తండ్రీ... నిను దలంచి | special story to Litterateur Rajanikantha Rao | Sakshi
Sakshi News home page

తండ్రీ... నిను దలంచి

Published Wed, Apr 25 2018 12:12 AM | Last Updated on Mon, Aug 13 2018 7:54 PM

special story to Litterateur Rajanikantha Rao - Sakshi

రజనీకాంతరావు కుటుంబ సభ్యులు 

అమృతం దొరికితే తాము తాగకుండా పిల్లలకు పంచిపెట్టేవారే తల్లిదండ్రులు అని ఒక కవి పోలిక.బాలాంత్రపు రజనీకాంతరావు వాత్సల్యం అనే అమృతం పిల్లలకు పంచారు. సంగీతం అనే అమృతం శ్రోతలకు పంచారు.తన గేయంతో, గానంతో అమరుడైనవాడు రజనీ.  ఆయన మరపురాని జ్ఞాపకాలను పిల్లలు పంచుకుంటున్నారు.

వాగ్గేయకారుడిగా, ఆకాశవాణి స్టేషన్‌ డైరెక్టర్‌గా, అంతర్జాతీయ స్థాయిలో అవార్డులు అందుకున్న సాహితీవేత్త బాలాంత్రపు రజనీకాంతరావు పరిపూర్ణ జీవితాన్ని అనుభవించి, పండు వయసులో ఇటీవల కన్నుమూశారు. ఆయనకు ముగ్గురు అబ్బాయిలు, ఇద్దరు అమ్మాయిలు. తండ్రి జ్ఞాపకాలను పంచుకోమని సాక్షి కోరిన వెంటనే వారు అంత బాధలోనూ స్పందించారు. 

సంగీత సాహిత్యాలే లోకం...
పెద్దబ్బాయి హేమచంద్ర మాట్లాడుతూ ‘మా ఇంటికి కాటూరి వెంకటేశ్వరావు, దేవులపల్లి కృష్ణశాస్త్రి వంటి సాహితీవేత్తలు వస్తుండేవారు. ఇంట్లో జరిగే సాహిత్య చర్చలు వింటూ పెరిగాం. పిల్లలు ఏం చదువుతున్నార నే విషయం మీద నాన్న ఎన్నడూ దృష్టి పెట్టలేదు. ఎవరికి ఎంత రాసి పెట్టి ఉంటే, అంతే వస్తుందని త్రికరణశుద్ధిగా నమ్మారు. మేం ఏం చదువుతున్నామో కూడా ఆయనకు తెలియదన్నమాట’– అంటూ నవ్వేశారు.   ‘నాన్నగారికి పిల్లలంటే చాలా ఇష్టం. మా ఐదుగురినీ చక్కగా చూసుకున్నారు. పరీక్షల్లో తక్కువ మార్కులు వచ్చినప్పుడు తిడతారేమోనని భయపడుతుంటే, గబగబ బయటకు వెళ్లి గ్లోబ్, స్క్రాబుల్‌ కొని తెచ్చారు. ఒకసారి వరల్డ్‌ అట్లాస్‌ తెచ్చారు. చదువులంటే మార్కులు కాదు, పరిజ్ఞానం అని ఆయన పరోక్షంగా తెలియచెప్పారు. బయట కూడా టాలెంట్‌ ఉన్నవారినే అక్కున చేర్చుకునేవారు. ఉషశ్రీ, పన్నాల సుబ్రహ్మణ్యభట్టు, శ్రీరమణ... ఇలా చాలామందిని ప్రోత్సహించేవారు’ అంటూ తండ్రి జ్ఞాపకాల వానలో తడిసిపోయారు రెండో అబ్బాయి శరత్‌. ‘నాన్నగారి సంగీత వారసత్వం కొంతవరకు నాకు వచ్చింది. ఆయన పాటలన్నీ నేను రాగయుక్తంగా పాడతాను. నన్ను చూస్తే నాన్నగారికి గర్వంగా ఉండేది. మూడో వాడు సంగీతం బాగా పాడతాడు’ అనేవారు అంటూ కళ్లు తుడుచుకున్నారు మూడో అబ్బాయి రామచంద్ర వెంకోబ్‌.

అల్లరి మధ్యలో రాత పని
‘1953 ఆ ప్రాంతంలో నాన్నగారు ‘ఆంధ్రవాగ్గేయకార చరిత్ర’ కు శ్రీకారం చుట్టారు. ఆయన రాసుకోవడం మొదలు పెట్టేసరికి పిల్లలమంతా ఆయన చుట్టూ చేరి ఆయన రాసుకున్న కాగితాల మీద గీతలు గీయడం ప్రారంభించాం. మేం లేకపోతే ఆయన ప్రశాంతంగా రాసుకోవచ్చనుకుని అమ్మని, మమ్మల్ని అమ్మమ్మ ఇంటికి పంపేశారు. అయితే పిల్లల అల్లరి లేకపోతే నేను రాయలేకపోతున్నానంటూ మరుసటి రోజు ఉదయమే మమ్మల్ని ఇంటికి తీసుకువచ్చేశారు’ అని రెండో అమ్మాయి నిరుపమ తండ్రి జ్ఞాపకాలను కలబోసుకున్నారు. ‘మా అత్తగారు పోయినప్పుడు చాలా భయపడ్డాం. ఆవిడంటే ఆయనకు ఎంతో ప్రేమ. మాకు తెలిసి వారిద్దరినీ ఒకరే అనుకునేవారం. కాని తట్టుకొని నిలబడ్డారు’ అన్నారు పెద్ద కోడలు ప్రసన్న. ‘ఆరుగురు మనుమలు, ముగ్గురు మునిమనుమలతో బాగా సరదాగా ఉండేవారు. మా అబ్బాయి బాగా పాడుతుంటే, మెచ్చుకోవడం నాకు ఎంతో సంతోషం అనిపించింది’ అన్నారామె. అలాగే ఆయన గొప్పతనం తెలిపే మరో జ్ఞాపకం కూడా పంచుకున్నారు. ‘ఆదికావ్యావతరణం రూపకం రిహార్సల్స్‌ విజయవాడ ఆకాశవాణి పాత స్టూడియోలో ఆరుబయట జరుగుతోందట. అందులో క్రౌంచపక్షి పడిపోతున్న మ్యూజిక్‌ను వయొలిన్‌ మీద చేయించారుట. ఆ సౌండ్‌ వినగానే అక్కడ చెట్ల మీదపక్షులన్నీ రోదించిన ధ్వని చేశాయని రిహార్సల్స్‌లో ఉన్నవారంతా మాకు ఇంటికి వచ్చి చెప్పారు’ అన్నారామె.‘తెలుగు క్యాలెండర్‌ ప్రకారం ఆయనకు నూరేళ్ల పండుగ చేసినప్పుడు చాలా సంతోషపడ్డారు. ఢిల్లీ నుంచి మనవడు వచ్చి పాటలు పాడుతుంటే ఆశీర్వదించి మురిసిపోయారు’ అని గుర్తు చేసుకున్నారు. 

పిల్లలను చూసి పాటలు
తండ్రి రాసిన పాటలన్నీ తమ మీదనేనని చెప్పుకున్నారు పెద్దమ్మాయి రమణకుమారి. ‘నాన్న రాసిన జే జి మావయ్య పాటలు చాలా వరకు మా మీదే రాశారు. మా చెల్లాయి నిరుపమ పళ్లు ఊడినప్పుడు పెద్ద తమ్ముడు, ‘నిమ్మీ! నీ పళ్లు ఏవే? అని ఆటపట్టిస్తుంటే, ఆయన ‘నిమ్మీ! నీ పళ్లేవే చెల్లీ నీ పళ్లేవే’ అని పాట రాశారు. మా పెద్ద తమ్ముడు పందిని చూసి అసహ్యించుకుంటే, ‘బాబుని చూసి పంది...’ అనే పాట రాశారు. మూడో తమ్ముడు వెంకోబ్‌ పుట్టినప్పుడు, ‘అలా ఎలా వచ్చావురా తమ్మూ’ అని పాట రాశారు. అవన్నీ మళ్లీ బాలానందంలో పాడించారు. మా తమ్ముళ్లు, చెల్లాయి మూడు చక్రాల సైకిల్‌ మీద ఆడుకుంటుంటే–‘మూడు చక్రాలు... చకచకా పోతోంది’ అంటూ మూడు చక్రాల సైకిల్‌ పాట రాశారు. అమ్మ చెంగులో దాగుని, ఆడటం చూసి, ‘దోబూచి దోబూచి/ కళ్లు రెండు మూసేసి/ అమ్మ చెంగున దాచేసి’ అంటూ రాశారు. రావే రావే పిల్లి, ఈ ముద్ద నీకు కాదు పోవే కాకి, జాబిలి వస్తున్నాడు కొండెక్కి చూస్తున్నాడు... అంటూ పిల్లల కోసం ఎన్నో పాటలు రాశారు’ అని చెప్పారు.తండ్రి ఇష్టాయిష్టాలను నిరుపమ గుర్తు చేస్తూ ‘నాన్నకి స్వీట్లంటే చాలా ఇష్టం. తేలికగా తినే రవ్వకేసరి, పరమాన్నం బాగా ఇష్టం. తెలుగు సభలకు పంచె కట్టుకునేవారు. కొన్ని అఫీషియల్‌ కార్యక్రమాలకు సూట్‌ వేసుకునేవారు’ అని వివరించారు.తండ్రి జ్ఞాపకాలు పిల్లలకు మరపురానివి.కాని ఇవి వారి తండ్రివి మాత్రమే కాదు.తెలుగువారు మర్చిపోలేని ఒక వాగ్గేయకారుడివి కూడా.

డ్యూటీలో మాటరానిచ్చేవారు కాదు
జై ఆంధ్ర సమయంలో ఆంధ్ర దేశమంతా కర్ఫ్యూతో అట్టుడికిపోతోంది. అంత ఒత్తిడిలోనూ ఒక్క సెకను కూడా రేడియో ప్రసారం ఆగిపోకుండా చేశారు నాన్న. ఇంటి మీదకు ఉద్యమకారులు వస్తారేమోననే భయంతో, మమ్మల్ని బంధువుల ఇళ్లకు పంపేశారు. ఆ ఉద్యమంలో కన్నుమూసిన కాకాని వెంకటరత్నం అంతిమయాత్రకు ప్రత్యక్ష వ్యాఖ్యానం చెప్పమని ఉషశ్రీని పిలిచారు. స్టూడియో నుంచే వ్యాఖ్యానం పూర్తి చేసి బయటకు వచ్చిన తనని చూసి నాన్న సంతోషంతో కౌగలించుకున్నారని స్వయంగా ఉషశ్రీ మాతో చెప్పారు. నాన్న మనసు ఎంతో సున్నితమైన దని, తన ఉద్యోగుల మీద కూడా పుత్రవాత్సల్యం చూపించేవారని ఆకాశవాణిలో పనిచేసినవారంతా అంటారు. 
– హేమచంద్ర, పెద్ద కుమారుడు

బాధ్యతతో పాటు గ్రహింపు ఉండాలి
నా పెళ్లయిన కొద్ది రోజులకు క్వార్టర్స్‌లో ఆరుబయట మెట్ల మీద ఉండగా, ఆయన ఆ పక్కనే కూర్చుని టీ తాగుతూ, ‘ఈ మొక్క సహజంగా పుట్టింది. మనం నాటినది కాదు. దానికి నీళ్లు పోసి, పాదు చేస్తే బాగా ఎదుగుతుంది. లేకపోతే చచ్చిపోతుంది. బాధ్యతతో మాత్రమే కాదు గ్రహింపుతో కూడా మనం కొన్ని పనులు చేయాలి’ అన్నారు. ఆ పాఠం జీవితాంతం గుర్తుంచుకున్నాను. 
– ప్రసూన, పెద్ద కోడలు
– సంభాషణ: పురాణపండ వైజయంతి

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement