నా వయసు 60 ఏళ్లు. గతంలో పొగతాగే అలవాటు ఉండేది. నడుస్తున్నప్పుడు నాకు కాలునొప్పి వస్తోంది. పిక్కలు, తొడలు, తుంటిభాగంలోనూ నొప్పిగా ఉంటోంది. మెట్లు ఎక్కుతున్నప్పుడు వచ్చే నొప్పి, ఆగితే తగ్గుతోంది. నొప్పి సన్నగా, తిమ్మిరి ఎక్కినట్లుగా ఉంటోంది. కాళ్ల కండరాలు అలసిపోయినట్లుగా ఫీలవుతున్నాను. పిరుదులు కూడా నొప్పిగా ఉంటున్నాయి. నా సమస్యకు కారణం తెలపండి.
–ఎమ్. రమణరావు, నెల్లూరు
మీరు చెప్పిన లక్షణాలను బట్టి మీకు కాలిలోని రక్తనాళాలు పూడిపోయినట్లుగా అనిపిస్తోంది. గుండెకు రక్తసరఫరా చేసే రక్తనాళాలు బ్లాక్ అయిన గుండెపోటు వచ్చినట్లే... కాలిలో కూడా అదే పరిణామం సంభవించే అవకాశం ఉంది. గుండెపోటులో ఉంటే ప్రమాదం లాగే ఈ లెగ్ అటాక్స్ ప్రమాదకరం. కాలిపైన ఎంతకూ నయంకాని అల్సర్స్ వచ్చి, చివరకు కాలు తీసేయాల్సిన పరిస్థితి దారితీయవచ్చు. లెగ్ అటాక్స్‌లో ఉన్న మరో ప్రమాదకరమైన అంశం... వీటిని చివరిదశ వరకూ గుర్తించడం కష్టం. అంతకుమించి ఈ వ్యాధి గురించి సాధారణ ప్రజల్లో అవగాహన చాలా తక్కువ. డయాబెటిక్ వ్యాధిగ్రస్తులు, 50 ఏళ్లు పైబడిన వారు, స్థూలకాయులు, రక్తపోటు ఎక్కువగా ఉన్నవారు, పొగతాగే వారు ఈ లెగ్ అటాక్స్ గురయ్యే అవకాశాలు ఎక్కువ. మీరు పేర్కొన్న లక్షణాలతో పాటు కాళ్లు లేదా పాదాలు క్రమంగా పాలిపోయినట్లుగా ఉండటం, కాళ్లు నీలిరంగులోకి లేదా ముదురు ఎరుపు రంగులోకి మారడం వంటివీ చోటుచేసుకుంటాయి. నడవకుండా విశ్రాంతిగా ఉన్నప్పుడు కూడా మీ లక్షణాల తీవ్రత ఎక్కువగా ఉంటే వ్యాధి తీవ్రత చాలా ఎక్కువగా ఉన్నట్లు గ్రహించాలి. ఈ రక్తనాళాల జబ్బును నిర్ధారణ చేయడానికి యాంజియోగ్రామ్ బాగా ఉపయోగపడుతుంది. అయితే నిర్ధారణలో మరింత కచ్చితత్వం కోసం అల్ట్రాసోనోగ్రఫీ, ఎమ్మారైలను ఎక్కువగా ఉపయోగిస్తున్నారు.
ఇలా కాలి రక్తనాళాల్లో పూడిక పేరుకుందని తెలిసినప్పుడు ప్రాథమిక దశలో సరైన మందులు, జీవనశైలిలో మార్పుల ద్వారా దీనికి చికిత్స చేస్తారు. దీనికి ఎంత త్వరగా చికిత్స చేయిస్తే అంత మంచిది. ఎందుకంటే వ్యాధి ముదిరాక డాక్టర్‌ను సంప్రదిస్తే ఒక్కోసారి కాలిని తొలగించే ప్రమాదమూ ఉండవచ్చు. అందుకే మీలో కనిపించిన లక్షణాలను గుర్తిస్తే వెంటనే డాక్టర్‌ను సంప్రదించాలి. ఇప్పుడు దీనికి బెలూన్ యాంజియోప్లాస్టీ, స్టెంట్ వంటి సమర్థమైన, సురక్షితమైన చికిత్స ప్రక్రియలు అందుబాటులోకి వచ్చాయి.
వేరికోస్ వెయిన్స్‌విషయంలోనిర్లక్ష్యం వద్దు
వాస్క్యులార్ కౌన్సెలింగ్
నా వయసు 47 ఏళ్లు. మోకాలి కింది భాగం నుంచి పాదాల వరకు ఉన్న రక్తనాళాలు ఉబ్బినట్లుగా కనిపిస్తున్నాయి. అవి ఎర్రటి, నీలం రంగులో ఉన్నాయి. వాటి వల్ల నాకు ఎలాంటి నొప్పి కలగడం లేదు. అయితే చూడటానికి ఎబ్బెట్టుగా, ఇబ్బందికరంగా ఉన్నాయి. దయచేసి నా సమస్యకు తగిన పరిష్కారం చూపగలరు.
– ఎల్. రవికుమార్, నిజామాబాద్
సాధారణంగా మనిషి శరీరాన్నంతటికీ గుండె, రక్తనాళాల ద్వారా రక్తాన్ని సరఫరా చేస్తుంది. మళ్లీ అవే రక్తనాళాల ద్వారా రక్తం గుండెకు చేరుతుంది. అయితే మిగతా భాగాల విషయంలో ఎలా ఉన్నప్పటికీ కాళ్ల విషయానికి వస్తే భూమి ఆకర్షణ శక్తి వల్ల ఈ రక్తప్రసరణ ప్రక్రియ కాస్త ఆలస్యమవుతుంది. అంతేకాకుండా వయసు పైబడటం, కుటుంబ నేపథ్యం, స్థూలకాయం, కూర్చొని పనిచేయటం, అదేపనిగా నిలబడి పనిచేయడం, బరువైన వృత్తిపనులు చేయడంతో జరిగినప్పుడు రక్తప్రసరణ ఆలస్యం అవుతుంది. మహిళల్లో గర్భం దాల్చడం, హార్మోన్లు ప్రభావం వంటి అంశాలు రక్తప్రసరణ ఆలస్యమయ్యేలా చేయవచ్చు. శరీరంలో ఏ భాగానికైనా ఈ సమస్య ఏర్పడవచ్చు. కానీ సాధారణంగా మోకాలి కింది భాగం నుంచి పాదాల వరకు ఇది ఇబ్బంది పెడుతుంది. ఈ సమస్య ఉన్నప్పుడు మీ ఫ్యామిలీ డాక్టర్‌ను కలిసి, ఆయన సూచనల మేరకు మీ కాలి దగ్గర ఒక ఎత్తయిన దిండు వేసుకుంటే సరిపోతుంది. అలాకాకుండా మీ కాలి రక్తనాళాల్లో ఏవైనా అడ్డంకులు ఏర్పడినా లేదా రక్తనాళాలు ఉబ్బి గుండెకు చేరాల్సిన రక్తసరఫరాను అది అడ్డుకుంటుంటే అప్పుడు మీరు ‘వేరికోస్ వెయిన్స్’ అనే కండిషన్ బారిన పడ్డట్లు చెప్పవచ్చు. మీరు మీ డాక్టర్‌ను సంప్రదిస్తే వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేయిస్తారు. ఒకవేళ మీరు ‘వేరికోస్ వెయిన్స్’ బారిన పడ్డా కంగారు పడాల్సిన అవసరం లేదు. మీరు చెప్పిన వివరాల ప్రకారం మీ సమస్య మొదటి దశలోనే ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పుడు ఆధునిక వైద్య చికిత్సల్లో వచ్చిన పురోగతి వల్ల మీ సమస్యను పూర్తిగా నయం చేయవచ్చు. సర్జరీ వంటి ప్రక్రియలకు ఖర్చుచేయడం అనవసరం అనే అభిప్రాయంతో మీ సమస్య తీవ్రతను పెంచుకోవద్దు. అలాగే నొప్పి, దురద, వాపులాంటివి లేవనుకొని నిర్లక్ష్యం చేయకూడదు. మీరు వెంటనే డాక్టర్‌ను సంప్రదించి తగిన చికిత్స చేయించుకోండి.
డయాబెటిక్ ఫుట్ అంటే?
నా వయసు 59. గత పదిహేనేళ్లుగా షుగర్‌వ్యాధితో బాధపడుతున్నాను. కొన్ని నెలల నుంచి నా కాళ్లు తరచూ తిమ్మిరెక్కుతున్నాయి. కాళ్లలో మంటలుగా అనిపిస్తున్నాయి. ఒక రోజు మరుగుతున్న నీళ్లు కాళ్ల మీద పడి బొబ్బలు కూడా వచ్చాయి. కానీ నాకు బాధ తెలియలేదు. నేను ఆందోళనతో డాక్టర్‌ను కలిశాను. డయాబెటిస్ ఫుట్ అని చెప్పి చికిత్స అందించారు. నాకు డయాబెటిస్ ఉందిగానీ... కాళ్లకు ప్రత్యేకంగా ఈ డయాబెటిస్ ఏమిటో నాకు అర్థం కావడం లేదు. అసలు డయాబెటిక్ ఫుట్ అంటే ఏమిటి? దయచేసి వివరంగా చెప్పండి.
– జి. ప్రభావతి, నల్లగొండ
డయాబెటిస్ ఫుట్ అంటే విడిగా కాళ్లకు డయాబెటిస్ సోకడం కాదు. డయాబెటిస్‌తో బాధపడే చాలామందిలో ఎదురయ్యే ప్రధానసమస్యల్లో కాళ్లపై పుండ్లు ఏర్పడే డయాబెటిక్ ఫుట్ ముఖ్యమైనది. దాదాపు ఆరోవంతు మంది వ్యాధిగ్రస్తుల్లో ఇది కనిపిస్తుంది. రోడ్డు ప్రమాదాల్లో కాకుండా... దేశవ్యాప్తంగా కాళ్లను తొలగించే పరిస్థితుల్లో 50 శాతానికి పైగా ఈ డయాబెటిక్ ఫుట్ కారణంగానే చోటుచేసుకుంటున్నాయి. ఇక డయాబెటిస్ సమస్య తీవ్రమై కాలు తొలగించాల్సి వచ్చిన వారిలోనూ 40 శాతం మందిలో ఆ తర్వాత మూడేళ్లకే రెండో కాలు కూడా తొలగించాల్సి వస్తోంది. అయితే ఇలాంటి రోగులకు ఆశాజనకం, ఉపశమనం కలిగించే విషయం ఏమిటంటే... ఇలా కాలిని తొలగించాల్సిన కేసుల్లో కాస్త ముందుజాగ్రత్తగా వ్యవహరిస్తే 85 శాతం మందిలో ఈ ప్రమాదాన్ని నివారించవచ్చు.
డయాబెటిస్ కారణంగా వచ్చే ఈ పరిస్థితి గురించి తగిన అవగాహన లేకపోవడమే మనలో కాలు కోల్పోవడానికి ఒక ప్రధాన సమస్య. అందుకే డయాబెటిస్‌పై తగిన అవగాహన పెంచుకోవాలి.
డయాబెటిస్ రోగులు... తమ కాలు తిమ్మిరిగా ఉండటం, నొప్పినీ... వేడి–చల్లదనాలను కాలు గుర్తించలేకపోవడం, కాళ్లమంటలు, కొద్దిపాటి బరువును కూడా భరించలేకపోవడం (పలుచని బెడ్‌షీట్ కాలి మీద పడ్డా అది చాలా బరువుగా అనిపించడం), కాలి కండరాలు బలహీనపడటం వంటి లక్షణాలతో డయాబెటిక్ ఫుట్‌ను ముందుగా గుర్తించవచ్చు. ఈ కారణాల వల్ల కాలికి దెబ్బతగిలినా రోగికి అది తెలియదు. మరోవైపు ఆ గాయం మానకుండా పెద్దదవుతుంది. పుండు పడుతుంది. డయాబెటిస్ వల్ల కాలికి జరిగే రక్తసరఫరాలో కూడా సమస్యలు ఎదురవుతాయి. తగినంత రక్తం సరఫరా కాకపోవడంతో గాయాలు పుండ్లు త్వరగా మానవు. అది గ్యాంగ్రీన్‌గా మారే ప్రమాదం పొంచి ఉంటుంది. కొద్దిపాటి జాగ్రత్తలతో డయాబెటిక్ ఫుట్ నుంచి కాళ్లూ, పాదాలను కాపాడుకోవచ్చు. వెచ్చని నీళ్లు, సబ్బు ఉపయోగిస్తూ ప్రతిరోజూ పాదాలను శుభ్రంగా కడుక్కోవాలి. పాదాలను నీళ్లలో నాన్చి ఉంచకూడదు. వేళ్ల మధ్యభాగాలతో సహా మొత్తం కాలు, పాదాన్ని తుడిచి పొడిగా ఉంచుకోవాలి. కాళ్లు, పాదాలపై పుండ్లు, బొబ్బలు, కమిలిన ప్రదేశాలు ఏమైనా ఏర్పడ్డాయా అని ప్రతిరోజూ చూసుకుంటూ ఉండాలి. కాళ్లల్లో రక్తప్రసరణకు సంబంధించి ఏవైనా సమస్యలు ఉన్నట్లయితే ఈ విషయంలో మరింత జాగ్రత్త అవసరం. బయటే కాకుండా ఇంట్లో కూడా పాదరక్షలు ధరించి తిరగాలి. వీలైనంతవరకు సాక్స్ వేసుకోకపోవడమే మంచిది. వేళ్లను కప్పి ఉంచే పాదరక్షలను ధరించి తిరగాలి. మార్నింగ్ వాక్, ఇతర సమయాల్లో షూస్ ధరించేట్లయితే కాన్వాస్‌తో తయారుచేసిన వాటినే ఎంచుకోవాలి.
డాక్టర్ దేవేందర్ సింగ్
సీనియర్ వాస్క్యులార్ అండ్‌ఎండోవాస్క్యులార్æ సర్జన్,యశోద హాస్పిటల్స్,
సోమాజిగూడ, హైదరాబాద్
Comments
Please login to add a commentAdd a comment