
ప్రియా వారియర్
ఉట్టికెగరలేనమ్మ స్వర్గానికి ఎగరుతానందట! కాన్ఫిడెన్స్ మంచిదే. అయితే ఇప్పుడు స్వర్గం ఎవరిక్కావాలి? చేతిలో స్మార్ట్‌ఫోన్ ఉంటేనూ! పనిలేని వాళ్లకు, పని ఉన్నవాళ్లకు కూడా వాట్సాప్ ఇప్పుడు స్వర్గధామం. ఈ స్వర్గంలో ప్రముఖులదీ, అనామకులదీ ఒకటే బెంచ్. దమ్ మార్ దమ్. ఏక్ హై హమ్. చిన్న పోస్టుతో అబద్ధం నిజం అయిపోతుంది, నిజం అబద్ధం అయిపోతుంది. ఎవరికి లాభం.. ఇలాంటి ఫేక్ పోస్టులతో? ఎవరికీ లేదు. అదో గంజాయ్ లాంటి ఎంజాయ్‌మెంట్.
రెండు రోజులుగా వాట్సాప్‌లలో ఒక కాలేజ్ ‘సర్క్యులర్’ సర్క్యులేట్ అవుతోంది. మీకూ వచ్చే ఉంటుంది. కోయంబత్తూర్‌లోని ‘వి.ఎల్.బి.జానకీయమ్మాళ్ కాలేజ్ ఆఫ్ ఆర్ట్ అండ్ సైన్స్’ ప్రిన్సిపాల్ పేరుతో అది బయటికి వచ్చింది. ‘డియర్ స్టూడెంట్స్.. ప్రియా వారియర్‌లా మీరూ కూడా క్లాస్ రూమ్‌లలో కన్నుగీటుతున్నట్లు తెలిసింది. అలా చేసినట్లు మా దృష్టికి వస్తే వెంటనే మిమ్మల్ని వన్ ఇయర్ పాటు కాలేజ్ నుంచి డీబార్ చేస్తాం’ అన్నది సారాంశం! అమ్మో ఈ పిల్ల దేశం మొత్తాన్నీ పాడు చేస్తోందే.. అనిపిస్తుంది ఆ సర్క్యులర్‌ని చూడగానే. పాడై పోయే మాట నిజమేనేమో కానీ... ఈ సర్క్యులర్ మాత్రం నిజం కాదు. ఎవరో ఉట్టికెగరలేనయ్యలు ఊరికే ఉండలేక ఇలా ఫేక్ పని చేసినట్లున్నారు. ఎలాగంటారా! ప్రియ ‘కన్నుగీటింది’ ఫిబ్రవరిలో. ఆ సర్క్యులర్ మీద ఉన్న డేటు జనవరిది.
Comments
Please login to add a commentAdd a comment