శ్రీశైలం చుట్టూ రింగ్ రోడ్డు!
శ్రీశైలం చుట్టూ రింగ్ రోడ్డు!
Published Tue, Sep 27 2016 12:07 AM | Last Updated on Thu, Sep 27 2018 5:46 PM
– ఆర్‌ఎఫ్‌పీకు ఆహ్వానం ...
– 7 కిలోమీటర్ల మేర ఏర్పాటు
– దేవస్థానం తరఫున ఇన్‌క్యాప్ బిడ్ల పిలుపు
– ఆదాయాన్ని రాబట్టేందుకు టోల్ ప్లాజా ఏర్పాటు
సాక్షి ప్రతినిధి, కర్నూలు: శ్రీశైలంలో రింగు రోడ్డును ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. సుమారు 100 అడుగుల విస్తీర్ణంతో క్షేత్రం చుట్టూ దీనిని వేసేందుకు ప్రణాళిక రచించింది. సుమారు 7 కిలోమీటర్ల పొడవున నిర్మాణం కానుంది. శ్రీశైలం ఆలయం చుట్టూ ఏర్పాటకానున్న రింగు రోడ్డును ఆది శంకర మార్గ్‌గా నామకరణం చేశారు. దేవస్థానం తరఫున ఆంధ్రప్రదేశ్ మౌలిక సదుపాయాల సంస్థ (ఇన్‌క్యాప్) రింగు రోడ్డు ప్రాజెక్టు రూపకల్పన కోసం రిక్వెస్ట్ ఫర్ ప్రపోజల్ (ఆర్‌ఎఫ్‌పీ)ను ఆహ్వానించనుంది. అయితే ఈ రింగురోడ్డు కోసం ఎక్కువ భూమిని సేకరించే అవసరం లేకుండా చూడాలనేది ప్రభుత్వ ఆలోచనగా ఉంది. కేవలం తక్కువ భూసేకరణ ద్వారానే ఈ ప్రాజెక్టును పూర్తి చేయాలని యోచిస్తోంది. మొత్తం ప్రాజెక్టును ప్రభుత్వ, ప్రై వేటు భాగస్వామ్య (పీపీపీ) పద్ధతిలో చేపట్టనున్నారు. తద్వారా మొత్తం ప్రాజెక్టు నిర్మాణాన్ని ప్రై వేటు సంస్థ చేపట్టనుంది. ఇందుకోసం టోల్‌ప్లాజాను ఏర్పాటు చేసి భక్తుల నుంచి టోలు ఫీజు వసూలు చేయనున్నారు.
టోలు తీస్తారు...!
శ్రీశైలంలో ఏర్పాటు చేసే రింగు రోడ్డు నిర్మాణాన్ని ప్రై వేటు సంస్థ చేపడుతుంది. ఈ ప్రాజెక్టుకు అయ్యే వ్యయాన్ని రాబట్టుకునేందుకు ఆ సంస్థే టోల్‌ప్లాజాను ఏర్పాటు చేసి ఆదాయాన్ని ఆర్జించాలనేది ఆలోచనగా ఉంది. ఈ టోల్‌ప్లాజా వద్ద కేవలం 5 సెకన్లలోనే వచ్చిన వాహనం వెళ్లిపోయేలా చూడాలని కూడా నిర్ణయించారు. ప్రాజెక్టు వ్యయం తిరిగి కాంట్రాక్టు సంస్థకు వస్తే వచ్చే వరకు దీనిని కొనసాగించనున్నారు. శ్రీశైలానికి వచ్చే భక్తుల రద్దీ దష్ట్యా ఈ సమయం 10 సంవత్సరాల నుంచి 40 ఏళ్ల వరకూ ఉండవచ్చునని అధికారులు భావిస్తున్నారు. సాధారణ రోజుల్లో శ్రీశైలానికి ప్రస్తుతం 10 వేల మంది భక్తులు వస్తున్నారు. వారాంతరం సెలవులల్లో ఈ సంఖ్య 50 వేలకు, ప్రత్యేక పండుగల సందర్భంగా 2 లక్షల వరకూ వెళుతోందని అంచనా వేశారు. ప్రాజెక్టు వ్యయం ఎంత అనే విషయాన్ని మొత్తం ప్రాజెక్టు నివేదిక తయారుచేసేందుకు ఎంపికయ్యే సంబంధిత కాంట్రాక్టు సంస్థనే నిర్ణయించాల్సి ఉంటుంది. ప్రాజెక్టు నివేదిక తయారు చేసేందుకు ఎంపికయ్యే సంస్థ... ఎనిమిది వారాల్లోగా సాంకేతిక, ఆర్థిక సాధ్యాసాధ్యాల నివేదికను అందజేయాలని ప్రభుత్వం ఆదేశించింది.
Advertisement