పరువమా.. పరుగు తీయకు | Special Story On Youth | Sakshi
Sakshi News home page

పరువమా.. పరుగు తీయకు

Published Wed, Jul 3 2019 10:11 AM | Last Updated on Mon, Jul 15 2019 1:09 PM

Special Story On Youth  - Sakshi

కౌమారం ఓ జలపాతం..కౌమారం ఓ సెలయేటి గలగల... కౌమారం పగ్గాల్లేని వేగం.. పాఠశాల దశ దాటి కళాశాలలో అడుగుపెట్టగానే.. అంతా ఓ కొత్త బంగారు లోకం... కానీ ఆ కొత్త బంగారులోకంలో పూల వెనక .. ముళ్లుంటాయి... ఆనందపు జలపాతాల వెనక సుడులుంటాయి... జారిపడితే అధఃపాతాలానికి దారులుంటాయి... అందుకే ప్రాయంలో అపాయాన్ని గుర్తెరగాలి... టీనేజీ డ్యామేజీ కాకుండా జాగురూకత ఉండాలి..ఎ దిగే వయసులో తప్పటడుగు పడకుండా చూడాలి... భవితకు క్రమశిక్షణతో బంగారు బాట వేసుకోవాలి... కౌమారంలో అంతా కొత్త బంగారులోకం.. తప్పటడుగు వేస్తే టీనేజీ...డ్యామేజీ.. కొత్త ఆనందాల వెనక అనర్థాలు..  బాలికలకు సదా అప్రమత్తత అవసరం

సాక్షి, అచ్యుతాపురం(విశాఖపట్టణం) : ప్రపంచం గురించి ఇప్పుడే తెలుసుకుంటారు. అనేక పరిచయాలు కొత్త ఆలోచనలు, ఆకర్షణలు, ఆలోచనలు తెలుస్తుంటాయి. పాలకు, నీళ్లకు తేడా తెలుసుకోలేని వయసు. పాఠశాల విద్యను పూర్తిచేసి ఉన్నత విద్యకు శ్రీకారం చుట్టే ప్రథాన ఘట్టం ఇదే. తాము ఏర్పాటు చేసుకునే లక్ష్యాలకు పదును పెట్టాల్సిన సమయం ఇదే. పట్టుదలతో చదవాలన్నా, పరిచయాలతో చెడు అలవాట్లకు గురికావాలన్నా ఇక్కడే జరుగుతుంది. బాగుపడాలన్నా చెడిపోవాలన్నా టీనేజ్‌ కత్తిమీద సామని చెప్పాలి. ఉజ్వల భవిష్యత్‌కి భుజం తట్టి ప్రోత్సహించే  చేతులుంటాయి. చెడుమార్గాన్ని నడిపించే చేతులుంటాయి జాగ్రత్తని ప్రముఖులు చెబుతున్నారు. 

ఆ...కర్షణలో రక్షణ లేదు
కౌమార దశలో వచ్చే కొత్త కొత్త అనుభూతులు కొందరిని బలహీనులుగా మారుస్తాయి. హార్మోన్‌ల ప్రభావంతో లైంగిక ఆకర్షణలకు గురికావడం, ఆపై దాడులకు గురవడం, మోసపోవడం చూస్తుంటాం. ఇటువంటి పరిస్థితుల్లో పరువానికి పగ్గాలు వేయడం ముఖ్యం. ముఖ్యంగా బాలికలు ఎదుర్కొనే పరిస్థితులు వేరు. తోటి విద్యార్థులుగాని, ఉపాధ్యాయులుగాని శుభాకాంక్షలు చెబుతూ షేక్‌హ్యాండ్‌ ఇచ్చినప్పుడు అరచేతిని వేలితోరుద్దడం, ప్రోత్సహిస్తున్నట్టు భుజంపై చేయివేయడం, ప్రయాణంలో చేతులు తాకించడం వంటి పలు చర్యలను ఆడపిల్లలు ఎదుర్కొనే ఇబ్బందికర స్పర్శలుగా గుర్తించారు. పరుషపదాలతో మాట్లాడడం, ఏకవచనంతో సంబోధించి మానసికంగా వేధించడం వంటి చర్యలూ వారిని కుంగదీస్తుంటాయి. ఇలాంటి చర్యలకు పాల్పడిన వారి వివరాలను పోలీసులకు చేర వేస్తే శక్తి టీం మహిళా కానిస్టేబుళ్లు  రంగంలోకి దిగుతారు. వారి భరతం పడతారు. కళాశాలకు బస్సులో ప్రయాణించేటప్పుడు ఇబ్బందికరంగా ఎవరైనా ప్రవర్తిస్తే ప్రయాణంలో ఉండగానే పోలీసులకు సమాచారం ఇస్తే బస్‌ ట్రాకింగ్‌ చేసి దగ్గరలో ఉన్న పోలీసు సిబ్బంది బస్‌స్టాప్‌కు చేరుకొని చర్యలు తీసుకుంటారు.

మజా ఖర్చులతో కరుసైపోతారు
పాఠశాల వదిలి కళాశాలలో అడుగుపెట్టగానే స్మార్ట్‌ఫోన్, నెట్‌ బ్యాలెన్స్‌కు ఖర్చు చేయాల్సి ఉంటుంది. బర్త్‌డే పార్టీలు, వాలెంటైన్స్‌డే, యూత్‌డే, ఫ్రెడ్‌షిప్‌డేలంటూ పార్టీ కల్చర్‌ ఎక్కువవుతుంది. గ్రూపుగా యువతీయువకులు చేరి ఎంజాయ్‌చేయాలనే ఆలోచన వస్తుంది. ఆ వేడుకలు రానురాను కాస్త అప్‌గ్రేడ్‌ అవుతున్నాయి. లంచ్, డిన్నర్, డ్రింక్, బీర్‌లవరకూ దారితీస్తుంది. మదర్స్‌డే. ఫాదర్స్‌డేలను కూడా తమ ఆనందాల కోసమే వాడుకుంటున్నారు. తరుచూ పాస్ట్‌ఫుడ్‌కి అలవాటుపడి  ఖర్చుని అమాంతంగా పెంచేస్తున్నారు. ఐదుగురు హోటల్‌కి వెళ్తే 2వేలుకి మించి ఖర్చుచేస్తారు. ఫాస్ట్‌ఫుడ్‌ సెంటర్‌కి వెళ్లే వందలకొద్దీ ఖర్చు చేస్తారు.  తల్లిదండ్రులు స్కూల్‌ ఫీజు చెల్లించడానికి ఇబ్బందిపడే పరిస్థితిలో పిల్లల ఖర్చు భారంగా మారుతుంది. తల్లిదండ్రులు జేబు ఖర్చులకు దండిగా డబ్బులు ఇవ్వకపోతే పోపుల డబ్బాలో చేయిపెట్టక తప్పడం లేదు. అక్కడ చిల్లర దొరకకపోతే చిల్లర దొంగతనాలకు పాల్పడే స్థాయికి సిద్ధపడుతున్నారు. బాలనేరస్తుల్లో ఎక్కువ మంది తమ వ్యక్తిగత అవసరాలను తీర్చుకోవడం కోసమే నేరాలకు పాల్పడుతున్నారు. డబ్బు అవసరాలను తగ్గించుకోవడం మంచిది.

ఆరోగ్యం పట్టించుకోరు..
కాలేజీకి వెళ్తున్నామంటే కొందరు  క్యారేజీని పక్కనపెట్టేస్తా రు. మధ్యాహ్నం భోజ నం చేయకపోవడం, చిరుతిండితో సరిపెట్టడంతో ఆరోగ్యాలు పాడైపోతున్నాయి. సమృద్ధిగా నీరుతాగరు. తాగమని చెప్పేవారుండరు. చెప్పినా వినిపించుకోరు. జంక్‌ఫుడ్‌ తినడంతో తరుచూ అనారోగ్యానికి గురవుతా రు. బాలికలు జీరోసైజ్‌కోసం తిండిని పక్కన పెట్టేస్తున్నా రు. చాక్లెట్లు డ్రింక్‌లతో సరి పెడుతున్నారు. అప్పటివరకూ పుస్తకాలబ్యాగ్‌తోపాటు భోజనం క్యారియర్‌ని ప్రత్యేకబ్యాగులో తీసుకెళ్తారు. ఎల్‌కేజీ నుంచి పదో తరగతి వరకూ అదే అలవాటుగా కొనసాగుతుంది. కాలేజీకి రాగానే ఇంటి భోజనంపై శ్రద్ధ తగ్గుతుంది.  ఎదిగేవయçసులో  సమృద్ధిగా పౌష్టికాహారం తినాలి. కానీ జంక్‌ ఫుడ్‌కు అలవాటు పడతారు. అందుకే క్రమశిక్షణగా ఇంటినుంచి భోజనం తీసుకెళ్లాలి.

‘షి’కారులు వద్దే వద్దు
పిక్నిక్, హాలిడేట్రిప్, సైన్స్‌ టూర్, కెరియర్‌ మీట్, ఎగ్జిబిషన్, సమ్మిట్‌కి హాజరుకావడం ఇప్పుడు అవసరమయ్యింది. విద్యలో రాణించడానికి ఉపాధి అవకాశాలను చేజిక్కించుకోవడానికి దూరప్రదేశాలకు వెళ్లాల్సి ఉంటుంది.    ఆ క్రమంలో కొత్త కొత్త పరిచయాలు పెంచుకుంటారు. అయితే మిత్రులే అంటూ ఎవరినీ ఎక్కువగా నమ్మడం సరికాదు. ఏకాంత ప్రదేశాలకు ఒంటరిగా వెళ్లడం మానుకోవాలి. అవే పరిచయాలతో అవకాశం ఉన్న ప్రతిసారీ బీచ్‌లకు, లాంగ్‌డ్రైవ్‌కి వెళ్లడం అలవాటు చేసుకుంటున్నారు. అటువంటి ‘షి’కారులతో అనర్థాలే.

ఒక్కసారే...అనుకుంటే అనర్ధమే..
చెడు అలవాటును పరిచయం చేయడంలో ఫ్రెండ్స్‌ వాడే మాట ఒక్కసారికి ఏమైపోతుందిలే..అని. అక్కడ నుంచి వ్యసనం మొదలవుతుంది.అదే పతనానికి నాంది అని  గ్రహించాలి. మత్తుపదార్థాలను తీసుకోవడం, అసభ్యకరవీడియోలను చూడడం జీవితాలను నాశనం చేస్తాయి. మంచి ఫ్రెండ్స్‌కి దగ్గరవ్వాలి. చెడుస్నేహాన్ని వీడాలి. ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు ఎప్పటికప్పుడు అప్రమత్తం చేయడం ద్వారా టీనేజ్‌లో ప్రమాదాల నుంచి బయటపడగలరు.

కౌమార దశలో జాగ్రత్తలు అవసరం
కౌమారదశలో ఆడపిల్లలకు శారీరక మార్పులు, హార్మోన్‌ల ప్రభావం ఉంటుంది. ఆ సమయంలో పిల్లల్ని వికృత చేష్టలతో ఇబ్బంది పెట్టే వారిపై కఠినంగా ఉండాలి. వారి ఏకాగ్రతను దెబ్బతీస్తున్నారు. అభం శుభం తెలియదు. ఏవో అనుభూతులతో కొందరు ఆకర్షణలో పడిపోతారు. భవిష్యత్‌ని నాశనం చేసుకుంటున్నారు. మగ స్నేహితుల మాటలకు ఆకర్షితులై చనువు పెంచుకుంటున్నారు. అవే శారీరక దాడులకు దారితీస్తున్నాయి. టీనేజ్‌ పిల్లల పట్ల తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలి. ప్రేమగా ఉండి ప్రతి అంశాన్ని అడిగి తెలుసుకోవాలి.
– ఎం.కనకమహాలక్ష్మి, వైద్యాధికారిణి, అచ్యుతాపురం పీహెచ్‌సీ 

ఓ కంట కనిపెట్టి ఉండాలి
పదో తరగతి వరకూ జాగ్రత్తగా చూస్తాం. ఇంటర్‌కి వెళ్లేసరికి ఎవరి మాటా వినరు. కొత్త పరిచయాలు, కొత్తస్నేహాలు, కొత్త అనుభూతులు ఉంటాయి. సరిగ్గా భోజనం చేయరు. మగపిల్లలతో పరిచయాలు పరిమితికి మించకూడదు. తల్లిదండ్రులకు జవాబుదారీగా ఉండాలి. ఎదుటివారికి అవకాశం ఇవ్వకూడదు.
– ఎ.విజయ, ప్రధానోపాధ్యాయుని హైస్కూల్, అచ్యుతాపురం 

క్రమశిక్షణతోనే బంగారు భవిత
క్రమశిక్షణతో ఉంటేనే పిల్లల ఉన్నత చదువులు సాధ్యమవుతాయి. ఆడపిల్లలకు అణువణువునా ఇబ్బందులు ఎదురవుతాయి. ఆకతాయిల ఆగడాలు ఎక్కువయ్యాయి. ఇంటర్, పాలిటెక్నిక్‌కి వెళ్లే పిల్లలకు అంతా కొత్త వాతావరణం..దీంతో తప్పటడుగులు పడే అవకాశం ఎక్కువ. సోషల్‌మీడియా ప్రభావంతో ప్రతి చిన్నవిషయానికి పార్టీ చేసుకోవడం లాంగ్‌డ్రైవ్‌లకు వెళ్లడం ఇటీవల ఎక్కువయ్యాయి. అవి బాలికలపై దాడులు జరగడానికి అవకాశంగా  మారుతుంది. ఆడపిల్లలు ధైర్యంగా సమస్యలను ఎదురొడ్డి నిలబడేలా వారిని తీర్చిదిద్దాలి. 
– పక్కుర్తి కుమారి, ఉపాధ్యాయుని 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement