‘క్షణక్షణం’ | special story to kshana kshanm movie | Sakshi
Sakshi News home page

‘క్షణక్షణం’

Published Fri, Jun 23 2017 12:16 AM | Last Updated on Tue, Sep 5 2017 2:14 PM

‘క్షణక్షణం’

‘క్షణక్షణం’

క్రైమ్‌తో కామెడీలు వద్దని చెప్పే ‘క్షణక్షణం’
నాటి  సినిమా


‘శివ’ సినిమాతో తెలుగు ప్రేక్షకులు రెచ్చిపోయారు. చిన్న చిన్న ఊళ్లలో ఆవారాగా తిరిగే కుర్రాళ్లు ఒక చేత్తో సైకిల్‌ చైన్‌ మరో చేత్తో హాకీ స్టిక్‌ పట్టుకుని నలుగురైదుగురు గుమిగూడి ‘శివ స్టిల్‌’ ఫొటోలు దిగడం మొదలెట్టారు. సైకిల్‌చైన్‌తో ఎదుటివారిని కొట్టడం చాలా కష్టమని తెలియని చాలామంది కొట్లాటల్లో సైకిల్‌ చైన్‌ వాడవచ్చని నమ్మారు. డైరెక్టర్‌ పేరు దాదాపుగా హవా కోల్పోతున్న సమయంలో రామ్‌గోపాల్‌వర్మ అనే పేరు ఒక సినీ వెర్రికి పర్యాయపదమైంది. మరి అతడు తీయబోయే రెండో సినిమా అంటే– దాని పేరు ‘క్షణక్షణం’ అయితే– అందులో శ్రీదేవి నటిస్తూ ఉంటే– పైగా వెంకటేశ్‌ ఆమె పక్కన ఫస్ట్‌టైమ్‌ యాక్ట్‌ చేస్తుంటే– ఆ క్రేజ్‌ ఎలా ఉండాలి.

కాని తీరా సినిమా రిలీజయ్యాక అలా లేదు. ఎలాగో ఉంటుందనుకుంటే ఇంకెలాగో ఉంది. ఆ ఇంకెలాగో ఉండటం దాని స్టయిల్‌ అనీ, అది క్లాసిక్‌ అనీ తెలియడానికి ఫస్ట్‌ రన్‌ వెళ్లి సెకండ్‌ రన్‌ రావాల్సి వచ్చింది. ‘క్షణక్షణం’ క్లాసిక్‌. మెల్లగా అది తెలుగు ప్రేక్షకులకు ఎక్కి ఇప్పుడు తమ ప్రియమైన సినిమాగా సెటిల్‌ అయ్యింది. నిజానికి దాని పేరే దానికి మైనస్‌ అని చెప్పాలి. ‘క్షణక్షణం’ అని పెట్టేసరికి క్షణం క్షణం టెన్షన్‌ ఉంటుందని ప్రేక్షకులు వచ్చారు. అదే ‘అనుకోకుండా ఒకరోజు’ అని టైటిల్‌పెట్టి ఉంటే ఫస్ట్‌ రన్‌లోనే సూపర్‌ హిట్‌ అయి ఉండేదేమో!తెలుగువారు స్థిమితమైన కామెడీతో సినిమా తీయలేరు అని ఎవరైనా అంటే వారికి ‘క్షణక్షణం’ చూపించాలి. దినదినప్రవర్థమానమైన తెలుగువారి ప్రతిభను చాటి చెప్పాలి.

ఇందులో ‘సత్య’ అనే పేరున్న అమ్మాయిగా వేసిన శ్రీదేవి సత్యభామలాగే గడుగ్గాయి. అంతే అమాయకురాలు. జీవితం పట్లగాని పని పట్లగాని పెద్దగా సీరియస్‌నెస్‌ లేదు. తెల్లనివన్నీ ప్యాకెట్‌ పాలనీ నల్లనివన్నీ నల్లానీళ్లని నమ్మేసే బాపతు. పొద్దెక్కేదాకా నిద్రపోవడం ఆఫీసుకు లేటుగా వెళ్లి బాస్‌ చేత అక్షింతలు తినడం ఆమె పని. బాస్‌ తిట్లు శ్రుతి మించేసరికి ‘ఆ.. బోడి ఉద్యోగం ఇది కాకపోతే ఇంకొకటి’ అని ఇంకో ఉద్యోగానికి అప్లై చేయడానికి పాస్‌పోర్ట్‌ సైజ్‌ ఫొటో కోసం స్టుడియోకు వెళుతుంది. అక్కడే ఆమె జీవితంలో క్రైమ్‌ ఎంటర్‌ అవుతుంది. ఆ స్టూడియో యజమానికి అంతకు ముందే ఒక పెద్ద బ్యాంకు దొంగతనంతో సంబంధం ఉంటుంది. అతడు తన బాస్‌– పరేశ్‌ రావెల్‌కు ఇవ్వాల్సిన డబ్బు తానే కొట్టేసి దానిని ఒక రైల్వే క్లోక్‌రూమ్‌లో దాచి ఆ రసీదును ఫొటో స్టుడియోలో పెట్టుకుని ఉంటాడు. అతన్ని వెతుక్కుంటూ బాస్‌ వచ్చేసరికి భయపడిపోయి అప్పుడే ఫొటోల కోసం వెళ్లిన శ్రీదేవికి ఇవ్వాల్సిన ఫొటోల కవర్‌లో క్లోక్‌రూమ్‌ రెసిప్ట్‌ను పెట్టి దానిని స్టుడియో దాటించేస్తాడు. కాని పరేశ్‌రావెల్‌ నాలుగు తగిలించి, ఒక చిటికెన వేలు తీసేసేసరికి ‘ఇప్పుడే ఫొటోల కోసం వచ్చిన అమ్మాయి ఆ రెసిప్ట్‌ తీసుకెళ్లింది’ అని కక్కేస్తాడు.

అక్కడి నుంచి పరేశ్‌రావెల్‌ బృందం శ్రీదేవి వెంటపడుతుంది. వీళ్లంతా తన వెంట ఎందుకు పడుతున్నారో తెలియని శ్రీదేవి తన ఫ్లాట్‌లో అడుగుపెట్టిన పరేశ్‌ రావెల్‌ మనిషిని దాదాపు చంపినంత పని చేస్తుంది. అంతా చేసి ఒక పూట వ్యవధిలోనే ఆమె జీవితం కకావికలం అయిపోతుంది. ఇప్పుడు ఆమెను కాపాడే మనిషి కావాలి. ఆ కాపాడేవాడే ‘చందు’ అనే పేరు కలిగిన వెంకటేశ్‌. ఇతనో పెద్ద చిల్లర దొంగ. అయితే ఇతడి నేరాలన్నీ చిల్లర వరకే. ఒక ఇరానీ కేఫ్‌లో శ్రీదేవిని చూసిన ఇతడు ఆమె వెనుక పెద్ద ముఠా పడుతోందని, దీని వెనుక ఒక కోటి రూపాయల బ్యాంకు దొంగతనం ఉందని తెలుసుకొని ఆ డబ్బు కోసం తానూ రంగంలో దిగుతాడు. కాని కత్తి పట్టుకున్నవాడికి కత్తే ఎదురవుతుంది. దొంగడబ్బు కోసం ప్రయత్నిస్తే ఖూనీకోర్లే ఎదురవుతారు. ఈ ఇద్దరూ ఒక నలభై ఎనిమిది గంటల వ్యవధిలో ఎన్నో అటాక్స్‌ను ఇటు పోలీసుల నుంచి అటు పరేశ్‌రావెల్‌ బ్యాచ్‌ నుంచి తప్పించుకోవాల్సి వస్తుంది.

చివరకు శ్రీదేవి దొంగ డబ్బు మనకు వద్దని అది పోలీసులకు అప్పజెబుదామని పట్టుపడుతుంది. వెంకటేశ్‌కు ఇది నిజంగా పెద్ద కష్టమే.
కాని అప్పటికే అతడు ఆమెతో రహస్యంగా ప్రేమలో పడి ఉంటాడు. చివరకు ప్రేమే గెలుస్తుంది. దొంగ సొమ్ము కోసం ప్రేమను కోల్పోయి, ప్రశాంతమైన జీవితం కోల్పోవడం కంటే అది ప్రభుత్వం వారి ముఖాన పడేయడమే బెటర్‌ అని భావిస్తాడు. చివరకు కలవని రైలు పట్టాల సాక్షిగా వారి ప్రేమ కలుస్తుంది. కథ సుఖాంతం అవుతుంది.
 
ఈ సినిమాకు హీరోలు ముగ్గురు. దర్శకుడు రామ్‌గోపాల్‌వర్మ, సినిమాటోగ్రాఫర్‌ ఎస్‌.గోపాల్‌రెడ్డి, మ్యూజిక్‌ డైరెక్టర్‌ కీరవాణి.
శ్రీదేవి, వెంకటేశ్‌లు కథకు తగినట్టుగా తన ప్రమేయాన్ని ఉంచారని చెప్పాలి. నిజానికి హీరో హీరోయిన్లు కథలో ఒక అంతర్గతభాగమై కనిపించడాన్ని తెలుగు ప్రేక్షకులు అర్థం చేసుకోవడానికి టైమ్‌ పట్టింది. ఓవర్‌ డ్రమాటిక్‌గా లేకుండా చాలా సహజంగా కనిపించడం కూడా కొత్తే. ‘దేవుడా దేవుడా దేవుడా’... అని భయపడే హీరోయిన్, ‘మా అమ్మ అప్పుడే చెప్పింది’.. అని అమాయకంగా కన్నీళ్లు పెట్టే హీరోయిన్‌ నిజంగా బాగుంటుందని వాళ్లు మెల్లగా అంగీకరించారు. వెంకటేశ్‌ కూడా చాలా క్యాజువల్‌గా ఉంటాడు. చాలా సినిమాల్లో హీరో తాను ఎందుకు దొంగగా మారాడో చెప్పే ‘డ్రామా’ను వెంకటేశ్‌ శ్రీదేవికి చాలా క్యాజువల్‌గా చెప్పినా, అదంతా అబద్ధం అని మనకు తెలుస్తూ ఉండేలా చెబుతాడు. శ్రీదేవి అంతా విని వెంకటేశ్‌ చెప్పింది నమ్ముతూనే ‘ఆ సినిమా నేను చూశా’ అనడం ఎంతో హాస్యంగా ఉంటుంది. దాని కన్నా హైలైట్‌ ఏమిటంటే క్లయిమాక్స్‌లో డబ్బుతో వెంకటేశ్‌ ఉడాయించేస్తే పరేశ్‌ రావెల్‌ను కూచోబెట్టి ‘ఆయన అలాంటి వారు కాదు. చిన్నప్పుడు వాళ్లమ్మకు బాగలేక మందుల కోసం ఏదో దొంగగా మారారు కానీ’... అని నమ్మకంగా చెబుతూ ఉంటే జనం కడుపుబ్బా నవ్వుతారు. హీరో హీరోయిన్ల మధ్య రొమాన్సు, అపార్థాలకు అలవాటు పడిన ప్రేక్షకులు ఈ సినిమాలో వీరిద్దరి మధ్య చోటు చేసుకున్న సున్నితమైన హాస్య సన్నివేశాలను అర్థం చేసుకొని నవ్వడానికి కొంచెం ఎదిగారు. ఇక డెన్‌లు గట్రా లేకుండా చిన్న మఫ్లర్‌ కట్టుకొని కనిపించే విలన్‌– పరేశ్‌ రావెల్‌ ఎంత రక్తమాంసాలతో ఉన్న మనిషో అనిపిస్తాడు. అతడి జిప్సీ తీసుకొని అడవిలోకి పారిపోయిన వెంకటేశ్, శ్రీదేవిలను అతడు వెతికి పట్టుకుని అడిగే మొదటి ప్రశ్న ‘జిప్సీలో ప్రయాణం బాగా సాగిందా?’ అని. అడవిలో వాన పడుతుంటే తన డబ్బు అడుగుతూనే ‘వర్షం... వర్షం... ఇలా జరుగు’ అని శ్రీదేవికి జాగ్రత్తలు చెబుతాడు.

‘నేను వంద రూపాయలకు మర్డర్‌ చేసిన రోజులున్నాయి’ అని అతడు చెప్పడం రియలిస్టిక్‌గా ఉండి ఒకవైపు కామెడీ చేస్తున్నా మరోవైపు నాతో జాగ్రత్త సుమా అని క్యారీ చేసేలా ఉంటుంది. దొంగలకు కూడా వెర్రి డౌట్స్‌ ఉంటాయని రౌడీలలో కూడా క్యూరియాసిటీ ఉంటుందని ఈ సినిమా చూపుతుంది. ‘అడవిలో ఈ బ్రిడ్జ్‌ ఎవరు కట్టుంటారు’ అని పరేశ్‌ రావెల్‌ అడిగితే ‘తెలియదు సార్‌’ అని నర్సింగ్‌ యాదవ్‌ జవాబు చెబుతాడు. ‘పాములు పగపడతాయంటావా?’ అని అడిగితే మళ్లీ నర్సింగ్‌ యాదవ్‌ ‘తెలియదు సార్‌’ అంటాడు. ఇలాంటి నార్మల్‌ డౌట్లు ఉన్న విలన్‌ తెలుగు ప్రేక్షకులకు కొత్త.

ఈ సినిమాలో చాలా సూక్ష్మమైన సన్నివేశాలు రెప్పపాటులో ముగుస్తాయి. ఉదాహరణకు రైల్లో శ్రీదేవి, వెంకటేశ్‌ తమ దగ్గర ఉన్న బ్యాగ్‌లో ఎంత డబ్బు ఉందో చెక్‌ చేయడానికి టాయిలెట్‌లో దూరుతారు. ఆ తర్వాత తలుపు తెరుచుకుని వాళ్ల హడావిడిలో వాళ్లు వెళుతుంటే ఒకే టాయిలెట్‌లో నుంచి అలా అబ్బాయి అమ్మాయి రావడం చూసి ఒక పెద్దమనిషి హతాశుడవతాడు. ఇలాంటివే ఎన్నో.
   
‘క్షణక్షణం’ సినిమా కేవలం సబ్జెక్ట్‌కు మాత్రమే కట్టుబడి ఆనెస్ట్‌గా తీసిన సినిమా.దీని వెనుక ‘రొమాన్సింగ్‌ ది స్టోన్‌’ వంటి సినిమాల ప్రభావం ఉన్నా రామ్‌గోపాల్‌ వర్మ ఎంతో కచ్చితమైన కథాసంవిధానంతో దీనిని తెరకెక్కించాడు. హీరో హీరోయిన్లు ఒకే డ్రస్సులో సినిమా అంతా కనిపించడం, రెండు రోజుల కాలవ్యవధిలో ఒక సినిమా ముగిసేలా చూపించడం ఆనాటికి ఉన్న ఫార్ములాకు ఏమాత్రం పొసగని వ్యవహారం. అయినప్పటికీ జనం, నెమ్మదిగానైనా సరే మెచ్చేలా వర్మ తీయగలిగాడు.ఇందులో ఉన్న వినోదానికి తోడు ఒక్కో సీన్‌లో కనిపించినా ఆటో డ్రైవర్‌ మాణిక్, బట్టల షాప్‌ ఓనర్‌ బ్రహ్మానందం గుర్తుండిపోతారు.కీరవాణి చేసిన పాటలు హిట్‌.

‘జాము రాతిరి జాబిలమ్మా’, ‘చలి చంపుతున్న చమక్కులో, ‘ముద్దిమ్మంది బుగ్గా’... కనిపిస్తూ, వినిపిస్తూనే ఉన్నాయి. వీటికి మించి కీరవాణి చేసిన రీరికార్డింగ్‌ కూడా బాగుంటుంది. మన రోజువారీ ప్రపంచం వేరు. క్రైమ్‌ ప్రపంచం వేరు. మన రోజువారీ ప్రపంచంలో క్రైమ్‌ దూరితే నేరుగా పోలీసులను ఆశ్రయించడమే బెటర్‌. కాదూ కూడదని సొంత ప్రయోగాలు చేస్తే జీవితం ప్రమాదంలో పడుతుందని ఈ సినిమా అన్యాపదేశంగా చెబుతుంది. కాకపోతే ఆ ముక్కను సీరియస్‌గా కాకుండా హాస్యపు పూతతో చెప్పడం వల్లే ఈ సినిమా క్లాసిక్‌గా నిలిచింది. ఎస్‌. క్షణక్షణం తెలుగువారి చెప్పుకోదగ్గ క్లాసిక్‌.


శ్రీదేవి పాట...
1991లో ‘క్షణక్షణం’ రిలీజయ్యే నాటికి శ్రీదేవి కెరీర్‌ పతాకస్థాయిలో ఉంది. ఆమె కనిపించడమే సినిమాకు పెద్ద వరంగా ఉండేది. నిర్మాతలు కె.ఎల్‌.నారాయణ, ఎస్‌.గోపాల్‌రెడ్డిలకు శ్రీదేవి డేట్స్‌ ఇచ్చాకే ఈ సినిమా ఆమెను దృష్టిలో పెట్టుకొని తయారయ్యింది. వర్మ... శ్రీదేవి వీరాభిమాని. అందువల్ల ఎంతో మంది నిర్మాతలు వెంటపడుతున్నా ఆమె కోసం ‘క్షణక్షణం’ తీశారు. ఇందులో శ్రీదేవితో ఆయన పాట కూడా పాడించారు. ‘కింగులా కనిపిస్తున్నాడు’... పాటను కీరవాణి దగ్గర తర్ఫీదు తీసుకుని పాడారామె. సిరివెన్నెల రాసిన ఆ పాట గమ్మత్తుగా ఉంటుంది.
– కె.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement