ప్రపంచంలోనే అత్యంత సంపన్నులలో ఒకరైన అంబానీ ఫ్యామిలీ చాలా కాలంగా వ్యాపార సామ్రాజ్యాన్ని శాసిస్తోంది. ధీరూభాయ్ అంబానీ కుటుంబంలోని అందరూ వ్యాపారంలో సంబంధాన్ని కలిగి ఉన్నారు. ప్రస్తుతం రిలయన్స్ గ్రూప్ ముకేశ్ అంబానీ సారథ్యంలో నడుస్తోంది. ఇందులో ఆకాష్, ఇషా, అనంత్ అంబానీలు కీలకపాత్ర పోషిస్తున్నారు. ఈ కంపెనీ నేడు ఈ స్థాయికి రావడానికి కారణమైన వాళ్లలో ధీరూభాయ్ అంబానీ సోదరీమణులలో ఒకరు కూడా ఉన్నారు.
ధీరూభాయ్ అంబానీ అంటే.. ముఖేష్ అంబానీ తండ్రి, నీతా అంబానీ మామ.. రిలయన్స్ ఇండస్ట్రీస్ వ్యవస్థాపకుడు అని అందరికీ తెలుసు. అయితే ఈయనకు నలుగురు తోబుట్టువులు కూడా ఉన్నట్లు సమాచారం. వీరు త్రిలోచన బెన్, రామ్నిక్లాల్ అంబానీ, జాసుబెన్, నతుభాయ్. త్రిలోచన బెన్ వయసులో ధీరూభాయ్ అంబానీ కంటే పెద్దవారు.
త్రిలోచన బెన్ రిలయన్స్ ఇండస్ట్రీస్ స్థాపనలో పరోక్షంగా ముఖ్యమైన పాత్ర పోషించారు. అయితే ఈమె గురించి చాలామందికి తెలియకపోవడం గమనార్హం. త్రిలోచన బెన్ కుమారుడు రిలయన్స్ వ్యవస్థాపక డైరెక్టర్లలో ఒకరైన రసిక్లాల్ మెస్వానీ. ఈమె మనవళ్లు నిఖిల్ ఆర్ మేస్వానీ, హిటల్ ఆర్ మేస్వానీ కూడా రిలయన్స్ ఇండస్ట్రీస్‌లో కీలక పదవుల్లో ఉన్నారు.
నిఖిల్ ఆర్ మేస్వానీ 1986లో ఆర్‌ఐఎల్‌లో చేరి కంపెనీ బోర్డులో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా పనిచేశారు. ఈయన పెట్రోకెమికల్ విభాగాన్ని చూసుకుంటూ.. ఐపీఎల్ జట్టు ముంబై ఇండియన్స్‌తో పాటు ఇండియన్ సూపర్ లీగ్‌ను నిర్వహించడంలో కూడా పాల్గొంటారు.
ఇక త్రిలోచన బెన్ చిన్న మనవడు హిటల్ ఆర్ మేస్వాని 1995లో కంపెనీలో చేరి.. తన అన్న నిఖిల్ మాదిరిగానే ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా అదే పదవిని నిర్వహించారు. పెట్రోలియం రిఫైనింగ్, మార్కెటింగ్, పెట్రోకెమికల్స్ తయారీతో పాటు హ్యూమన్ రిసోర్స్ మేనేజ్‌మెంట్ (HR), ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, రీసెర్చ్ & టెక్నాలజీ వంటి కంపెనీ ఇతర కార్పొరేట్ విధులను కూడా ఈయన నిర్వహిస్తారు.
ముకేశ్ అంబానీ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తన వ్యాపార ప్రారంభ రోజులను గుర్తు చేసుకున్నారు. నా మొదటి బాస్.. నా అత్త కుమారుడు రసిక్లాల్ మెస్వానీ అని పేర్కొన్నారు. అంతే కాకుండా ఈయన సంస్థను సరైన దిశలో నడిపించారని ప్రశంసించారు.
రసిక్లాల్ మెస్వానీ చాలా ఓపెన్‌గా ఉంటారు. మేము ఒకరి క్యాబిన్‌లోకి మరొకరు వెళ్ళవచ్చు. సమావేశాల్లో, చర్చల్లో పాల్గొనవచ్చు. దీన్ని మా నాన్న ప్రోత్సహించారు. నేను అధికారికంగా రిలయన్స్‌లో చేరినప్పుడు.. నాన్న పాలిస్టర్ వ్యాపారాన్ని రసిక్‌భాయ్ కింద ఉంచారు. ఇందులో పాలిస్టర్ ఫైబర్‌ను దిగుమతి చేసుకోవడం, దానిని టెక్స్‌టైల్ చేయడం, మా సొంత మిల్లులలో విక్రయించడం వంటివి ఉన్నాయని ముకేశ్ అంబానీ వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment