మోహన దృశ్యం | special story on mohanlal | Sakshi
Sakshi News home page

మోహన దృశ్యం

Published Mon, Jul 27 2015 11:12 PM | Last Updated on Fri, Aug 17 2018 2:24 PM

మోహన  దృశ్యం - Sakshi

మోహన దృశ్యం

ఓ సగటు మధ్యతరగతి మనిషి.
ఏదో కేబుల్ టీవీ వ్యాపారం చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తుంటాడు.
ఆయన పెద్దకూతురి నగ్నచిత్రాలు తీసి ఒక దుర్మార్గుడు
బ్లాక్‌మెయిల్ చేయడానికి ఇంటికే వస్తాడు.
కోపంతో ఊగిపోయిన భార్య వాడిపై దాడి చేస్తుంది.
వాడు చచ్చిపోతాడు.
ఇప్పుడీ కుటుంబాన్ని ఈ సగటు మనిషి కాపాడుకోవాలి.
అదీ ‘దృశ్యం’ సినిమా.
దీంట్లో మీకు ఎక్కడైనా హీరోయిజం కనబడిందా?
మోహన్‌లాల్‌కి కనపడింది.
ఇప్పుడు ఈ సినిమా దాదాపు అన్ని భాషల్లోకి వచ్చేస్తోంది.
అందుకేనేమో మోహన్‌లాల్ యాభై ఐదేళ్లు వచ్చినా
ఇంకా మోహనదృశ్యంగా అందర్నీ ఆకట్టుకుంటున్నాడు.

 
హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లో సినిమా హాలు. ‘జిల్లా’ సినిమా... ఇంటర్వెల్ ఘట్టం... తండ్రి పాత్రధారి మోహన్‌లాల్‌తో కొడుకు పాత్రధారి హీరో విజయ్ తెరపై తలపడుతున్నాడు. లాల్‌ను సవాలు చేస్తూ విజయ్ పెద్ద డైలాగేదో చెప్పాడు. మోహన్‌లాల్ మాత్రం ఒక చిన్న డైలాగ్... సీరియస్‌గా ఒక చిన్న చూపు విసిరాడు. మొత్తం సీన్‌ను తన వైపు తిప్పేశాడు. జనం ఒకటే ఈలలు. ఇంటర్వెల్‌లో ఆడియన్స్ మోహన్‌లాల్ గురించే మాట్లాడుకుంటున్నారు.

ఈ మలయాళ స్టార్ గురించి మాట్లాడుకోవడం ఇదేమీ మొదటిసారి కాదు. మూడున్నర దశాబ్దాలుగా సినీప్రేమికులు ఈ ‘లాలేట్టన్’ (మలయాళంలో ‘లాల్ అన్నయ్య’ అనే ప్రేమపూర్వక పిలుపు) గురించి మాట్లాడుకుంటూనే ఉన్నారు. నిండైన విగ్రహం, నటనలో నిగ్రహం, హుందాతనం నిండిన బాడీ లాంగ్వేజ్ - ఇవన్నీ మోహన్‌లాల్‌కు దేవుడిచ్చిన వరాలు. అందుకే, గడ్డం, మీసంతో ఆయన గంభీరంగానూ ఉండగలరు. క్లీన్ షేవ్‌లో కళ్ళతోనే నవ్వుతూ ప్రేమ, వినోదం పండించగలరు. కమర్షియల్ సినిమాకు కేరాఫ్ అడ్రస్... అదే టైమ్‌లో సీరియస్ సబ్జెక్ట్‌లకూ సరితూగే సెన్సిబుల్ యాక్టింగ్. అభిమానుల మాటల్లో చెప్పాలంటే... ‘ది కంప్లీట్ యాక్టర్’.

ఏ విలన్ నుంచి హీరో... ఆ పైన సూపర్‌స్టార్
 అది ముప్ఫై ఏడేళ్ళ క్రితం సంగతి. అప్పటికి మోహన్‌లాల్ విశ్వనాథన్ నాయర్ వయసు 18 ఏళ్ళే! ఆ వయసులోనే తొలి అవకాశం ‘తిరనోట్టమ్’ (1978). కానీ సెన్సార్ చిక్కులు. మలి చిత్రం ‘మంజిల్ విరింజ పూక్కళ్’ (’80) ముందుగా విడుదలైంది. అదీ విలన్ వేషం. దాదాపు 30 సినిమాల దాకా హీరో అన్నవాళ్ళు లేరు. అలాంటి వ్యక్తి తరువాత హీరో, ఆ పైన సూపర్‌స్టారవడం ఆశ్చర్యమే.
 1980లలో ఒకపక్కన తమిళంలో రజనీకాంత్, కమలహాసన్, తెలుగులో చిరంజీవి, కన్నడంలో విష్ణువర్ధన్ లాంటి హీరోలు ఎదిగి వస్తున్న సమయంలోనే మలయాళ సీమలో పొడిచిన పొద్దుపొడుపు - మోహన్‌లాల్. ఆరో తరగతిలోనే స్టేజ్‌పై తొమ్మిది పదుల వయసున్న ముసలివాడి పాత్ర వేసిన బెస్ట్ యాక్టర్. ఆ రోజున లాల్ ఎవరో తెలియదు. కానీ, ఇవాళ ఆయనను తెలియనివారు లేరు.

 ఏ కెమెరాను మరచి... సహజ నటన
 కమర్షియల్, కామికల్, సీరియస్, సెన్సిబుల్ - ఇలా ఏ తరహా పాత్ర అయినా అందులో చిన్న చిన్న అంశాలు కూడా కొట్టొచ్చినట్లు కనపడేలా చేయడం మోహన్‌లాల్ గొప్పదనం. కాన్స్ ఫెస్టివల్‌కెళ్లిన ‘వానప్రస్థమ్’ (99)లో కథకళి డ్యాన్సర్ కున్హికుట్టన్... ‘తన్మాత్ర’ (2005)లో కుటుంబ జీవితం కష్టాలపాలైన అల్జీమర్స్ వ్యాధిగ్రస్థుడు రమేశ్ నాయర్... ‘కిరీడమ్’ (’89. హిందీలో జాకీష్రాఫ్‌తో ‘గర్దిష్’గా రీమేకైంది)లో సమాజం చేసిన రౌడీ సేతుమాధవన్... ‘దేవాసురమ్’(93)లో గ్రామపెద్ద మంగళసేరి నీలకంఠన్... సెటైరికల్ కామెడీ ‘నాడోడికట్టు’(’87)లో ఏజెంట్ చేతిలో మోసపోయిన యువకుడు... లాంటి పాత్రల్ని పరిశీలించండి. అక్కడ లాల్ కనపడడు, పాత్ర కనపడుతుంది. నటన ఉండదు, జీవించడం ఉంటుంది.

 అందుకే, చాలామంది ఆయనను కమలహాసన్‌తో పోలుస్తుంటారు. కమల్‌కు గురువైన ప్రముఖ దర్శకుడు కె. బాలచందరే - ‘కమల్ మెథడ్ యాక్టర్. కెమెరా ముందు నటిస్తున్నానన్న సంగతి తనకు బాగా తెలుసు. కానీ, లాల్ అలా కాదు. నటిస్తున్నప్పుడు కెమెరా ముందున్నానన్న సంగతి మర్చిపోయి మరీ నటిస్తాడు’ అన్నారు.     

 ఏ పొరుగింటి పెద్ద హీరోలకు... లైఫ్!    
 ప్రేమ్‌నజీర్, మధు లాంటి టాప్‌స్టార్స్ వచ్చిన మలయాళ సీమలో మోహన్‌లాల్ ఎన్నో ఏళ్ళుగా బాక్సాఫీస్ వేగుచుక్క. కానీ, 2000 ప్రాంతం నుంచి మలయాళ సినిమాను పూర్తిగా కమర్షియల్ చట్రంలోకి నెట్టేశారని విమర్శ మోహన్‌లాల్‌పై బలంగానే వినిపిస్తుంది. ఆయన మాత్రం ఇప్పటికీ హీరోగా చేస్తూనే ఏ కొత్త తరహా కథలు, పాత్రలు వచ్చినా, సై అంటున్నారు. మలయాళంలో మున్ముందుగా వచ్చిన ‘దృశ్యమ్’ (2013) అందుకో ఉదాహరణ. నిజానికి, ఆ సినిమాలో హీరోయిజమేమీ ఉండదు. కానీ, రచయిత, దర్శకుడు జీతూ జోసెఫ్ చెప్పిన కథ వినీ వినగానే, పాత్రలు బలమైనవని లాల్‌కు అనిపించింది. అంతే! హీరోయిజమ్ గురించి చింత పడకుండా, ఓ.కె. చెప్పేశాడు. సినిమా పూర్తయి రిలీజయ్యాక, ఆయన అంచనా నిజమైంది. సినిమా పెద్ద హిట్. కెరీర్‌కు ఒక కొత్త కోణమూ వచ్చి చేరింది. అన్ని భాషల్లోకీ ఆ కథ వెళ్ళింది.

 ఇలా మోహన్‌లాల్ నటించిన సినిమా, పోషించిన పాత్ర రీమేక్‌ల రూపంలో ఎక్కడెక్కడి పెద్ద హీరోలకో కొత్త ఊపిరి పోయడం కొత్త ఏమీ కాదు. మలయాళ సైకలాజికల్ థ్రిల్లర్ ‘మణిచిత్ర తాళు’ (1993)లో ఆయన చేసిన సైకియాట్రిస్ట్ పాత్ర ఇతర భారతీయ భాషల్లో కనీసం ఇద్దరు పెద్ద హీరోలకు (కన్నడంలో విష్ణువర్ధన్‌కు ‘ఆప్తమిత్ర’-2004గా, తమిళ - తెలుగుల్లో రజనీకాంత్‌కు ‘చంద్రముఖి’-2005గా) కొత్త లైఫ్ ఇచ్చింది.

 ఏ ఎల్లలు దాటి... ప్రతిభను చాటి...
 దేశమంతటా సుపరిచితుడైనా మోహన్‌లాల్ పక్కా మలయాళీగానే తెరపై మిగిలారు. ఇరవై ఒక్క ఏళ్ళ క్రితం ఒకే ఒక్క స్ట్రెయిట్ తెలుగు సినిమాలో ఆయన నటించారు. ఆప్తమిత్రుడైన ప్రియదర్శన్ దర్శకత్వంలో ‘గాండీవం’లో ‘గోరువంక వాలగానే గోపురానికి’ పాటలో అక్కినేని, బాలకృష్ణ, రోజాలతో కలసి హుషారుగా నర్తించారు. ఇక, మణిరత్నం ‘ఇరువర్’ (తెలుగులో ‘ఇద్దరు’)లో స్వర్గీయ ఎమ్జీయార్‌ను తలపించే పాత్ర లాల్‌కు తమిళంలో తెరంగేట్రం. ఆ తరువాత అప్పుడప్పుడూ తమిళ తెరపైకి వస్తున్నారు. కన్నడ సినిమాల్లోనూ అంతే. వర్మ ‘కంపెనీ’ (2002)లో పోలీసాఫీసర్‌గా హిందీకి పరిచయమైన లాల్ బాలీవుడ్ కెరీర్‌ను సీరియస్‌గా తీసుకోలేదు.

 ఏ వ్యాపారంలోనూ స్టారే!
 అక్షరాస్యతతో పాటు రాజకీయ చైతన్యం కూడా ఎక్కువైన మలయాళ సీమలో ఉన్నప్పటికీ, విచిత్రంగా మోహన్‌లాల్ రాజకీయాల వైపు దృష్టి పెట్టలేదు. మరో సూపర్‌స్టార్ మమ్మూటి సి.పి.ఐ (ఎం)కూ, సురేశ్‌గోపి బి.జె.పి.కీ దగ్గరైనప్పటికీ, తన మీద ‘రాజకీయ బ్రాండింగ్’ పడకుండా చూసుకున్నారు. రాజకీయ వ్యాపారంలోకి దిగలేదన్న మాటే కానీ, వ్యాపారసూత్రాలు ఆయనకు బానే తెలుసు. చిత్ర నిర్మాణం, పోస్ట్ ప్రొడక్షన్, పంపిణీలతో పాటు తనకున్న తిండిపుష్టికి దీటుగా దుబాయ్‌తో సహా చాలాచోట్ల మోహన్‌లాల్ పసందైన రెస్టారెంట్లు నడుపుతున్నారు. పచ్చళ్ళు, మసాలా పొడుల వ్యాపారం చేస్తున్నారు.

 ఏ ఇటు భౌతికవాదం... అటు ఆధ్యాత్మికత
 కొత్త రుచుల పట్ల కోరికకు తగ్గట్లే జీవితాన్ని ఆస్వాదించడంలోనూ మోహన్‌లాల్ తరువాతే ఎవరైనా! ఎవరి వెంటా పడడు. కానీ, వలచి వచ్చామంటూ వెంటపడేవాళ్ళను విదిల్చికొట్టడు. ఈ నిత్యయౌవనుడికి ఇవాళ్టికీ పెద్ద ఫిమేల్ ఫ్యాన్ ఫాలోయింగ్. వైరుద్ధ్యం ఏమిటంటే, మోహన్‌లాల్‌లో ఎంత భౌతికవాదో, అంత ఆధ్యాత్మిక భావావేశపరుడు. ఆయన రజనీశ్ బాటను అనుసరిస్తాడు. జిడ్డు కృష్ణమూర్తి, రమణ మహర్షి బోధల్ని అభిమానిస్తాడు. ప్రముఖ తమిళ నిర్మాత స్వర్గీయ కె. బాలాజీ కుమార్తె సుచిత్రను ఇరవై ఏడేళ్ళ క్రితం ప్రేమ వివాహం చేసుకున్న లాల్‌కు ఇద్దరు పిల్లలు. కొడుకు ప్రణవ్, కూతురు విస్మయ. కొడుకు కూడా తండ్రి లానే సినీ రంగంలోకొచ్చాడు.

కెరీర్ తొలినాళ్ళలో ఏ ప్రశ్న అడిగినా, ‘యస్’, ‘నో’ లాంటి పొడి మాటలకే పరిమితమైన సిగ్గరి... ఇవాళ ఏ అంశం పైన అయినా అనర్గళంగా మాట్లాడగల దిట్ట. అప్పటి మామూలు నటుడు... ఇవాళ 4 నేషనల్ అవార్డ్స్ (మూడు నటుడిగా, ఒకటి నిర్మాతగా) అందుకున్న ఆలిండియా స్టార్. ఆయన ఎదిగారు. కాలంతో పాటు చాలా మారారు. ఫేస్‌బుక్ అకౌంట్ తెరిచారు. బ్లాగ్ నడుపుతున్నారు. అఫిషియల్ వెబ్‌సైట్, ‘యు’ ట్యూబ్ చానల్, ట్విట్టర్ - అన్నీ ఉన్నాయి. ఇంత మోడరన్ స్టారైనా, తలకెక్కించుకోలేదు. ఇప్పటికీ ఫోన్ చేస్తే లైన్‌లోకొచ్చి, జవాబిచ్చే పాతతరం పెద్ద నటుల ఒరవడిని వదులుకోలేదు.

 ఏ హి ఈజ్ స్టిల్ స్ట్రాంగ్!
 మోహన్‌లాల్‌కు ఈ మధ్యే యాభై అయిదు నిండి, యాభై ఆరు వచ్చాయి. మూడున్నర దశాబ్దాలు దాటిన కెరీర్‌లో 325 మలయాళ సినిమాల్లో నటన... అయినా, లాల్ కళాతృష్ణ తీరలేదు. ఆడియన్స్‌కు ఆయన పట్ల ఆకర్షణా తగ్గలేదు. ‘స్టిల్... హి ఈజ్ గోయింగ్ స్ట్రాంగ్’. ఎంత స్ట్రాంగ్ అంటే... ఆయన నటించిన ‘జిల్లా’ తమిళంలో వంద కోట్ల వసూల్ సినిమా. మలయాళ సీమలో మెగాహిట్. ఇప్పుడు తెలుగులోనూ ఓపెనింగ్స్ అదరగొట్టిన సినిమా. లాల్ క్రేజ్ ఎంతటిదంటే... రాజమౌళి సైతం అవకాశమొస్తే ఆయనతో సినిమా చేయాలనుంది అనేటంత!

ఎస్... హి ఈజ్ స్ట్రాంగ్. మనిషి, మనసే కాదు... స్వాతిశయంలోనూ స్ట్రాంగే. అందుకే, అభిమానులిచ్చిన బిరుదే ఆయన అఫిషియల్ వెబ్‌సైట్ పేరు... ‘ది కంప్లీట్ యాక్టర్’. అవును. స్నేహశీలతతో పాటు స్వాతిశయాన్ని కూడా నిర్మొహమాటంగా చూపించగల మోహన్‌లాల్ నటనలోనూ, జీవితంలోనూ కూడా కంప్లీటే! ఆయన లేని సమకాలీన దక్షిణ భారత సినీ చరిత్ర పూర్తిగా ఇన్‌కంప్లీట్!
 
భాష ఏదైనా... బిగ్ కమర్షియల్ హిట్
 ఏడాదిన్నర క్రితం వచ్చిన మలయాళ ఫ్యామిలీ సెంటిమెంట్ థ్రిల్లర్ ‘దృశ్యమ్’ పెద్ద హిట్టు. ఎంత పెద్ద హిట్టంటే, మలయాళ సినీ చరిత్రలో రూ. 50 కోట్ల పైగా వసూలు చేసిన తొలి చిత్రం. కేబుల్ టీవీ బిజినెస్‌మ్యాన్‌గా మోహన్‌లాల్ ప్రపంచవ్యాప్తంగా మలయాళ సినీలవర్స్‌ని కట్టిపడేశారు. యునెటైడ్ అరబ్ ఎమిరేట్స్‌లో శతదినోత్సవం జరుపుకొన్న రెండో సినిమా కూడా ఇదే. (మొదటిది ‘టైటానిక్’). తరువాత ఇదే కథ తెలుగు, కన్నడ, తమిళాల్లోకి వెళ్ళింది. ఈ 31న హిందీలోనూ వస్తోంది. ప్రతి భాషలోనూ అదే కథ... హీరోలు వేరు. కానీ రిజల్ట్ ఒకటే! కెరీర్‌లో సరైన హిట్ కోసం తపిస్తున్న ప్రతి సీనియర్ హీరోకూ, నిర్మాతకూ ఆ కథ కల్పవృక్షమైంది. విత్తు దశలోనే ఆ కథలోని సత్తువను గుర్తించి, ఇమేజ్ మార్పుకు ఆసరాగా అందిపుచ్చుకున్న ఘనత మోహన్‌లాల్‌దే!
 
 - రెంటాల జయదేవ
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement