అజ్ఞాత మూర్తి | special story on kokila ben | Sakshi
Sakshi News home page

అజ్ఞాత మూర్తి

Published Mon, Dec 5 2016 12:52 AM | Last Updated on Mon, Sep 4 2017 9:54 PM

రిలయన్స్ రాజమాత : కోకిలాబెన్... నాడు.. నేడు

రిలయన్స్ రాజమాత : కోకిలాబెన్... నాడు.. నేడు

ధీరూభాయ్ అంబానీకి అదృష్టమూర్తి...
ముఖేశ్ అంబానీకి, అనిల్ అంబానీకి మాతృమూర్తి...
రిలయన్స్ ప్రగతికి అజ్ఞాతమూర్తి... కోకిలా బెన్.
భర్తకు నీడ, పిల్లలకు వెలుగు.. కోకిలాబెన్.

ఒక దేశ ఆర్థిక వ్యవస్థనే ప్రభావితం చేయగల వ్యాపార మహా సామ్రాజ్యానికి రాజమాత అయిన కోకిలా బెన్ అజ్ఞాతంగా వెనుక ఉండి  ఆ సామ్రాజ్యాన్ని ముందుకు నడిపిస్తున్నారు.

ముంబైలో అంబానీ సోదరుల మాతృమూర్తి కోకిలాబెన్‌కు ఉండేందుకైతే మూడు విలాసవంతమైన నివాస భవనాలు ఉన్నాయి. అయితే వాటిల్లో ఆమెకు ఏవేళనైనా కాస్తంత మనశ్శాంతిని చేకూర్చేది కఫ్ పరేడ్ ప్రాంతంలోని 18 అంతస్తుల ‘సీ విండ్’ మాత్రమే! మరీ ముఖ్యంగా అందులోని పదో అంతస్తు. ఆ అంతస్తులో పూజామందిరం ఉంది. అక్కడ ఆమె ఇష్టదైవం ‘శ్రీనాథ్‌జీ’ కొలువై ఉంటాడు.

మిగతా రెండు నివాస భవనాలలో ఒకటి పెద్ద కొడుకు ముఖేశ్ అంబానీ దక్షిణ ముంబైలోని పెడర్ రోడ్డులో ముచ్చటపడి కట్టుకున్న 4,500 కోట్ల రూపాయల విలాసవంతమైన భవనం ‘ఆంటీలియా’! రెండోది, అన్నకు పోటీగా అనిల్ అంబానీ బాంద్రాలోని పాలీహిల్ ప్రాంతంలో ఐదు వేల కోట్ల రూపాయలతో నిర్మించుకున్న ‘అబోడ్’ భవంతి.

అనుబంధాల కేంద్రబిందువు
కొడుకులిద్దరి ఇళ్లల్లో కోకిలాబెన్ ఏ రోజు ఏ ఇంట్లో ఉంటారన్నది, ఏ ఇంటికి ఏ రోజున ఆమె అవసరం ఏర్పడిందన్నదాన్ని బట్టి మాత్రమే ఉంటుంది. సాధారణంగా అనిల్‌కు అమ్మ అవసరం ఎక్కువగా కలుగుతుంటుంది. అమ్మ సలహా, అమ్మ ఓదార్పు, అమ్మ ప్రేమ, అమ్మ తీర్పు! అతడింకా పిల్లవాడే. ముఖేశ్.. అమ్మకు ఇష్టమైనట్లు నడుచుకుంటే, అనిల్ తనకు ఇష్టమైనట్లుగా అమ్మ మనసును మలుచుకుంటూ ఉంటాడు. ఇద్దరు కోడళ్లు నీతా, టీనా; తరచూ అమ్మ ఎక్కడ ఉంటే అక్కడకు వచ్చిపోతుండే ఇద్దరు కూతుళ్లు దీప్తి, నీనా.. ఇంకా మనవలు, మనవరాళ్లు.. వీళ్లందరి అనుబంధాల కేంద్రబిందువు కోకిలాబెన్. భర్త ధీరూభాయ్ అంబానీ జీవించి ఉన్న కాలంలో భారతదేశ వ్యాపార సామ్రాజ్యానికి ప్రథమ మహిళగా ఆయనకు చేదోడుగా నడిచిన కోకిల ఇప్పుడు తన తనయులను ఒకటిగా నడిపిస్తున్నారు.

పిల్లల మధ్య ఆస్తి తగాదాలు!
దేశానికి ఇవాళ అనుకోని ఆర్థిక కష్టం వచ్చినట్టే... పదేళ్ల క్రితం అంబానీల కుటుంబానికి అనుబంధాల కష్టం వచ్చింది. అది కుటుంబ కష్టం అయితే కావచ్చు. కానీ ఒక దేశాన్నే ఆర్థికంగా ప్రభావితం చెయ్యగల కుటుంబంలో వచ్చిన అపనమ్మకాల కష్టం అది. ఎప్పట్లాగే తల్లి కాళ్లకు చుట్టుకుపోయాడు అనిల్. ‘‘నలుగురం నీ పిల్లలమే. న్యాయం నువ్వే చెప్పాలి’’ అన్నాడు. కోకిలాబెన్‌కు అర్థమైంది. పిల్లల మధ్య ఆస్తి తగాదాలు!! ఆమె ఊహించనివి! తన భర్త కూడా ఊహించలేదు కాబట్టే వీలునామా రాయకుండా పోయారు. ఆయన పోయిన మూడేళ్ల తర్వాత.. అన్న మీద తమ్ముడు, అన్నదమ్ముల మీద అక్కచెల్లెళ్లు ఆయన ఉన్నప్పటంత నమ్మకంతో లేరు. అంటే.. తల్లిగా తను సరిగా లేనట్లే కదా! బయటివాళ్లు లోపలికి వచ్చేశారంటే.. లోపల ఉండీ తనేం చేస్తున్నట్లు?! ఆలోచించారు కోకిలాబెన్.

దేవుడి ఎదుట ప్రమాణం
ఆ సాయంత్రం దీపాలు పెట్టే వేళకు అంబానీ కుటుంబ సభ్యులంతా ‘సీ విండ్’ భవంతిలోని శ్రీనాథ్‌జీ ఎదుట నిలబడి ఉన్నారు. తల్లి, ఇద్దరు కొడుకులు, ఇద్దరు కూతుళ్లు. మొదట కోకిలాబెన్ అన్నదమ్ములిద్దరి చేతా ప్రమాణం చేయించారు.. గొడవలు పడబోమని. తర్వాత దేవుణ్ణి ప్రార్థించారు.. ఈ కుటుంబాన్ని ఎప్పటికీ కలిపి ఉంచమని. ఒక సాధారణ గృహిణిగానైతే కోకిలాబెన్ ఆ రెండు పనులు మాత్రమే చేయించి ఉండేవారు. ధీరూభాయ్ భార్యగా ఆయన స్థాపించిన సామ్రాజ్యం ముక్కలు చెక్కలు కాకుండా ఉండడం కోసం కుమారులిద్దరికీ దేవుడి సమక్షంలోనే నాలుగు శాసనాలు కూడా విధించారు.
1. రిలయన్స్‌ను చీల్చడానికి లేదు.
2. షేర్లు అమ్ముకుని ఎవరి దారిన వారు వెళ్లడానికి లేదు.
3.ఒకరిపై ఒకరు పోటీకి దిగడానికి లేదు.
4.బయటివారి జోక్యానికి అవకాశం కల్పించడానికి లేదు. ఇవాళ టాటాలుముక్కలవడానికి కారణాలు ఏవైనా కావచ్చు, అంబానీలు విడివిడిగానే అయినా ఒక్కటిగా ఉండడానికి ఏకైక కారణం మాత్రం కోకిలాబెన్.

‘ద్వారక’... ఇష్టమైన ఆలయం
తల్లి చాటు బిడ్డ అంటారు. అలా.. కోకిలాబెన్ రిలయన్స్ చాటు తల్లి. యాభై ఏళ్ల క్రితం1966లో రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ప్రారంభం అయిన క్షణం నుంచి ఎలాగైతే కంపెనీకి దూరంగా ఉంటూనే భర్తకు సలహాదారుగా ఉన్నారో, ఇప్పటి రిలయన్స్ మహాసామ్రాజ్యాన్నీ పిల్లలకు ఒక చోదకశక్తిగా ఉండి ముందుకు నడిపిస్తున్నారు కోకిలాబెన్. ఆమె తరచూ అనే మాట: ‘‘భగవంతుడు సర్వశక్తి సంపన్నుడు’’అని. ఆ సంపన్నుడి దర్శనభాగ్యం కోసం ఈ సంపన్నురాలు నిరంతరం తపిస్తూనే ఉంటారు. ఆమెకు ఇష్టమైన ఆలయం గుజరాత్, జామ్నగర్‌లోని ద్వారక. ఆ తర్వాత రాజస్థాన్‌లోని నాథ్ ద్వారా ఆలయం. ఏటా ఈ ద్వారకాధీశ, శ్రీనాథ ఆలయాలను కోకిలాబెన్ తప్పనిసరిగా దర్శించుకుని వస్తారు. ‘సీ విండ్’ నివాసంలో ఏడాదికి మూడుసార్లు పూజలు, పురాణ కచేరీలు జరిపిస్తారు.

కృష్ణుడింట కోకిల పుట్టింది
కోకిలాబెన్ పుట్టిందీ గుజరాత్‌లోని జామ్నగర్‌లోనే. ఆమె బాల్యం అంతా జామ్నగర్‌లోని ద్వారక ఆలయ పరిసరాల్లో గడిచింది.అందుకేనేమో ఆమెకు కృష్ణభగవానుడంటే అంత భక్తి. కోకిల తండ్రి రతీలాల్ జస్రాజ్ పటేల్. తపాలాశాఖ అధికారి. పేరుకే అధికారి. ప్రదర్శనకు ఏమాత్రం కాదు. వినయంగా, విధేయంగా, పొదుపుగా, నిరాడంబరంగా, నిజాయితీగా ఉండేవారు. తల్లి రుక్మిణీబెన్. భర్తకు తగిన భార్య. గృహిణి. కోకిలాబెన్‌తో కలిపి ఐదుగురు పిల్లలు. ముగ్గురు అమ్మాయిలు, ఇద్దరు అబ్బాయిలు. ఇంతమందితో ఇల్లు గడవాలి. చదువులూ సాగాలి. భర్త తెచ్చే ఆ కొద్ది జీతంతోనే ఇల్లూ గడిచేది, చదువులూ సాగేవీ.. అప్పుడప్పుడూ అవసరంలో ఇంటికొచ్చి చెయ్యి చాచినవారికి రుక్మిణీబెన్ చేతినుంచి కొంత సహాయమూ అందేది!

తల్లి నోట్లోంచి ఊడి పడింది!
రుక్మిణీబెన్ చదువుకోలేదు. కానీ జీవితాన్ని చదివింది. ఆ జీవితాన్నే కోకిలాబెన్ చేతా చదివించింది. ఇంటి పనులతో పాటు కోకిలకు కుట్టు మిషన్‌పై కుట్లు, ఎంబ్రాయిడరీ నేర్పించింది. 1940లలో జామ్నగర్‌లో ఒకే ఒక స్కూలు ఉండేది. సజూబా గర్ల్స్ హైస్కూల్. ప్రభుత్వ పాఠశాల. అందులో మెట్రిక్యులేషన్ పాస్ అవడంతో పాటు, బాధ్యత గల అమ్మాయిగా ఇంట్లోనూ ఉత్తీర్ణురాలయింది కోకిల! వ్యక్తిత్వంలో తల్లి ఎలా ఉండేదో అచ్చంగా అలాగయింది! పెళ్లి కూడా అంతే. మరీ తొందరగా ఏం కాదు కానీ, 19 ఏళ్లకే అయింది. గుజరాత్‌లోనే.. చార్వాడ్ నుంచి జామ్నగర్‌కి కోకిల కుటుంబాన్ని వెతుక్కుంటూ వచ్చింది ధీరూభాయ్ అంబానీ కుటుంబం. అణకువ గల పిల్ల అందరికీ నచ్చింది. ముఖ్యంగా ధీరూభాయ్‌కి. అప్పుడతడికి 22 ఏళ్లు. వ్యాపారం కోసం అని ముంబై వచ్చేశాడు. ముంబైని చూడ్డం కోకిలకు అదే మొదటిసారి. ఆ తర్వాత ఆమె చాలా దేశాలు చూసింది. మొదట చూసిన దేశం ఎమెన్.

ఏడెన్‌కు ఒంటరి ప్రయాణం!
ఎమెన్ (అరబ్ కంట్రీ)లోని రేవు పట్టణం ఏడెన్‌లో భర్తకు ఉద్యోగం. ఆయనతో ఎమెన్ వెళ్లారు కోకిల. అక్కడ ఓ ట్రేడింగ్ కంపెనీలో గుమస్తా ధీరూభాయ్. గుమస్తా గుమస్తాగా ఉండిపోతే ఇప్పుడు రిలయన్స్ లేదు. అంబానీలూ లేరు. క్లర్కుగా ఉండి ట్రేడింగ్ కంపెనీ మెళకువ లన్నీ నేర్చుకున్నాడు ధీరూభాయ్. మనమే సొంతంగా బిజినెస్ స్టార్ట్ చేద్దాం అన్నాడు. కోకిల సరేనన్నారు. అప్పటికే ముఖేశ్ పుట్టాడు. ముగ్గురూ ఇండియా వచ్చేశారు. భర్త ఏడెన్‌లో పనిచేస్తున్నప్పుడు ఒకట్రెండు సార్లు కోకిల ఒంటరిగా ముంబై నుంచి ఏడెన్ ప్రయాణించవలసి వచ్చింది! ఆ ప్రయాణం ఆమెకు ఎంతో ధైర్యాన్నిచ్చింది. దేశం నుంచి దేశానికి ఒక్కదాన్నే సముద్రంపై  వెళ్లగలిగినప్పుడు.. భర్తతో కలసి ఎన్ని సముద్రాలనైనా ఈదేయలేనా అన్నంత ఉత్సాహం కలిగింది ఆమెలో. ఒక విధంగా ప్రపంచం మొత్తం ఆమెకు ఒక జమ్నాగర్ అయింది!

‘కోకిలా... నేను కారు కొన్నాను’!
జమ్నాగర్‌లో కారు అన్న వాహనాన్నే చూడలేదు కోకిల! మెట్టినింటికి చార్వాడ్ వెళ్లినప్పుడు కూడా ఆమె ఎడ్లబండ్లనే చూశారు. మామగారు హీరాచంద్ అంబానీకి పొలం ఉండేది. కొన్ని ఎడ్లబండ్లు ఉండేవి. వాటితో ఇల్లు నడిచేది. ధీరూభాయ్ ఏడెన్ వెళ్లిన కొన్నాళ్లకు కోకిలకు ఒక ఉత్తరం వచ్చింది. ‘‘కోకిలా.. నేను కారు కొన్నాను. నువ్విక్కడికి వచ్చినప్పుడు నిన్ను తీసుకెళ్లడానికి ఆ కారులోనే వస్తాను. కారు రంగేమిటో ఊహించగలవా? నాలాగే.. నలుపు’’ అని! కారు కొన్నందుకు కాదు కానీ, ఇదిగో ఈ సెన్సాఫ్ హ్యూమర్‌కే భర్త ఆమెకు విపరీతంగా నచ్చేశాడు. ఏడెన్‌లో దిగగానే కారుతో ప్రత్యక్షమయ్యాడు. అలా ఎడ్లబండి నుంచి ఏరోప్లేన్‌ల వరకు వచ్చింది కోకిల జీవనయానం. ఈ ప్రయాణంలో ఆమె నమ్మిన, నమ్మి పాటించిన, ఇప్పటికీ పాటిస్తున్న జీవన సూత్రం.. ‘సహాయం చెయ్యి. కానీ చేసినట్టు చెప్పకు’.

పింక్ కలర్ ఇష్టం
కోకిలాబెన్‌కు లేత గులాబీ రంగు అంటే ఇష్టం. బర్త్‌డే పార్టీలు, ఇతర వేడుకల్లో ఆమె ఎక్కువగా పింక్ శారీలో కనిపించడానికి కారణం ఇదే.

ధీరూభాయ్ దగ్గర పెద్ద పడవలాంటి కాడిలాక్ కారు ఉండేది. అదంటే ఆయనకు ఇష్టం. ఎందుకనో  కాడిలాక్ కారులో ప్రయాణించడానికి కోకిలాబెన్ ఆసక్తి చూపేవారు కాదు. మెర్సిడెస్‌లో వెళ్దాం అనేవారు.

శాకాహారి. ఇంట్లోకి నాన్‌వెజ్ వాసన కూడా రావడానికి లేదు. రోటీ, దాల్, ధోక్లీ ఐటమ్స్‌ని ఇష్టంగా తింటారు.

స్విట్జర్లాండ్ ఇష్టమైన దేశం. కానీ ఆ ఫుడ్డు, లాంగ్వేజీతో ఇబ్బంది పడేవారట. స్విట్జర్లాండ్ తర్వాత యు.కె. ముఖ్యంగా లండన్.

ఫారినర్స్‌లో కోకిలకు నచ్చే విషయం.. వాళ్లు పాటించే శుభ్రత. ఆ డిసిప్లీన్ కూడానట.

కోకిలాబెన్ ఇప్పటికీ రోజూ యోగా సాధన చేస్తుంటారు. రోజూ కనీసం 30 నిమిషాలు నడుస్తుంటారు. ధ్యానంలో కూర్చుంటారు. ఉదయం పండ్ల రసాలు, పండ్లు తీసుకుంటారు.

ఈ జీవన విధానం వల్లే ఎలాంటి చికాకుల్లోనైనా తనెంతో ప్రశాంతంగా ఉండగలుగుతున్నానని చెబుతారు కోకిలాబెన్.

ఆహ్వానం అందితే తప్పక వెళ్లాలి
ఇంటికి దీపం ఇల్లాలే. ఈ మాట వాస్తవం. పిల్లల సత్ప్రవర్తన, మంచీమర్యాద తల్లి నుంచి వచ్చేవే.
పిల్లలకు విద్యను, వివేకాన్ని, సహనాన్ని, ఓర్పును, ఔదార్యాన్ని, బాధ్యతను నేర్పించగలిగితే తల్లిగా స్త్రీ జీవితం సార్థకమైనట్లే.
మహాలక్ష్మి అంటే ఎవరో కాదు. ఇంటిని సంతోషంగా, శుభ్రంగా, ఆరోగ్యంగా ఉంచగలిగిన గృహిణే.
రక్తసంబంధీకులు, స్నేహితుల ఇళ్లల్లోని  వేడుక చిన్నదైనా పెద్దదైనా ఆహ్వానం అందినప్పుడు తప్పక వెళ్లిరావాలి.
ప్రపంచంలో ఏ మూలకు వెళ్లినా నెగ్గుకు రాగలిగిన ప్రతిభ, శక్తిసామర్థ్యాలు నేటి మహిళకు ఉన్నాయి.
అందంగా కనిపించాలంటే ఆరోగ్యంగా ఉండాలి.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement