ఎంత మాటన్నారు చంద్రబాబు గారూ!
(సాక్షి వెబ్ ప్రత్యేకం)
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సరిగ్గా 35 ఏళ్ల తర్వాత తన రాజకీయ జీవిత విశేషాలను నెమరువేసుకుంటూ చెప్పిన పలు విషయాలు విశ్లేషకులను నివ్వెరపరుస్తున్నాయి. మరీ ముఖ్యంగా ఎన్టీఆర్ గురించి ఆయన చేసిన వ్యాఖ్యలపై నెటిజన్లు తీవ్రంగా స్పందిస్తున్నారు. అసలు పార్టీ పెట్టమని ఎన్టీఆర్‌కు చెప్పింది తానేననీ, ఎన్నికల్లో ఎన్టీఆర్‌పైన పోటీ చేస్తానని తానెప్పుడూ చెప్పలేదంటూ చంద్రబాబు అంటున్న విషయాలపై ఇప్పుడు సోషల్ మీడియాలో ప్రజలు రకరకాల సెటైర్లు వేస్తున్నారు. గత చరిత్రను తిరగదోడుతున్నారు.
1982లో పార్టీ స్థాపించాలని ఎన్టీఆర్ నిర్ణయం తీసుకున్న రోజుల్లో చంద్రబాబు కాంగ్రెస్‌లో సినిమాటోగ్రఫీ, పురావస్తు శాఖల మంత్రిగా కొనసాగుతున్నారు. ఎన్టీఆర్ పార్టీ స్థాపించినప్పుడుగానీ, దాని కోసం జరిగిన కసరత్తులోగానీ చంద్రబాబు పాత్ర ఎక్కడా లేదు. పైపెచ్చు సినిమా గ్లామర్‌కు ఓట్లు రాలుతాయా? అంటూ ఎద్దేవా చేశారు. అలాంటి చంద్రబాబు తన పెళ్లి రోజును స్మరించుకుంటూ చెప్పిన వివరాలు ప్రజలను విస్మయపరిచాయి.
"ఎన్టీఆర్‌కు పార్టీ పెట్టమని చెప్పింది నేనే...." పెళ్లయి 35 ఏళ్లు అయిన సందర్భంగా మీడియాతో ముచ్చటిస్తూ చంద్రబాబు చెప్పినమాట ఇది. ఇంతకు ముందెప్పుడూ చంద్రబాబు ఈ మాట చెప్పలేదు. ఎన్టీఆర్ బతికి ఉన్నప్పుడు ఇలాంటి మాటలే ఆయన నోటి నుంచి రాలేదు. ఎన్టీఆర్ మరణించిన 20 ఏళ్ల తర్వాత చంద్రబాబు చెప్పిన ఈ మాటలను.. గతంలో జరిగిన సంఘటనలతో పోల్చుతూ సోషల్ మీడియాల్లో పోస్టులు చేస్తున్నారు.
నిజానికి అంతకు ముందు ఏం జరిగిందంటే... 1982 మార్చి 21 న రామకృష్ణా స్టూడియోస్‌లో విలేకరుల సమావేశం పెట్టి ప్రజాజీవితంలోకి రావాలని నిర్ణయించుకున్నానని ఎన్టీఆర్ ప్రకటించారు. అప్పుడు ఎన్టీఆర్ పక్కన చంద్రబాబు లేరు సరికదా... పెట్టిన తర్వాత పార్టీలో చేరాలని ఆహ్వానించినా చంద్రబాబు తిరస్కరించారు. అదో గాలి పార్టీ అని ఎద్దేవాచేశారు. ఎన్టీఆర్ ప్రకటన వెలువడిన తర్వాత కాంగ్రెస్ పార్టీకి చెందిన నాదెండ్ల భాస్కరరావు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఆదయ్య, రత్తయ్య, నారాయణ తదితరులు ఆ పార్టీకి రాజీనామా చేసి ఎన్టీఆర్‌కు మద్దతు ప్రకటించారు. ఆ సమయంలోనూ పక్కన చంద్రబాబు లేరు. ఆ తర్వాత కొద్ది రోజులకు ఊటీలో సినిమా షూటింగ్ ముగించుకుని 1982 మార్చి 29న హైదరాబాద్ వచ్చిన ఎన్టీఆర్ నేరుగా నాదెండ్ల ఇంటికి వెళ్లారు. అప్పుడు కూడా చంద్రబాబు లేరు. హైదరాబాద్ లోని న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో ఎన్టీఆర్ తన పార్టీ పేరు తెలుగుదేశంగా ఖరారు చేశారు. అప్పుడు చంద్రబాబు ఆ దరిదాపుల్లో లేరు.
రామకృష్ణా స్టూడియోస్‌లో టీడీపీ లోగోను ఎన్టీఆర్ ఒక కాగితం మీద గీశారు. చక్రం, నాగలి, గుడిసె చిత్రాలతో పసుపు జెండా రూపొందించి అక్కడే ఉన్న ప్రముఖుల అభిప్రాయాలను కోరారు. వారెవరంటే... బెజవాడ పాపిరెడ్డి, తుర్లపాటి సత్యనారాయణ, యలమంచిలి శివాజీ, నాదెండ్ల భాస్కరరావు, రత్తయ్య, ఆదయ్య, నారాయణ, దగ్గుబాటి చెంచురామయ్య తదితరులు మాత్రమే. అక్కడ కూడా చంద్రబాబు లేరు. ఆయన కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నారు. ఆ తర్వాత 1982 ఏప్రిల్ 11 న హైదరాబాద్‌లోని నిజాం కాలేజీ గ్రౌండ్స్‌లో టీడీపీ తొలి బహిరంగ సభను ఎన్టీఆర్ నిర్వహించారు. ఆ ఛాయల్లో ఎక్కడా చంద్రబాబు లేరు.
ఆనాడేం జరిగింది... దగ్గుబాటి మాటల్లోనే...
"నిజాం కాలేజీలో మొదటిసభ ముగిసిన తర్వాత ఆయా నాయకుల మద్దతు కోరడానికి, పార్టీలోకి ఆహ్వానించడానికి కాంగ్రెస్ పార్టీకి చెందిన నాటి సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి చంద్రబాబు దగ్గరికి వెళ్లాను. అప్పుడు చంద్రబాబు ఒక కాగితం తీసుకుని లెక్కలేసి ఎన్టీఆర్ జేబులోంచి పైసా తీయడు. ఎన్టీఆర్‌కు 5 శాతం ఓట్లు మాత్రమే వస్తాయి. సినిమా మోజుకి ఓట్లు పడతాయా? ఎట్టి పరిస్థితుల్లోనూ గెలవడు. నాకు కాంగ్రెస్‌లో మంత్రిపదవి ఉంది. నేను మంత్రి పదవి వదులుకుని ఎలా వస్తాను?" అంటూ టీడీపీలోకి వచ్చేదే లేదని తేల్చిచెప్పారు చంద్రబాబు. ఆ తర్వాత క్రమంలో 1982 మే 28న ఎన్టీఆర్ తన జన్మదినం సందర్భంగా తిరుపతిలో ఒక సభ ఏర్పాటుచేసి దానికి మహానాడు అని పేరు ఖరారుచేశారు. (ఆ సమయంలోగానీ... ఆ సభ జరిగినప్పుడు గానీ ఆ దరిదాపుల్లో చంద్రబాబు లేరు)
1982 నవంబర్ 18 న కాంగ్రెస్ అధిష్టానం ఆదేశిస్తే మామ ఎన్టీఆర్ మీద పోటీకి రెడీ అని చంద్రబాబు ప్రకటన చేశారు. 1982 లో తిరుపతిలోని పాలిటెక్నిక్ గ్రౌండ్స్ లో నిర్వహించిన కాంగ్రెస్ ఎన్నికల ప్రచారసభలో మాట్లాడుతూ, అధిష్టానం ఆదేశిస్తే మామ ఎన్టీఆర్ మీద పోటీకి సిద్ధమని ప్రకటించారు. దానికి కొద్దిరోజుల ముందే ఆంధ్రపత్రికలో (దగ్గుబాటి ఒక చరిత్ర కొన్ని నిజాలు పుస్తకం నుంచి) చంద్రబాబు చెప్పిన విషయాలు "మామ ఎన్టీఆర్ పై ఎక్కడి నుంచైనా పోటీ చేయడానికి రెడీ. తెలుగుదేశం ఒక గాలి పార్టీ. దానికి భవిష్యత్తు లేదు" అన్న శీర్షికతో ప్రచురితమైంది. ఇదే విషయం అప్పట్లో మరికొన్ని పత్రికల్లో ప్రచురితమైంది.
ఏమాత్రం తడుముకోకుండా...!!
చంద్రబాబు ఆ మాటలు చెప్పినట్టు చరిత్రలో ఎన్నో సాక్ష్యాలున్నా, ఏమాత్రం తడబాటు లేకుండా ఎన్టీఆర్‌పై పోటీ చేస్తానని తానెప్పుడూ చెప్పలేదని తాజాగా అన్నారు. 1983 జనవరి 5న పుట్టినగడ్డ చంద్రగిరిలో మేడసాని వెంకటరామ నాయుడు అలియాస్ మీసాల నాయుడు చేతిలో 17,429 ఓట్ల తేడాతో కాంగ్రెస్ అభ్యర్థి చంద్రబాబు ఘోరంగా ఓడిపోయారు. అప్పుడే టీడీపీ రాష్ట్రంలో ఘన విజయం సాధించింది. సరిగ్గా ఆ తర్వాతి నుంచి చంద్రబాబు రూటు మార్చడం ప్రారంభించారు. ఎన్నికల్లో ఓడిపోయిన 15 రోజులకే మామ ఎన్టీఆర్ వద్దకు పలువురి ద్వారా రాయబారం పంపారు. తన విధానాలను మార్చుకుంటానని, అంకితభావంతో పనిచేస్తానని... రాయబారం నెరిపారు. ఆ తర్వాత టీడీపీలో చేరుతానని ప్రకటన చేశారు. (విధానాలను మార్చుకుంటా అంటున్నారని, అందుకే పార్టీలో చేర్చుకుంటున్నానని ఎన్టీఆర్ చెప్పినట్టు దగ్గుబాటి తన పుస్తకంలో రాసుకున్నారు)
1983లో చిత్తూరు జిల్లాలో టీడీపీ ఓటమికి తీవ్రకృషి చేయడమే కాకుండా అప్పట్లో జిల్లాలోని టీడీపీ కార్యాలయాన్ని ధ్వంసం చేయించిన చంద్రబాబును చేర్చుకుంటే పార్టీ పతనానికి నాంది పలికినట్టేనని అప్పట్లో టీడీపీ నేత సిద్దయ్య మూర్తి బహిరంగంగానే ప్రకటించారు. అదే సంవత్సరం జరిగిన పార్టీ రాష్ట్ర స్థాయి సదస్సులో చంద్రబాబును ఓడించిన మీసాల నాయుడు లేచి కాంగ్రెస్ వారిని పార్టీలో చేర్పించుకోరాదని తీర్మానం ప్రవేశపెట్టగా దానికి మద్దతు తెలుపుతూ 99 శాతం మంది చేతులెత్తి దాన్ని బలపరిచారు. ఇలాంటివారిని పార్టీలోకి ఆహ్వానిస్తే తీవ్రంగా ప్రతిఘటిస్తామని మహిళా విభాగం నాయకురాలు రమణమ్మ అసంతృప్తి వ్యక్తం చేశారు. వీరి చేరికను వ్యతిరేకిస్తూ మరో నాయకురాలు సీతామహాలక్ష్మి కన్నీరు పెట్టుకున్నారు. ఆ తర్వాతి కాలంలో వారందరికీ సర్దిచెప్పిన ఎన్టీఆర్ (పిల్లనిచ్చిన మామ కావడంతో) చంద్రబాబును పార్టీలో చేర్చుకున్నారు. (తోడల్లుడు దగ్గుబాటు వెంకటేశ్వరరావు రాసిన ఒక చరిత్ర కొన్ని నిజాలు పుస్తకంలోంచి...)
రాజ్యాంగం పర్మిట్ చేస్తే...!
''ఒక వ్యక్తి బొమ్మ (ఎన్టీఆర్) పెట్టుకొని గెలవలేదు. ప్రతి ఒక్కరి కంట్రిబ్యూషన్ ఉంది. అందరూ కలిసే ఎన్నికల్లో గెలిచాం. ఎన్టీఆర్‌కు చరిష్మా ఉంటే ఆయన 1989లో ఎందుకు ఓడిపోయారని అడుగుతున్నాను. 1984 ఆగస్టు క్రైసిస్ తర్వాత మిత్రపక్షాలు అందరూ కలిసి 240 మంది గెలిచాం. తిరిగి 1994లో అందరికీ తెలిసిందే. ఆ విధంగా ప్రతి ఒక్కరి పర్ఫార్మెన్స్‌తో గెలిచాం. ఏ ఒక్కరితో కాదు'' -1995లో ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నప్పుడు అసెంబ్లీ వేదికగా చంద్రబాబు చెప్పిన మాటలివి.
ఒకానొక చర్చ సందర్భంగా ఆయన ఎన్టీఆర్ ను వెన్నుపోటు పొడిచిన అంశంపై చంద్రబాబు సభలో మాట్లాడారు. "ఇదే హౌస్‌లో 227 మంది ఎమ్మెల్యేలు సపోర్ట్ చేసినా ఇంకా ప్రజాస్వామ్యం...! ప్రజాస్వామ్యం...! అని మాట్లాడితే నాకే అర్థం కావడం లేదు. అసలు ప్రజాస్వామ్యానికి డెఫినిషన్ ఏమిటని వారిని (ప్రతిపక్షాలను ఉద్దేశించి) అడుగుతున్నాను. ఎన్టీఆర్ ఏం చేశారంటే... పార్టీ రాజ్యాంగాన్ని రాసుకున్నామని అన్నారు. ఆయన ఎప్పుడు రాసుకున్నారో నాకు తెలియదు. పార్టీ అధ్యక్షుడిగా శాశ్వతంగా ఆయన ఉంటారని రాసుకున్నారు. మన కాన్ స్టిట్యూషన్ కూడా పర్మిట్ చేస్తే... ఆయన శాశ్వతంగా ముఖ్యమంత్రి అని రాసుకునే వారేమో నాకు తెలియదు." ఆగ్రహంతో ఊగిపోతూ అన్న మాటలివి. (5 డిసెంబర్ 1995 రోజున శాసనసభలో చంద్రబాబు చేసిన ప్రకటన - అసెంబ్లీ రికార్డుల్లోంచి).
ఇదే చంద్రబాబు.. తనకు ప్రధానమంత్రి అయ్యే అవకాశం వచ్చిందని, కానీ అప్పటికి పదో తరగతి చదువుతున్న తన కుమారుడు లోకేశ్‌ను అడిగితే ముఖ్యమంత్రి పదవి శాశ్వతం, ప్రధాని పదవి అశాశ్వతం అని చెప్పాడని, అందుకే తాను ముఖ్యమంత్రి పదవినే ఎంచుకున్నానని చెప్పారు. ఎన్టీఆర్ విషయంలో ఇలాంటి వ్యాఖ్యలు చేసిన వ్యక్తి.. తన కొడుకు చెబితే మాత్రం ముఖ్యమంత్రి పదవి శాశ్వతం అని ఎలా భావించారో ఆయనకే తెలియాలి!
కళ్లార్పకుండా...
ఎన్టీఆర్ విషయంలో ఇలా ఒకో సందర్భంలో ఒకలా మాట్లాడిన చంద్రబాబు తాజాగా మీడియాతో చేసిన వ్యాఖ్యలు సర్వత్రా నివ్వెరపరుస్తున్నాయి. మామ ఎన్టీఆర్‌పై ఎక్కడినుంచైనా పోటీకి రెడీ అని చంద్రబాబు ప్రకటన చేసిన కొద్దిరోజుల్లోనే ఇప్పుడు రాజకీయాల్లో చురుగ్గా ఉన్న నేతలు టీఆర్ఎస్ అధ్యక్షుడు కె. చంద్రశేఖర్ రావు, కేంద్ర మంత్రి పి. అశోక గజపతిరాజు, కాంగ్రెస్ నేత కె.జానారెడ్డి, టీడీపీ నేత ముద్దుకృష్ణమ నాయుడు తదితరులు టీడీపీలో చేరారు. ఇలా ఒకరేంటి... చాలామంది నేతలు చంద్రబాబు కన్నా ఎంతో ముందుగా టీడీపీలో చేరినవారే. ఆనాటి చరిత్రకు వీళ్లంతా సాక్షులే.
ఇంత జరిగినా... ఎన్టీఆర్ ను రాజకీయాల్లోకి ఆహ్వానించింది తానేననీ, పార్టీ పెట్టమని చెప్పిందీ తానేననీ... వంటి మాటలు అలవోకగా చెప్పడం చంద్రబాబుకే చెల్లింది.