సింగిల్‌ హ్యాండ్‌ సచిన్‌  | Special story to muni sekhar | Sakshi
Sakshi News home page

సింగిల్‌ హ్యాండ్‌ సచిన్‌ 

Published Wed, Jun 13 2018 12:10 AM | Last Updated on Wed, Jun 13 2018 12:10 AM

 Special story to muni sekhar - Sakshi

సాధించాలనే తపన.. సాధిస్తాననే నమ్మకం.. సాధించగలననే ఆత్మవిశ్వాసం ఉంటే అద్భుతాలను ఆవిష్కరించవచ్చని నిరూపిస్తున్నాడు చిత్తూరు జిల్లా తిరుపతికి సమీపంలోని వేదాంతపురం పంచాయతీకి చెందిన పాలమంగళం మునిశేఖర్‌. అవమానాలనే పునాదులుగా చేసుకుని ఒంటిచేత్తో క్రికెట్‌లో వండర్స్‌ సృష్టిస్తూ..సింగిల్‌ హ్యాండు సచిన్‌గా గుర్తింపు సాధిస్తున్నాడు. ఒంటి చేత్తోనే సిక్స్‌లు, ఫోర్లను అవలీలగా కోట్టేయడమే కాకుండా, ఫీల్డింగ్‌లోనూ రాణిస్తూ అద్భుత క్యాచ్‌లను ఒడిసి పట్టేస్తూ అవార్డుల మీద అవార్డులు సాధిస్తున్నాడు. ఓ పక్క ఆవులను మేపుతూనే మరోవైపు డీఎస్సీకి ప్రిపేరు అవుతూ.. తనకు ఇష్టమైన క్రికెట్‌లో రాణిస్తున్నాడు. ప్రభుత్వం, దాతలు సహకరించి మెరుగైన శిక్షణ అందిస్తే క్రికెట్‌లో రాణించి దేశానికి ఆడాలని తన జీవిత లక్ష్యమని చెబుతున్నాడు. 

చేతిని మింగిన కోతి కొమ్మచ్చి
మునిశేఖర్‌ చిన్ననాటి నుంచి బాగా చురుగ్గా ఉండేవాడు. 12 ఏళ్ల వయస్సులో స్కూల్లో పిల్లలందరూ కలసి కోతి కొమ్మచ్చి ఆట ఆడుతున్నారు. పక్కనున్న విద్యార్థి తోసేయడంతో 12 అడుగుల ఎత్తున్న చెట్టు కొమ్మపై నుంచి కిందకు పడ్డాడు. దీంతో ఎడమ చేతి మణికట్టు వద్ద విరిగింది. పక్కనే గ్రామంలో ఉన్న వైద్యుడు వద్దకు వెళ్లితే పసరు కట్టు వేసి పంపించాడు. సరైన వైద్యం అందక పోవడంతో చేతి నరాలు దెబ్బతిన్నాయి. రక్త ప్రసరణ ఆగిపోయింది. చేతి మీద పెద్ద పెద్ద బొబ్బలు వచ్చి నల్లగా మారింది. దీంతో మెరుగైన చికిత్స నిమిత్తం తిరుపతి రుయా ఆసుపత్రికి తీసుకెళ్లారు. నరాలు దెబ్బతిన్నాయని, ఇన్‌ఫెక్షన్‌ ఎక్కువగా అయిందని, చేతిని మోచేతి వరకు తీయాల్సిందేనని, లేకుంటే ప్రాణానికే ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరించారు. తప్పనిసరి పరిస్థితుల్లో మునిశేఖర్‌ ఎడమ చేతిని మోచేతి వరకు తొలగించారు. 

 మామ శిష్యరికంలో.. క్రికెట్‌లో ఓనమాలు
చేయి తొలగించాక నగరి దగ్గర ఉన్న దామరపాకంలోని మేనమామ సుబ్రమణ్యం ఇంట్లో ఉండి 10వ తరగతి వరకు చదువు పూర్తి చేసుకున్నాడు. తర్వాత తిరుపతి ఎస్‌జీయస్‌ కళాశాలలో డిగ్రీ పూర్తి చేశాడు. తర్వాత డీఎడ్‌ కూడా పూర్తి చేశాడు. రెండేళ్ల క్రితం తండ్రి రామయ్య విద్యుత్‌ పనులకు వెళ్లి ప్రమాదవశాత్తు మృతి చెందాడు. దీంతో తల్లి లలితమ్మ ఆవులను మేపుతూ కుటుంబాన్ని పోషిస్తోంది. అమ్మకు చేదోడువాదోడుగా ఉండేందుకు మునిశేఖర్‌ తండ్రికి చెందిన బైక్‌ను ఒంటిచేత్తో నడపడం నేర్చుకున్నాడు. బైక్‌ పైనే కసువు కోసుకురావడం, ఆవుల కోసం నీళ్లు తీసుకురావడం వంటి పనులను చేస్తున్నాడు. ఆవులను మేపుతూ కుటుంబ పోషణలో పాలుపంచుకుంటూనే,  ప్రస్తుతం డీఎస్సీ కోసం ప్రిపేరు అవుతున్నాడు.మామ సుబ్రమణ్యంకు క్రికెట్‌ అంటే ఇష్టం. అతనితో పాటు మునిశేఖర్‌ కూడా ఆటను చూసేందుకు వెళ్లేవాడు. దీంతో ఆటపై ఆసక్తితో నేర్చుకోవాలని ఆశ పడ్డాడు. రెండు చేతులు ఉండే వాళ్లే ఆడేందుకు అష్టకష్టాలు పడుతున్నారు.. ఒంటి చేత్తో నువ్వు ఏం సాధిస్తావు.. అంటూ హేళనగా మాట్లాడారు. కళాశాల స్థాయిలో కూడా చిన్నపాటి అవకాశాలు ఇవ్వలేదు. దాంతో క్రికెట్‌పై మునిశేఖర్‌కు మరింత కసి పెరిగింది. ఎలాగైనా క్రికెట్‌ను ఆడాలి..తాను ఫోర్లు, సిక్స్‌లు కొట్టాలి.. మంచి పేరు తెచ్చుకోవాలని పట్టుదల పెంచుకున్నాడు. మూడేళ్ల క్రితం ఇంటి వద్దనే మామ సుబ్రమణ్యం దగ్గర బ్యాట్‌ పట్టుకోవడం, బ్యాటింగ్‌ చేయడం సాధన చేశాడు. బ్యాటింగ్‌లో మంచి ప్రతిభ చూపడంతో గ్రామ స్థాయిలో టీమ్‌లోకి ఎంటర్‌ అయ్యాడు.
 
గ్రామీణ టోర్నమెంట్‌తో గుర్తింపు
చంద్రగిరి ఎమ్మెల్యే డాక్టర్‌ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి నిర్వహిస్తున్న వైఎస్సార్‌ గ్రామీణ క్రికెట్‌ టోర్నమెంట్‌ మునిశేఖర్‌ ప్రతిభకు జిల్లా స్థాయి గుర్తింపును తెచ్చిపెట్టింది. భారీ స్థాయిలో నిర్వహిస్తున్న ఈ టోర్నమెంట్‌లో మునిశేఖర్‌ కొట్టిన సిక్స్‌లు, ఫోర్లకు అందరూ ఆశ్చర్యచకితులు అయ్యారు. ఇప్పటి వరకు 18 అర్ధ సెంచరీలు సాధించాడు. అతని బెస్ట్‌ స్కోరు 93 నాటౌట్‌. 2016 టోర్నమెంట్‌లో కేవలం 18 బంతుల్లో నాలుగు సిక్స్‌లు, ఐదు ఫోర్లతో అతను సాధించిన 62 పరుగులు అతని దూకుడైన బ్యాటింగ్‌కు నిదర్శనం. కేవలం బ్యాట్స్‌మెన్‌గా ఉంటే సరిపోదని బౌలింగ్‌ కూడా ప్రాక్టీస్‌ చేయడం ప్రారంభించిన మునిశేఖర్, ప్రస్తుతం జరుగుతున్న వైఎస్సార్‌ గ్రామీణ క్రికెట్‌ టోర్నమెంట్లో మొదటి మ్యాచ్‌లో 3 ఓవర్లలో 8 పరుగులు ఇచ్చి 3 వికెట్లు పడగొట్టి, బెస్ట్‌ బౌలర్‌ అవార్డును అందుకున్నాడు.  ఇప్పటి వరకు 16 టోర్నమెంట్లు ఆడిన అతను 9సార్లు బెస్ట్‌ బ్యాట్స్‌మెన్, ఐదు సార్లు బెస్ట్‌ బౌలర్, మరో ఆరు సార్లు మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డులను కైవసం చేసుకున్నాడు. అతని ఆట తీరు చూసిన ప్రతి ఒక్కరూ ‘ఒంటి చేయి సచిన్‌’ అంటూ పిలుస్తుంటారు.

ప్రోత్సాహం కరువు
క్రికెట్‌లో అద్భుత ప్రతిభ చూపుతున్న మునిశేఖర్‌కు ప్రభుత్వం నుంచి కానీ వికలాంగులశాఖ నుంచి కానీ ప్రోత్సాహం కరువైంది. పారా గేమ్స్‌లోను అవకాశం కల్పించడం లేదని ఈ ప్రతిభావంతుడు ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు.  దాతలు కానీ, ప్రభుత్వం కానీ తనకు మెరుగైన శిక్షణ తీసుకునేందుకు సహాయం చేయాలని కోరుతున్నాడు. 
– సౌపాటి ప్రకాష్‌బాబు, సాక్షి, తిరుపతి

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement