గుమ్మానికి పెళ్లి తోరణం | special story to temple | Sakshi
Sakshi News home page

గుమ్మానికి పెళ్లి తోరణం

Published Tue, Aug 30 2016 11:22 PM | Last Updated on Mon, Sep 4 2017 11:35 AM

గుమ్మానికి పెళ్లి తోరణం

గుమ్మానికి పెళ్లి తోరణం

దేవుని గడప
కల్యాణ క్షేత్రాలు


ఇది గడప. దేవుని గడప. అవును... ఇక్కడి శ్రీ లక్ష్మి వెంకటేశ్వరస్వామి క్షేత్రం శ్రీ వేంకటేశ్వరుని సన్నిధికి చేరుకోవడానికి గడపలాంటిది. ప్రాచీన కాలంలో ఉత్తర ప్రాంతం భక్తులు తిరుమలకు వెళుతూ ఇక్కడ ఆగి ఆ తర్వాత తిరుమలకు వెళ్లేవారు. అక్కడ దాకా వెళ్లలేనివారు కడప రాయునికే తమ ముడుపులు అందజేసి వెనుతిరిగేవారు.


ప్రాచీన క్షేత్రం: దేవుని గడప క్షేత్రాన్ని అత్యంత ప్రాచీనమైన ఆలయాలలో ఒకటిగా పేర్కొంటారు. ఆలయంలో మూలవిరాట్ వెనుక వైపు దాదాపు 13 అడుగుల ఎత్తయిన శ్రీ ఆంజనేయస్వామి కుడ్య శిల్పం ఉంటుంది. ఈ క్షేత్ర పాలకుడు ఆయనే. అందుకు నిదర్శనంగా ఆలయం ఎదురుగా 50 మీటర్ల దూరంలో  హనుమాన్ ఆలయం ఉంటుంది. ప్రధాన ఆలయానికి ఆనుకుని దక్షిణం వైపు పడమర ముఖంగా శ్రీ పద్మావతీదేవి ఆలయం ఉంది. స్వామిని దర్శించుకునే భక్తులు ఆ వెంటనే అమ్మవారిని కూడా దర్శించుకోవడం సాంప్రదాయం.

 
ముస్లిం ఆడబిడ్డ: ఆలయప్రాంగణంలో ఆండాల్ తయార్, సుదర్శన్ ఆళ్వార్ల సన్నిధి కూడా ఉన్నాయి. ఆలయం ఎదురుగా అత్యంత ప్రాచీనమైన పెద్ద పుష్కరిణి ఎప్పుడూ నీటితో జలకళతో ఉంటుంది. జనవరిలో వారం రోజులపాటు జిల్లాలోనే అత్యంత వైభవంగా బ్రహ్మోత్సవాలను నిర్వహిస్తారు. వైకుంఠ ఏకాదశి నాడు ఉత్తర ద్వారం ద్వారా స్వామి దర్శనం కల్పిస్తారు. ఆలయంలోని పద్మావతి అమ్మవారిని తమ ఆడబిడ్డ అలివేలు మంగగా, స్వామిని తమ బంధువుగా భావించి ఉగాదిరోజున దాదాపు వెయ్యి మందికి పైగా ముస్లింలు స్వామికి భత్యం సమర్పించి స్వామి, అమ్మవార్లను దర్శించుకోవడం ఆనవాయితీ. జిల్లాలో మత సామరస్యం కొనసాగడానికి ఈ ఆలయం కూడా ఎంతగానో ఉపయోగపడుతుంది.

 
కల్యాణ కాంతులు....: దేవునికడప శ్రీలక్ష్మి వెంకటేశ్వరస్వామి ఆలయంలో స్వామి శ్రీ లక్ష్మి సమేతుడై ఉండడంతో ఈ క్షేత్రంలో వివాహాలు చేసుకుంటే ఆ జంటలకు శుభం కలుగుతుందని ఈ ప్రాంత వాసుల్లో ప్రగాఢమైన విశ్వాసం ఉంది. దాదాపు సంవత్సరంలో మూఢం, ఆషాడం మినహా మిగతా రోజుల్లో ఆలయం నిత్య కల్యాణంగా ఉంటుంది. సీజన్‌లో పాతిక నుంచి వందకు పైగా వివాహాలు కేవలం స్వామి సన్నిధిలోనే నిర్వహిస్తారు. ఒక దశలో వధూవరులు, వారి బంధుమిత్రులతో ఆలయ ప్రాంగణం కిటకిటలాడుతుంది. ప్రతి వివాహానికి ఆలయ అధికారులు సర్టిఫికెట్‌ను అందజేస్తారు. వధూవరుల తల్లిదండ్రులు తగిన ఆధారాలు చూపించి ముందే వివాహాల కోసం రిజర్వు చేయించుకోవాల్సి ఉంటుంది. 2007లో ఈ ఆలయాన్ని తిరుమల-తిరుపతి దేవస్థానాలు తమ నిర్వహణలోకి తీసుకున్నాయి. కల్యాణాల రద్దీని గమనించిన అధికారులు ఇటీవల ఆలయానికి సమీపంలో రూ.5 కోట్ల నిధులతో ప్రత్యేకంగా కల్యాణమండపంతోపాటు గదులు, ఇతర వసతులతో భారీ భవనాన్ని నిర్మిస్తున్నారు. ఆలయ ప్రాంగణంలోని కల్యాణ కట్టలో భక్తులు నిత్యం తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకుంటారు. స్వామి, అమ్మవార్లపై భక్తితో ఈ ప్రాంత వాసులు ఎక్కువ మంది వారి పేర్లు పెట్టుకుంటారు.

 

ప్రయాణమార్గం:  హైదరాబాదు నుంచి సుమారు 450 కిలోమీటర్ల దూరంలో కడప ఉంది. కడప, రేణిగుంట విమానాశ్రయాలు అందుబాటులో ఉన్నాయి. తిరుపతి నుంచి 170 కిలోమీటర్ల దూరంలో ఈ క్షేత్రం ఉంది. చెన్నై, హైదరాబాద్ నుంచి నిత్యం రైలు సౌకర్యం కూడా ఉంది. - మోపూరి బాలకృష్ణారెడ్డి, కడప

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement