ప్రతీకాత్మకచిత్రం : ‘మిషన్ మంగళ్’ చిత్రంలో తాప్సీ
మన ఉద్దేశం ఏదైనా అది అవతలి వాళ్లకు ఎలా అర్థమయిందో అదే మన అసలు ఉద్దేశం అవుతుంది! హృదయం అచ్చుయంత్రమై అందులోంచి మన ఉద్దేశాన్ని ప్రింట్ అవుట్ తీసి ఇచ్చినా కూడా ఎవరికి వాళ్లు అర్థం చేసుకున్నదే అచ్చులో ఉన్నది అవుతుంది తప్ప, అచ్చులో ఉన్నది అందరికీ ఒకేలా అర్థమవదు.-మాధవ్ శింగరాజు
‘కబీర్‌సింగ్’ దర్శకుడు సందీప్‌రెడ్డిఓ ఇంటర్వ్యూలో చేసిన కామెంట్స్ మిస్‌ఫైర్ అయినట్లే.. నాగపూర్‌లో ఓ యువతి హత్యపై ట్విట్టర్లో తాప్సీ పెట్టిన కామెంటు బ్యాక్‌ఫైర్ అయింది. ‘మేబీ అది కూడా ప్రేమేనేమో’ అని తాప్సీ సందీప్‌రెడ్డిపై సర్కాస్టిక్‌గా చేసిన ట్వీట్ ఏ కొద్దిమందికో అర్థమైనట్లుగా కనిపిస్తోంది.
యావద్దేశ ప్రజలందరి ఐక్యూ లెవల్స్ ఒకలా ఉండనట్లే, వాళ్ల ఎత్తిపొడుపు లెవల్సన్నీ ఒకేలా ఉండవు. ఐక్యూ కన్నా ఎత్తిపొడుపు మోర్ కాంప్లికేటెడ్. పైన ఉండే వాళ్ల ఐక్యూను ఒకనాటికి కాకున్నా ఒకనాటికి కింద ఉండేవాళ్లు అందుకోగలుగుతారు. ఐక్యూ కన్నా ఇంకా ఎత్తున ఎత్తిపొడుపు ఉంటుంది కనుక అది ఏనాటికీ సామాన్యుల చేతికి అందదు. ఎంత ఐక్యూ ఉన్నా, ఎత్తిపొడుపును అర్థం చేసుకోలేకపోయారంటే వాళ్లూ సామాన్యుల కిందే లెక్క. ‘సర్కాజం’ అంటారు ఎత్తిపొడుపును ఇంగ్లిష్‌లో.
నటి తాప్సీ ట్విట్టర్‌లో సర్కాస్టిక్‌గా చేసిన ఒక కామెంట్‌పై ఇప్పుడు నెట్‌లో ఆగ్రహావేశాలు రగులుకుంటున్నాయి. అర్థం కాకపోవడం వల్ల జరిగిన అనర్థం అది. అంత పీక్‌లో ఉంది మరి తాప్సీ సర్కాజం. నాగపూర్‌లో ఒక యువకుడు తన ప్రియురాలి క్యారెక్టర్‌ని శంకించి, ఆమె తలను మోది చంపేశాడు. దారుణమైన ఘటన. ఇద్దరూ ఫ్రెండ్స్. అతడి పేరు అష్రాఫ్ షేక్. ఆ అమ్మాయి ఖుషీ పరిహార్. ఆమె ఉండటం నాగపూర్‌లో. మోడలింగ్ అంటే ఇష్టం. లోకల్‌గా ఫ్యాషన్ షోలు చేస్తుంటుంది. అలా అష్రాఫ్ పరిచయం. అలాగే మరికొందరు పరిచయం. వాళ్లతో మాట్లాడొద్దంటాడు ఖుషీని. గత శనివారం పంధుర్న–నాగపూర్ హై వే మీద పోలీసులకు ఓ యువతి మృతదేహం ఉన్నట్లు సమాచారం అందింది. ముఖం గుర్తుపట్టలేని విధంగా ఉంది. సోషల్ మీడియాలో శోధించి ఆమెను, ఆమె ఫ్రెండ్ అష్రాఫ్‌నీ గుర్తించారు పోలీసులు. చంపింది తనేనని ఒప్పుకున్నాడు అష్రాఫ్. ఎందుకు చంపావు అంటే.. ‘వేరే మగాళ్లతో కూడా మాట్లాడుతోంది. తన క్యారెక్టర్ మంచిది కాదనిపించి చంపేశాను’ అన్నాడు. చంపడమే ఘాతుకం అనుకుంటే, క్యారెక్టర్ మంచిది కాదని చంపేయడం ఇంకా ఘాతుకం. ఈ ఘాతుకంపైనే తాప్సీ సర్కాస్టిక్‌గా చేసిన కామెంట్ బ్యాక్ ఫైర్ అయింది. ‘మేబీ అతడు ఆమెను పిచ్చిగా ప్రేమిస్తున్నాడేమో! మేబీ ఆ పిచ్చి ప్రేమతోనే అతడు ఆమెను చంపేశాడేమో!’ అని తాప్సీ ట్వీట్ చేశారు. ‘కబీర్ సింగ్’ డైరెక్టర్ సందీప్ రెడ్డిని ఎత్తిపొడవడం ఇది. అయితే ట్వీట్‌లో సందీప్ పేరు లేకపోవడంతో ఈ ఎత్తిపొడుపు ఎవరికీ అర్థమైనట్లు లేదు. అర్థంకాకపోవడం అర్థం చేసుకోలేనివాళ్ల తప్పైతే కాదు. ఈ ఒక్కచోట ఎత్తిపొడుపులో తన ఐక్యూ లెవల్స్‌ని తాప్సీ తగ్గించుకోవలసింది. సున్నితమైన సంగతి కదా. ఆమె సర్కాజం అర్థమైనవాళ్లకు కూడా తాప్సీ ఎవరికో భలే పంచ్ ఇచ్చారని మాత్రమే అనిపిస్తుంది. ఏ కొద్దిమందికో ఆమె సందీప్‌ని అంటున్నారని తెలుస్తుంది.. ఆయన ఇంటర్వ్యూపై జరుగుతున్న రగడను ఫాలో అవుతున్నవారికి. మిగతావాళ్లంతా నిజంగానే తాప్సీ.. ఆ చంపిన యువకుడిని సమర్థిస్తోందనే అనుకున్నారు. ట్రోలింగ్ మొదలుపెట్టారు.
‘కబీర్‌సింగ్’లో హీరో హీరోయిన్‌ని చెంపదెబ్బ కొట్టే సీన్ ఉంది. ఇలా స్త్రీ చెంపపై పురుషుడు చెయ్యి చేసుకునే సీన్లు సినిమాలు పుట్టినప్పటి నుంచీ ఉన్నాయి కానీ ఇది కొంచెం వేరుగా ఉంది. ఆ కొట్టడంలో ‘టాక్సిక్ మాస్క్యులినిటీ’ స్పష్టంగా కనిపిస్తోంది. సినిమా చూస్తున్న మగపిల్లల కండల్లోకి విషపూరిత పురుషత్వాన్ని ఇంజెక్ట్ చేసేశాడు డైరెక్టర్.. ప్రియుడి చేత ప్రియురాలిని ఫిజికల్‌గా అసాల్ట్ చేయించి! పైగా అలా కొట్టడాన్ని ప్రేమ అన్నాడు సందీప్‌రెడ్డి అనుపమా చోప్రాతో. ఆమె ఫిల్మ్ క్రిటిక్. ‘‘స్త్రీని తక్కువ చెయ్యడం కదా అది’’ అని అనుపమ అన్నప్పుడు.. ‘‘గాఢమైన ప్రేమలో ఇలాగే జరుగుతుంది. ఇలా జరగలేదంటే అక్కడేం లేనట్లు’’ అని సందీప్ అన్నాడు! ఆయన ఇలా అనడం చెంపదెబ్బ సీన్ కన్నా పెద్ద సీన్ అయింది! ఆయన చెప్పదలచుకున్నది ఏదో ఉంది. దాన్నే డెప్త్‌కి వెళ్లి మాట్లాడాడు. అంతే డెప్త్‌కి వెళ్లి తాప్సీ ఆయన్ని ఎత్తిపొడిచారు. ఇంటర్వ్యూలో ఆయన కామెంట్స్ మిస్‌ఫైర్ అయినట్లే, ట్విట్టర్లో తాప్సీ కామెంటు బ్యాక్‌ఫైర్ అయింది. దానిపై మళ్లొక ట్వీట్ పెట్టారు తాప్సీ. ‘‘ఎత్తిపొడుపును అర్థం చేసుకోలేనివాళ్లు దయచేసి నా ట్వీట్‌ను పట్టించుకోకండి. థ్యాంక్యూ, మీరెవరో నాకు తెలియకపోవడం మంచిదైంది’’ అని కామెంట్ పెట్టారు. సందీప్‌రెడ్డి అంతకుముందే తన మాటలపై వివరణ ఇచ్చారు. అది కొంచెం బెటర్ వెర్షన్‌లో ఉంది. అంటే.. అర్థం చేయించే భాషలో. ‘‘మీరు నా మాటల్ని పూర్తిగా అపార్థం చేసుకున్నారు. కబీర్‌సింగ్ తన ప్రియురాలిని కొట్టడం కొట్టినట్లు కాదు. ఒకరు లేకుండా ఒకరు ఉండలేనంతగా దగ్గరైనప్పుడు కోపాన్ని వ్యక్తం చేసే స్వేచ్ఛను తీసుకోకుండా ఉండలేకపోవడం అది. అమ్మాౖయెనా అంతే, అబ్బాౖయెనా అంతే’’ అని అన్నాడు. ఈ మాట ఎంతమందికి ఎంత మేరకు అర్థమైయిందో మరి.
తాప్సీని, సందీప్‌నీ వదిలేద్దాం. అంతగా డెప్త్ లేని, అంతగా సర్కాజం లేని మనం కూడా నెత్తీనోరూ మొత్తుకుంటూనే ఉంటాం.. ‘నా ఉద్దేశం అది కాదు’ అని చెప్పడానికి. ముఖ్యంగా భార్యాభర్తలు, కుటుంబ సభ్యులు, బాగా దగ్గరి ఫ్రెండ్స్! ఉద్దేశాన్ని వేరేలా అర్థం చేసుకున్నారంటే.. ఉద్దేశాన్ని అర్థం చేసుకోలేకపోయారనో, అపార్థం చేసుకున్నారనో కాదు. మన ఉద్దేశం వేరేలా కూడా అర్థమయ్యేలా ఉందని.
Comments
Please login to add a commentAdd a comment