మహానటి సినిమా చూశారా? అయితే టైటిల్స్ గమనించారా? చూస్తే.. గమనిస్తే.. గార్లపాటి పల్లవి పేరు కనిపించిందా? ఇప్పుడు అదో సినిమా అయింది! సావిత్రి మీద అభిమానంతో ఆమె గురించి అక్కడ చదివి.. ఇక్కడ చదివి.. వాళ్లను వాకబు చేసి.. వీళ్లను వాకబు చేసి ‘మహానటి సావిత్రి.. వెండితెర సామ్రాజ్ఞి’ అనే పుస్తకం రాశారు! సావిత్రి వాస్తవంగా ఓ మహానటి. అయితే.. మహానటి వాస్తవంగా సావిత్రి కాదు.. అని సోషల్ మీడియా వాల్స్ మీద ఈ మధ్య పోస్టర్లు వెలిసినప్పుడు.. మహానటి నిజంగానే ఓ కథేనా? లేక దాంట్లో వాస్తవాలున్నాయా అని తెలుసుకోవడానికి పల్లవిని పలకరించింది... సాక్షి.
‘మహానటి’.. సావిత్రిని ఈ తరానికి పరిచయం చేసిన సినిమా. అయితే అంతకుముందే ఆమె బయోగ్రఫీ వచ్చింది ‘మహానటి సావిత్రి.. వెండితెర సామ్రాజ్ఞి’ అనే పేరుతో. ఆ పుస్తకాన్ని రాసింది సావిత్రి కుటుంబీకురాలో.. ఆమె సన్నిహితురాలో.. లేదా ఇంకే సినిమా పర్సనాలిటీనో కాదు. రచయిత అంతకన్నా కాదు. ఓ సాధారణ గృహిణి. గార్లపాటి పల్లవి. సావిత్రి పుస్తకంతోనే ఆమె రచయిత్రిగా మారారు. మహానటి సావిత్రి సినిమాకు ఓ సోర్స్‌గా కూడా మారారు. అయినా ‘‘ఆ సినిమా తెలుగువారి మహానటి కాదు.. మద్రాస్‌వారి మహానటి’’ అంటారు ఆమె. అన్ని వివరాలు పల్లవి మాటల్లోనే విందాం.‘‘నాకోసం నేను రాసుకున్న పుస్తకం సావిత్రి. ఆమె సినిమాలు పెద్దగా చూసిందీ లేదు. ఎందుకంటే నాకు ఊహ తెలిసేటప్పటికే సావిత్రి క్యారెక్టర్ రోల్స్‌కి వచ్చేశారు. ఆవిడంటే మా నాన్నగారికి చాలా ఇష్టమని మా అమ్మ చెప్తుండేది. అలా ఆవిడ నా మైండ్‌లో అచ్చయిపోయారు. నేను ట్వల్త్‌క్లాస్‌లో ఉన్నప్పుడు మా ఇంట్లోకి వీసీఆర్ వచ్చింది. అందులో మేం చూసిన మొదటి సినిమా ‘‘కన్యాశుల్కం’’. మధురవాణిగా సావిత్రిని ఎవరైనా మరిచిపోగలరా? ఆ తర్వాత 1990ల్లో మళ్లీ సావిత్రిగారి సినిమా చూశా. ఐ ఫాలెన్ ఇన్ లవ్ విత్ హర్. ఆ లవ్వే ఆమె బయోగ్రఫీ రాసేలా చేసింది. 2004లో అనుకుంటా ఘంటసాల గారి మీద రాసిన పుస్తకం చూపిస్తూ మాకు తెలిసినొకాయన..‘‘ దీని కోసం 6 లక్షలు ఖర్చయింది’’ అన్నారు. ‘నేనైతే సావిత్రి కోసం ఎన్ని లక్షలయినా ఖర్చుపెట్టేస్తా’ అన్నాను ఆసువుగా. అప్పటికి నాకు పెళ్లయి ముగ్గురు పిల్లలు. పాప ప్రణతి యూకేజీలో ఉంది. ఇద్దరు మగపిల్లలు ట్విన్స్ ఆకాశ్, పృథ్వీ. ఎల్‌కేజీలో ఉన్నారు. నేనూ ఏదో కాంపిటీటివ్ ఎగ్జామ్‌కి ప్రిపేర్ అవుతున్నా. ఆ పరీక్ష అయిపోయిన వెంటనే ఆ వ్యక్తికి కాల్ చేశా ‘‘అంకుల్ విల్ గో ఫర్ బుక్’’ అని. అప్పటిదాకా నేను క్లాసిక్స్ అనదగ్గవి 20 వరకూ చదివుంటా. కానీ ఎప్పుడూ రాయలేదు. డైరెక్ట్‌గా మహానటి సావిత్రే. ముందు భూషణ్ (ప్రముఖ ఫొటోగ్రాఫర్) గారి దగ్గరకు తీసుకెళ్లారు. ఆయన సావిత్రి ఫొటోస్ కొన్ని ఇచ్చారు, ఆ తర్వాత చెన్నైకి వెళ్లాను. ఫిల్మ్ న్యూస్ ఆనంద్‌ను కలిశాను. సంజయ్‌కిశోర్‌ను కలిశాను.
దశాదిశ లేకుండానే..
నేను మామూలు హౌస్‌వైఫ్‌ని. సినిమాలతో కానీ, సినిమా వాళ్లతో కానీ మా ఫ్యామిలీకి ఎలాంటి స్నేహం లేదు. సావిత్రిగారిమీదున్న ప్రేమ, పుస్తకం రాయాలి అన్న సంకల్పమే తప్ప ఎవరిని కలవాలి, ఎక్కడ ఇన్ఫర్మేషన్ తీసుకోవాలి అన్నవేమీ తెలియవు. గుమ్మడి గారిని కలిశాను. ఆయన రాసిన ‘తీపి గుర్తులు.. చేదు జ్ఞాపకాలు’ పుస్తకం తీసుకున్నాను. భూషణ్ (ప్రముఖ ఫొటోగ్రాఫర్)ను కలిస్తే ఆయన కొన్ని ఫొటోస్ ఇచ్చారు. సంజయ్ కిశోర్‌ను, జమున గారిని, కాంతారావుగారిని, చెన్నైలో ఫిల్మ్‌న్యూస్ ఆనంద్‌ను కలిశాను. అప్పుడే జమునగారి కూతురి పెళ్లి ఉండడంతో ఆమె తర్వాత కలవమని చెప్పారు. కానీ వెళ్లలేకపోయాను. కాంతారావు గారేమో బ్యాడ్ హెల్త్ కండిషన్‌లో ఉండి ఏమీ చెప్పలేక పోయారు. ఆతర్వాత విజయ చాముండేశ్వరి గారినీ కలిశాను. నా పిల్లలు చిన్నవాళ్లవడంతో అవుట్‌స్టేషన్స్‌కు వెళ్లడం కుదర్లేదు. సావిత్రిగారి మీది ఆర్టికల్స్, ఆమె ఇంటర్వ్యూ బాగా ఉపయోగపడ్డాయి. వనితాజ్యోతిలోని పసుపులేటి రామారావుగారు రాసిన ఆర్టికల్.. ఇంకా అలాంటివి చాలా. పుస్తకం రాయడం మొదలుపెట్టాక, ఇంకా చెప్పాలంటే పూర్తయ్యాక ఒక్కొక్కరూ తెలియడం మొదలుపెట్టారు. సావిత్రిగారి అక్క భర్త మా ఇంటి దగ్గరే ఉంటారని తెలిసింది. నాకు దొరికిన సోర్స్‌ని బట్టి రాస్తూ వచ్చాను. అలాగని గ్రౌండ్ వర్క్ చేయలేదని చెప్పను. విజయవాడ, సత్యనారాయణపురంలో సావిత్రిగారు వాళ్లున్న వీధికి వెళ్లా. ఆ తరం వాళ్లను కలిసి మాట్లాడా. అలాగే ఆవిడ స్కూల్ కట్టించిన ఊరికీ వెళ్లా. వేటపాలెం లైబ్రరీనీ కాంటాక్ట్ చేశా. సావిత్రిగారు లక్స్ యాడ్‌కు మోడలింగ్ చేశారన్న సంగతి ఆ లైబ్రరీతోనే తెలిసింది.
పుస్తకంలో చాముండి పాత్ర
పుస్తకం రాసేటప్పుడు అప్పటికప్పుడు నాకు తట్టిన పాత్ర అది. సావిత్రికి ఫ్రెండ్‌గా పెట్టాను. ఆమె జీవితంలో వెన్నంటి ఉండే పాత్ర. సినిమాలు తీయకు, దానాలు చేయకు, జెమినీని నమ్మకు అంటూ సావిత్రికి అడుగడుగునా మంచిచెడులు చెప్తుంటుంది. అయితే ఈ పాత్ర మాత్రమే కల్పితం. కానీ ఆ మిగిలినవన్నీ సావిత్రిగారి జీవితం లో జరిగినవే. మరెందుకు ఆ కల్పిత పాత్ర? అంటే చెప్పలేను. చాముండి వల్లే నా పుస్తకం అంతా ఫిక్టీషియస్ అనుకున్నారు. సూజెన్ హెవర్డ్ ఉత్తరం కూడా అంతే. సావిత్రి లైఫ్ గురించే ఎక్కువ చెప్పాను. నటిగా ఆమెను ఎక్కడా డిస్క్రైబ్ చేయలేదు. ఆ ఉత్తరం ఒకటి క్రియేట్ చేసి దాని ద్వారా ఆమె నటనను వర్ణించాలనుకున్నాను. ఈ ఉత్తరం నా కల్పితమని నా పుస్తకం ముందుమాటలో గుమ్మడిగారు స్పష్టం చేశారు కూడా. అంతెందుకు గుమ్మడిగారి పుస్తకంలో.. సావిత్రిగారు బెంగళూరు హోటల్లో బస చేసినప్పుడు (తనతో స్నేహంగా ఉన్న) ఒక నటిని పిలిపించుకొని ఎప్పుడో ఆమెకు ఇచ్చిన తన నగను ఇవ్వమని సావిత్రి అడిగినట్టు, దానికి ఆ నటి తన దగ్గర ఆ నగలేదని చెప్పినట్టు, డబ్బు అవసరంలో ఉన్న సావిత్రిగారు ఆ మాట విని షాకైనట్టు అలా కోమాలోకి వెళ్లినట్టూ రాశారు. ‘‘ఇది నిజమేనా అండీ.. ’’ అని నేను గుమ్మడిగారిని అడిగా. ఆయన నిజమని చెప్పలేదు.. అబద్ధమనీ నిర్ధారించలేదు. మౌనంగా ఉన్నారు. ఇది ఎందుకు చెప్తున్నానంటే ఉన్న సోర్సెస్ కూడా నిజాలను తేల్చలేదని తెలియజేయడానికే. స్టార్ట్‌చేసిన యేడాదికల్లా పుస్తకం రెడీ అయింది. మా నాన్నగారికి శాంతాబయోటిక్ వరప్రసాద్‌రెడ్డిగారు మంచి ఫ్రెండ్. ఆయనకు ఈ పుస్తకాన్ని అంకితమిచ్చాను. ఇప్పటి వరకు పన్నెండు వేల కాపీలను ప్రింట్ చేశాం. ప్రతి యేడాది రెండు వేల కాపీలను ప్రింట్ చేస్తూనే ఉన్నాం. ఈ పుస్తకంలో నేనెంత లీనమయ్యానంటే మా పిల్లలు ‘‘అమ్మా సావిత్రమ్మ మాకు అమ్మమ్మ అవుతుంది కదా’ అని అడిగేంతగా!
రెండో పుస్తకం.. ఎమ్మెస్‌గారి మీద
ఎమ్మెస్ సుబ్బులక్ష్మిగారు అంటే నాకు శ్రీ వేంకటేశ్వరస్వామి సుప్రభాతమే. అంతకుమించి ఆమె పాడినవి ఏవీ నేను వినలేదు. ఆమెను చూడలేదు. ఆమె పాడిన భజగోవిందంలోని పునరపి జననం.. పునరపి మరణం అనే వాక్యాలు కలిగించిన కుతూహలం టీజేఎస్ జార్జ్ .. ఎమ్మెస్ మీద రాసిన పుస్తకాన్ని పరిచయం చేసింది. అది చదివాక ఆమె బయోగ్రఫీ తెలుగులో రాస్తే బాగుంటుందనిపించింది. సావిత్రి బయోగ్రఫీ ఇచ్చిన ఎక్స్‌పీరియెన్స్‌తో ఈ పుస్తకానికి రీసెర్చ్ మొదలుపెట్టా. దాదాపు ఎనిమిదేళ్లు సాగింది. సావిత్రి పుస్తకం ఇష్టమైతే.. ఎమ్మెస్ మీద పుస్తకం ఓ యజ్ఞం. జార్జ్ మొదలు, ఎమ్మెస్‌గారి వదిన, ఎమ్మెస్ గారి మనవడు, మునిమనవరాలు, సదాశివం (ఎమ్మెస్ భర్త) కాంటెంపరరీస్ అయిన ఖాసా సుబ్బారావు గారి కూతురు, వీఏకే రంగారావు, స్వామినాథన్ ఇలా చాలామందిని కలిశాను. చెన్నై, కోయంబత్తూరు, మధురై, రాజుపాళెం వంటి చోట్లకూ వెళ్లా. ఆమె మీద వచ్చిన ఎన్నో పుస్తకాలను, ఆర్టికల్స్‌నూ ఔపోసన పట్టా. ఆమె మీద తీసిన ‘ఫరెవర్ లెజెండ్’ డాక్యుమెంటరీ చూశా. ఆడియోస్ విన్నా. అన్నీ హెల్ప్ అయ్యాయి. ఈ ప్రయాణం స్టార్ట్‌చేసేనాటికి నా పిల్లలు పెద్దవాళ్లయ్యారు. ఈ పుస్తక రచనలో చాలా సాయపడ్డారు. ఫొటోలు తీయడం దగ్గర్నుంచి ఇంటర్వ్యూలను రికార్డ్‌చేయడం వరకు ఒకరకంగా నాకు అసిస్టెంట్స్‌గా ఉన్నారని చెప్పొచ్చు. మా నాన్నా అంతే తోడుగా ఉన్నారు. ఇలా మా ఇంట్లో వాళ్లంతా ఎవరికి తోచిన సహాయం వాళ్లు చేశారే తప్ప ఎందుకు ఈ ప్రయాస అంటూ నన్ను డిస్కరేజ్ చేయలేదు. ఈ రీసెర్చ్ నాకు చాలా విషయాలను నేర్పింది. ఎమ్మెస్ సుబ్బులక్ష్మిగారికి సంబంధించి ఒక క్లూ ఇచ్చింది మాత్రం ఆమె వదినగారే.
ఎమ్మెస్ భర్త సదాశివం..ఆమెను పెళ్లిచేసుకున్నాక పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేయించుకున్నారట. ఈ విషయం తెలిసి సుబ్బులక్ష్మిగారు తన అన్నతో చెప్పి ఏడ్చారని చెప్పింది వాళ్ల వదిన. కానీ సుబ్బులక్ష్మి మనవడు చెప్పేదానికంటే కూడా ‘‘మీరు జార్జ్ లాగా రాయొద్దు’’ అని ఆంక్షలే ఎక్కువ పెట్టాడు. కానీ నేను జార్జ్ కన్నా నాలుగు నిజాలు ఎక్కువే రాశాను. జార్జ్ తన పుస్తకంలో ప్రశ్నార్థకాలు పెట్టిన వాస్తవాల దగ్గర నా పుస్తకంలో నేను ఫుల్‌స్టాప్ పెట్టా. ఎమ్మెస్ వాళ్లమ్మ చనిపోతే ఆమె వెళ్లలేదని ఎమ్మెస్ కుటుంబానికి దగ్గరగా ఉన్న వ్యక్తి చెప్పాడు. నేనూ అదే రాశాను. పుస్తకం అచ్చుకి రెడీ అయిన టైమ్‌లో ఎమ్మెస్ సుబ్బులక్ష్మి మీద ‘ది హిందూ’లో ఓ వ్యాసం వచ్చింది. అందులో ఆమె వాళ్లమ్మ చనిపోయినప్పుడు వెళ్లింది అని రాశారు. ఆ ఆర్టికల్ రాసిన వ్యక్తి కాంటాక్ట్ నంబర్ పట్టుకొని క్రాస్ చెక్ చేసుకున్నా. నిజమే అని తేలింది. దాంతో నేను రాసింది మళ్లీ మార్చాల్సి వచ్చింది. అలాంటి ఎన్నో సంఘటనలు మళ్లీ మళ్లీ క్రాస్ చెక్ చేసుకుంటూ పోయా. ‘సుస్వరాల లక్ష్మి ఎమ్మెస్ సుబ్బులక్ష్మి’గా పుస్తకాన్ని అచ్చువేశా. వరప్రసాద్‌రెడ్డి గారి తల్లిదండ్రులైన శాంతమ్మగారు, వెంకటరమణారెడ్డి గారికి ఆ పుస్తకాన్ని అంకితమిచ్చా. రిలీజ్ అయిన రోజే రెండు వందల కాపీలు అమ్ముడుపోయాయి. వితిన్ సిక్స్ మంత్స్ సెకండ్ ప్రింట్‌కు వెళ్లాల్సి వచ్చింది. ఎమ్మెస్ ఎక్స్‌పీరియెన్స్‌తో సావిత్రి పుస్తకం మళ్లీ రాయాలనుంది. ఈ పుస్తకం నాకు సావిత్రి అభిమాని శిల్పను మంచి ఫ్రెండ్‌గా చేస్తే, తెలుగు యూనివర్సిటీ వారి ఉత్తమ వచన రచన పురస్కారాన్ని అందించింది. విమర్శలను పట్టించుకుంటూనే నా పని నేను చేసుకుంటా. ఏ పనికైనా ప్రత్యేకంగా ప్లాన్ అంటూ ఏమీ ఉండదు. అప్పటికప్పుడు బలంగా ఏదనిపిస్తే అది చేస్తా’’ అంటూ ముగించారు గార్లపాటి పల్లవి.
పల్లవి.. కుటుంబం
పల్లవి స్వస్థలం గుంటూరు జిల్లా, బోడిపాలెం. ఆమె తండ్రి రావిపాటి నాగేశ్వరరావు సెంట్రల్ ఎక్సైజ్ సూపరింటెండెంట్‌గా పనిచేశారు. తల్లి శాంతి. నిజానికి పల్లవి తెలుగు చదివింది మూడో తరగతి వరకే. ఎందుకంటే తర్వాత ఆమె విద్యాభ్యాసమంతా సెంట్రల్ స్కూల్స్‌లోనే సాగింది. ఎనిమిదో తరగతి వరకు గుంటూరులోనే. తండ్రి ఉద్యోగరీత్యా తర్వాత నుంచి అంతా హైదరాబాదే. కేంద్రీయ విద్యాలయాల్లో స్పోర్ట్స్‌కి చాలా ప్రాముఖ్యం ఉంటుంది. అందువల్ల పల్లవి కూడా టేబుల్ టెన్నిస్ ఆడేవారు. స్కూల్స్ నేషనల్స్ వరకూ వెళ్లారు. ఎమ్మే హిస్టరీ చేశారు. సివిల్స్‌కూ ప్రిపేర్ అయ్యారు. ఆమె భర్త గార్లపాటి మధుసూదన్‌రావు. సాఫ్ట్‌వేర్ ఇంజనీర్. కూతురు ప్రణతి. ఇంజనీరింగ్ చదువుతోంది. మగపిల్లలు ఆకాశ్, పృథ్వీ ట్విన్స్. ఇంటర్‌లో ఉన్నారు.
– సరస్వతి రమ
Comments
Please login to add a commentAdd a comment