కమనీయంగా కైలాస వాసుని కల్యాణం
కడప కల్చరల్ : దక్షిణ కైలాసం శ్రీశైల వాసుడు శ్రీ మల్లికార్జునుడు కొండ దిగి కడప గడపన తన దేవేరితో కల్యాణ శోభతో భక్తులను ఆశీర్వదించాడు. శ్రీశైలం దేవస్థానం ఆధ్వర్యంలో సోమవారం కడప మున్సిపల్ స్టేడియంలో శ్రీ భ్రమరాంబ మల్లికార్జునస్వామి కల్యాణోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. ఆలయ ఏఈఓ హరినాథరెడ్డి, జిల్లా దేవాదాయశాఖ అసిస్టెంట్ కమిషనర్ శంకర్‌బాలాజీల పర్యవేక్షణలో స్వామి, అమ్మవార్లను వధూవరులుగా అలంకరించి పెళ్లిపీటలపై కొలువుదీర్చారు. వేద పండితులు శాస్త్రోక్తంగా కల్యాణ క్రతువును క్రమంగా నిర్వహించారు. కార్యక్రమ ప్రారంభంలో జిల్లా కలెక్టర్ కేవీ సత్యనారాయణ దంపతులు కల్యాణ మూర్తులను దర్శించుకున్నారు. శ్రీశైలం దేవస్థాన అర్చకులు వారిని ఆశీర్వదించి తీర్థ ప్రసాదాలు అందజేశారు.
ప్రవాహంలా ‘సొట్టు’ వ్యాఖ్యానం..
ప్రముఖ వేద పండితులు, వ్యాఖ్యాన వాచస్పతి బ్రహ్మశ్రీ సొట్టు సాంబమూర్తి ఆది దంపతుల కల్యాణోత్సవాన్ని వర్ణించిన తీరు భక్తులందరినీ విశేషంగా ఆకట్టుకుంది. ఒక దశలో ప్రముఖులందరూ ఆయన ప్రసంగాన్ని ఎంతో ఆసక్తిగా విన్నారు. పలువురు ధార్మిక సంస్థల ప్రతినిధులు, పెద్ద సంఖ్యలో భక్తులు ఈ కార్యక్రమానికి హాజరై కల్యాణమూర్తులైన ఆది దంపతులను దర్శించుకున్నారు. స్వర్ణహంపి పీఠా«ధిపతి కల్యాణోత్సవంలో ప్రత్యక్షంగా పర్యవేక్షించారు. స్వామి శౌనక చైతన్య, శ్రీశైలం దేవస్థానం అధికారులు తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు.