దేవస్థానేతర గృహాలకు విద్యుత్ కనెక‌్షన్ కట్
దేవస్థానేతర గృహాలకు విద్యుత్ కనెక‌్షన్ కట్
Published Tue, Jan 31 2017 10:51 PM | Last Updated on Thu, Sep 27 2018 5:46 PM
· ఆందోళనలో వ్యాపారులు
· మొన్నటి దాకా దుకాణాలను
ఖాళీ చేయాలని ఆదేశం
· నేడు వ్యాపార నివాస గృహాలపై
దృష్టి పెట్టిన ఈఓ
· పాలుపోక ప్రజాప్రతినిధుల కోసం
వ్యాపారులు ఎదురు చూపు
శ్రీశైలం: శ్రీశైలదేవస్థానం పరిధిలో అనేక ఏళ్లుగా వ్యాపారాలను నిర్వహించుకుంటూ గతంలో దేవస్థానం ఉన్నతాధికారులు కేటాయించిన నివాసిత గృహాల్లో ఉంటున్న వ్యాపారస్తుల (దేవస్థానేతరులు)పై ఈఓ నారాయణ భరత్ గుప్త ఉక్కుపాదం మోపారు. మొన్నటి వరకు ప్రధాన మాడా వీధుల్లో ఉన్న దుకాణాలను షాపింగ్ కాంప్లెక్స్‌లోకి జనవరిలోగా తరలించడానికి ఆయన విశ్వప్రయత్నం చేశారు. అయితే హఠాత్తుగా రాష్ట్ర దేవాదాయశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జేఎస్వీ ప్రసాద్ రావడం, స్థానిక ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖరరెడ్డి, ఎమ్మెల్సీ శిల్పాచక్రపాణిరెడ్డితో కలిసి ఆయన దుకాణాదారులతో సుదీర్ఘ చర్చలు జరిపారు. వారు గడువు కోరడంతో మార్చి నెలాఖరు వరకు పొడిగించారు.
ఆ తరువాత అంతా ప్రశాంతంగా ఉంది అనుకుంటున్న సమయంలో ఈఓ ఇప్పుడు దేవస్థానానికి సంబంధించిన గృహాల్లో నివాసముంటున్న వ్యాపారులపై దృష్టి సారించారు. గతంలో ఆయన దేవస్థానం సిబ్బంది కోసం ఆ గృహాలను స్వాధీనం చేయాల్సిందిగా ఆదేశించారు. అయితే అది అమలు కాలేదు. ఇప్పుడు ఎలాగైనా వాటిని ఖాళీ చేయాల్సిందేనని పట్టుబట్టారు. యాత్రిక నివాస్, పెద్దసత్రం, జగద్గురు సత్రం–యాదవ సత్రాల సమీపంలో ఉన్న గృహాల్లో ఉంటున్న దేవస్థానేతరులను ఖాళీ చేయించడానికి విద్యుత్‌ను నిలిపి వేయాల్సిందిగా రెవెన్యూ అధికారులకు ఆదేశించారు. ఈఓ ఆదేశాల మేరకు వారు విద్యుత్ నిలుపుదల చేశారు. దీనిపై దేవస్థానేతరులు ప్రజాప్రతినిధులకు తెలియజేశారు. ప్రస్తుతం ఈఓ క్యాంప్‌కెళ్లడంతో ఆయన తిరిగి వచ్చిన తరువాత పరిస్థితులు ఎక్కడికి దారితీస్తాయోననే టెన్షన్ వ్యాపారులకు పట్టుకుంది. కాగా దేవస్థానంలో ఇటీవల చేరిన కొంత మంది ఉద్యోగులకు నివాసగృహాల కొరత ఉన్నందువల్లే ఈఓ ఈ కఠిన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. మరో రెండు మూడు రోజుల్లో పరిస్థితులు ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉందని స్థానికులు భావిస్తున్నారు.
Advertisement
Advertisement