ఓ సినిమాలో పాపులర్ డైలాగ్..
‘సింహం సింగిల్‌గా వస్తుందని’!
పాస్‌పోర్టు ఆఫీస్ మాత్రం..
జారియా జంటగానే రావాలి అంది!
‘‘కుదర్దు సింగిల్‌గానే వస్తుంది..
సింగిల్‌గానే మార్పు తెస్తుంది’’ అని
మనసులోనే శపథం చేసుకుంది జారియా!
ఈ సింగిల్ మదర్ .. పోరాటం..
విజయం.. వెరిమచ్ ఇన్‌స్పైరింగ్.
‘‘క్యా హువా బేటా (ఏమైందమ్మా)’’బయటి నుంచి వచ్చి ఈసురోమంటూ సోఫాలో చేరగిలబడ్డ కూతురిని చూస్తూ అడిగింది తల్లి ఆత్రంగా! ‘‘కుఛ∙నహీ హువా మా... హమేషాకి తరహ్ (ఏమీ కాలేదమ్మా.. ఎప్పటిలాగే)’’.. నిరాశగా నిట్టూరుస్తూ జవాబిచ్చింది కూతురు.‘‘పరేషాన్ మత్ హో.. సబ్ ఠీక్ హోగా (కంగారు పడకు.. అంతా సవ్యంగానే జరుగుతుంది)’’.. అంది తల్లి కూతురి తల నిమురుతూ!
కళ్లల్లో నీళ్లొచ్చాయి కూతురికి తల్లి స్పర్శతో. వెంటనే తమాయించుకుని ‘‘ఏక్ మినట్ మా... ’’అంటూ దిగ్గున లేచి తన గదిలోకి వెళ్లింది కూతురు. హడావుడిగా ల్యాప్‌ట్యాప్ తెరిచి.. ‘ఛేంజ్ డాట్ ఓఆర్‌జీ’కి ఓ పిటిషన్ మెయిల్ చేసింది. తర్వాత విదేశీ వ్యవహారాలశాఖా మంత్రి సుష్మాస్వరాజ్‌కు ట్వీట్ చేసింది. ఆమె పేరు జారియా పట్నీ. ముంబై నివాసి. ఉన్నపళంగా పిటిషన్, మంత్రికి ట్వీట్ చేయాల్సిన అవసరమేంటి?
గతం
జారియాకు పందొమ్మిదేళ్లప్పుడు పెళ్లయింది. ముంబైలో వాళ్ల బిల్డింగ్‌లోనే ఓ అపార్ట్‌మెంట్‌లో అద్దెకుండే ఓ వ్యక్తితో పరిచయమైంది. అతను ఆమెకన్నా ఏడేళ్లు పెద్దవాడు. ‘‘నువ్వంటే ఇష్టం’’ అన్నాడు. ఆమె స్నేహం చేసింది. కాఫీ షాప్‌లు, సినిమాలు, షాపింగ్‌లకు కలిసి వెళ్లేవారు. ఆ చనువు ప్రేమగా మారింది. పెద్దల అంగీకారంతో పెళ్లీ అయింది. పెళ్లయ్యాక అతనికి దుబైలో ఉద్యోగం రావడంతో జారియాను తీసుకొని దుబై వెళ్లాడు. ఆమె ఏం తినాలి? ఎలాంటి బట్టలు వేసుకోవాలి? ఎవరితో మాట్లాడాలి? ఎలాంటి వాళ్లు స్నేహితులుగా ఉండాలి అనేవన్నీ అతనే నిర్ణయించడం మొదలుపెట్టాడు. మొదట్లో.. ఏ బట్టలు వేసుకోవాలో, ఏం తినాలో భర్త చెబుతుంటే ప్రేమ అనుకుంది. కాని రానురాను ఆ తీరు పొసెసివ్‌నెస్‌గా, అతని అభద్రతగా అర్థమైంది జారియాకు. అయితే ఆయన ప్రతాపం అంతటితో ఆగలేదు. జారియా తన హక్కు గురించి ఏమాత్రం మాట్లాడినా చేయిచేసుకునేదాకా వెళ్లింది. ఆ సమయంలోనే ఆమె ప్రెగ్నెంట్ అని తేలింది. అయినా హింస ఆపలేదు. గర్భిణి అని కూడా చూడకుండా ఆమెను కొట్టాడు. తీవ్ర అస్వస్థతకు లోనై ఆసుపత్రి పాలైంది. ఒక్కరోజు ఆలస్యమైనా జారియా ప్రాణంమీదకు వచ్చేదని చెప్పారు డాక్టర్లు. దాంతో భయపడిపోయిన జారియా ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అవగానే ముంబైకి ప్రయాణమైంది. జరిగిన విషయం ఇంట్లో తల్లిదండ్రులకు చెప్పింది. అండగా నిలిచారు. మళ్లీ వెనక్కి వెళ్లాల్సిన అవసరం లేదన్నారు. విడాకులకు దరఖాస్తు చేసుకుంది. కేస్ కోర్టులో ఉండగానే జారియాకు కొడుకు పుట్టాడు. బిడ్డతో పాటు విచారణలకు వెళ్లొచ్చేది. ఎట్టకేలకు బిడ్డకు ఆమెను లీగల్ గార్డియన్‌గా చేస్తూ కోర్టు విడాకులు మంజూరు చేసింది. ఊపిరి పీల్చుకుంది జారియా.
ప్రస్తుతం
చేంజ్ డాట్ ఓఆర్‌జీలో ఆమె పిటిషన్‌కు తొంభైఆరువేల మంది మద్దతు పలికారు. దాంతో ప్రభుత్వం... సుప్రీంకోర్టు గైడ్‌లైన్‌కు విరుద్ధంగా ఉన్న తన నిబంధనను వెనక్కు తీసుకోవాల్సి వచ్చింది. తల్లి లీగల్ గార్డియన్ అని ఉన్న సుప్రీంకోర్టు గైడ్‌లైన్‌ను గౌరవిస్తూ తల్లి సంతకంతోనే జారియా కొడుకుకు పాస్‌పోర్ట్ మంజూరు చేశారు. తన పోరాటం ఎంతో మంది ఒంటరితల్లులకు ఊరటైనందుకు చాలా సంతోషంగా ఉంది జారియా పట్నీ!
బ్రాండ్ ఫొటోగ్రాఫర్
ఓ వైపు పిల్లాడి పెంపకం బాధ్యతలు చూసుకుంటూనే ఇంకోవైపు తండ్రికి వ్యాపారంలో చేదోడువాదోడుగా ఉంటోంది జారియా. బాబు కొంచెం పెద్దయ్యాక భర్త పక్కన పెట్టించిన ఫొటోగ్రఫీ అభిరుచిని మళ్లీ ప్రారంభించింది. త్వరలోనే మంచి పేరున్న బ్రాండ్స్ నుంచి ఆఫర్స్ రావడం మొదలయ్యాయి. ఆ షూటింగ్‌లు, వ్యాపారంతో చాలా బిజీ అయిపోయింది. షూటింగ్స్ విదేశాల్లో ఉండటంతో అక్కడికీ వెళ్లాల్సి వచ్చింది. ఒకసారి కొడుకును కూడా తీసుకెళ్దామనుకుంది. పాస్‌పోర్ట్‌కు అప్లయ్ చేస్తే రిజెక్ట్ అయింది. కొంతకాలం ఆగి మళ్లీ చేసింది. మళ్లీ దరఖాస్తును తోసిపుచ్చారు. ఖంగు తినింది. కారణమేంటో తెలియలేదు. పాస్‌పోర్ట్ ఆఫీస్‌కు వెళ్లి ఆరా తీసింది. పిల్లాడి తండ్రి సంతకం తప్పనిసరిగా కావాలన్నారు. ‘‘అదేంటి? సింగిల్ పేరెంట్‌ని. విడాకులు కూడా తీసుకున్నాను. ఇప్పుడు అతని దగ్గరకు వెళ్లి సంతకం ఎలా తీసుకొస్తాను? తేలేను’’ అని తేల్చేసింది. ‘‘మేమూ ఇవ్వలేం’’ అని వాళ్లూ స్పష్టం చేశారు. షాక్ అయింది జారియా. అతని హింసను భరించలేక కాపురం వద్దనుకోవడమే కాదు జన్మలో అతని మొహమే చూడకూడదనుకుంది. సంతకం కోసం అలాంటి వ్యక్తి దగ్గరకు మళ్లీ వెళ్లాలా? సమస్యే లేదు. పాస్ పోర్ట్ ఎలా రాదో చూస్తా అనుకుంది. సుప్రీంకోర్టు గైడ్‌లైన్స్ చూసింది. విడాకుల కేసుల్లో పిల్లలకు సంబంధించి దరఖాస్తు ఫారాల్లో తల్లి, తండ్రి ఇద్దరిలో ఎవరి సంతకమైనా చెల్లుతుంది అని రాసి ఉంది. ఆ గైడ్‌లైన్‌ను పట్టుకొని ఇంకోసారి పాస్‌పోర్ట్ ఆఫీస్‌కు వెళ్లింది. తండ్రి సంతకం తప్పనిసరిగా కావాలని ప్రభుత్వ నియమాన్ని, నిబంధనను తీసి చూపించారు పాస్‌పోర్ట్ అధికారులు. సుప్రీంకోర్టు గైడ్‌లైన్‌ను చెల్లదు పొమ్మన్నారు! డీలా పడి ఇల్లు చేరింది. అంతలోకే ఆలోచన వచ్చి చేంజ్ డాట్ ఓఆర్‌జీకి పిటిషన్, సుష్మాస్వరాజ్‌కు ట్వీటూ చేసింది.
– శరాది
Comments
Please login to add a commentAdd a comment