
ప్రతిభ ఉంది.. గుర్తింపు లభించింది. ఉత్సాహం ఉంది.. ప్రోత్సాహం దొరికింది. లక్ష్యం ఉంది.. రాణింపునకు కొదవేముంది?!
నిరుపేద కుటుంబంలో పుట్టి.. తల్లిదండ్రులు, గురువుల ప్రోత్సాహంతో గ్రామీణ క్రికెట్ స్థాయి నుంచి అంచెలంచెలుగా ఎదిగి, ఏపీ మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్‌గా వ్యవహరిస్తూ, తాజాగా ఇండియా రెడ్ జట్టుకు ఎంపికయ్యారు కర్నూలు జిల్లా కోడుమూరుకు చెందిన అనూష. అనూష తండ్రి వెంకటేష్ టీ దుకాణం నడుపుతుండగా, తల్లి లక్ష్మీదేవి ఇంటి పని చూసుకుంటోంది. అనూష నాల్గవ తరగతి చదువుతుండగా కోడుమూరు మహిళా క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు డా.ఎ.రçఘురామిరెడ్డి అనూషలో క్రికెట్ పట్ల ఉన్న పట్టుదలను, ఉత్సాహాన్ని గమనించి శిక్షణ ఇచ్చారు. అనుకున్నట్లుగానే అనూష క్రికెట్‌లో రాణిస్తూ జిల్లా, రాష్ట్ర, దేశ స్థాయి క్రికెట్ పోటీల్లో అత్యద్భుతంగా రాణిస్తూ నేడు అండర్–23, సీనియర్ ఆంధ్ర మహిళా క్రికెట్ జట్లకు కెప్టెన్‌గా వ్యవహరిస్తూ ఇండియన్ రెడ్ జట్టుకు ఎంపికయ్యారు. క్రికెట్‌తో పాటు చదువును బాగా ఇష్టపడే అనూష కోడుమూరు సాయిరాం డిగ్రీ కళాశాలలో ప్రస్తుతం బీకామ్ సెకండియర్ చదువుతున్నారు. తన కూతురు దేశం తరపున ఆడితే చూడాలన్నదే నా కోరిక అని అనూష తండ్రి వెంకటేష్ అన్నారు. అందుకోసం ఎంత కష్టాన్నైనా భరిస్తానన్నారు. టీ దుకాణం నడుపుకుంటూ అందులో వచ్చే సంపాదనతోనే కుటుంబాన్ని పోషించుకుంటూ రెండవ కుమార్తె అయిన అనూష క్రికెట్‌లో రాణించేలా ప్రోత్సహిస్తున్నారు. ఆయన ఆశ, ఆకాంక్షల మేరకు అనూష కూడా ఇండియా మహిళా క్రికెట్ జట్టు తరపున ఆడాలన్న లక్ష్యంతోనే ముందుకు సాగుతున్నారు. ‘‘చిన్నప్పటి నుంచి క్రికెట్‌నే జీవితంగా భావించి ఆడుతున్నా. క్రికెట్ పరంగా, చదువుపరంగా నన్ను అన్ని విధాలా ప్రోత్సహిస్తున్న తల్లిదండ్రులు, మహిళా క్రికెట్ అసోసియేషన్ సభ్యుల సహకారం మరువలేనిది’’ అని అనూష అన్నారు.
– హంపిరెడ్డి, ‘సాక్షి’, కోడుమూరు రూరల్
అనూష అత్యధిక స్కోర్లు
అండర్ 16, అండర్ 19, రంజీ ట్రోఫీ, ఇండియన్ రైల్వేస్, రంజీ నుంచి సీనియర్ సౌత్ ఇండియా జట్టు, ఇండియా గ్రీన్ జట్ల తరపున ఆడిన అనూష ప్రతి ఈవెంట్‌లోనూ అత్యధిక పరుగులు సాధించి జట్టు విజయాల్లో కీలకపాత్ర పోషించింది. అండర్ 16 పోటీల్లో భాగంగా గోవా జట్టుపై 105 పరుగులు తీసింది. మహిళల అండర్ 19 సౌత్ జోన్ లీగ్ టోర్నమెంట్‌లో తమిళనాడు జట్టుపై 168 పరుగుల నాటౌట్, తొలి వికెట్‌కు మరో ఓపెనర్‌తో కలిసి 50 ఓవర్లలో 302 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పి జాతీయ రికార్డు సృష్టించింది. అండర్ 23 పోటీల్లో హైదరాబాద్ జట్టుపై 100 పరుగులు నమోదు చేసింది. జార్ఖండ్‌లో జరిగిన అండర్ 19 జాతీయ స్థాయి పోటీల్లో హర్యానాపై 124 పరుగులు, ఉత్తరప్రదేశ్‌పై 84పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచింది. 2017 సంవత్సరంలో అండర్ 23 ఏపీ జట్టు తరపున గోవా జట్టుపై 115 పరుగులు, తమిళనాడు జట్టుపై 47 పరుగులు సాధించి జట్టును గెలిపించింది. సీనియర్ విభాగంలో ఏపీ జట్టు తరపున హిమాచల్‌ప్రదేశ్ జట్టుపై 65 పరుగులు చేసి జట్టు విజయానికి తోడ్పడింది.
ఉత్సాహాన్ని గమనించాను
చిన్నప్పుడు అనూషలో క్రికెట్‌పై ఉన్న ఇష్టాన్ని ఉత్సాహాన్ని చూసి ప్రోత్సహించా. రోజుకు ఐదు నుంచి ఆరు గంటల పాటు మైదానంలో కష్టపడి క్రికెట్ ప్రాక్టీస్ చేసేది. సాధన చేస్తే ఏదైనా సాధించవచ్చు అనే తత్వం అనూషలో చూశా. అనుకున్నట్లుగా క్రికెట్‌లో అద్భుతంగా రాణిస్తూ అనూష అంచెలంచెలుగా ఎదిగి నేడు ఆంధ్ర జట్టు కెప్టెన్‌గా వ్యవహరిస్తూ, ఇండియా రెడ్ జట్టుకు ఎంపికైంది.
– డా. రఘురామిరెడ్డి,మహిళా క్రికెట్ తాలూకా అసోసియేషన్
అధ్యక్షుడు, కోడుమూరు
Comments
Please login to add a commentAdd a comment