పాపం తమన్నా చెల్లెలు! | special story to real crime story | Sakshi
Sakshi News home page

పాపం తమన్నా చెల్లెలు!

Published Tue, Jul 11 2017 12:09 AM | Last Updated on Tue, Sep 5 2017 3:42 PM

పాపం తమన్నా చెల్లెలు!

పాపం తమన్నా చెల్లెలు!

క్రైమ్‌ పేరెంటింగ్‌

హిందీలో ‘తమన్నా’ అంటే ఆశ.. కోరిక.. కాంక్ష. ఏదో కావాలన్న ఆశ. ఏదో అయిపోవాలన్న కోరిక. ఒక్క ఛాన్స్‌ వస్తే..  స్టార్‌ అవ్వాలన్న కాంక్ష. ఇవన్నీ లేకపోతే.. అమ్మాయిలు హీరోయిన్‌లు ఎలా అవుతారు? కష్టం ఉండాలి.. నష్టం ఉండాలి.. దీక్ష ఉండాలి.. ప్రతిభ ఉండాలి.
వీటన్నిటితో పాటు ఇంకోటి కూడా ఉంటోంది! అమాయకత్వం! ‘అచ్చు.. తమన్నా చెల్లెల్లా ఉన్నావు’ అని ఎవరైనా అంటే... మన అమ్మాయికి ఆశ కలగదా? కోరిక పుట్టదా? కాంక్ష.. పెడదారి పట్టదా?!


‘‘పిల్ల ఏం చేస్తోంది? ఏమాలోచిస్తోంది– అని ఒక్కసారైనా పట్టించుకున్నావా?’’ కోపంతో అరిచాడు సురేష్‌ భార్య మీద.‘‘దాని మనసులో ఇలాంటి ఆశలున్నాయని నేను మాత్రం కలగన్నానా?’’ కళ్లల్లో తిరిగిన నీళ్లను పమిటచెంగుతో తుడుచుకుంటూ అంది రత్న.‘ముందునుంచీ చెప్తున్నా.. పిల్లలు చెప్పినట్టు ఆడొద్దు.. ఏది కావాలంటే అది ఇప్పించొద్దు అని?’.. అదే పిచ్‌లో అన్నాడు సురేశ్‌.‘‘తప్పు నా ఒక్కదానిదేనా? మీకు లేదా బాధ్యత? ఎప్పుడూ ఆఫీస్, క్యాంప్‌లు అని తప్ప ఇంట్లోవాళ్ల గురించి ఏనాడైనా పట్టించుకున్నారా?’’ ఒక్కసారిగా ఏడ్చేసింది రత్న. పరిస్థితి తీవ్రం అవుతోందని గ్రహించి రత్న తల్లిదండ్రులు, సురేష్‌ తల్లిదండ్రులు.. మధ్యలో కల్పించుకున్నారు.

‘‘ఇది తప్పొప్పులు ఎంచుకునే టైమ్‌ కాదు. ముందు పిల్ల జాడ వెదికే ప్రయత్నం చేయండి’’ అన్నాడు సురేష్‌ తండ్రి. ‘‘బావగారూ... రశ్మి ఇంటిలోనుంచి వెళ్లిపోయి మూడు రోజులు. పరువుకోసం చూసుకుంటే మొదటికే మోసం రావచ్చు. పోలీస్‌ కంప్లయింట్‌ ఇస్తేనే మంచిది’’ అన్నాడు రత్న తమ్ముడు. బేలగా చూశాడు సురేష్‌. అక్కడున్న అందరూ అవునన్నట్టు కళ్లతోనే చెప్పారు. తప్పదన్నట్లుగా రశ్మీ ఫోటో, వెళ్తూ వెళ్తూ ఆ అమ్మాయి రాసిన ఉత్తరం.. తీసుకొని బావమరిదిని వెంటబెట్టుకొని పోలీస్‌స్టేషన్‌కు వెళ్లాడు సురేష్‌.

హైదరాబాద్‌.. యూసుఫ్‌గూడ
‘‘అబ్బ.. సేమ్‌ టు సేమ్‌ తమన్నా!’’ అన్నాడు మధు. బ్లూజీన్స్, బ్లాక్‌ టీ షర్ట్‌ వేసుకొని వచ్చిన రశ్మిని చూసి ముగ్ధుడైనట్టు. ‘‘అంత కలర్‌ ఉన్నానా?’’ ఆ కితాబుకు కొంచెం సిగ్గు పడుతూ అంది రశ్మి. ‘‘అంతకన్నా ఎక్కువే ఉన్నావ్‌! అయినా నీకేం తక్కువరా.. మంచి కలర్, మాంచి ఫిగర్‌.. నువ్వు హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చాక నిన్ను చూసి తమన్నా కుళ్లుకోకపోతే అడుగు!’’ సవాలు విసురుతున్నట్టుగా అన్నాడు మధు.   ‘‘తెలుగులో కాదు.. హిందీలో చాన్సెస్‌ కావాలి.. రాజమండ్రిలో నన్నంతా ‘బాలీవుడ్‌ భామలాగుంటావే’ అనేవాళ్లు’’ అంది అద్దం ముందు అటూ ఇటూ రకరకాల భంగిమల్లో కదులుతూ. ‘‘అబ్బో..’’ అని సణుక్కున్నాడు. ‘‘ఏమన్నావ్‌?’’ అంది కాస్త మొహం ఎర్రగా చేసుకుంటూ.. ‘‘అబ్బా.. అన్నాను మెచ్చుకుంటూ’’ సవరించుకున్నాడు మధు. రశ్మి మొహం వెలిగిపోయింది.‘‘నీకు తెలుసా.. నేను లాంగ్‌ టాప్‌.. నీలెంగ్త్‌ లెగ్గింగ్‌ వేసుకుంటే...’’ అని రశ్మీ చెప్తుంటే ‘బాబోయ్‌ మొదలెట్టిందిరా మళ్లీ’ అన్నట్టుగా చూపులను నేలకు దించి.. తనలో తనే మెల్లగా గొణుక్కున్నాడు.

‘‘ఏయ్‌.. మధూ..’’– వింటున్నావా లేదా అన్నట్టుగా గద్దించింది.‘‘అదే.. రశ్మీ.. వింటున్నా... నీలెంగ్త్‌ లెగ్గింగ్, లాంగ్‌ టాప్‌ వేసుకొని వెళితే నీ ఫ్రెండ్స్‌ అంతా ‘దీపికా పడుకోన్‌లా ఉన్నావే’ అని కాంప్లిమెంట్‌ ఇచ్చేవాళ్లు అవునా...’’ ఎన్నిసార్లు చెప్తావ్‌ అనే ధ్వని మధు మాటలో.‘‘దీపికా కాదు.. కత్రినా..’’ సరిదిద్దింది.‘‘అదేలే.. జీన్స్‌ వేసుకుంటే దీపికాలా .. హెయిర్‌ లీవ్‌ చేస్తే అనుష్కలా.. లాంగ్‌స్కర్ట్‌ వేసుకుంటే ఆలియాలా.. పటియాలా వేసుకుంటే కరీనాలా.. కదా..’’ అన్నాడు మధు.. కరెక్ట్‌గా గుర్తుంది అన్నట్టుగా!‘‘ఊ.. అవును’’ మళ్లీ సిగ్గుపడింది.‘‘రశ్మీ.. ఈరోజు మా ఫ్రెండ్‌ వచ్చేస్తున్నాడు రూమ్‌కి. మనం ఖాళీ చేసేయ్యాలి’’ అన్నాడు.

‘‘ఎలా మరి?’’ అంది కంగారుగా.‘‘నువ్వేమో ‘బాలీవుడ్‌ చాన్స్‌లే కావాలి’ అంటున్నావ్‌. ముంబైలో మా ఫ్రెండ్‌కి రాత్రి కాల్‌ చేస్తే.. ‘ముందు మోడలింగ్‌కి ట్రై చేయాల్రా.... తర్వాతే సినిమాల్లోకి’ అన్నాడు. వాడికి నీ ఫోటో కూడా పంపా..’’ చెప్పాడు.‘‘ఏమన్నాడు..’’ రశ్మీ గొంతులో ఆత్రం, కళ్లల్లో మెరుపుతో అడిగింది.‘మోడలింగ్‌లో ఈజీగా చాన్స్‌ దొరుకుతుందిరా ఆ ఆమ్మాయికి అన్నాడు. కాని.. ’ అంటూ ఆగాడు మధు.‘‘కాని ఏంటీ?’’ ఆందోళనగా అంది ఆమె.‘‘మనం ముంబై వెళ్లడం అంత ఈజీకాదు. నాకు అక్కడ ఫ్రెండ్స్‌ ఉన్నారు అయితే ఇక్కడలా కాదు. రూమ్‌లో షేర్‌ చేసుకోవడానిక్కూడా ఇష్టపడరు. ముందు కనీసం వారం రోజులైనా హోటల్లో ఉండాలి.. ఆ తర్వాత రూమ్‌ వెదుక్కోవాలి. నా దగ్గర అంత డబ్బు లేదు’ ’అన్నాడు బాధపడ్తున్నట్టు.‘‘నా దగ్గర ఉంది కదా..’’ అంటూ గబగబా తన హ్యాండ్‌ బ్యాగ్‌ తీసి ఐదు వందల నోట్లతో ఉన్న యాభైవేల రూపాయల కట్ట తీసింది ‘‘ఇవిగో... ‘ఇంకా మా అమ్మమ్మ నా కోసం చేయించిన చైన్, బ్రేస్‌లెట్, ఇయర్‌రింగ్స్, రెండు రింగ్స్‌ కూడా తెచ్చా.. ఏదో ఒక చాన్స్‌ దొరికేదాకా పనికొస్తాయి కదా..’’ అంది భరోసా ఇస్తున్నట్టు. ఈసారి మెరుపు మధు కళ్లల్లో.‘‘రేపటికి రిజర్వేషన్‌ చేయించనా ముంబైకి’’ అన్నాడు మధు. ‘‘డన్‌’’ అంది రశ్మి. కుడిచేయి పిడికిలి బిగించి బొటన వేలును మాత్రం పైకి చూపిస్తూ!

‘‘బావగారూ... రశ్మి ఇంట్లోనుంచి వెళ్లిపోయి మూడు రోజులు. పరువుకోసం చూసుకుంటే మొదటికే మోసం రావచ్చు. పోలీస్‌ కంప్లయింట్‌ ఇస్తేనే మంచిది’’ అన్నాడు రత్న తమ్ముడు.

రాజమండ్రి పోలీస్‌స్టేషన్‌
‘‘చదువు చదువు అని ఏమన్నా ఇబ్బంది పెట్టారా?’’ అడిగాడు ఎస్‌ఐ.‘‘లేదు సర్‌. ఒక్కానొక్క కూతురు. తననెప్పుడూ ఏ విషయంలోనూ ఇబ్బంది పెట్టరు మా అక్క, బావ’’ ఆన్సర్‌ చేశాడు సురేష్‌ బావమరిది.‘‘మరి.. బాయ్‌ఫ్రెండ్‌...’’ ఆగాడు ఎస్‌ఐ.‘‘అబ్బే .. చిన్నపిల్లండి. మొన్ననే టెన్త్‌ అయిపోయింది. అలాంటిదేం లేదు సర్‌’ అన్నాడు నొచ్చుకున్నట్టుగా సురేష్‌.‘ఆరోజు కోప్పడ్డం కాని... కొట్టడం కాని ఏమన్నా చేశారా..’’ ఎస్‌ఐ కూపీలాగుతుండగానే రశ్మీ రాసిన లెటర్‌ తీసిచ్చాడు సురేష్‌. చదవడం పూర్తి చేస్తూ ‘సినిమా పిచ్చి అన్నమాట’ అన్నాడు లెటర్‌ను పేపర్‌వెయిట్‌ కింద పెడుతూ ఎస్‌ఐ. ఏం మాట్లాడాలో తెలియక మొహమొహాలు చూసుకున్నారు బావ, బావమరుదులు.‘‘వెళ్తూ వెళ్తూ ఏమన్నా తీసుకెళ్లిందా?’’ ఎస్‌ఐ. ‘‘యాభై వేలు, కొంచెం బంగారం’’ చెప్పాడు బావమరిది.‘ఊ...’ నిట్టూరుస్తూ కానిస్టేబుల్‌ని పిలిచాడు ఎస్‌ఐ.. అమ్మాయి ఫోటో తీసుకొని వివరాలు రాసుకొమ్మని పురమాయించాడు.‘‘సర్‌.. కొంచెం త్వరగా..’’ రిక్వెస్ట్‌ చేశాడు సురేష్‌. ‘ట్రై చేస్తాం లెండి. అయినా మూడు రోజుల క్రితం అమ్మాయి కనిపించకుండా పోతే ఇప్పుడా చెప్పడం’’ అని చీవాట్లు కూడా వేశాడు.

సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌
‘‘ఫోన్‌ కాల్‌ మాట్లాడి వస్తానని వెళ్లావ్‌? అటే వెళ్లి పోయావ్‌?’’ తనను అంతసేపు వెయిట్‌ చేయించాడనే కోపంతో అంది రశ్మీ.‘‘సారీ! కాస్త లేట్‌ అయింది’’ అని ఆమెకు సమాధానమిచ్చి తన పక్కనే ఉన్న వ్యక్తిని చూపిస్తూ ‘‘రశ్మీ.. ఇతని పేరు సతీష్‌. నా ఫ్రెండ్‌’’ అని పరిచయం చేశాడు.‘‘హాయ్‌’’ అంది రశ్మి. కళ్లతోనే పలకరించాడు ఆ వ్యక్తి.కాస్త దూరంగా వీళ్ల ముగ్గురినే గమనిస్తూ ఇద్దరు మగవాళ్లు, ఇద్దరు ఆడవాళ్లు నిలబడున్నారు.మధు అటూ ఇటూ చూసి రశ్మీకి దగ్గరగా వస్తూ కాస్త చిన్నగా.. ‘‘సారీ.. నాకు ముంబై రావడం కుదరట్లేదు. ఇక్కడ షూటింగ్‌ పనిపడింది అర్జెంట్‌గా. మూడు రోజుల్లో వస్తాను. సతీష్‌ నాకు చాలా క్లోజ్‌. బాగా బతిమాలితే నిన్ను తీసుకెళ్తానన్నాడు. అక్కడ నీకు ఆనంద్‌ను ఇంట్రడ్యూస్‌ చేస్తాడు. నువ్వు ఇచ్చిన డబ్బు ఆనంద్‌ అకౌంట్‌లో వేశా. నీకు అవసరం ఉన్నప్పుడు ఇస్తాడు. గోల్డ్‌ తాకట్టు పెట్టి తీసుకున్న ఎమౌంట్‌ సతీష్‌ దగ్గర ఉంది. ఖర్చులకు కావాలి కదా.. ’ నచ్చజెప్పాడు.

‘‘అయ్యో నువ్వు రావట్లేదా? మరి అతనికి అన్నీ తెలుసా?’’ అడిగింది రశ్మి.‘‘అన్నీ తెలుసు. నీ స్క్రీన్‌ టెస్ట్‌ కల్లా నేను అక్కడ ఉంటాగా’’  భరోసా ఇచ్చాడు. స్క్రీన్‌ టెస్ట్‌ అనగానే మొహం చేటంతయింది రశ్మీకి. సతీష్‌కు కళ్లతోనే ఏదో సైగ చేస్తూ... ‘‘వస్తా మరి’’ అని అక్కడ నుంచి కదులుతుండగా... నలుగురు మనుషులు వేగంగా వచ్చి ఈ ముగ్గురినీ పట్టేసుకున్నారు ‘‘ఎక్కడికిరా వచ్చేది’’ అంటూ! వాళ్లు పోలీసులు. రశ్మి తల్లిదండ్రులకు ఫోన్‌ చేశారు ‘మీ అమ్మాయి దొరికింది’ అని.

పేరెంట్స్‌కీ కౌన్సెలింగ్‌
మధుది అమలాపురం. హైదరాబాద్‌లో బ్రోకర్‌ పనులు చేసేవాడు. ముఖ్యంగా అమ్మాయిల ట్రాఫికింగ్‌లో మధుకి క్రైమ్‌రికార్డ్‌ ఉంది.కొన్నాళ్లు హైదరాబాద్‌ జైల్లో కూడా ఉన్నాడు. కౌన్సెలింగ్‌ ఇచ్చి మరీ విడుదల చేశారు పోలీసులు. అప్పుడే రాజమండ్రికి వెళ్లాడు వాళ్ల అక్క దగ్గరకు. అక్కడే రశ్మి పరిచయం అయింది. మెల్లగా తనతో స్నేహం చేశాడు. ఆమెకు మోడలింగ్‌ అంటే మోహమని, సినిమా అంటే పిచ్చి అని అర్థమైంది. దాన్ని  క్యాష్‌ చేసుకుందా మనుకున్నాడు. తనకు హైదరాబాద్, ముంబైలలో చాలామంది సినిమా ఫ్రెండ్స్‌ ఉన్నారని... ఈజీగా చాన్స్‌లిప్పిస్తానని, ఓవర్‌నైట్‌లో హీరోయిన్‌ను  చేసేస్తానని రశ్మీని మాయలోపెట్టాడు. గుడ్డిగా నమ్మింది ఆ పదహారేళ్ల పిల్ల. ఒకరోజు మధుతో ట్రైన్‌ ఎక్కింది. ఇప్పుడిలా పోలీసుల చేతికి దొరికింది.

‘చూడమ్మాయ్‌.. వాడు నిన్ను ముంబై తీసుకెళ్తోంది నీకు సినిమా చాన్స్‌లిప్పించడానిక్కాదు. అక్కడ రెడ్‌లైట్‌ ఏరియాకు పంపించడానికి. నీ దగ్గరున్న డబ్బు లాక్కొని నిన్ను ఆ సతీష్‌ అనే వాడికి అమ్మేశాడు తెలుసా... ’ అన్నాడు ఎస్‌ఐ. అవాక్కయింది రశ్మీ.‘‘చూడ్డానికి బాగుండగానే సినిమాలో చాన్స్‌లు దొరకవు. ఒకవేళ ఆ కెరీర్‌ కావాలనుకుంటే దానికి వేరే మార్గం ఉంటుంది. ఇలా ఎవరు పడితే వాళ్లు సినిమా చాన్స్‌లిస్తామంటే నమ్మకూడదు. వెంట వెళ్లకూడదు. ముందు బాగా చదువుకో. లోకజ్ఞానం పెంచుకో. అర్థమైందా?’’ అని చెప్పి రాజమండ్రి పంపించారు. అక్కడ ఆమె తల్లిదండ్రులకూ కౌన్సెలింగ్‌ ఇచ్చారు..‘‘టీన్స్‌లో ఉన్న అమ్మాయిల పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి. బయటి వాళ్లు ఎవరైనా ‘మీ అమ్మాయికేం. చందమామ తునక.. నాకు ఫలానా ప్రొడ్యూసర్‌ తెలుసు.. కెమెరామన్‌ తెలుసు.. డైరెక్టర్‌ తెలుసు.. చాన్స్‌లు ఇప్పిస్తా. డబ్బే డబ్బు’ అంటారు. అలాంటి వాళ్లను దరిదాపుల్లోకి కూడా రానివ్వద్దు. ఒక్క సినిమా చాన్సే కాదు... సిటీలో మంచి ఉద్యోగాలు ఉన్నాయని, బోలెడు డబ్బని.. ఆడవాళ్లు, మగవాళ్లు, ఎవరు చెప్పినా నమ్మి పిల్లలను వాళ్ల వెంట పంపొద్దు’’ అని. రశ్మి అమ్మా నాన్నా ఊపిరి పీల్చుకున్నారు.
– శరాది

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement