
కథలున్నాయి.. కథలు లేకపోవడం ఏంటి? కానీ కథ హిట్టయితేనే కదా తీద్దామనుకుంటారు. హిట్ అవుతుందని ముందే తెలియాలి కదా తీయడానికి. ‘సపోజ్... ఫర్ సపోజ్’... ఇప్పుడు మేం 7 కథలు చెబుతాం. ఈ ఏడు కథలూ ఏడుగురు ప్రొడ్యూసర్లకి ఏడుగురు తెలుగు డైరెక్టర్లు చెబుతారనుకుందాం. ఒక్క చేప అయినా ఎండుతుందన్న నమ్మకం ఉంటుందంటారా? అందుకే చేప తెచ్చి ఎండబెట్టడం కంటే ఎండిన చేప తెచ్చుకుంటే రాజుగారు.. (అంటే ప్రొడ్యూసర్‌గారు) ‘‘చేపా చేపా ఎందుకు ఎండ లేదు’’ అని అడిగే ప్రసక్తే రాదు. తెలుగు కథకుల్లో ప్రతిభ లేక కాదు. ఆ ప్రతిభ కాంతికి చేప ఎండుతుందో లేదో అన్న నమ్మకం లేక పరభాష హిట్ సినిమాలు తెచ్చుకుని 7 రీమేకులు చేస్తున్నారు. స్ట్రయిటా, డబ్బింగా, రీమేకా అనేది కాదు. సినిమా బాగుంటే ఎవరూ ఎవర్నీ ఎండగట్టక్కర్లేదు. భాష ఏదైతేనేమి! హిట్ అవ్వడానికో గ్రామర్ ఉంటుంది. అదే హిట్ లాంగ్వేజ్.
త్రీ థ్రిల్లర్స్
గతేడాది తమిళంలో ఎన్నో వివాదాలు ఎదుర్కొని ఫైనల్లీ స్క్రీన్ మీదకొచ్చింది ‘మెర్సల్’. సూపర్ డూపర్ హిట్. తెలుగులో ‘అదిరింది’ పేరుతో అనువాదమై, టైటిల్‌కి తగ్గట్టే అనిపించుకుంది. విజయ్ హీరోగా అట్లీ దర్శకత్వం వహించిన సినిమా ఇది. అంతకు ముందు సంవత్సరం ఈ ఇద్దరి కాంబినేషన్‌లో వచ్చిన సినిమా ‘తేరి’. అంటే.. మెరుపు. స్పార్క్ అనీ, వివేకం అనీ.. ఇలా కొన్ని అర్థాలున్నాయి. ‘రాజా రాణి’ అనే మంచి లవ్ కమ్ రొమాంటిక్ మూవీతో దర్శకుడయ్యారు అట్లీ. ఆ వెంటనే ‘తేరి’లాంటి యాక్షన్ ఎంటర్‌టైనర్ తీశారు. మాస్ హీరో విజయ్‌కి తగ్గట్టే అట్లీ మంచి మాస్ స్టోరీ రెడీ చేశారు. కథ సింపుల్. చాలా సినిమాల్లో చూసిందే. సిన్సియర్ పోలీసాఫీసర్ తన డ్యూటీని బాధ్యతగా చేస్తుంటే భార్య, తల్లిని చంపేస్తారు. కూతురి కోసం అన్నీ వదిలేసి వేరే ఊరెళ్లిపోతాడు. అతను చనిపోయినట్లుగా కలరింగ్ ఇస్తాడు. కానీ, బతికున్న విషయం బయటపెట్టకుండా సంఘ విద్రోహ శక్తులను మట్టుబెడతాడు. ఈ కథకు అట్లీ ఇంట్రస్టింగ్ స్క్రీన్‌ప్లే రాసుకుని, తీశారు. సినిమాలో స్పార్క్ ఉందని, మంచి యాక్షన్ థ్రిల్లర్ అని ఆడియన్స్ కితాబులిచ్చేశారు. ఈ చిత్రం తెలుగులో రీమేక్ అవు తోంది. రవితేజ హీరోగా నటిస్తున్నారు. ‘కందిరీగ’ ఫేమ్ సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తున్నారు. విశేషం ఏంటంటే.. ‘తేరి’ సినిమా తెలుగులో ‘పోలీసోడు’గా అనువాదమైంది. జనాలు బాగానే చూశారు. మరి రీమేక్ ఎందుకు? అంటే.. మక్కీకి మక్కీ తీయడంలేదు. కథలో 70 శాతం మార్పులు చేశారట. ప్రస్తుతం ‘అమర్ అక్బర్ ఆంటోని, తేరి’ రీమేక్ రెండింటినీ ఒకేసారి చేస్తున్నారు రవితేజ. ఈ రెండు సినిమాలను మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు.
ఇక, తమిళం నుంచి తెలుగుకి రాబోతున్న మరో మూవీ ‘కణిదన్’ కూడా యాక్షన్ థ్రిల్లరే. అప్‌కమింగ్ హీరో, ‘హృదయం’ ఫేమ్ మురళి తనయుడు అథర్వ హీరో. కణిదన్ అంటే గణిత శాస్త్ర నిపుణుడు అని అర్థం. అయితే సినిమాలో హీరోకి, మ్యాథ్స్‌కి సంబంధం ఉండదు. అతను జర్నలిస్ట్. కాకపోతే శత్రువుల లెక్కని తెలివిగా తేల్చుతాడు. ఓ చిన్న టీవీ చానల్‌లో రిపోర్టర్‌గా చేసే హీరోకి బీబీసీ వంటి పెద్ద చానల్‌లో ఉద్యోగం దక్కించుకోవాలనే ఆరాటం ఉంటుంది. ఆ టైమ్ వచ్చినప్పుడు లైఫ్ వేరే టర్నింగ్ తీసుకుంటుంది. నకిలీ పత్రాలు సృష్టించి, చదువు కోసం బ్యాంక్ లోన్ తీసుకున్నావ్ అంటూ పోలీసులు అరెస్ట్ చేస్తారు. బెయిల్ మీద బయటకు వచ్చి, నకిలీ పత్రాల ముఠా లెక్కలు తేల్చుతాడు హీరో. ఈ యాక్షన్ థ్రిల్లర్ తెలుగులో ‘ముద్ర’గా రీమేక్ అవుతోంది. ఇందులో నిఖిల్ హీరో. తెలుగు ఆడియన్స్ టేస్ట్‌కి తగ్గట్టుగా పలు మార్పులు చేసి, ‘ముద్ర’ తీస్తున్నారు. తమిళ మాతృక దర్శకుడు టి.ఎన్. సంతోష్ దర్శకత్వంలో ‘ఠాగూర్’ మధు నిర్మిస్తున్నారు. నిఖిల్, లావణ్యా త్రిపాఠీ తొలిసారి జంటగా నటిస్తున్న సినిమా ఇది. తెలుగులో రీమేక్ అయిన మరో తమిళ చిత్రం ‘సదురంగ వేటై్ట’. అంటే... చెస్ అన్నమాట. ఎత్తులకు పై ఎత్తులు వేస్తూ.. అందర్నీ మోసం చేస్తాడు హీరో. డబ్బు తప్ప హీరోకి మరో ధ్యాస ఉండదు. పెద్ద పెద్ద స్కామ్‌లను అవలీలగా చేసేస్తాడు. చివరికి ప్రేయసిని కూడా మోసం చేసేస్తాడు. అయితే కొందరు వ్యక్తులు అతనిపై దాడి చేయడంతో మోసానికి గురైన ప్రేయసి ఆదుకుంటుంది. ఆమెను పెళ్లి చేసుకుంటాడు. ఫైనల్లీ లైఫ్ అంటే మనీ మాత్రమే కాదు... మెనీ థింగ్స్ ఉన్నాయని తెలుసుకుంటాడు. ‘జ్యోతిలక్ష్మి’ ఫేమ్ సత్యదేవ్ హీరోగా తెలుగులో ఈ చిత్రం ‘బ్లఫ్ మాస్టర్’ పేరుతో రీమేక్ అయింది. గోపీ గణేశ్ పట్టాభి దర్శకత్వంలో రమేశ్ పిళ్లై నిర్మించిన ఈ సినిమా వచ్చే నెల రిలీజ్ కానుంది. తెలుగులో రీమేక్ అవుతోన్న ‘తేరి’, ‘కణిదన్’, ‘సదురంగ వేటై్ట’.. మూడూ థ్రిల్లర్స్ కావడం విశేషం. ఈ త్రీ థ్రిల్లర్స్ తమిళంలోలానే ఇక్కడా హిట్టవుతాయనే అంచనాలు ఉన్నాయి.
2 జానర్స్
పెళ్లి కుదురుతుంది. ఇంకో 24 గంటలు గడిస్తే మెడలో తాళి పడిపోతుంది. రాణీ మెహ్రాకి ఎన్నో కలలు. ఆనందంలో తేలుతున్న ఆమెతో ‘నీకు, నాకు కుదరదు. నీ సంప్రదాయపు అలవాట్లతో నేను మ్యాచ్ కాలేను’ అంటాడు కాబోయే భర్త విజయ్. రాణి అవాక్కవుతుంది. ఆ తర్వాత తల్లిదండ్రులను ఒప్పించి, పెళ్లి జరిగాక భర్తతో కలసి హనీమూన్ వెళ్లడానికి బుక్ చేసుకున్న టికెట్స్ తీసుకుని ఒంటరి ప్రయాణం మొదలుపెడుతుంది. ఈ ప్రయాణంలో ఎన్నో విషయాలు తెలుసుకుంటుంది. ఆత్మవిశ్వాసం ఉన్న అమ్మాయి అయిపోతుంది. మోడ్రన్‌గా మారిన రాణి గురించి తెలుసుకుని, పెళ్లి చేసుకుందాం అని కబురు పెడతాడు విజయ్. మర్నాడు అతని ఇంటికి వెళుతుంది రాణి. ‘యస్’ చెప్పడానికి వచ్చిందనుకుంటాడు. ఎంగేజ్‌మెంట్ రింగ్ ఇచ్చేసి, ధీమాగా వెళ్లిపోతుంది రాణి. కంగనా రనౌత్ కెరీర్‌కి మైల్‌స్టోన్ లాంటి సినిమా ‘క్వీన్’. ఇప్పుడు తెలుగు, తమిళ, మలయాళంలో రీమేక్ అవుతోంది. తెలుగులో ‘దటీజ్ మహాలక్ష్మి’ పేరుతో రీమేక్ అవుతోన్న ఈ చిత్రంలో తమన్నా హీరోయిన్. ముందు నీలకంఠ దర్శకత్వంలో ఆరంభమైంది. ఆ తర్వాత ‘అ!’ ఫేమ్ ప్రశాంత్ వర్మ డైరెక్షన్ బాధ్యతలు చేపట్టారు. ‘దటీజ్ మహాలక్ష్మి’ ఎమోషనల్ జానర్ అయితే.. ‘2 స్టేట్స్’ లవ్ జానర్. అబ్బాయి నార్త్.. అమ్మాయి సౌత్. హీరో పానీ పూరి బ్యాచ్. హీరోయిన్ పులిహోర బ్యాచ్. హీరో భల్లే భల్లే... బాంగ్రా డ్యాన్స్‌లో బెస్ట్. హీరోయిన్ సరిగమప టైప్. అయినా లవ్‌లో పడ్డారు. ‘సెట్ కాదు’ అని పెద్దలు అనేశారు. హీరోయిన్ ఇంటికి హీరో వెళతాడు. ఆ తర్వాత హీరో ఇంటికి హీరోయిన్ వెళుతుంది. పెద్దల మనసు గెలుచుకోవాలని పిల్లల ప్రయత్నం. గెలుచుకుంటారు. అయితే పెళ్లి తంతు ముగిసేవరకూ ‘మా ఆచారం.. మా ఆచారం’ అంటూ పెద్దల గొడవలు. ఎలాగైతేనేం లవర్స్ ఒకటయ్యారు. సింపుల్‌గా హిందీ ‘2 స్టేట్స్’ కథ ఇది. చేతన్ భగత్ రాసిన నవల ఆధారంగా అభిషేక్ వర్మన్ దర్శకత్వంలో కరణ్ జోహార్ నిర్మించారు. తెలుగులో అడవి శేష్ హీరోగా నటిస్తున్నారు. ఈ లవ్‌స్టోరీ ద్వారా జీవితా రాజశేఖర్‌ల కుమార్తె శివానీ రాజశేఖర్ హీరోయిన్‌గా పరిచయం కానున్నారు. వెంకట్ కుంచమ్ దర్శకత్వంలో ఎమ్‌ఎల్‌వి సత్యనారాయణ నిర్మిస్తున్నారు. ఆల్రెడీ ఓ భాషలో హిట్టయిన ఈ లవ్‌స్టోరీ తెలుగు ప్రేక్షకుల ప్రేమ కూడా పొందుతుందని నమ్మొచ్చు.
థ్రిల్లర్ టర్న్
అదో ఫ్లైఓవర్. అంత పొడవాటి ఫ్లై ఓవర్ మీద వెళ్లే బదులు మధ్యలో ఉండే డివైడర్స్‌ని దాటేస్తే టైమ్ కలిసొస్తుందని.. కొందరు ఆ డివైడర్స్‌ని పక్కకు తప్పించి, యు టర్న్ చేసుకుని వెళ్లిపోతుంటారు. ఇలా యు టర్న్ తీసుకున్నవాళ్లు హత్యకు గురవు తుంటారు. అవి చేస్తున్నదెవరు? అని తెలుసుకోవడానికి ఓ జర్నలిస్ట్ చేసే ప్రయత్నమే యు–టర్న్. పవన్ కుమార్ దర్శకత్వంలో రూపొందిన ఈ కన్నడ సినిమా సూపర్ హిట్. తెలుగులో జర్నలిస్ట్ రోల్‌ను సమంత చేస్తున్నారు. పవన్ కుమార్ దర్శకత్వంలోనే శ్రీనివాస్ చిట్టూరి ‘యు టర్న్’ పేరుతో రీమేక్ చేస్తున్నారు. ఆది పినిశెట్టి, రాహుల్ రవీంద్రన్, భూమిక ముఖ్య పాత్రలు చేస్తున్నారు. ఈ థ్రిల్లర్ తెలుగులోనూ థ్రిల్ చేస్తుందని ఊహించవచ్చు.
ఏబీసీడీ.. కామెడీ
ఇద్దరు కుర్రాళ్లు... కజిన్స్. బాధ్యతల్లేవ్, బాధల్లేవ్. ఒక కుర్రాడి తండ్రి బిలియనీర్. కజిన్‌తో కలసి లైఫ్‌ని ఎంజాయ్ చేయడమే ఆ కుర్రాడి లైఫ్. ఖరీదు గల కార్లు, పబ్బులు.. ఎంజాయ్‌మెంట్స్ పీక్స్‌లో ఉంటుంది. ఇలా అయితే కొడుకు జీవితం పాడవుతుందని గ్రహించిన తండ్రి వెకేషన్ అంటూ ఇండియా పంపిస్తాడు. తనతో పాటు కజిన్ కూడా ఇండియా ప్రయాణం అవుతాడు. వీళ్లు ఇండియాలో అడుగుపెట్టే లోపు మొత్తం క్రెడిట్, డెబిట్ కార్డ్స్‌ని బ్లాక్ చేస్తాడు తండ్రి. అక్కణ్ణుంచి మనీ కష్టాలు మొదలవుతాయి. లైఫ్ తెలుసుకుంటారు. కామెడీ వేలో సాగే మలయాళ సినిమా ‘ఏబీసీడీ’ కథ ఇది. అంటే.. ‘అమెరికన్ బార్న్ కన్‌ఫ్యూజ్డ్ దేశీ’ అన్నమాట. అదే పేరుతో తెలుగులో అల్లు శిరీష్ హీరోగా రీమేక్ అవుతోంది. కొత్త దర్శకుడు సంజీవ్ రెడ్డి దర్శకత్వంలో మధుర శ్రీధర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ ఫన్ జర్నీ తెలుగులోనూ ఆకట్టుకుంటుందని చెప్పొచ్చు.
– డి.జి. భవాని
Comments
Please login to add a commentAdd a comment