హిందీ నేర్పలేక టీచర్లు పారిపోయారు.. | Special Story on Telangana New Governor Tamilisai | Sakshi
Sakshi News home page

గవర్నరమ్మ

Published Wed, Sep 4 2019 7:09 AM | Last Updated on Wed, Sep 4 2019 1:33 PM

Special Story on Telangana New Governor Tamilisai - Sakshi

తెలంగాణ కొత్త గవర్నర్‌ తమిళిసై

తమిళనాట సూర్యుడు ఉదయిస్తాడో లేదోగానీ.. తామర వికసిస్తుంది’. ఇది ఆమె ఎప్పుడూ భావోద్వేగంగా చెప్పే మాట. ఆ మాట ఆమెను గేలిచేసేలా, హేళనకు గురయ్యేలా చేసింది. ఇక ఆమె చింపిరి తలకట్టుపై
ఒక కామెంట్‌ కాదు. సామాజికమాధ్యమాలలో ఎన్నో అవమానాలు, ఛీత్కారాలు! అయినా తాను నమ్మిన సిద్దాంతం.. పార్టీ ఆమెను గుర్తించేలా చేసింది. ఆమెను ఎవరూ ఊహించనిఅందలానికి ఎక్కించింది.  తమిళ నాడు రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలిగా ఉండి.. ప్రస్తుతం తెలంగాణ గవర్నర్‌గా నియమితురాలైన ఆమే.. తమిళిసై సౌందర్రాజన్‌. వైద్యురాలిగా.. సాహితీవేత్తగా.. రాజకీయనేతగా తమిళిసైది వెన్నుచూపని మార్గం. తమిళ రాజకీయాల్లో తలపండిన వారుఎందరు ఉన్నా.. ఆమెలోని సంకల్పబలమే ఆమెను ఈ స్థాయికి చేర్చింది.

వద్దన్నా పాలిటిక్స్‌లోకి!
తమిళిసై తండ్రి కుమరి అనంతన్‌ గాంధేయవాది. జాతీయ కాంగ్రెస్‌లో సీనియర్‌ నేత. తమిళనాట కాంగ్రెస్‌కు డెబ్భైలలో ప్రచార ఫిరంగిగా  ఆయనకు పేరుంది. అదే తమిళిసైకి రాజకీయ వారసత్వంగా వచ్చింది. అయితే అనంతన్‌కు వారసత్వ రాజకీయాలు నచ్చవు. అందుకే తన కుటుంబం రాజకీయాల్లో రాదని కరాకండిగా తేల్చేశాడు. కూతురు రాజకీయాల్లోకి వస్తానంటే అదేమాట చెప్పేశాడు. అయినా తన రాజకీయ సభలకు, చట్టసభలకు కావాల్సిన కొన్ని నోట్స్‌ తమిళిసైతోనే రాయించుకునేవాడు. అదే ఆమెకు రాజకీయాల్లోకి రావటానికి పునాది వేసింది. తండ్రిలోని వాక్పటిమ, నాయకుడిగా ప్రజల్లో మమేకమయ్యే తీరు ఆమెను రాజకీయాల్లోకి వచ్చేలా చేసింది.

భర్తతో తమిళిసై
‘పెద్దల్ని’ కలిపిన పెళ్లి
తమిళిసై కన్యాకుమారి జిల్లా నాగర్‌ కోయిల్‌లో పుట్టింది. ఆమెను డాక్టర్‌ను చేయాలన్నది తల్లిదండ్రుల కోరిక. వారి కోరిక మేరకే మద్రాసు మెడికల్‌ కాలేజిలో ఆమె వైద్య విద్య అభ్యసించారు. వైద్య విద్య రెండవ ఏడాదిలో ఆమెకు అక్కడే వైద్యుడిగా ఉన్న డాక్టర్‌ సౌందర్రాజన్‌తో వివాహం జరిగింది. ఆమె వివాహం తమిళనాట ఓ సంచలనం. కారణం.. ఆమె తండ్రి అనంతన్‌పై ఉన్న గౌరవంతో అప్పటి ముఖ్యమంత్రి ఎంజీఆర్‌ తోపాటు ప్రతిపక్ష నేత కరుణానిధి, మాజీ ముఖ్యమంత్రి భక్తవత్సలం వంటి హేమాహేమీలు హాజరయ్యారు. ఇందులో మరొక విశేషం ఉంది. రాజకీయంగా విరోధులుగా మారిన ఎంజీఆర్, కరుణానిధిలు పదేళ్ల తర్వాత తొలిసారిగా  ఈ వివాహంలో కలుసుకోవటమే కాకుండా కరుణానిధి నేరుగా ఎంజీఆర్‌ పక్కనే కూర్చుని స్నేహితుడి యోగక్షేమాలు తెలుసుకున్నారు! పెళ్లిలో ముందుగా మాట్లాడిన కరుణానిధి ‘తమిళనాట తమిళ శబ్ధం వినపడుతుందా అని ఎదురు చూస్తున్న రోజుల్లో కుమరి అనంతన్‌ తన కుమార్తెకు తమిళ్‌ ఇసై.. అంటే తమిళ సంగీతం అంటూ పేరు పెట్టడం ఆమె గురించి రాష్ట్రవ్యాప్తంగా తెలిసేలా చేసింది’ అన్నారు.  ఎంజీఆర్‌ మాట్లాడుతూ.. తమిళిసైను చూస్తుంటే చిన్న పిల్లలా కనిపిస్తున్నా ఏదో రోజు దేశంలోనే పెద్ద పేరు తెచ్చుకుంటుందని ఆకాంక్షించారు.

తొలి అడుగు కన్యాకుమారి
1996లో జరిగిన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు తమిళిసై రాజకీయ ప్రవేశానికి దారి తీశాయనే చెప్పాలి. ఆమె తన తండ్రి కోసం కన్యాకుమారిలో ఎన్నికల ప్రచారానికి వెళ్లినప్పుడు అక్కడి నుండి బీజేపీ తరపున పోటీ చేస్తున్న పొన్‌.రాధాకృష్ణన్‌ ప్రచారాన్ని ఆమె చూడటం జరిగింది. ఆయన కోసం బీజేపీ నేతలు, ఆర్‌ఎస్‌ఎస్‌ వర్గాలు కన్యాకుమారిలో ప్రచారం చేయటం, వారి ప్రచార సరళి ఆమెను ఆకట్టుకున్నాయి. ఆ తర్వాత తమిళిసై తంజావూరులో హౌస్‌ సర్జన్‌ చేస్తుండటం, అక్కడి హాస్పిటల్‌ లోని వార్డుబాయ్, ఆర్‌ఎస్‌ఎస్‌ కార్యకర్త వాజ్‌పేయి గురించి చెప్పటం ఆమెను బీజేపీ వైపు మొగ్గుచూపేలా చేశాయి. వాజ్‌పేయి ప్రసంగాలూ ఆమెపై ప్రభావం చూపాయి. ప్రధానంగా ఆయన  ప్రసంగంలోని ‘మతం కన్నా మానవత్వం మిన్న’ అనే నినాదం ఆమెను పూర్తిస్థాయి రాజకీయాల్లోకి వచ్చేలా చేసింది. అప్పుడే వాజ్‌పేయి ప్రధాని కావటం, కేవలం పదమూడు రోజులే ఆయన పదవిలో ఉండటం, ప్రభుత్వం కూలిపోవడం వంటి సంఘటనలు ఆమెను బీజేపీలో కార్యకర్తగా చేరేలా చేశాయి. అలా రాజకీయంగా ఆమె ఒక్కో మెట్టూ ఎక్కారు.

నేనా.. పాడనా పాటా..!
తమిళిసైకి కర్నాటక సంగీతం ఇష్టం. వీణ వాయిస్తారు. నిశ్చితార్థం తర్వాత కాలేజ్‌లో జరిగిన కార్యక్రమంలో తమిళిసై పాడిన ఓ పాటంటే సౌందర్రాజన్‌కు చాలా ఇష్టం. ఇప్పటికీ అడిగి మరీ ఆ పాటను పాడించుకుంటారు. తమిళిసైకి వంటరాదు. కనీసం టీ కూడా చేయలేదు! పెళ్లయిన కొత్తలో పుస్తకాలు చూసి వంటచేయటం భరించలేక ఆమెతో వంట మాన్పించారని ఆమె భర్త నవ్వుతూ చెబుతారు. ‘‘అదొక్కటే కాదు.. తమిళిసైకి  హిందీ నేర్పలేక ఆరుగురు టీచర్లు పారిపోయారు’ అని  సౌందర్రాజన్‌ సరదాగా అన్నారు. తమిళిసై ఎంత ఎత్తుకు ఎదిగినా రోజుకు కనీసం ఓ గంటైనా వైద్య సేవలు అందించాలన్నది సౌందర్రాజన్‌ కోరిక. ఇక ఆమె డ్రెస్, హెయిర్‌ స్టైల్‌ అంతా కుమార్తె సూచనలే. ఆరంభంలో దూరదర్శన్, రాజ్‌ టీవీలో డిబేట్స్‌ నిర్వహించిన తమిళిసై అనర్గళంగా మాట్లాడగలరు. పదవులు ఉన్నా, లేకపోయినా తనపై విమర్శలు వచ్చినా వివాదాస్పద విషయాలైనా నిర్మొహమాటంగా, నిక్కచ్చిగా మీడియా ముందు మాట్లాడేయడం ఆమె ప్రత్యేకత.

కనిమొళిపైనే పోటీ!
తమిళిసై చట్టసభల్లో గెలుపెరగని నేత. అయినా నిరాశ చెందని ఉక్కు మహిళగా పేరొందారు. తమిళ శాసనసభకు మూడుసార్లు, లోక్‌సభకు రెండుసార్లు పోటీ చేసి పరాజయం పాలయ్యారు. అయితే 2019 సార్వత్రిక ఎన్నికల్లో తూత్తుకుడి నుండి డిఎంకె సీనియర్‌ నేత కనిమొళిపై పోటీ చేయటం, ఓటమిపాలైనా రెండవస్థానంలో నిలవటం తమిళిసై సత్తాను చాటేలా చేసింది.

పేదల డాక్టర్‌
ఒకే కాలేజ్‌లో పరిచయం అయినా తమిళిసైది పెద్దలు కుదిర్చిన వివాహమే. భర్త, ఇద్దరు పిల్లలు. కుమారుడు సుగంధన్, కుమార్తె పూవినీ.. ఇదీ తమిళిసై కుటుంబం. ఇంట్లో ఐదుగురు వైద్యులున్నారు. కొడుకు, కోడలు, కూతురు కూడా వైద్యులే. తమిళిసై వైద్యురాలిగా ఐదేళ్ల పాటు చెన్నైలోని ఎస్‌ఆర్‌ఎంసీలో సేవలు అందించిన అనంతరం పలు కళాశాలలకు ప్రొఫెసర్‌గా పనిచేశారు. తమిళిసై అల్ట్రాసౌండ్‌ స్కాన్‌ లో నిష్ణాతురాలు. తన నివాసంలోనే డయాలసిస్‌ విభాగాన్ని ఏర్పాటు చేసి కొందరికి ఉచితంగా, మరికొందరికీ కేవలం రెండు వందల రూపాయలకే డయాలసిస్‌ సేవలు అందించి స్థానికంగా పేదల డాక్టర్‌ అనే పేరు తెచ్చుకున్నారు.

మిస్డ్‌ కాల్‌ ఐడియా తనదే
బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలిగా పార్టీని బలోపేతం చేసే క్రమంలో తమిళిసై చేసిన కోటి మంది సభ్యత్వ నమోదు కార్యక్రమం రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం రేపింది. ఒక్క మిస్డ్‌ కాల్‌ తో పార్టీ సభ్యత్వం అంటూ ఆమె ప్రవేశపెట్టిన కొత్త మార్గం రాష్ట్రంలోని యువతను ఆకట్టుకునేలా చేసింది. అప్పుడే.. ‘సూర్యుడు ఉదయిస్తాడో లేదో కాని తమిళనాట తామర వికసిస్తుంది’ అంటూ ఆమె చేసే ప్రసంగాలపై, ఆమె జుట్టుపై సామాజిక మాధ్యమాలలో ఆమెపై హేళనగా సెటైర్లు పడ్డాయి. అయితే అవి ఆమె ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయలేకపోయాయి. ఈ క్రమంలో గత ఏడాది సరిగ్గా ఇదే నెలలో తూత్తుకుడి నుండి చెన్నై వస్తున్న విమానంలో జరిగిన ఓ సంఘటన తమిళిసై వైపు రాష్ట్రం తిరిగి చూసేలా చేసింది. ఆమె ప్రయాణిస్తున్న విమానంలోనే ఉన్న సోఫియా అనే యువతి తమిళిసైను చూడగానే ఫాసిస్ట్‌ బీజేపీ నశించాలంటూ నినదించింది. ఆ ఘటనతో మొదటిసారిగా తమిళనాడు ఆమెలోని ఆగ్రహాన్ని తలెత్తి చూసింది. విమానం చెన్నై ఎయిర్‌ పోర్ట్‌లో దిగగానే సోఫియాను పోలీసులు అరెస్టు చేయటం తమిళిసై సోఫియాపై కేసు నమోదు చేయటం ఒక్కసారిగా బీజేపీలో రాజకీయాల్ని వేడెక్కేలా చేశాయి. అదొక్కటే కాదు, గడిచిన నాలుగేళ్లుగా రాష్ట్రంలో బీజేపీని పటిష్టం చేయటంతోపాటు రజనీకాంత్, కమల్‌ హాసన్, సత్యరాజ్, సుబ్రమణ్యస్వామి, హెచ్‌.రాజా వంటి వారు కేంద్రప్రభుత్వంపై, బీజేపీపై చేసిన విమర్శలను ఆమె సమర్థంగా తిప్పికొడుతూ వచ్చారు.– సంజయ్‌ గుండ్ల, ప్రత్యేక ప్రతినిధిసాక్షి టీవీ, చెన్నై బ్యూరో

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement