
‘మనసు మమత’ సీరియల్‌లో హరితేజను‘అర్చన’గా చూసి ప్రేక్షకులు ఫ్లాట్ అయ్యారు. వంటల ప్రోగ్రామ్‌లో... ఆమె పంచ్‌లకు త్రివిక్రమ్ ఫ్లాట్ అయ్యారు. బిగ్ బాస్‌లో ఆమె హరికథకు...ఇల్లిల్లూ ఫ్లాట్ అయింది. ఇలా.. అంతా ఫ్లాట్ అయిపోయేలా.. టీవీల్లో, సినిమాల్లో మెరుస్తున్న హరితేజ గురించి..
‘బిగ్‌బాస్’ షో ముందు వరకు హరితేజ ఎక్కడకు వెళ్లినా, ముఖ్యంగా పల్లెల్లోకి వెళ్లినప్పుడు.. ‘మీరు అర్చన కదా’ అంటూ ‘మనసు మమత’ సీరియల్‌లో ఆమె చేసిన పాత్రను గుర్తు తెచ్చుకునేవారు. ఐదారేళ్ల క్రితం సీరియలే అయినా అందరికీ గుర్తుండిపోయిన పాత్ర అది. ఇక ఇప్పుడైతే బిగ్‌బాస్ హరితేజ! ‘మనసు మమత’ సీరియల్ ఆమె కెరియర్‌లో బిగ్గెస్ట్ హిట్. డ్యూయల్ రోల్, నర్స్, డాక్టరు, అమ్మ, చెల్లి అన్నీ వేయించేసారు. ఆ సీరియల్‌లో పొద్దున్నే పూజ చేసుకునే సీన్‌లో హరితేజకు పాట పెట్టేవారు. ‘‘ఆ సీరియల్‌తోనే కాస్త డబ్బు దాచుకున్నాను, ఇల్లు కొనుక్కున్నాను’’ అంటారు హరితేజ. ఆ క్రమంలోనే ‘అత్తారింటికి దారేది’ సినిమాలో ఒక్క నిమిషం నిడివి ఉన్న పాత్ర నటించే అవకాశం వచ్చినప్పుడు, ఆమె పెద్దగా ఆసక్తి చూపలేదు. త్రివిక్రమ్‌గారి సినిమాలో నటిస్తే బావుంటుంది అన్నారు మేనేజర్. ఆ సినిమాలో చేసిన ఒకే ఒక్క షాట్ పూర్తయ్యాక, ‘హరితేజ గారూ! ఒక్క షాట్‌లోనే మీ టాలెంట్ అర్థమైపోయింది, మనం కలిసి పనిచేద్దాం’ అన్నారట త్రివిక్రమ్.
అమ్మతో కలసి హైదరాబాద్‌కి
భాగవతుల సేతురామ్ దగ్గర కూచిపూడి డ్యాన్స్ నేర్చుకునేందుకు తల్లిని వెంటబెట్టుకుని తిరుపతి నుంచి హైదరాబాదు వచ్చి వెళ్తుండేవారు హరితేజ. ఆమె డ్యాన్స్ ప్రోగ్రామ్‌ల ఫొటోలు సినీ పరిశ్రమకు వెళ్లడంతో చిన్న చిన్న ఆఫర్‌లు రావడం మొదలయ్యాయి. బిఏ సైకాలజీ చేశాక, మాస్టర్స్ చేద్దామనుకున్న సమయంలో ఆఫర్లు పెరుగుతుండటంతో చదువుకి ఫుల్‌స్టాప్ పెట్టేశారు. అలా సీరియల్స్‌లోకి వచ్చేశారు.
అమ్మమ్మలాంటి అత్తమ్మ
హరితేజలో డ్యాన్సర్, నటి మాత్రమే కాదు. ఒక ఫిలాసఫర్ కూడా ఉన్నారు. ‘‘బాల్యం నుంచి మా అమ్మమ్మ చెప్పిన రామాయణ భారత భాగవత కథలతో నాకు ఫిలాసఫీ అలవాటైంది. ఈ రంగుల ప్రపంచంలో ఎన్ని ఇబ్బందులు ఎదురైనా, సీతమ్మ వారికే కష్టాలు తప్పలేదు, నేనెంత! అనుకుంటాను. అమ్మమ్మలాంటి అత్తగారు రావడం కూడా నా అదృష్టం. నాకేమైనా ఇబ్బందులు వచ్చినప్పుడల్లా ఆవిడ కూడా పురాణ ఘట్టాలు చెబుతూ నన్ను మోటివేట్ చేస్తారు’’ అని చెప్పారు హరితేజ. అంతేకాదు, ‘‘తరతరాల నుండి మేమంతా ఇంటికే పరిమితమై చేసిందేమీ లేదు, నువ్వైనా సమాజంలో ఉండే నాలాంటి వందలమందికి ఆదర్శంగా ఉండు. ‘ఈ అమ్మాయి నా కోడలు’ అని గర్వంగా చెప్పుకుంటాను. ఇంకేమీ అక్కర్లేదు’ అని అత్తగారు (సుధ) అంటారట.
మామయ్య సపోర్ట్ చేశారు
హరితేజ ఒక సాధారణ ప్రభుత్వ ఉద్యోగి కూతురు. కష్టపడి డబ్బు సంపాదించి అమ్మానాన్నలను బాగా చూసుకోవాలని అనుకోవడం కూడా ఆమె ఈ రంగానికి రావడానికి ఒక కారణం. అయితే మొదట్లో టీవీల్లో ఇమడలేకపోయారు. డ్యాన్స్ టీచర్‌గా కెరీర్‌ను తీసుకోవాలని అనుకుంటున్న సమయంలో హరితేజ మామయ్య ఇచ్చిన సపోర్ట్‌తో ఆగిపోయారు. ‘తట్టుకుని నిలబడాలి. అలాగని మన వ్యక్తిత్వాన్ని వదులుకోనవసరం లేదు అని ఆయన చెప్పారు. ఆ తర్వాతి నుంచీ ఎవరైనా ఫోన్ చేస్తే, ‘నేను పని మాత్రమే చేయగలనండీ, మీకు ఓకేనా’ అని అడగడం మొదలుపెట్టారు.
త్రివిక్రమ్‌కి నచ్చాయి
హరితేజ కెరీర్‌లో అసలు పని లేని దశ కూడా ఒకటి ఉంది. ఆ సమయంలో వంటల కార్యక్రమమే ఆమెను నిలిపింది. ‘‘నేను కుకరీ షో చేస్తున్నప్పటికి ఇంకా బిగ్ బాస్ షో మొదలవ్వలేదు. చిత్రం ఏమిటంటే, ఆ కార్యక్రమంలో నేను వేసిన పంచ్‌లు చూసి త్రివిక్రమ్‌గారు నాకు ‘అ ఆ’ చిత్రంలో అవకాశం ఇచ్చారు. నేను ఏమీ ఆలోచించకుండా చేసిన పని, నాకు మంచి సినిమా ఇచ్చింది’’ అంటారు హరితేజ. ‘‘ఆట, పాట, సెటైర్, ఫన్, ఎంటర్‌టైన్‌మెంట్... వీటిలో ఏదైనా చేయగలను. ‘నువ్వు హీరోయిన్‌లా ఉన్నావు’ అని ఎవరైనా అంటే నిజమేననుకోవడం ఫూలిష్‌నెస్. ఎక్స్‌పోజింగ్ ఇష్టం లేదు. టాలెంట్‌ను నమ్ముకున్నాను. ఇప్పటికీ ఏడాదికి ఒక్క సినిమానే చేస్తున్నాను. ప్రతి రంగంలోను ఇబ్బందులు, కష్టాలు ఉంటాయి. విలువలకు కట్టుబడి ఉండటం వల్ల వాటిని అధిగమిస్తూ ముందుకెళ్లడానికి చాలా కష్టపడ్డాను’’ అని తనెలా నిలదొక్కుకున్నదీ చెప్పారు హరితేజ. ఎప్పటికైనా సినీ పరిశ్రమలో సూర్యకాంతంలా నిలబడాలని ఆమె కోరిక.
పెళ్లి.. జీవితం.. సినిమాలు
పెళ్లితో నా ప్రపంచం చాలా అందంగామారిపోయింది. రాత్రి ఇంటికి రావడం ఆలస్యం అయితే, నా భర్త దీపక్ తనే వంట చేసి ఉంచుతారు. నేను పొద్దున్నే షూటింగ్‌కి వెళ్లాలంటే నాకు కాఫీ ఇస్తారు. ఆయన ఫార్మసీలో చేస్తున్నారు. ఎంత బిజీగా ఉన్నప్పటికీ నా కోసం తీరిక చేసుకుంటారు. జీవితం అంటే ఏమిటో తెలుసుకోవడం కంటే గొప్ప విషయం లేదు. ఇల్లంటే నలుగురు మనుషులు, నాలుగు మంచి మాటలు, ఆహ్లాదకరమైన వాతావరణం. అంతేకాని, కార్లు, ఇంటీరియర్స్ కాదు. ప్రస్తుతం నటిస్తున్న సినిమాలు : ఇంద్రగంటి మోహన కృష్ణ దర్శకత్వంలోను, శ్రీనివాసరెడ్డి చిత్రంలోను, నందినీరెడ్డి దర్శకత్వంలో.
బిగ్‌బాస్ హరికథ
హరికథ చెప్పే కళ నాలో ఉందని ‘బిగ్ బాస్ షో’లో చేసే వరకు నాకు తెలీదు. షో పూర్తయ్యాక, మా అమ్మ.. ‘నీ హరికథ బాగా హిట్ అయ్యింది! మీ తాతయ్య మైక్ కూడా లేకుండా హరికథ చెబుతుంటే ఊరివారంతా వినేవారు. నువ్వు చెప్పడం చూసి, ‘మా నాన్నేంటి, దీనికి ఇలా పూనాడు అనుకున్నాను‘ అంది.
– ఇంటర్వ్యూ : పురాణపండ వైజయంతి
Comments
Please login to add a commentAdd a comment