షకీలా
ఎవరైనా వాళ్ల జీవితం గుట్టుగా ఉండాలి అనుకుంటారు.ఎంత పాపులర్ అయినా పర్సనల్ లైఫ్‌ని ప్రైవేట్‌గా ఉంచుకోవాలనుకుంటారు.ఎంత పెద్ద హీరో అయినా.. ఎంత పెద్ద హీరోయిన్ అయినాగుట్టుగా ఉంచకూడదనుకునేది ఒకటి ఉంటుంది.అదే ఫ్యాన్స్.ఎంతమంది ఫ్యాన్స్ ఉంటే ఇండస్ట్రీలో అంత సక్సెస్‌ఫుల్.షకీలాకి చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు.కానీ ఒక్కరూ బయటపడరు.అందుకే ‘సీక్రెట్ స్టార్’.
చాలా రోజుల తర్వాత ‘శీలవతి’ సినిమా చేస్తున్నారు. ఇది మీకు 250వ సినిమా. వెనక్కి తిరిగి చూసుకుంటే గర్వంగా చెప్పుకోవడానికి ఒక్క మూవీ కూడా లేదేమో?
ఎగ్జాట్లీ. ఇన్ని సినిమాలు చేసినా ఆర్టిస్ట్‌గా నాకు తృప్తి లేదు. నటిగా నేను చాలా కేపబుల్. మంచి అవకాశాలిస్తే బాగా చేయగలను. కానీ రాలేదు. ఇలా చెబితే కొంతమంది డైరెక్టర్స్ ఫీలవుతారేమో. ‘మేం మంచి చాన్సులే కదా ఇచ్చాం’ అని వాళ్లనుకోవచ్చు. కానీ చేసినప్పుడు, భవిష్యత్తులో నా క్యారెక్టర్స్ చూసుకున్నప్పుడు నాకు శాటిస్‌ఫ్యాక్షన్ ఉండాలి కదా. ‘శీలవతి’లో మంచి పాత్ర చేశా. ఈ చిత్రదర్శకుడు సాయిరామ్ దాసరిని ఒక ఆడియో ఫంక్షన్‌లో కలిశాను. ‘మంచి రోల్ కోసం వెయిట్ చేస్తున్నా’ అని చెబితే ‘వెయిట్ చేయండి. మంచి స్క్రిప్ట్‌తో వస్తా’ అన్నాడు. అన్నట్లుగానే మంచి పాయింట్‌తో వచ్చాడు.
అసలు సినిమాల్లోకి ఎందుకు వచ్చారు?
ఉన్నది ఉన్నట్లు చెబుతున్నా. నేను డబ్బు సంపాదించడానికే వచ్చాను. నా ఫ్యామిలీ కోసం ఆర్టిస్ట్ అయ్యాను. సంపాదించాను.
ఫ్యామిలీ అంటే ఎంతమంది?
ఇద్దరు అక్కలు, ఆ తర్వాత ఇద్దరు అన్నయ్యలు, ఆ తర్వాత మరో అక్క (ఆవిడ చిన్నప్పుడే చనిపోయింది), తర్వాత నేను, నా తర్వాత తమ్ముడు, చెల్లెలు. అమ్మానాన్న. లార్జ్ ఫ్యామిలీ. మా అక్క పెళ్లి చేసుకున్నాక కూడా మా ఇంట్లోనే ఉండేది. ఒక అన్న డ్రగ్ అడిక్ట్. తమ్ముడు టెన్త్ ఫెయిల్. ఎవరూ సెటిల్ అయ్యే పరిస్థితి లేదు. మా కష్టాలు పోగొట్టడానికి ఇంటి బాధ్యతను మోశాను.
మీకన్నా పెద్దవాళ్లు ఉండగా మీరే ఎందుకు బాధ్యత తీసుకున్నారు?
నాకు ఫుడ్ అంటే బాగా ఇష్టం. ఒకసారి అమ్మ çపప్పుచారు పలచగా చేస్తే.. ‘ఏంటి? ఇలా ఉంది’ అనడిగాను. ‘నువ్వు సరిగ్గా చదువుకుని ఉంటే నర్స్ అయ్యేదానివి. ఇదిగో ఇలా కష్టపడుతున్నాం’ అనేసరికి బాధగా అనిపించింది. నిజానికి నాకు చదువు అబ్బలేదు. కష్టాలన్నీ నా వల్లే అని అమ్మ అనడంతో ఏదైనా చేయాలనుకున్నాను. ఆ టైమ్‌లో ఎదురింటి వాళ్ల ద్వారా సినిమా ఆఫర్ వచ్చింది. డబ్బులు ఇస్తారా అని అడిగితే? ‘సెలెక్ట్ అయితే ఇస్తాం’ అన్నారు. సెలెక్ట్ అయ్యాను. అప్పట్లో (1990లలో) ఏడువేల ఐదువందల రూపాయలు ఇచ్చారు. మా ఇంటి అద్దె 700. అప్పటికి ఇంటి అద్దె కట్టి 23 నెలలైంది. అంత కష్టాల్లో ఉండేవాళ్లం.
షూటింగ్‌లో ఇచ్చే డ్రెస్సుల గురించి అభ్యంతరం చెప్పిన సందర్భాలున్నాయా?
నాన్న నాతో పాటు షూటింగ్‌కి వచ్చినా, లొకేషన్లోకి వచ్చేవారు కాదు. నేను లోపలికి వెళ్లగానే కాస్ట్యూమ్స్ ఇచ్చేవారు. ‘ఇదేంటి ఇలా ఉన్నాయ్?’ అని అడిగితే.. ‘మీ నాన్నతో మేం మాట్లాడాంలే’ అనేవారు. డాడీతో మాట్లాడాక నేను మాట్లాడ్డానికి ఏముంటుంది? నోరు మూసుకుని ఆ బట్టలేసుకుని వాళ్లెలా చెబితే అలా చేసేదాన్ని. షూటింగ్ ఫినిష్ చేసి ఇంటికెళ్లేటప్పుడు ‘డాడీ.. మీతో వాళ్లు హిందీలో మాట్లాడుతున్నారు. మీరేమో అర్థం కాకుండా అన్నింటికీ తలూపుతున్నారు. నా దగ్గరేమో మీతో మాట్లాడానంటున్నారు. ఒకసారి నా కాస్ట్యూమ్స్, క్యారెక్టర్ గురించి అడగండి’ అనేదాన్ని. ‘సరే’ అనేవారు. అయితే మళ్లీ మామూలే. చివరికి ‘ఇది తప్పదు’ అని నా మైండ్ ప్రిపేర్ అయిపోయింది.
పోనీ మీకు వచ్చిన ‘ఇమేజ్’ తెలిశాక ‘సినిమా లు మానెయ్’ అని మీ అమ్మానాన్న అనలేదా?
అమ్మ ఎప్పుడూ అనలేదు. డాడీ మాత్రం రెండు సందర్భాల్లో అన్నారు. ‘కడవుళ్’ అనే తమిళ సినిమా కోసం ఓ మామిడి తోటలో పాములతో డ్యాన్స్ చేస్తున్నా. ‘ఒకవేళ ఆ పాములు కరిస్తే ఆ అమ్మాయి పరిస్థితి ఏంటి?’ అని ఎవరో డాడీతో అన్నారట. షూటింగ్‌కి ప్యాకప్ చెప్పాక డాడీ, నేనూ వెళుతున్నప్పుడు ‘ఇక సినిమాలు వద్దమ్మా’ అన్నారు. అప్పటికి నా సిస్టర్స్‌కి పెళ్లయింది. ‘నీక్కూడా పెళ్లి చేస్తాను. నువ్వూ సెటిల్ అయిపో’ అన్నారు. ఇది జరిగిన నెలకు మరో సాంగ్ షూట్‌లో పాల్గొంటూ పై నుంచి జారి పడ్డా. అప్పుడు కూడా డాడీ సినిమాలు మానేయమన్నారు. అయితే అప్పటికే ఇంట్లోవాళ్లకు కొన్ని కంఫర్ట్స్ చూపించేశాను. మళ్లీ వాళ్లను కష్టాల్లోకి దించడమా? అనిపించింది. అదే రోజు రాత్రి డాడీకి హార్ట్ ఎటాక్ వచ్చింది. దాంతో సినిమాలు ‘వదలకూడదు’ అని స్ట్రాంగ్‌గా నిర్ణయించుకున్నాను.
మీ ఫ్యామిలీ కోసం చాలా కష్టపడ్డారు. మరి వాళ్లు మీ ఫ్రొఫెషన్‌ని ఎంత రెస్పెక్ట్ చేస్తారు?
కుటుంబం కోసమే కష్టపడుతున్నాను కాబట్టి నన్నెంతో అభిమానిస్తారని నమ్మాను. కానీ నా నమ్మకాన్ని వమ్ము చేశారు. ఒక మలయాళం మేగజీన్ కోసం ఫ్యామిలీ ఫొటో అడిగితే.. మా అక్క వాళ్ల పిల్లలు వద్దని రాలేదు. మా తమ్ముడూ రాలేదు. నాకు దగ్గరగా ఉండే నా చెల్లెలూ రాలేదు. ఫొటోగ్రాఫర్ ఇంటికొచ్చిన పరిస్థితిలో నాకెలా ఉంటుందో ఊహించండి. ఫ్యామిలీ ఫొటో అంటే చివరికి నేను, మా అన్నయ్య కూర్చున్నాం. వాళ్లకు అవసరం ఉన్నప్పుడు నేను, నా పేరు కావాలి. కానీ నాకు ఫొటో అవసరం అయినప్పుడు వాళ్లు రాలేదు.
మీవాళ్లు మిమ్మల్ని ఓన్ చేసుకోకపోవడంతో పాటు మనీ వైజ్‌గా మోసం చేశారా?
అవును. ఒకానొక దశలో సినిమాలు మానేసి, హ్యాపీగా సెటిలవుదామనుకున్నా. మా అమ్మగారు సరిగ్గా చదువుకోలేదు. చిన్నప్పుడు నన్ను స్కూల్లో చేర్పించింది మా అక్కే. తనంటే నమ్మకం. నా ఆర్థిక లావాదేవీలన్నీ మా అక్క చూసుకునేది. ఇక బ్రేక్ తీసుకోవాలనుకున్నాక డబ్బు గురించి అడిగితే.. ‘నో బ్యాలెన్స్’ అంది. నా డబ్బులన్నీ ఎవరికో ఇచ్చిందట. వాళ్లు ఇవ్వలేదట. అలా అనే చెప్పింది. అప్పుడు మళ్లీ జీరోతో స్టార్ట్ అయ్యాను. ఇప్పుడైతే దయనీయ స్థితిలో లేను కానీ, కొన్నేళ్లు పడిన శ్రమ మొత్తం బూడిదలో పోసిన పన్నీరైందని నా బాధ.
షకీలాను ట్రెడిషనల్‌గా చూపించాలని ఒక్కరూ అనుకోలేదా? లేదా మీరూ రెడీగా లేరా?
నేనెప్పుడూ రెడీ. ఫుల్ ట్రెడిషనల్ క్యారెక్టర్ ఇచ్చి చూడమనండి. అప్పుడు తెలుస్తుంది.. ఆర్టిస్ట్‌గా నేనేంటో. అందుకే నేను ‘శీలవతి’, ‘కొబ్బరిమట్ట’ సినిమాల రిలీజ్ కోసం వెయిట్ చేస్తున్నా. షకీలాని గ్లామర్‌గానే చూస్తామని ఆడియన్స్ ఎప్పుడైనా అన్నారా? వాళ్లు ఏ పాత్ర చేసినా చూస్తారు. నా ఇండస్ట్రీయే నన్ను వేరే రకంగా చూస్తే నేనేం చేయాలి?
ఇప్పటివరకూ చాలాసార్లు ప్రేమలో పడ్డారట. షకీలాని లవర్‌గా చూస్తారు కానీ వైఫ్‌గా అంగీకరించడానికి ఎవరూ ఇష్టపడటంలేదా?
తప్పంతా నాదే. నన్ను ప్రేమించినవాళ్లంతా ఫ్యామిలీని వదిలేసి నాతో వచ్చేయ్ అనేవారు. కానీ మా ఫ్యామిలీలో సంపాదించేవాళ్లు లేరు. నా స్వార్థం చూసుకుంటే మావాళ్లను ఎవరు చూస్తారు? ఇదొక్కటే నాకు ప్రాబ్లమ్‌గా ఉండేది. ఒకటే చెప్పేదాన్ని ‘ఐ లవ్ మై మదర్’ అని. అందుకోసం ఇప్పటికీ సెటిల్ అవ్వలేదు. అమ్మ చనిపోయాకా సెటిల్ కాలేకపోయాను. ఎంతమంది పిల్లలు తల్లిదండ్రుల కోసం ఇంతగా ఆలోచిస్తారు? నేను ఆలోచించానని గర్వంగా చెప్పుకుంటాను. నేను తల్లి కాలేదు. నా తల్లిని బాగా చూసుకున్నాను. తోడబుట్టినవాళ్లను అమ్మలా చూసుకున్నా.
అందరు అమ్మాయిల్లాగా పెళ్లి చేసుకొని భర్త, పిల్లలతో హాయిగా ఉండాలని మీకు ఉండదా?
ఎందుకుండదండి? నేను ఆడదాన్ని కాదా? ముఖ్యంగా మూడేళ్లుగా చాలా ఒంటరితనం ఫీలవుతున్నా. ఇప్పుడైతే డిప్రెషన్‌లోనే ఉన్నాననాలి. ఒంటరిగా నిద్రపోవాలంటే భయమేస్తోంది? ఏదైనా జరిగితే ఎవరుంటారు? హాస్పిటల్‌కి వెళ్లాలంటే తోడు ఎవరొస్తారు? అని ఆలోచన వస్తుంది. నాకు ఓదార్పు కావాలి. తనివి తీరా ఏడవడానికి ఒక ‘భుజం’ కావాలి. ఒక భరోసా కావాలి. ప్రేమను షేర్ చేసుకోవటానికి ఒక పార్టనర్ కావాలి. నేనెవర్నీ మోసం చేయలేదు. అబద్ధాలు ఆడలేదు. నేనే నేరం చేయలేదు. నాకెందుకీ ఒంటరితనం? నా బాధలో న్యాయం ఉంది కదండీ.
ఎగ్జాట్లీ.. మీ నుంచి ఇంత విన్నాక మీకో ‘సోల్‌మేట్’ దొరికితే బాగుండు అని మాకూ అనిపిస్తోంది. మీ లైఫ్‌లో ఎవరో ఉన్నారట.. మిగతా ప్రేమల్లా ఇది కూడా రహస్యమేనా?
అది జరిగితే అంతకన్నా ఆనందం ఏముంటుంది?
మీవైపు నుంచి ఆలోచిస్తే మీరు చేసిన క్యారెక్టర్స్ మీకు కరెక్ట్‌గా అనిపించవచ్చు. కానీ గతంలో మీరు చేసిన కొన్ని సినిమాలు యంగ్‌స్టర్స్ చెడిపోయే విధంగా ఉన్నాయి. ఏమంటారు?
ఇలాంటి సినిమాలు స్టార్ట్ చేసిన మొదటి ఆర్టిస్ట్‌ని నేను కాదు కదా. సెక్స్ అన్నది ఎవరండి మొదలుపెట్టారు. షకీలాతో మొదలైందా? భూమి పుట్టినప్పటి నుంచి ఉంది కదండి. గ్లామర్ సినిమాలు నాతోనే మొదలయ్యాయా? అంతకుముందు లేవా? నా చిన్నప్పుడు నేను కూడా చూశాను. ఇప్పుడు ఇంటర్నెట్ వచ్చాక కొన్ని చోట్ల ఎక్స్‌ట్రా డబ్బులు తీసుకొని అలాంటి సినిమాలు చూపించడంలేదా? నా తమ్ముడు చూశాడని తెలిసి, ఒక్కసారి తన్నాను కూడా? నేనేం ఓపెన్‌గా చూపించలేదు కదా. నేను న్యూడ్‌గా కనిపించానా? నేను మెసేజ్ ఇచ్చానని చెప్పి ఎవరినైనా మోసం చేశానా? ఇప్పుడు నేనలాంటి సినిమాలు చేస్తున్నానా? మరి.. యూట్యూబ్‌లో ఎన్నో ఉన్నాయి. చాలా దరిద్రంగా ఉన్నాయి. నేను యంగ్‌స్టర్స్‌ని చెడగొట్టానని ఎలా అనగలరు? నేను నా కోసం చేసుకున్నాను. నా ఖర్మ ఏంటంటే నాకన్నీ అలాంటి సినిమాలే ఇచ్చారు. నాకు సినిమాకు లక్ష రూపాయలు ఇస్తుంటే మా అమ్మానాన్న గురించి స్వార్థంగా ఆలోచించాను తప్పితే సమాజం గురించి ఆలోచించే పరిస్థితిలో లేను. నా కడుపు నింపుకుని, మావాళ్ల కడుపు నింపాలనుకున్నాను.
కష్టాలు పోగొట్టుకోవడానికి ‘శృంగార తార’ అని పేరు తెచ్చుకునే క్యారెక్టర్స్ చేయాల్సిన అవసరంలేదు కదా.. వేరే పాత్రలు చేసి ఉండొచ్చేమో?
ఫస్ట్ మూవీ ‘ప్లే గర్ల్స్’ చేసినప్పుడు నేను టీనేజ్‌లో ఉన్నాను. ఆ సినిమా పేరు, నా క్యారెక్టర్ నాకు చెప్పలేదు. సిల్క్ స్మిత చెల్లెలి క్యారెక్టర్ చేయించారు. ఫలానా క్యారెక్టర్ చేస్తే కెరీర్ ఇలా టర్న్ అవుతుంది, ఇలాంటి ఇమేజ్ వస్తుందని ఊహించేంత వయసు లేదు. పరిస్థితులూ ఆలోచించనివ్వలేదు. అమ్మానాన్న చేయమన్నారు. చేశాను.
శరీరాన్ని బయటపెట్టే దుస్తులు వేసుకుని నలుగురిలో నటించడం, శృంగార సన్నివేశాలు చేయడం బిడియం అనిపించలేదా?
ఇలా చెబితే ‘ఛ.. నిజమా?’ అని నమ్మరేమో. నాకిప్పటికీ సిగ్గేనండి. శరీరాన్ని ప్రదర్శించాలని ఏ ఆడదీ అనుకోదు. నా దురదృష్టమో ఏమో నాకలాంటి చాన్సులే వచ్చాయి. అందుకే నేను సెకండ్ టేక్ తీసుకోను. ఒకేసారితో సీన్ బాగా చేసేస్తే ‘పీడ వదిలిపోతుంది’ అనుకుంటూ కెమెరా ముందుకెళ్లేదాన్ని. ఒక్క టేక్‌లో చేయడం కోసం నేను గంటలు గంటలు ప్రాక్టీస్ చేసే దాన్ని. రెస్ట్ ఉండేది కాదు. నేను పని చేసిన డైరెక్టర్స్, కెమెరామేన్ ఎవరినైనా అడగండి.. నా లైఫ్‌లో నేను రెండో తీసుకున్నానా? అని.
దేవుడి మీద కోపంగా ఉందా?
అప్పుడప్పుడు. ఈ ప్రపంచంలో నాకున్న ఏకైక బంధువు ఆ దేవుడే. అందుకే కోపం, ప్రేమ.. రెండూ తన పైనే. ‘నన్ను చూసుకో దేవుడా’ అని మొరపెట్టుకుంటుంటాను.
ఇలాంటి ప్రొఫెషన్ ఇచ్చినందుకేనా దేవుడంటే కోపం?
ఆ విషయంలో దేవుడి మీద కోపం లేదండి. నేను డాక్టర్ అయినా కూడా నంబర్ వన్ డాక్టర్ అయ్యుండేదాన్నేమో. నేనేం చేసినా నంబర్ వన్‌గా ఉండాలని ముందే బలంగా మైండ్‌లో ఫిక్స్ అయ్యాను. నాకు డబ్బు కావాలి. పాపులార్టీ కావాలి. ఈ రెండూ సంపాదించుకోవడం కోసం ఆ దేవుడు ఒక రూట్ ఇచ్చాడు. దానికి నేను చాలా హ్యాపీ. నా బాధంతా ఫ్యామిలీ కోసం ఇంత చేశామే, వాళ్లెందుకు నన్ను ఓన్ చేసుకోలేదని. ‘షకీలా ఏం తప్పు చేసింది’ అని వాళ్ల కళ్లు ఆ దేవుడు తెరిపించలేదు ఎందుకు? అనుకుంటాను.
– డి.జి. భవాని
Comments
Please login to add a commentAdd a comment