
బడిపంతులు
నాటి సినిమా
బుద్ధిలేని సంతానానికి పాఠాలు చెప్పే బడిపంతులు
ధర్మరాజు కంట కన్నీరు రాలిన చోట క్షామం పుడుతుందట. కాదు– తల్లిదండ్రుల కంట కన్నీరు ఒలికిన చోట కాటకం పుడుతుంది. కరువు కబళిస్తుంది. అశాంతి చెరలేగి జాతినే ముంచెత్తుతుంది. ఇది తెలుసుకునేది ఎంతమంది.
‘బాబూ... నీ కాళ్లు పట్టుకుంటాను... ఒక్క ముద్ద తినరా’ చిన్నప్పడు అన్నం తినడానికి మారాం చేసే పిల్లలతో తల్లి. ‘బాబూ... నీ కాళ్లు పట్టుకుంటాను... ఒక్క ముద్ద పెట్టరా’ పెద్దయ్యాక పోషణకు ఆరళ్లు పెట్టే పిల్లలతో తల్లి.పిల్లలకు తల్లిదండ్రులకంటే కామెడీ అయిపోయింది.కన్నారు... ఎవరి కోసం కన్నారు... పెంచారు... ఎవరి కోసం పెంచారు... ఉన్న ఆస్తో పాస్తో పంచారు... ఎవరి కోసం పంచుతారు... ఇప్పుడు మాకు రెక్కలొచ్చాయి... భర్తలు/భార్యలు వచ్చారు... పిల్లలు పుట్టారు... మా గొడవ మేం చూసుకోవడానికే టైమ్ లేదు... ఇంక తల్లిదండ్రులను ఏం చూసుకునేది? ఇలా అనే సంతానానికి ఎన్ని బెత్తం దెబ్బలు కొట్టాలి? ఎన్ని బడితె పూజలు చేయాలి?
తల్లిదండ్రుల జీవితం పిల్లల జననంతోనే అంతమైపోతుంది. ఆపైన వాళ్లకంటూ ఒక జీవితం ఉండదు. పిల్లల జీవితమే వాళ్ల జీవితం. పిల్లల కోసమే కష్టపడతారు. పిల్లల కోసమే సంపాదిస్తారు. పిల్లల కడుపు నిండితే తమ కడుపు నిండిందని భావించి తృప్తిగా బతుకుతారు. కొందరు పిల్లలకు అది అలుసవుతుంది. చిన్నప్పటి నుంచి చనువిచ్చి ఉంటారు కనుక కొందరు పిల్లలకు చిన్నచూపు ఏర్పడుతుంది. ఎన్నోసార్లు నిస్సహాయంగా ఆధారపడుతారు కదా అందుకని కొందరు పిల్లలకు అహంకారం వస్తుంది. అందువల్ల తల్లిదండ్రులను అలక్ష్యం చేస్తారు. నిర్లక్ష్యం వహిస్తారు. కాలికి చేతికి అడ్డం అని భావించి ఏ వృద్ధాశ్రమంలోనో వదిలిపెడతారు. మరికొందరు దయతలిచి దారిఖర్చులు కలిసొస్తాయని ఏకంగా వల్లకాటిలోనే వదిలిపెడతారు.ధర్మరాజు కంట కన్నీరు రాలిన చోట క్షామం పుడుతుందట.కాదు–తల్లిదండ్రుల కంట కన్నీరు ఒలికిన చోట కాటకం పుడుతుంది. కరువు కబళిస్తుంది. అశాంతి చెరలేగి జాతినే ముంచెత్తుతుంది. ఇది తెలుసుకునేది ఎంతమంది.అమ్మా... అన్నం తిన్నావా అని రోజుకు ఒకసారైనా ప్రేమగా పలకరించే సంతానం ఎంతమంది.
‘బడిపంతులు’ సినిమాలో తండ్రి ఎన్.టి.రామారావు బడిపంతులు. తల్లి అంజలీదేవి గృహిణి. వీళ్లకు ఇద్దరు కొడుకులు– కృష్ణంరాజు, రామకృష్ణ. ఒక కూతురు. ఆ రోజుల్లో బతకలేక బడిపంతులు అన్నారు. ఆ బతకలేని రోజుల్లోనే ఆ పెద్దమనిషి ఎన్.టి.రామారావు ఎన్నో కష్టాలు పడి పిల్లలని చదివించాడు. వాళ్ల కాలేజీ ఖర్చుల కోసం అప్పులు చేశాడు. కూతురి పెళ్లి కోసం కట్నం ఇవ్వలేక ప్రోనోటు రాసిచ్చాడు. ఇవన్నీ తన కోసం చేసుకున్న ఖర్చులు కాదు. పిల్లల కోసమే చేశాడు. వాళ్లు తిరిగి చెల్లిస్తారనే నమ్మకంతో చేశాడు. కాని ఆ పిల్లలు వయసు రాగానే చెరొక అమ్మాయిని వలిచారు. పెళ్లిళ్లు చేసుకుని తల్లిదండ్రులను, తోడబుట్టినదాన్ని వదిలేసి వెళ్లిపోయారు. చేసిన అప్పుకు గాను ఇల్లు వేలానికి వస్తుంది. అది ఉత్త ఇల్లు కాదు. స్కూలు పిల్లలు ఎంతో అపురూపంగా ఆ బడిపంతులకు కట్టిచ్చిన పొదరిల్లు. అలాంటి ఇల్లు అమ్ముడుపోవడమంటే ఎన్.టి.రామారావుకు ప్రాణం పోవడమే. ఇద్దరు కొడుకులూ పట్టించుకోరు.పైగా తల్లిదండ్రులను వాటాలు వేసుకొని తల్లిని ఒకరు, తండ్రిని ఒకరు తమ వెంట తీసుకుపోతారు. ఇరవై ముప్పై ఏళ్లు ఒక్కరోజు కూడా వదలకుండా కలిసిమెలిసి జీవించిన దంపతులు వాళ్లు.
వాళ్లను వేరే చేయడం ఏం భావ్యం. ఒకరు లేకుండా మరొకరు బతకగలరా వాళ్లు? అయినా పిల్లల నిర్ణయానికి విలువిచ్చి దూరం వెళతారు. వెళ్లినా అక్కడ అవమానాలు, చీదరింపులు. కాని పిల్లలందరూ ఇలాగే ఉంటే ఈ సృష్టి ఎప్పుడో అంతరించి ఉండును. ఈ బడిపంతులుకు ఒక మానసపుత్రుడు ఉన్నాడు. స్టూడెంట్. చిన్నప్పటి నుంచి చేరదీసి నాలుగు మంచి మాటలు చెప్తే బాగా చదువుకుని పైకొచ్చి పెద్ద పోలీసాఫీసర్ అయి ఉంటాడు. ఈ పాత్రను చేసింది జగ్గయ్య. అతడు తన గురువుకు వచ్చిన దురవస్థను గమనిస్తాడు. కదిలిపోతాడు. ఏ ఇల్లైతే వేలానికి వెళ్లిందో ఆ ఇంటిని కొని తాను ఎంతో అభిమానించిన గురువును, గురువుగారి భార్యను అందులో పెట్టి వాళ్లను ఆదరిస్తాడు. ఇది చూసి బుద్ధి తెచ్చుకున్న పిల్లలు వచ్చి కాళ్ల మీద పడతారు. అందరూ ఒకటవుతారు. కాని ఇలా ఒకటవటానికి వృద్ధ ప్రాణాలను ఇంత క్షోభ పెట్టడం అవసరమా?తల్లిదండ్రులు వయసు మీరాక శారీరకంగా మానసికంగా బలహీనపడి ఉంటారు. ఆ వయసులో వారికి కావలసింది పిల్లల తమ పట్ల చూపే అపేక్ష, అనురాగం. మనవళ్లు చేసే సందడి. వాళ్లకు కావలసిన తిండి ఎంత? నాలుగు ముద్దలు.ఆ పెద్దరికాన్ని గౌరవిస్తూ దగ్గర ఉంచుకుని కుటుంబ నియమాన్ని పాటించడం పిల్లల బాధ్యత. ఆ బాధ్యతను గుర్తు చేసే సినిమా, భుజాలు తడుముకునేలా చేసే సినిమా ‘బడిపంతులు’.
1972లో విడుదలైన ‘బడిపంతులు’ సినిమాలో చేస్తే అక్కినేని చేయాలి. ఇది ఆయనకు నప్పే సబ్జెక్ట్. కాని ఎన్టీఆర్ ఆ పాత్రను ఒప్పుకోవడమే కాకుండా ఎంతో ప్రతిభావంతంగా నటించి ప్రేక్షకులను గెలుచుకోవడం విశేషం అనిపిస్తుంది. ‘భీష్మ’ తర్వాత సినిమా అంతా ముసలి వేషం వేసి కొడుకులు, మనవళ్లు ఉన్న పాత్ర చేయడానికి ఈ సినిమాలో ఉన్న కథాబలమే కారణం అనిపిస్తుంది. ఎన్టీఆర్‌కు వృద్ధులైన తల్లిదండ్రుల సమస్యల పట్ల సానుభూతి ఉంది. ఈ సినిమా చేయడానికి అది ఒక కారణం కావచ్చు. ఈ సమస్య ఆయన మనసులో ఎంత గాఢంగా ఉండిపోయిందంటే తన చివరి రోజుల్లో రచయిత డి.వి.నరసరాజు (బడిపంతులు ఈయనే రాశారు)తో ఇలాంటి సమస్య మీదే ఒక సినిమా స్వీయ నిర్మాణ దర్శకత్వంలో చేయాలని తపించారు కూడా. స్కూలు పిల్లలు తప్ప తన బాగోగులు కూడా పట్టించుకోని ఉపాధ్యాయుడిగా, భార్య దూరమయ్యాక ఆమె ఉత్తరం కోసం ఎదురు చూసే భర్తగా, పిల్లల ఈసడింపును భరించే నిస్సహాయుడైన తండ్రిగా ఆయన ఉదాత్త నటన ప్రదర్శించాడు.
దానికంటే విశేషం అప్పటికి కుర్ర దర్శకుడిగానే చెప్పుకోవాల్సిన పి. చంద్రశేఖరరెడ్డి ఎంతో సమర్థంగా సినిమాను నడిపించడం.. రక్తి కట్టించడం. ఈ సినిమాలో చిన్న హీరోగా కనిపించిన కృష్ణంరాజు ఆ తర్వాత ఎంత పెద్ద హీరో అయ్యాడో చూశాం. అలాగే ఎన్టీఆర్‌కు మనవరాలిగా నటించిన శ్రీదేవి ఆ తర్వాత పెరిగి పెద్దదై ‘వేటగాడు’, ‘సర్దార్ పాపారాయుడు’, ‘బొబ్బిలిపులి, ‘కొండవీటి సింహం’, ‘జస్టిస్ చౌదరి’ వంటి అనేక సినిమాలలో ఆయన పక్కన హీరోయిన్‌గా నటించింది.ఇలాంటి వింతలూ విడ్డూరాలు ఈ సినిమాలు చాలా ఉన్నాయి. కాని తల్లిదండ్రులను చూడని సంతానమే అతి పెద్ద వింతని, కన్నవారికి అన్నం పెట్టని సంతానమే అతి పెద్ద విడ్డూరమనీ ఈ సినిమా చెబుతుంది. విషాదం ఇలాంటి సంతానం పెరగడం. ‘బడిపంతులు’కు ప్రాప్త కాలజ్ఞత తప్ప కాలదోషం పట్టకపోవడం. ఈ కథావస్తువు పనికిరాకుండా పోయే రోజుల కోసం ఎదురు చూద్దాం.
హిందీలో ‘బాగ్‌బన్’
‘బడిపంతులు’ సినిమాకు మూలం మరాఠీ రచయిత విష్ణువామన్ శిర్‌వాడ్‌కర్ రాసిన నవల ‘వైష్ణవి’. దీని ఆధారంగా దర్శక నిర్మాత బి.ఆర్.పంతులు ‘స్కూల్ మాస్టర్’ అనే సినిమాను కన్నడలో, హిందీలో కూడా నిర్మించారు. దాని రీమేక్ హక్కులతోనే తెలుగులో ‘బడిపంతులు’ తీశారు. అయితే ఇది జరిగిన చాలా ఏళ్లకు 2003లో అమితాబ్, హేమమాలినిలతో ఇదే కథ హిందీలో ‘బాగ్‌బన్’ సినిమాగా వచ్చింది. హిట్ అయ్యింది కూడా. తెలుగులో ఎన్.టి.రామారావు ప్రియశిష్యుడుగా జగ్గయ్య కనిపిస్తే హిందీలో అమితాబ్ ప్రియ శిష్యుడుగా సల్మాన్‌ఖాన్ కనిపిస్తాడు.
బూచాడమ్మ బూచాడు....
తెలుగులో టెలిఫోన్ మీద వచ్చిన తొలి సరదా పాట ‘బడిపంతులు’లో ఉంది. ‘బూచాడమ్మ బూచాడు’ పాటను చిన్నారి శ్రీదేవి అభినయిస్తే అందంగా చిత్రీకరించారు. ఆత్రేయ ఈ పాట రాయగా కె.వి.మహదేవన్ బాణీ కట్టారు. ఇందులోనే ఉన్న ‘భారత మాతకు జేజేలు బంగరు భూమికి జేజేలు’ పాట ప్రతి ఆగస్టు 15కు వినిపిస్తూనే ఉంటుంది. ఇంకా ‘నిన్న మొన్న రేకు విప్పిన కన్నెముగ్గ’ డ్యూయెట్ కూడా హిట్టే.
– కె