అచ్చులు అశ్రువులు | special story prabhavathi | Sakshi
Sakshi News home page

అచ్చులు అశ్రువులు

Published Wed, Mar 28 2018 12:36 AM | Last Updated on Wed, Mar 28 2018 12:36 AM

special story prabhavathi - Sakshi

అచ్చులు హల్లులు కలిస్తేనే పాఠం.కాని పాఠం సగం ఆగిపోయింది.బ్లాక్‌బోర్డ్‌ మీద అక్షరాలు సగమే మిగిలిపోయాయి.సిలబస్‌ పూర్తి కాక మునుపే ఒక బంధం దూరమైపోయింది.మిగిలింది అశ్రువులు. కేవలం అశ్రువులు.ప్రభావతి టీచర్‌.ఆ రెండూళ్లు తల ఎత్తి తలుచుకునే పేరు. జెండాకు వందనం చేసినట్టు పవిత్రంగా వందనం చేసే పేరు.

2016. ఆగస్ట్‌ 14.రంగారెడ్డి జిల్లా. పెద్ద ఉమెంతాల్‌.ఉదయం పది దాటింది. అప్పుడే టిఫిన్‌ తిన్నారు ఆ ఇంట్లో వాళ్లు.‘‘సరే మరి. నేను ఫంక్షన్‌కు వెళ్తా’’ అన్నాడు భర్త. ‘‘ఊ.. నేను కూడా స్కూల్‌కెళ్లొస్తా’’ అన్నది భార్య.‘‘ఇవ్వాళ ఆదివారమే కదా. స్కూల్‌కెందుకు?’’అన్నాడు ఆయన.‘‘రేపు పంద్రాగస్ట్‌ కదా. స్టూడెంట్స్‌ వస్తున్నరు స్కూల్‌కి డెకరేషన్‌ కోసం. నేను కూడా ఉంటే మంచిది’’ అన్నది ఆమె.‘‘నిజమే కాని.. పిల్లలు హాస్టల్‌ నుంచి వచ్చిండ్రు కదా.. ఇంట్లో ఇద్దరం లేకపోతే ఎట్లా?’’ అన్నాడు. ‘‘తొందరగానే వస్తా.. ఈ లోపు వాళ్లు రెస్ట్‌ తీసుకుంటరు’’ అన్నది ఆమె.‘‘సరే.. ’’ అని ఆయన వికారాబాద్‌లో ఏదో ఫంక్షన్‌ ఉంటే వెళ్లిపోయాడు. ఆమె కూడా తన ఇద్దరు కూతుళ్లకు జాగ్రత్తలు చెప్పి స్కూటీ స్టార్ట్‌ చేసింది రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఊర్లోని స్కూల్‌కి వెళ్లడానికి. మధ్యలో స్టేషనరీ షాప్‌ దగ్గర ఆగి రంగు కాగితాలు, జెండా కాగితాలు, డెకరేషన్‌కు సంబంధించిన ఇతర వస్తువులూ అన్నీ కొనుక్కొంది. దాదాపు అరగంట ప్రయాణం తర్వాత మేడికొండ ఊరు చేరుకుంది. నేరుగా వెళ్లి స్కూల్‌ ఆవరణలో స్కూటీ ఆపింది. ఆ చప్పుడికి లోపలున్న ఐదారుగురు పిల్లలు బిలబిలమంటూ బయటకు వచ్చారు. టీచర్‌ను చూసి ‘‘టీచర్‌ వచ్చేసింది ’’అనుకుంటూ ఆమెకు ఎదురువెళ్లి  చేతిలో ఉన్న సామాన్ల బ్యాగ్‌ తీసుకున్నారు. సింగిల్‌  టీచర్‌ స్కూల్‌ అది. ఐదవ తరగతి వరకు ఆమె ఒక్కరే ఆ స్కూల్‌ను సంభాళించాలి. 

‘‘తినే వచ్చిండ్రా పిల్లలూ?’’ ఆత్మీయంగా ప్రశ్నించింది వాళ్ల వెంటే లోపలికి వెళ్తూ.‘‘తిన్నాం.. టీచర్‌’’ముక్తకంఠంతో జవాబు.వెళ్లేసరికే బ్లాక్‌బోర్డ్‌ను శుభ్రం చేసేసేశారు. కళ్లతోనే శభాష్‌ అని మెచ్చుకుంది. ముగ్గురికి రంగు కాగితాలు ఇచ్చింది మడత పెట్టమని. ఇంకొక స్టూడెంట్‌ ఇతర డెకరేషన్‌ సామాన్లు చూడసాగింది. ఇంకో ఇద్దరు పిల్లలను తీసుకొని ముందున్న గ్రౌండ్‌కి వెళ్లింది. జెండా స్తంభాన్ని చెక్‌ చేయడానికి. ఆ స్కూల్లో జెండా ఇనుప రాడ్‌కు కట్టి ఉంది. దానికి జెండా డిజైన్‌లో ఉన్న కాగితాలు అతికించమని పిల్లలకు చెప్పి లోపలికి వెళ్లింది ఆమె. లోపల డెకరేషన్‌ పనులు చూసుకోవడానికి. అరగంటకు..గ్రౌండ్‌ నుంచి పెద్దపెద్దగా అరుపులు, కేకలు వినిపించాయి. లోపల బిజీగా ఉన్న ఆ టీచర్‌ గుండె గుభేలు మన్నది.. ‘ఏమైందీ’ అనుకుంటూ అంతే గాభరాగా పరిగెత్తుకుంటూ వచ్చింది. ఆ వెనకాలే క్లాస్‌లో ఉన్న పిల్లలూ వచ్చారు భయంతో. ముగ్గురు పిల్లలు జెండా రాడ్‌ పట్టుకుని కరెంట్‌ షాక్‌ తగిలినట్టు కంపిస్తున్నారు. అనుమానంగా పైకి చూసింది. 11కేవీ వైర్లు. జెండా ఉన్న ఇనుపరాడ్‌ వాటికి తగిలి కరెంట్‌ సర్క్యూట్‌ అయి అది పట్టుకున్న పిల్లలకూ పాస్‌ అవుతోంది. ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా వడివడిగా వాళ్లను తోసేసింది. ఆ క్రమంలో ఆ రాడ్‌ ఆమె చేతుల్లో పడింది. గిలగిలా కొట్టుకోసాగింది ఆమె శరీరం. ఆ హఠాత్పరిణామానికి అక్కడున్న పిల్లలు నోరెళ్లబెట్టారు. ఏం చేయాలో తెలియట్లేదు ఆ పసివాళ్లకు. చేష్టలుడిగిపోయారు. అరుద్దామన్నా నోరు పెగలట్లేదు.జెండా కాగితాలు అతికించి ఆ రాడ్‌ను దిమ్మెలో పెడదామని ముగ్గురు పిల్లలు తమ బలాన్ని కూడదీసుకొని జెండాను పైకెత్తారు దాంతో ఆ రాడ్‌ కరెంటు తీగలకు తగిలి ఈ ప్రమాదానికి కారణమైంది.
కళ్ల ముందే టీచర్‌.. తమ క్లాస్‌మేట్స్‌ను రక్షించబోయి.. కరెంట్‌ తీగకు బలవుతోంది. 

అలా కంపించిన శరీరం కొన్ని సెకన్లకు అచేతనమైపోయింది. నల్లగా మాడిపోయి. అంతకుముందు ఆ రాడ్‌ను పట్టుకున్న ముగ్గురు  పిల్లలకు గాయాలయ్యాయి. కాని టీచర్‌ను అలా చూసి తమ గాయాలను మర్చేపోయారు. కళ్లవెంట ధారాపాతంగా నీళ్లు. ఊర్లో వాళ్లను పిలవాలంటే కూడా నోరు రావట్లేదు. భయంతో బిక్కచచ్చిపోయారు. మొత్తానికి బలవంతంగా కదిలి ఊర్లోవాళ్ల దగ్గరకు పరిగెత్తారు.  ‘ప్రభావతి టీచర్‌కు కరెంట్‌ షాక్‌ గొట్టింది’ ఒకేఒక్క నిమిషంలో ఊరంతా గుప్పుమంది. హుటాహుటిన వికారాబాద్‌ తీసుకుపోయారు. కాని టీచర్‌.. చనిపోయింది!పిల్లల గుండె పగిలింది. ఇదంతా అబద్ధం కావాలి దేవుడా.. పిల్లల మనసు రొదపెడుతోంది. ‘‘నాన్నా.. ఆ వైర్లను తీసేపియ్యు. టీచర్‌ రేపు జెండా ఎగరేస్తే తగలకుండా... ’’ ఆ స్కూల్లో చదివే ఆరేళ్ల అమ్మాయి అమాయకంగా అంది వాళ్ల నాన్నతో. ఒక అబ్బాయి విసావిసా ఇంట్లోకి వెళ్లి ఇస్త్రీ బట్టలను విసిరేశాడు. ఇంకో అమ్మాయి క్లాస్‌లోకి వెళ్లి బోర్డ్‌ మీద పిచ్చి గీతలు గీసింది. ఇంకో అబ్బాయి రంగు కాగితాలను చించేశాడు. పిల్లల మనసు వికలమైపోయింది.టీచర్‌ ఇంట్లో.. ఆమె మరణ వార్తతో షాక్‌ అయ్యారు. ‘‘ఇప్పుడే కదా అమ్మ మాకు జాగ్రత్తలు చెప్పి వెళ్లింది. మ«ధ్యాహ్నం మీకు ఆకలయ్యే సరికి ఇంట్లో ఉంటానని ప్రామిస్‌ చేసి మరి! ఇదేంటి అమ్మ చనిపోయిందని చెప్తారేం’’ ఆమె పిల్లల సందేహం. ‘‘వద్దు అన్నా వినకుండా వెళ్లింది. నా ఇంటిని చీకటి చేసింది’’ భర్త కుమిలి కుమిలి ఏడుస్తున్నాడు. పెద్ద ఉమెంతాల్‌.. మేడికొండ.. రెండూళ్లు శోకసముద్రాలయ్యాయి. ‘ప్రభావతి టీచరే కాదు.. ఆమె అందరికీ అమ్మలాంటిది. బాగా చదవాలని పిల్లలకు, బాగా చదివించాలని పెద్దవాళ్లకూ కౌన్సిలింగ్‌ ఇచ్చేది.అలాంటి మనిషి మళ్లీ దొరకదు. మాదురదృష్టం’’ ఊళ్లో వాళ్ల అభిమానం చెప్పే మాట అది. 

‘మా పెళ్లయి పదిహేడేళ్లు. ప్రభావతి డెడికేషన్‌తో పనిచేసేది. మాకు ఇద్దరు ఆడపిల్లలు. పెద్దమ్మాయి సుభీక్ష ఇప్పుడు టెన్త్‌ చదువుతోంది. చిన్నమ్మాయి నాగహర్ష నెన్త్‌క్లాస్‌. ఆడపిల్లలయినా మేం ఎప్పుడూ ఫీలవలేదు. ఇద్దర్లో ఒకరిని డాక్టర్‌ చేద్దాం అనేది. ఇంటా, బయటా అన్నీ తానే చూసుకునేది. ఆమె ఉన్నన్ని రోజులు నేను అగ్రికల్చరే చూసేవాడిని. మాకు వాటర్‌ ప్లాంట్‌ ఉంది. ఊళ్లో వాళ్లు రోజూ సాయంత్రం మా ఇంటి దగ్గరకే వచ్చి నీళ్లు తీసుకెళ్తారు. ఆ టైమ్‌లో ఆమె అందరినీ పలకరిస్తూ మంచిచెడ్డలు అడిగి తెలుసుకునేది. వాళ్లు కూడా ఆమెతో అన్నీ షేర్‌ చేసుకునేవాళ్లు. ఆఫీసుల్లో నిర్భయంగా మట్లాడేది. ఆమె ఆ స్వభావం కొంతమంది శత్రువులుగా కూడా మారారు. అది చూసి ‘ఎందుకులే.. నీ పని నువ్వు చూసుకో’ అనేవాడిని. ‘ఇదీ నా పనే. అందరం మనకెందుకులే అనుకుంటే సమస్యలెలా సాల్వ్‌ అవుతాయి?’ అనేది. తప్పును సహించేది కాదు. లాజిక్‌గా మాట్లాడుతుంది. నా చిన్నకూతురిదీ అదే స్వభావం. ఆమెను చూస్తుంటే ప్రభావతే గుర్తొస్తుంది (గాద్గదిక స్వరంతో). అలాంటి మనిషి నా భార్యవడం నా అదృష్టమని ఫీలయ్యేవాడిని. ఇట్లా మమ్మల్ని వదిలేసి వెళ్లిపోయింది. నా లైఫ్‌లో అలాంటి మనిషిని చూడలేదు. చూడలేను కూడా’ అంటాడు ఆమె భర్త చౌదరి రాజీవ్‌ రెడ్డి. ప్రభావతి చనిపోయాక ఆమె ఉద్యోగాన్ని రాజీవ్‌రెడ్డికి ఇచ్చారు. ప్రస్తుతం ఆయన పరిగి మండలంలోని చిట్యాల్‌లో జూనియర్‌ అసిస్టెంట్‌గా పనిచేస్తున్నారు. ప్రభావతి స్ఫూర్తిని తమ కుటుంబం కొనసాగిస్తుందని అంటాడు. ‘ప్రైవేట్‌ స్కూళ్లో చదివించే స్థోమతలేని వాళ్లే తమ పిల్లలను గవర్నమెంట్‌ స్కూల్‌లో వేస్తారు. కాబట్టి పేరెంట్స్‌ నమ్మకాన్ని వమ్ము చేయొద్దు. ప్రైవేట్‌ స్కూల్‌ పిల్లల కన్నా మా స్కూళ్లో పిల్లలను మిన్నగా తయారు చేయాలి అని ప్రభావతి అనేది. నా మాట కూడా అదే’ అంటాడు రాజీవ్‌ రెడ్డి. 

ఏమైపోయేవాళ్లమో.. 
ఆ రోజు   ప్రభావతి టీచర్‌ వచ్చి  మమ్మల్ని నెట్టేయకపోతే ఏమైపోయేవాళ్లమో. పంద్రాగస్ట్‌ వస్తుందంటే ఇప్పటికీ భయమైతుంటది. టీచర్‌ కూడా బాగా గుర్తొస్తుంటది.   
– కీర్తన, నాల్గవ తరగతి, మేడికొండ

దేవతలా కాపాడింది
మా అబ్బాయి (గణేష్, నాల్గవ తరగతి)  పుట్టు మూగ,  చెవిడు.  జెండా వందనం కోసం జెండా పైప్‌ను చెక్‌ చేయడం కోసం పైకెత్తి మళ్లీ తీసేస్తుండగా పైన  కరెంటు తీగలు తాకడంతో  షాక్‌ వచ్చి వెల్లకిలా పడ్డాడు కొడుకు. ప్రభావతి టీచర్‌ దేవతలా వచ్చి కాపాడింది. ఆ టీచర్‌ అంటే మాకు చాలా గౌవరం. ఆమె లేదంటే బాధనిపిస్తుంటుంది. 
– గణేష్‌ తల్లిదండ్రులు, మేడికొండ

ఒళ్లంత గాయాలయ్యాయి
మేడం లేకుంటే బ్రతికేవాళ్లం కాదు మేడం పక్కకు నెట్టేయకుంటే చనిపోయే వాళ్లం. పైపు పైకి ఎత్తడంతో ఒక్కసారిగా కరెంట్‌ షాక్‌ తగిలి మూర్చపోయాం. ఇప్పుడు టీచర్‌ ఉండిఉంటే బాగుండేది. చాలా గుర్తొస్తుంటుంది.
– కుర్వ మధుమతి, నాల్గవ తరగతి 
– సరస్వతి రమ

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement