గట్టిగా... చెట్టులా...
వృక్షం ఎంత భారీగా ఉన్నా కాండం మీదనే నిలబడి ఉంటుంది. అదే విధంగా మనిషి కూడా శరీరాన్ని ఒకే కాలు మీద స్థిరంగా నిలిపి సాధన చేయడం ద్వారా అలాంటి స్థిరత్వాన్ని అద్భుత శక్తిని సంతరించుకోవచ్చు. అందుకే దీనిని వృక్షాసనం అంటారు.
ఉపయోగాలు: వెన్నెముక తీరుకు ఉపకరిస్తుంది. ఎడమకాలి మీద చేసినప్పుడు హై బీపీకి, కుడికాలి మీద చేసినప్పుడు లోబీపీకి పరిష్కారంగా పనికివస్తుంది. పించ్ నర్వ్, సయాటికా సమస్యలను నివారిస్తుంది. వృద్ధాప్యంలో జారిపడే ఇబ్బందులను పరిహరించడానికి ఒకే కాలు మీద బ్యాలెన్స్ చేయడం చాలా ఉపకరిస్తుంది. కాలి కండరాలకు, భుజాలకు బలం చేకూరుస్తుంది. ఏకాగ్రత, సమతుల్యతకి మంచిది. గర్భవతులు తొలి ఆర్నెల్ల సమయంలో సాధన చేస్తే పెల్విక్ ప్రాంతంలో కండరాలకు వ్యాకోచం పెరిగి సుఖ ప్రసవానికి సహకరిస్తుంది. వృక్షాసనాన్ని మూడు విధాలుగా సాధన చేయవచ్చు.
వృక్షాసన 1: శరీరాన్ని సమస్థితిలో నుంచి ఎడమ కాలి మీద నిలబడాలి. కుడికాలిని ముందుకు మడచి పాదాన్ని పూర్తిగా ఎడమ తొడకి పై భాగంలో కంద (జననేంద్రియానికి, గుదముకి మధ్య ఉండే ప్రాంతం)కి దిగువన ఆనించాలి. శ్వాస తీసుకుంటూ రెండు అరచేతులనూ ఆకాశంవైపు చూపిస్తూ స్ట్రెచ్ చేస్తూ పైకి తీసుకెళ్లాలి. అక్కడ అరచేతులను నమస్కార ముద్ర తరహాలో జోడించాలి. ఏదైనా శారీరక సమస్య వల్ల జోడించడం కుదరకపోతే చేతుల్ని దూరంగానే ఉంచవచ్చు. రెండు, మూడు సాధారణ శ్వాసల తర్వాత నెమ్మదిగా శ్వాస వదులుతూ అరచేతులు భూమికి అభిముఖంగా కిందకి తీసుకురావాలి. ఇదే విధంగా రెండోవైపు కూడా అంటే కుడికాలి మీద కూడా నిలబడి చేయాలి. ఒక కాలు మీద బ్యాలెన్స్ చేయలేని పక్షంలో వీపుని గోడకి సమంగా ఆన్చి నిలబడి గాని లేదా కుర్చీ ఆధారంగా చేయవచ్చు.
వృక్షాసన 2 సమస్థితిలో ఉండి ఎడమకాలి మీద నిల్చోవాలి. కుడికాలిని వెనుకకు మడిచి కుడి చేతితో కుడికాలి చీలమండను పట్టుకుని శ్వాస తీసుకుంటూ ఎడమచేతిని ముందు నుంచి పైకి తీసుకువెళ్లి, పైన స్ట్రెచ్ చేస్తూ కొంచెం సేపు నిలబడాలి. రెండు మూడు సాధారణ శ్వాసలు తీసుకుని నెమ్మదిగా శ్వాస వదులుతూ ఎడమచేతిని ముందు నుంచి అలాగే కిందకు శరీరం పక్కకు తీసుకురావాలి. ఇదే తరహా రెండో వైపు కూడా చేయాలి.
వృక్షాసన 3 ఎడమకాలి మీద నిలబడి, కుడికాలిని మడిచి కుడిపాదం నడుముకి ఎడమవైపు దగ్గరగా ఉంచాలి. వీలైనంతగా కటి ఎముక
(పెల్విక్ బోన్)దగ్గరగా లాగాలి. శ్వాస తీసుకుంటూ కుడిచేతిని నడుం వెనుక నుండి తీసుకుని కుడిపాదాన్ని పట్టుకుని ఎడమ చేతిని నడుము నుంచి పైకి స్ట్రెచ్ చేసి రెండు మూడు సాధారణ శ్వాసలు తీసుకుని వదులుతూ ఎడమ అరచేతిని నేలవైపు చూపుతూ శరీరం పక్కగా తీసుకురావాలి. అదే విధంగా రెండోవైపుకి కూడా చేయాలి.
యోగావగాహన
ఆసనాలు వేసేటప్పుడు శక్తి ప్రవాహం స్థూలం నుంచి సూక్ష్మంవైపుగా పయనించాలి. అంటే మూలాధారం నుంచి సహస్రారం వైపు మన ప్రయాణం ఉండాలి. (శరీరంలో ఉన్న విభిన్న నాడీ కేంద్రాలను చక్రాలుగా ఋషులు పేర్కొన్నారు. ఆధునిక శాస్త్రం నెర్వ్ సెంటర్స్ లేదా నాడీ కేంద్రాలు అంటోంది).ఈ మూల సూత్రాన్ని అనుసరించి ఆసనాలు ఐదు రకాలుగా విభజించబడ్డాయి. అవి 1.నిలబడి చేసేవి 2.కూర్చుని చేసేవి 3.పొట్ట మీద పడుకుని చేసేవి, 4.వీపు మీద పడుకుని చేసేవి. 5) తలకిందులుగా చేసేవి. నిలబడిన స్థితిలో ఆసనాలు వేసేటప్పుడు స్పైన్ అలైన్‌మెంట్, కుడి ఎడమల మధ్య సమతౌల్యం, తొడ కండరాలు, పిక్కల కండరాలు బలోపేతం అవుతాయి. శరీరానికి నిలకడను, దారుఢ్యాన్ని అందిస్తుంది.
మన శరీరపు బరువులో ప్రతి కిలోగ్రాముకు కనీసం 40 మి.లీ నీటిని తాగాలి. అంటే ఉదాహరణకు శరీరం బరువు 60 కిలోలు ఉన్నట్లయితే దాదాపు 2.5 లీటర్ల నీరు తాగడం అవసరం. ఆహారం తీసువడానికి ముందు, తరువాత కనీసం అరగంట వ్యవధి ఇచ్చి నీరు తాగాలి. అలా కాకపోతే ఆహారం తీసుకునే సమయంలో పొట్టలో ఉత్పత్తి అయ్యే హైడ్రోక్లోరిక్ ఆమ్లం, పెప్సిన్ వంటి గ్యాస్ట్రిక్ జ్యూసెస్ నీటితో కలిసి డైల్యూట్ అవడం వల్ల వాటిలో సాంద్రత తగ్గి జీర్ణశక్తి లోపిస్తుంది. ఆహారం తీసుకున్న అనంతరం ప్రతిసారీ కనీసం 300 మి.లీ నీరు తాగడం మంచిది.యోగ సాధన అంతిమ లక్ష్యం ఆత్మ దర్శనం. బ్రహ్మజ్ఞానం పొందడం, కైవల్యం, నిర్వాణ/నిబ్బాన, పరిశుద్ధాత్మ (హోలీ స్పిరిట్), తౌహీద్ (అల్లా)ని చేరటమే.
ఎ.ఎల్.వి కుమార్
ట్రెడిషనల్
యోగా ఫౌండేషన్