ఉరకలు వేసే ఉత్సాహంతో ఈ జూన్ 30నపుట్టిన రోజు వేడుకని సంబరంగా జరుపుకుంది 22 ఏళ్ల చంద్రిక. కానీ అదే తన జీవితంలో చివరి వేడుకని తెలియలేదు తనకి.కృష్ణా జిల్లా నందిగామకు చెందిన చంద్రిక నిండు నూరేళ్ల జీవితం పాతికేళ్లు కూడా నిండకుండానే కడతేరిపోయింది. అది కూడా సొంత తండ్రి చేతిలో!ప్రమాదవశాత్తూ అనో, ఆవేశంలో అనో తండ్రి చంపేశాడని సరిపెట్టుకోవడానికి ఇది మామూలు హత్య కాదు.ఇది పరువు హత్య! పరువు పేరుతో హత్య. చంద్రిక చేసిన నేరమల్లా తన జీవిత భాగస్వామిని తాను ఎంపిక చేసుకోవడమే.
నిజానికి 18 ఏళ్లు నిండిన ఏ ఆడపిల్లైనా తనకు నచ్చిన వ్యక్తిని ఎంచుకోవచ్చుననీ, దాన్ని ఎవరైనా అడ్డుకోవాలనుకోవడం తీవ్రమైన నేరంగా భావించాల్సి వస్తుందనీ భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఏనాడో తీర్పు ఇచ్చింది. కానీ ఈ దేశంలో కుటుంబ బంధాలూ, రక్త సంబంధాలూ, ప్రేమానుబంధాలన్నింటికన్నా మించింది కులమేనని మరోసారు రుజువు చేసింది చంద్రిక మరణం. ఆడపిల్లల జీవితాల్లో పరువు అనే మూడక్షరాలు సృష్టిస్తోన్న మారణకాండకి చంద్రిక ఒక తాజా ఉదాహరణ మాత్రమే. యూపీ, బిహార్, హర్యానా లాంటి రాష్ట్రాల్లో ఖాప్ పంచాయితీల పేరుతోనూ, తమిళనాడులో ఖట్టా పేరుతోనూ కుటుంబ సభ్యుల చేతిలో హత్యకు గురై చివరకు ఆచూకీ దొరకని కేసుగానో, తప్పి పోయిన కేసుగానో, ఎవరితోనో వెళ్లిపోయి కనపడకుండా పోయిన అమ్మాయిల జాబితాలోనో చేరిపోతూ అంతుచిక్కని రహస్యంగా మారిపోతున్నాయి అమ్మాయిల మరణాలు. అందుకు ఎన్నో నిదర్శనాలు.
2016 మార్చి 24. గుంటూరు జిల్లా పట్టాభిరాంపురంలో కూతురు దీప్తిని చున్నీని ముఖానికి చుట్టి ఊపిరాడకుండా చేసి చంపేసాడు తండ్రి హరిబాబు. హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఐటీæ కంపెనీలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తోన్న దీప్తి చేసిన ‘నేరం’ కూడా.. తనకు నచ్చిన వ్యక్తిని కులం చూడకుండా ప్రేమించడమే. ఎవరికైనా తెలిస్తే పరువు పోతుందని, కులం తక్కువ వ్యక్తితో ప్రేమా గీమా అంటే తాము చనిపోతామని మొదట బెదిరించాడు. తర్వాత నయానా భయానా చెప్పి చూశాడు. దీప్తి తను ప్రేమించినతన్నే చేసుకుంటానని చెప్పడంతో ఏదో వంకతో హైదరాబాద్ నుంచి గుంటూరుకి పిలిపించి చున్నీతోనే ఊపిరాడకుండా చేసి చంపేశాడు. ఆ తరువాత కోపంలో చంపేశామని పోలీసులకు లొంగిపోయాడు.
2015 జనవరి 31. ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లాలోని పంజని పోలీస్ స్టేషన్ పరిధిలోని కొత్తవీరపల్లి గ్రామంలో ఇంటర్‌మీడియట్ చదువుతోన్న పదిహేడేళ్ల అమ్మాయిని సొంత తల్లిదండ్రులే చంపేసి, తమ కూతురు కనిపించడం లేదని పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. వేరే కులానికి చెందిన 20 ఏళ్ల వ్యక్తితో చనువుగా ఉండడం తెలిసి, అమ్మాయి తండ్రి శ్రీరాములు కూతురిని హెచ్చరించాడు. అయినా వినకపోవడంతో తల్లీతండ్రీ ఇద్దరూ కలిసి ఆ అమ్మాయికి మాయమాటలు చెప్పి కొండమీదికి తీసుకెళ్లి చంపేశారు. పోలీసు ఇన్వెస్టిగేషన్ ప్రారంభించడంతో అది జరిగిన పది రోజుల తరువాత ఆ అమ్మాయి శవం దొరికింది. అసలు విషయం బయటపడింది.
ప్రేమ.. పరువు.. హత్య
ప్రాణంకన్నా ఎక్కువగా భావించే, ప్రేమించే పిల్లలకి ఏ తండ్రైనా, తల్లైనా ఎందుకు హాని చేస్తారు? కన్నపేగుకన్నా బలమైనదేదో వారిని కట్టిపడేస్తోంది. అదే.. కుల సమాజం. కులం కాకపోతే మతం లేదా ప్రాంతం లేదా స్టేటస్. వీటన్నింటి ద్వారా సంక్రమించే పరువు. అదే ఈ హత్యలన్నిటికీ కారణం. ఓ సామాజిక అనంగీకార భావన. ఇంకా చెప్పాలంటే న్యూనతా భావం. ఇంత వరకూ గౌరవంగా చూసిన సమాజం తక్కువ కులం వ్యక్తిని తమ బిడ్డ వివాహం చేసుకుంటే ఏమనుకుంటుందోననే భయం. తమని గేలిచేస్తారేమోననే ఆత్మన్యూనతాభావం. కులం నుంచి వెలివేస్తారేమోననే భయం. కుటుంబ గౌరవం పోతుందనే ఓ తప్పుడు భావజాలం వారిని సొంత బిడ్డలనే కడతేర్చుకునేలా చేస్తోంది. పరువు హత్యకు పాల్పడేలా చేస్తోంది.ఉత్తరాదికి పోటీగా ఏపీ! ఉత్తరప్రదేశ్, హరియానా, గుజరాత్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో పరువు హత్యలు ఎక్కువగా జరుగుతున్నాయి. అక్కడ ఆడపిల్లలను కంట్రోల్ చేయడమన్నది ఖాప్ పంచాయితీల పేరుతో వ్యవస్థీకృతంగా కొనసాగుతోంది. ఆంధ్రప్రదేశ్ కూడా ఇప్పుడు పరువుహత్యల్లో ఉత్తరాది రాష్ట్రాలకు ఏమాత్రం తీసిపోని విధంగా ఉందని గణాంకాలు ధ్రువీకరిస్తున్నాయి.
– అత్తలూరి అరుణ
సుప్రీంకోర్టు ఏం చెపుతోంది?
‘‘వివాహ వయస్సు వచ్చిన ఏ అమ్మాయికి అయినా, అబ్బాయికి అయినా తమకిష్టమైన వ్యక్తిని పెళ్లి చేసుకునే హక్కు వుంది. అందులో ఖాప్ పంచాయితీలు గానీ, ఏ ఇతర వ్యక్తులుగానీ, సమాజాలుగానీ ప్రశ్నించే హక్కులేదు’’ అని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ దీపక్ మిశ్రా, జస్టిస్ ఖాన్‌వాల్కర్, జస్టిస్ చంద్రచూడ్‌లతో కూడిన ధర్మాసనం తేల్చి చెప్పింది. ఏప్రిల్ 2011లో సుప్రీంకోర్టు న్యాయమూర్తులు మార్కండేయ ఖట్జూ, జ్ఞాన్ సుధా మిశ్రాతో కూడిన ధర్మాసనం.. పరువు పేరుతో హత్యలను వ్యవస్థీకరించిన ఖాప్ పంచాయితీలను తీవ్రంగా దుయ్యబట్టింది. దక్షిణాదిన తమిళనాడులో ఖట్టా్ట పంచాయితీలు, ఉత్తర భారతదేశంలో ఖాప్ పంచాయితీల పేరుతో జరుగుతున్న దారుణాలకు అడ్డుకట్టవేయాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పింది. ఇటీవల కూడా పరువు హత్యలను అరికట్టాల్సిన బాధ్యత ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వాలపై ఉంటుందని చెప్పింది. దీనిపై జిల్లా కలెక్టర్లకు, పోలీసు అధికారులకు కొన్ని సూచనలు కూడా చేసింది. కులాంతర, మతాంతర వివాహాల సందర్భంగా ప్రభుత్వాల పరంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలేమిటో వివరించింది. ప్రభుత్వం, పోలీసు వ్యవస్థ ఈ దురాచారాలపై ప్రజలను చైతన్యం చేయాల్సిన ఆవశ్యకతను నొక్కి చెప్పింది. అయినప్పటికీ ఇప్పటికీ పరువు హత్యల పరంపర కొనసాగుతూనే ఉండడం ఆడపిల్లల జీవించే హక్కుని హరించి వేస్తోంది.
ఐసీఏహెచ్‌కే నివేదిక ఆధారంగా...
►ప్రపంచవ్యాప్తంగా రోజుకు 13 మంది మహిళలు పరువుహత్యకు గురవుతున్నారు.
►ఏడాదికి సుమారు 5000 పరువు హత్యలు
Comments
Please login to add a commentAdd a comment