
అతనొక మాజీ సైనికుడు. ఇప్పుడంటే మాజీ అయ్యాడు కానీ, అతని పేరు చెబితేనే శత్రువులకు హడల్. చిన్నప్పుడు బాగా బలహీనంగా ఉండేవాడు. కానీ, అతనికున్న సాహసగుణం వల్ల, ధైర్యమనే లక్షణం వల్ల సిపాయిగా చేరాలన్న తన కోరికను ఎంతో కష్టంమీద నెరవేర్చుకున్నాడు. ఆ సాహసం వల్ల సిపాయి స్థానం నుండి సైనికాధికారి స్థాయికి చేరుకోగలిగాడు. గెలుస్తామనే ఆశ ఏమాత్రం లేని అనేక పోరాటాల్లో ఆయన తన సైన్యాన్ని నేర్పుగా ముందుకు నడిపించి, ఘన విజయాలు సాధించాడు. శత్రువులు దొంగదెబ్బ తీయడం వల్ల ఒక యుద్ధంలో కుడిచేతిని, మరొక యుద్ధంలో ఎడమ కంటిని కోల్పోయాడు. అలాగే పోరాడి విజయాన్ని సాధించాడు. అతను చేసిన ఈ యుద్ధాన్ని అందరూ కథలు కథలుగా చెప్పుకునేవారు. అతను ఉద్యోగ విరమణ చేయవలసి వచ్చింది. ఉద్యోగ బాధ్యతల నుంచి అధికారికంగా అయితే తప్పుకున్నాడు కానీ, మానసికంగా మాత్రం ఎప్పటికీ తప్పుకోదలచుకోలేదు.
‘ప్రభుత్వం ఇచ్చే పెన్షన్ తీసుకుని హాయిగా విశ్రాంతి తీసుకోక ఎందుకు శ్రమపడతావు?’ అని ఎందరు ఎన్ని విధాలుగా చెప్పి చూసినా వినలేదతను. ‘కన్నుతోనూ, చేతితోనూ చేసేదే యుద్ధం కాదు. యుద్ధానికి అవసరమైనది మస్తిష్కం. అంతకుమించి, సాహసోపేతమైన దృఢచిత్తం కావాలి. నాలో పోరాట పటిమ ఎప్పటికీ చావదు. సాహసం చేయాలన్న నా మనసు ఊరకనే కూర్చోదు. అందువల్ల నేను ఉద్యోగం నుంచి విరమిస్తేనేం, ధైర్య సాహసాలు గల యువకులకు ప్రేరణ, ప్రోత్సాహం కలిగించే కథలు చెబుతాను, వారికి యుద్ధ తంత్రం నేర్పుతాను. నాలాంటి మరికొంత మంది సైనికులను తయారు చేస్తాను. నా ఊపిరి ఉన్నంత కాలమూ నాలోని సైనికుడు చావడు. పరిస్థితులతో యుద్ధం చేస్తూనే ఉంటాడు’ అని చెప్పటమే కాదు, అలాగే జీవించాడు కూడా. నీతి ఏమిటంటే.. వయసుకు మాత్రమే విరమణ ఉంటుంది. మనసుకు కాదు.
– డి.వి.ఆర్.