ఆత్మహత్యాయత్నం నేరం. ఆత్మహత్యను ఆపే ప్రయత్నం చేయకపోవడం కూడా నేరమే. మనకు తెలిసినవాళ్లెవరైనా ఆత్మహత్య చేసుకోబోతున్నారనిమనకు తెలిపినా.. మనకు తెలిసినాఆపకపోవడం, ఆపలేకపోతే.. వెంటనే పోలీసులకు చెప్పకపోవడం‘అబెట్‌మెంట్’ టు సూయిసైడ్ అవొచ్చు.అంటే.. ఆత్మహత్యకు ప్రేరేపించడం. అబెట్‌మెంట్‌కు కూడా శిక్ష.. ఉంటుందని తెలుసుకోండి.
ఆత్మహత్యా యత్నానికి శిక్ష ఉన్నట్లే, ఆత్మహత్యను ప్రేరేపించినందుకూ భారతీయ శిక్షాస్మృతిలో శిక్ష ఉంది. ఆత్మహత్యకు ప్రేరేపించడాన్ని ‘అబెట్‌మెంట్’ అంటారు. సెక్షన్ 306 ప్రకారం అబెట్‌మెంట్‌కు గరిష్టంగా పదేళ్ల జైలు శిక్ష పడుతుంది. భార్య సునందా పుష్కర్ ఆత్మహత్య కేసులో ఆమె భర్త శశిథరూర్‌పై ఢిల్లీ పోలీసులు తాజాగా 498ఎ కేసుతో పాటు, ‘అబెట్‌మెంట్’ కేసూ పెట్టారు. జూలై 7న థరూర్ ఢిల్లీలోని పాటియాలా హౌస్ కోర్టుకు ఉదయం పది గంటలకు హాజరు కావాలి.
కొట్టానా! తిట్టానా?!
కానీ.. ‘‘నేను అమాయకుడిని’’ అంటున్నారు థరూర్. ‘‘కొట్టానా! తిట్టానా! తను ఆత్మహత్య చేసుకుంటే నా తప్పెలా అవుతుంది? అందుకు నేనెలా కారణం అవుతాను’’ అని థరూర్ వాదిస్తున్నారు. ఆయనకు మద్దతుగా మరి కొందరు వాదిస్తున్నారు. అసలు ఆ పాత విక్టోరియన్ కాలం నాటి సెక్షన్‌నే మార్చిపడేయాలని అంటున్నారు. ‘‘నువ్వు దూకు.. అంటే దూకేస్తారా? ట్రిగ్గర్ మీద వేలు పెట్టి నొక్కు అంటే నొక్కేస్తారా? చచ్చిపో అంటే చచ్చిపోతారా? భార్య ఆత్మహత్య చేసుకుంటే.. భర్తెలా దానికి కారణం అవుతాడు? మానవ సంబంధాల్లోని క్షణికావేశాల పర్యవసానాలకు కోర్టులు తీర్పులు చెప్పడం ఏంటి?’’ అని థరూర్‌ని సమర్థించేవారు ప్రశ్నిస్తున్నారు.
అమాయకత్వం కూడానా!
నిజమే. థరూర్ అమాయకుడే. భార్య ఫీలింగ్స్‌ని గమనించలేనంత అమాయకుడే. భార్య చనిపోతుందేమోనని ఊహించలేనంత అమాయకుడే. ‘నాకు బతకాలని లేదు’ అని సునంద తన చివరి ఈమెయిల్‌లో చెప్పినా, సీరియస్‌గా తీసుకోనంత అమాయకుడే. ఈ అమాయకత్వం కారణంగానే సునందను రక్షించుకోలేక (రక్షించలేక) పోయాడు కాబట్టి అతడి అమాయకత్వాన్ని కూడా చట్టం అబెట్‌మెంట్‌గా పరిగణిస్తుంది. థరూర్ తన భార్యను హింసించలేదంటున్నాడు. నిజంగానే హింసించలేదనుకుందాం. కనీసం తిట్టనైనా తిట్టలేదంటున్నాడు. నిజంగానే తిట్టలేదనుకుందాం. హింసంటే కొట్టడమూ, తిట్టడమేనా?! మౌనంతో కూడా రాచిరంపానపెట్టే మృదుస్వభావులు మనలో ఎంతమంది లేరు?!
భార్యాభర్తలకే కాదు...
ఐపీసీ 306 కేవలం భార్యాభర్తలకు మాత్రమే ఉద్దేశించిన సెక్షన్ కాదు. ఒక వ్యక్తి ఎవరైనా ఇంకో వ్యక్తిని ఆత్మహత్యకు ప్రేరేపిస్తే ఈ సెక్షన్ పరిధిలోకి వస్తారు. థరూర్ ‘అబెట్‌మెంట్’పై డిబేట్ పెట్టిన రిపబ్లిక్ టీవీ ఎడిటర్–ఇన్–చీఫ్ ఆర్ణబ్ గోస్వామి మీద కూడా అబెట్‌మెంట్ కేసు ఉంది. ఆర్ణబ్ భాగస్వామిగా ఉన్న ఓ సంస్థ తమకు చెల్లించవలసిన ఐదున్నర కోట్ల రూపాయల బకాయీలను ఎగవేసిందని నోట్ రాసి 53 ఏళ్ల ఇంటీరియర్ డిజైనర్, ఆమె తల్లి ఆత్మహత్య చేసుకోవడంతో పోలీసులు ఆర్ణబ్‌పై అబెట్‌మెంట్ కేసు నమోదు చేశారు. రెండేళ్ల క్రితం టీవీ నటి ప్రత్యూషా బెనర్జీ ఆత్మహత్య చేసుకున్న కేసులో ఆమె బాయ్‌ఫ్రెండ్ రాజ్ సింగ్‌ని కూడా ఇదే సెక్షన్ కింద ముంబై పోలీసులు అరెస్ట్ చేశారు. ‘నిషాద్’ చిత్రంలో అమితాబ్‌తో కలిసి నటించిన జియాఖాన్ 2013 నాటి ఆత్మహత్య ఘటనలో ఆమె బాయ్‌ఫ్రెండ్ సూరజ్ పాంచాలీపై అబెట్‌మెంట్ కేసింకా విచారణలో ఉంది. ప్రతి ఆత్మహత్య వెనుక ఒక ఆవేదన ఉన్నట్లే.. ఆ ఆవేదన వెనుక ఒక కారణం ఉంటుంది. ఆ కారణం ఒక మనిషే కనుకైతే అబెట్‌మెంట్ కింద అతడు దోషి అవుతాడు. శశిథరూర్ ప్రస్తుతానికైతే నిందితుడు.
ముచ్చటైన జంట. పచ్చని కాపురం. శశి (థరూర్) అందగాడు. సంస్కారవంతుడు. కేరళ నాయర్‌ల అబ్బాయి. లండన్‌లో పుట్టాడు. పెద్ద చదువులు, పెద్దపెద్ద పదవులు. ఈ 62 ఏళ్ల వయసులోనూ యంగ్‌గా కనిపిస్తారు. తిరువనంతపురం కాంగ్రెస్ ఎంపీ. సునంద (పుష్కర్) అందగత్తె. ఆయన కన్నా ఆరేళ్లు చిన్న. కశ్మీరీ పండిట్‌ల అమ్మాయి. ఈవెంట్ మేనేజర్. బిజినెస్ ఉమన్. సునంద శశికి మూడో భార్య. శశి సునందకు మూడో భర్త. మొదటి భార్య తిలోత్తమకు, రెండో భార్య క్రిస్టా గైల్స్‌కు శశి విడాకులు ఇచ్చాక; మొదటి భర్త సంజయ్ రైనాకు, రెండో భర్త సుజీత్ మీనన్‌కు సునంద విడాకులు ఇచ్చాక 2010లో శశి, సునందల పెళ్లి జరిగింది. నాలుగేళ్లు కలిసున్నారు. శశి జీవితంలోకి నాలుగో స్త్రీ ప్రవేశిస్తుండగా సునంద శశితో బాగా గొడవపడ్డారు. ఆ నాలుగో స్త్రీ పాకిస్తాన్ జర్నలిస్టు మెహర్ తరార్.
ఆత్మహత్యపై అనుమానాలు
గొడవపడిన మర్నాడే, 2014 జనవరి 17న న్యూఢిల్లీ చాణక్యపురిలోని లీలాప్యాలెస్ హోటల్ రూమ్ నెంబర్ 345లో బెడ్ మీద సునంద డెడ్‌బాడీ పడి ఉంది. సొంతింటికి పెయింట్లు వేయిస్తున్న ఈ జంట, ఆ పని పూర్తయ్యేవరకు ఉండడం కోసం హోటల్‌లో గది అద్దెకు తీసుకుంది. సునంద మృతదేహాన్ని శశి థరూర్ ఆ సాయంత్రం వరకు గమనించనేలేదు! పోస్టుమార్టమ్‌లో సునందది ఆత్మహత్య అని తేలింది. ‘ఎయిమ్స్’ డాక్టర్లు ఆమె దేహం మీద గాయాలున్నట్లు రిపోర్ట్‌లో రాశారు. అయితే ఆ గాయాల వల్లే ఆమె చనిపోయిందని చెప్పలేం అని కూడా రాశారు. సునంద మృతదేహాన్ని దక్షిణ ఢిల్లీలోని లోథీ శ్మశాన వాటికలో దహనం చేశారు. కానీ ఆమె మరణంపై ఉన్న అనుమానాలు ఆమెతో పాటు దహనమైపోలేదు!
రాంగ్ రిపోర్ట్ కోసం ఒత్తిడి!
సునంద చనిపోడానికి కొద్దిరోజుల ముందు ఆమెకు సాధారణ వైద్య పరీక్షలు జరిపిన త్రివేండ్రంలోని కిమ్స్ ఆసుపత్రి వైద్యులు సునందకు ఎలాంటి ఆరోగ్య సమస్యలూ లేవని ప్రకటించడంతో ఆమె మరణంపై అనుమానాలకు మరింత బలం చేకూరింది. అదొక్కటే కాదు. చనిపోడానికి ముందు సునంద తన ఆత్మహత్య గురించి హింట్ ఇచ్చారన్న విషయం బయటపడింది! తర్వాత 2014 జూలై 1న ‘ఎయిమ్స్’ డాక్టర్ సుధీర్ గుప్తా బయటపడ్డారు. తప్పుడు వైద్య నివేదిక ఇవ్వవలసిందిగా తన మీద తీవ్రమైన ఒత్తిడి వచ్చిందని ఆయన వెల్లడించారు.
పనిమనిషికి కొంత తెలుసు
సునంద మరణంపై దర్యాప్తు జరుపుతున్న వైద్య బృందం ఒకటి విష ప్రయోగం వల్లనే సునంద చనిపోయిందని అక్టోబర్ 10న నిర్థారించింది! ఢిల్లీ పోలీసులు దీనిని హత్యకేసుగా ఎఫ్.ఐ.ఆర్. నమోదు చేసుకున్నారు. సునంద పనిమనిషి కూడా సాక్ష్యం ఇచ్చింది. ‘హత్య’కు కొద్దిరోజుల ముందు సునంద శశితో పెద్దగా గొడవ పెట్టుకున్నారట. ‘అన్నీ బయటికి చెప్పేస్తాను. నీ పని ఫినిష్ అవుతుంది’ అని భర్తను దారికి తెచ్చే ప్రయత్నం చేశారట. చివరికి వేళ్లన్నీ శశివైపు తిరిగాయి. నాలుగేళ్ల దర్యాప్తు తర్వాత ఈ మే నెలలో శశిపై చార్జిషీటు నమోదు అయింది. మాటలతో, చేతలతో హింసించడం ద్వారా భార్య ఆత్మహత్యకు ప్రేరకుడు అయ్యాడన్నది అతడిపై అభియోగం.
Comments
Please login to add a commentAdd a comment