ఫార్‌... ఇన్‌ కిచెన్‌ | Special story to fast food | Sakshi
Sakshi News home page

ఫార్‌... ఇన్‌ కిచెన్‌

Published Sat, Sep 22 2018 12:35 AM | Last Updated on Sat, Sep 22 2018 12:35 AM

Special story to fast food - Sakshi

వియత్నాం వంటలోసారిప్రయత్నించి చూస్తారా? థాయ్‌ వంటకాలకు హాయ్‌ చెప్పాలని ఉందా? ఇవన్నీ మనవి. అంటే మన ఆసియా ఖండానివి. మరి పొరుగింటి పుల్లకూర రుచి కదా! అందుకే...యూరప్‌ ఖండపు పొరుగు ఖాద్యాలనూ చూద్దాం. టేస్టీ టేస్టీ ఫ్రెంచు... బోల్డంత నోరూరించు అంటూ... ఇటాలియన్‌ డిషెస్‌తో నాల్కను మిటకరిస్తూ... లాలాజల వర్షంతో నోరు చిరపుంజీ కాగా దేశదేశాల వంటల్ని మన ఇంట తయారు చేసుకుని... ఆవురావురుమంటూ తిందాం... బ్రేవు బ్రేవుమందాం. 

సెసేమ్‌కోటెడ్‌  స్వీట్‌ స్టఫ్‌డ్‌  పాన్‌ కేక్స్‌ (ఫ్రెంచ్‌)
ఫ్రెంచ్‌ క్విజైన్‌ డెజర్ట్స్‌కి బాగా ప్రసిద్ధి. మనం కూడా ఈ రోజు ఇంటి దగ్గరే ఒక డెజర్ట్‌ తయారుచేసి ఫ్రెంచ్‌ రుచిని ఇంటి దగ్గరే ఆస్వాదించుదాం.
కావలసినవి: మైదా పిండి – 2 కప్పులు; బేకింగ్‌ పౌడర్‌ – కొద్దిగా; కోడి గుడ్డు – 1; వెనిలా ఎసెన్స్‌ – కొద్దిగా; పాలు – అర కప్పు; బటర్‌ – తగినంత; పంచదార పొడి – 2 టేబుల్‌ స్పూన్లు; తేనె – కొద్దిగా; ఎల్లో బటర్‌ – కొద్దిగా; వేయించిన నువ్వులు – 25 గ్రా.
స్టఫింగ్‌ కోసం: పచ్చి కొబ్బరి తురుము – అర కప్పు; డ్రై ఫ్రూట్స్‌ – తగినన్ని (కిస్‌మిస్, జీడి పప్పు); ఎండు ఖర్జూరాలు – ఆరు; ఏలకుల పొడి – పావు టీ స్పూను; ఎల్లో బటర్‌ – ఒక టేబుల్‌ స్పూను; పంచదార – ఒక టే బుల్‌ స్పూను
తయారీ: ∙ఒక పెద్ద పాత్రలో మైదా పిండి, బేకింగ్‌ పౌడర్, ఉప్పు, పంచదార వేసి బాగా కలిపాక, పిండి మధ్యలో గుంటలాగ చేసి పాలు, గిలకొట్టిన కోడి గుడ్డు, కరిగించిన బటర్‌ వేసి బాగా కలిపి సుమారు గంట సేపు పక్కన ఉంచాలి ∙స్టౌ మీద బాణలి ఉంచి వేడయ్యాక బటర్‌ వేసి కరిగించాలి ∙కొబ్బరి తురుము, డ్రై ఫ్రూట్స్, ఏలకుల పొడి, ఎండు ఖర్జూరాలు, పంచదార వేసి బాగా కలపాలి ∙మిశ్రమాన్ని తడిపోయేవరకు కలుపుతూ ఉడికించి, పక్కన ఉంచాలి ∙స్టౌ మీద నాన్‌ స్టిక్‌ పాన్‌ ఉంచి, వేడయ్యాక కొద్దిగా బటర్‌ వేసి కరిగించాలి ∙కలిపి ఉంచుకున్న మైదా పిండి కొద్దిగా తీసుకుని, పాన్‌ మీద దోసె మాదిరిగా వేసి రెండు వైపులా కాల్చాలి ∙బాగా కాలిన తరవాత స్టఫింగ్‌ మిశ్రమాన్ని దోసె మధ్యలో ఉంచి కర్రతో జాగ్రత్తగా ఒత్తి, మరోమారు కాల్చాలి ∙తయారయిన పాన్‌ కేక్‌లను కట్‌ చేసి, ఒక ప్లేట్‌లోకి తీసుకుని, పంచదార పొడి, తేనెలతో అలంకరించి, చివరగా నువ్వులతో గార్నిష్‌ చేసి అందించాలి.

పాడ్‌ థాయి  నూడుల్స్‌  ఎట్‌ హోమ్‌
థాయి క్విజీన్‌ గురించి మాట్లాడుకునేటప్పుడు మొట్టమొదటగా పాడ్‌ థాయి నూడుల్స్‌ను తలచుకుంటారు. ఈ వంటకాన్ని సులువుగా తయారు చేసుకుందామా.
కావలసినవి: నూడుల్స్‌ – అర కేజీ; ఉల్లి కాడలు – ఒక కట్ట; పుట్ట గొడుగులు / బేబీ కార్న్‌  – 100 గ్రా. ; వేయించిన పల్లీలు – 100 గ్రా.;  పల్లీ నూనె – 100 మి.లీ.; చిక్కుడు గింజలు – కొద్దిగా; వెల్లుల్లి తరుగు – కొద్దిగా; నిమ్మ రసం – ఒక టీ స్పూను; పసుపు – కొద్దిగా; ఎండు మిర్చి – 2 (ముక్కలు చేయాలి); ఉప్పు – తగినంత; పంచదార – టీ స్పూను; సోయా సాస్‌ – టీ స్పూను; పచ్చి మిర్చి – 4 (ముక్కలు చేయాలి); ఉల్లి తరుగు – పావు కప్పు; పచ్చి కొబ్బరి తురుము – అర కప్పు; మిరప కారం – అర టీ స్పూను; అజినమోటో – చిటికెడు

తయారీ: ∙ఒక పాత్రలో నీళ్లు, ఉప్పు, నూనె వేసి బాగా కలిపి స్టౌ మీద ఉంచి మరిగించాలి ∙నీళ్లు మరుగుతుండగా నూడుల్స్‌ వేసి ఉడికించి దింపేయాలి ∙నీరు ఒంపేసి, నూడుల్స్‌ను ఒక ప్లేట్‌లోకి తీసి చల్లారబెట్టాలి ∙ఇవి చల్లారేలోగా పచ్చి మిర్చి, వెల్లుల్లి, పచ్చి కొబ్బరి తురుము, బేబీ కార్న్, పుట్ట గొడుగులను మిక్సీలో వేసి మెత్తగా చేయాలి ∙స్టౌ మీద బాణలి ఉంచి అందులో నూనె వేసి కాగాక ఉల్లి తరుగు, వెల్లుల్లి తరుగు వేసి వేయించాక, పచ్చికొబ్బరి తురుము మిశ్రమం ముద్దను వేసి మరోమారు బాగా వేయించి, ఉడికించాలి ∙ఉడికించిన నూడుల్స్‌ను జత చేసి మిశ్రమం అంతా నూడుల్స్‌కు పట్టేవరకు కలపాలి ∙ఉప్పు, ఎండు మిర్చి, మిరియాల పొడి, పంచదార, అజినమోటో, సోయా సాస్, ఉల్లి కాడల తరుగు, చిక్కుడు గింజలు, నిమ్మ రసం జత చేసి బాగా కలపాలి ∙చివరగా పల్లీల పొడి వేసి కలిపి, ప్లేట్‌లోకి తీసుకుని కొత్తిమీర తరుగుతో అలంకరించి అందించాలి.

ఇండియన్‌  హోమ్‌ మేడ్‌  పిజ్జా (ఇటాలియన్‌  ఫ్యూజన్‌)
పిల్లలు ఈ రోజుల్లో సాయంత్రం స్నాక్స్‌లా తినడానికి ఫాస్ట్‌ ఫుడ్స్‌ ఇష్టపడుతున్నారు. ముందుగా మనం ఇటాలియన్‌ పిజ్జా తయారీ చూద్దాం. ఇంటి దగ్గరే ఈ పిజ్జాలను తయారుచేసుకోవచ్చు.

కావలసినవి...
బేస్‌ కోసం: మైదా పిండి – రెండున్నర కప్పులు; పంచదార – అర టీ స్పూను; ఉప్పు – అర టీ స్పూను; డ్రై ఈస్ట్‌ – అర టీ స్పూను; రిఫైన్‌డ్‌ ఆయిల్‌ లేదా ఎల్లో బటర్‌ – ఒక టీ స్పూను; గోరువెచ్చని నీళ్లు – ఒక కప్పు; మైదా పిండి∙– 3 టే బుల్‌ స్పూన్లు (అద్దడానికి)
టాపింగ్‌ కోసం: మోజరిల్లా చీజ్‌ – 150 గ్రా. (సూపర్‌ మార్కెట్‌లో దొరుకుతుంది); క్యాప్సికమ్‌ తరుగు – ఒక కప్పు (సన్నగా తరగాలి); కొత్తిమీర – అర కప్పు
వెజ్‌ టాపింగ్స్‌: సన్నగా తరిగిన పుట్ట గొడుగులు – ఒక కప్పు; బేబీ కార్న్‌ / ఉడికించిన కూరలు / వేయించిన పనీర్‌ (వీటిలో ఏదో ఒకటి); నాన్‌ వెజ్‌ టాపింగ్స్‌; బోన్‌ లెస్‌ చికెన్‌ (బ్రాయిల్డ్‌ లేదా గ్రిల్డ్, ఏదైనా నాన్‌ వెజ్‌)
సాస్‌ కోసం: టొమాటో తరుగు – 2 కప్పులు (తొక్క తీసేయాలి); ఆలివ్‌ ఆయిల్‌ లేదా రిఫైన్‌డ్‌ ఆయిల్‌ – 2 టేబుల్‌ స్పూన్లు; ఉప్పు – రుచికి తగినంత; పంచదార – కొద్దిగా; నల్ల మిరియాల పొడి – అర టీ స్పూను; ఎండు మిర్చి – 1 (ముక్కలు చేయాలి); టొమాటో కెచప్‌ – 2 టీ స్పూన్లు; వెల్లుల్లి తరుగు –50 గ్రా.; ఉల్లి తరుగు – అర కప్పు; కార్న్‌ ఫ్లోర్‌ – కొద్దిగా (పావు కప్పు నీళ్లలో కలిపితే కార్న్‌ స్టార్చ్‌ తయారవుతుంది)
సాస్‌ తయారీ: స్టౌ వెలిగించి, మంటను మీడియంలో ఉంచి, బాణలి పెట్టాలి. ఉల్లి తరుగు జత చేసి వేయించాలి. వెల్లుల్లి తరుగు, నల్ల మిరియాల పొడి, ఎండు మిర్చి ముక్కలు వేసి బాగా వేయించాక టొమాటో తరుగు, ఉప్పు, పం^è దార వేసి కలపాలి. టొమాటోలు మెత్తగా ఉడికి, నీరంతా పోయేవరకు కలుపుతుండాలి. టొమాటో కెచప్, కార్న్‌ స్టార్చ్‌ జత చేసి బాగా కలపాలి. మంట బాగా తగ్గించి, మిశ్రమం మృదువుగా అయ్యేవరకు ఉడికించాలి. (టొమాటలో మరీ పుల్లగా అనిపిస్తే మరి కాస్త పంచదార జత చేస్తే సరి).

బేస్‌ తయారీ: ∙ఒక చిన్న పాత్రలో గోరువెచ్చని నీటికి ఈస్ట్‌ జత చేసి బాగా కలిపి పది నిమిషాల పాటు పక్కన ఉంచాలి ∙వేరొక పాత్రలో మైదా పిండి, పంచదార, ఉప్పు, నూనె వేసి బాగా కలపాలి ∙‘పిజ్జా మృదువుగా రావాలంటే పిండిని చాలాసేపు చే తితో బాగా అదమాలి) ∙ఈ మిశ్రమానికి ఈస్ట్‌ నీటిని జత చేసి మరోమారు కలపాలి ∙పిండిని కలుపుతూ మధ్యమధ్యలో ఆగుతూ సుమారు ఐదు నిమిషాల పాటు పిండిని కలపాలి ∙పిండి∙మెత్తగా ఉండాలే కాని, చేతికి అంటుకోకుండా చూసుకోవాలి ∙చేతికి అంటుతుంటే కొద్దిగా మైదా పిండి జత చేయాలి ∙పిండి బాగా కలిపిన తరవాత ఒక టేబుల్‌ స్పూను నూనె జత చేసి, పిండి సాగేలా అయ్యేవరకు కలపాలి ∙పెద్ద పాత్రకు నూనె పూయాలి ∙మైదా పిండికి కూడా మరి కాస్త నూనె పూసి, పాత్రలో ఉంచి వస్త్రంతో మూసేసి, సుమారు రెండు గంటల పాటు పక్కన ఉంచాలి ∙పిండి రెట్టింపు పరిమాణంలోకి అయ్యాక, పిండిని బయటకు తీసి కొద్దిగా పొడి పిండి జత చేసి మళ్లీ చేతితో బాగా కలిపి, పిండిని రెండు సమాన భాగాలుగా చేసి, సుమారు ఐదు నిమిషాలు పక్కన ఉంచేయాలి. 
నాన్‌ స్టిక్‌ పాన్‌ మీద బేస్‌ తయారుచేసుకోవాలి: ∙పిండిని చపాతీ కర్రతో ఒత్తి, గుండ్రంగా కట్‌ చేసుకోవాలి ∙గుండ్రంగా అక్కర్లేని వారు వారికి కావలసిన ఆకారంలో కట్‌ చేసుకుని, కొద్దిగా పొడి పిండి అద్ది, నూనె పూసిన పిజ్జా పాన్‌ మీద ఉంచాలి (అంచులు గుండ్రంగా వచ్చేలా కట్‌ చేసుకోవాలి) ∙గోధుమరంగులోకి వచ్చేవరకు సన్నని మంట మీద ఉంచాలి ∙చివరగా పిజ్జా బేస్‌ను వేరొక ప్లేట్‌లోకి తీసి, తయారుచేసి ఉంచుకున్న సాస్‌ను పిజ్జా మీద వేసి సమానంగా పరచాలి ∙ముందుగా కట్‌ చేసి ఉంచుకున్న టాపింగ్స్‌తో అందంగా అలంకరించాలి ∙కొత్తిమీర, చీజ్‌ తురుము కూడా చల్లాలి ∙ఇప్పుడు పిజ్జాను పాన్‌ మీద ఉంచి చీజ్‌ కరిగేవరకు ఉంచి దింపేయాలి ∙ఇలా ఇంటి దగ్గరే పిజ్జా తయారుచేసుకుని అందరూ కలిసి సరదాగా ఆరగించవచ్చు.

సతాయ్‌  హోమ్‌ స్టైల్‌  ఇండోనేషియా
ఇండోనేషియాలో ఈ వంటకాన్ని ప్రత్యేకంగా తయారుచేసుకుంటారు. ఈ వంటకాన్ని మనం ఇంటి దగ్గరే తయారుచేసుకుందాం.
కావలసినవి: రొయ్యలు – పావు కేజీ; క్యాప్సికమ్‌ తరుగు – ఒక కప్పు; టొమాటో తరుగు – ఒక కప్పు; ఉల్లి తరుగు – అర కప్పు; ఉప్పు – తగినంత; మిరియాల పొడి – అర టీ స్పూను; నిమ్మ రసం – ఒక టీ స్పూను; చీజ్‌ – 100 గ్రా.; చిల్లీ సాస్‌ – ఒక టీ స్పూను; ఆవాల ముద్ద – అర టీ స్పూను; కొత్తిమీర – కొద్దిగా; టొమాటో సాస్‌ – ఒక టీ స్పూను; బటర్‌ – ఒక టీ స్పూను; (వెజిటేరియన్లు పుట్ట గొడుగులు, పనీర్, బేబీ కార్న్‌తో తయారుచేసుకోవచ్చు)

తయారీ: ∙ఒక పాత్రలో శుభ్రం చేసిన రొయ్యలు, టొమాటో తరుగు, ఉల్లి తరుగు, క్యాప్సికమ్‌ తరుగు వేసి కలపాలి ∙వీటికి ఉప్పు, మిరియాల పొడి, నిమ్మ రసం, ఆవాల ముద్ద, చిల్లీ సాస్, టొమాటో సాస్, కొత్తిమీర జత చేసి బాగా కలిపి పక్కన ఉంచాలి ∙ఇదే విధంగా వెజిటేరియన్లు కూరముక్కలను ఊరబెట్టుకోవాలి. టూత్‌ పిక్‌లు తీసుకుని ఊరబెట్టిన ఉల్లి పాయ, క్యాప్సికమ్, టొమాటో, రొయ్యలను వరుసగా గుచ్చాలి ∙సమాంతరంగా ఉండే పాన్‌ తీసుకుని స్టౌ మీద ఉంచి, వేడయ్యాక బటర్‌ వేసి కరిగాక, గుచ్చి ఉంచుకున్న పుల్లలను పాన్‌ మీద ఉంచి బాగా కాల్చాలి ∙చివరగా చీజ్‌ తురుము వేసి బాగా కలపాలి. ఇంటికి ఎవరైనా అతిథులు వచ్చినప్పుడు వీటిని వేడివేడిగా తయారుచేసి పెడితే బాగుంటుంది.
– డా. స్వజన్, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌
ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టూరిజమ్‌ అండ్‌ ట్రావెల్‌ మేనేజ్‌మెంట్‌

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement