పునర్దర్శనం 2017 | special to Yadadri | Sakshi
Sakshi News home page

పునర్దర్శనం 2017

Published Wed, Apr 20 2016 12:22 AM | Last Updated on Sun, Sep 3 2017 10:16 PM

పునర్దర్శనం 2017

పునర్దర్శనం 2017

యాదాద్రి


యాదగిరిగుట్ట యాదాద్రిగా మారి భారీ స్థాయిలో పునర్నిర్మాణ పనులకు సమాయత్తమవుతున్న దరిమిలా ఈనెల 21 తర్వాత ఆలయంలోని అర్చామూర్తుల దర్శనం ఉండదని తెలుసుకున్న భక్తులు పెద్ద సంఖ్యలో  తరలివస్తున్నారు. ప్రతిరోజూ సగటున 20 వేల మంది భక్తులు  దర్శనానికి వస్తున్నారు.

 
ఈ సందర్భంగా యాదగిరిగుట్ట క్షేత్రంపై  ప్రత్యేక కథనం..
హైదరాబాద్ నుంచి వరంగల్లు వెళ్లే రహదారిలో దాదాపు 70 కి.మీ దూరంలో లక్ష్మీనరసింహస్వామి కొలువైన క్షేత్రం యాదగిరి గుట్ట. దీనిని తెలంగాణలో అత్యంత ప్రాముఖ్యత కలిగిన దివ్యక్షేత్రంగా మార్చాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించిన దరిమిలా ఆలయ రూపురేఖలు మార్చే ప్రణాళికలు వేగంగా జరుగుతున్నాయి. గుట్ట ప్రధాన ఆలయాన్ని, మాడ వీధులను రెండున్నర ఎకరాల విస్తీర్ణంలో అభివృద్ధి చేయనున్నారు. నాలుగువైపులా నాలుగు ద్వారాలు, మాడవీధుల ఆలయ కైంకర్యాలకు అవసరమైన సౌకర్యాలు కల్పించనున్నారు. కొండపై శివాలయానికి మాడవీధులు, తూర్పువైపు బ్రహ్మోత్సవ కల్యాణ మండపం పునర్నిర్మించనున్నారు. స్వామి వారి పుష్కరిణిని కూడా అభివృద్ధి చేయనున్నారు. ఈ పనుల వల్ల గర్భగుడి కార్యకలాపాలకు ఆటంకం కలగనున్నందున ఈ నెల 21న బాలాలయంలో విగ్రహాల ప్రతిష్ఠాపన చేయనున్నారు. ఈ ప్రతిష్టాపన అనంతరం మళ్లీ మూల గర్భగుడి తెరిచేంతవరకు ఈ బాలాలయంలోని విగ్రహాలకే పూజలు నిర్వహించనున్నారు. భక్తులు కూడా స్వయంభూ విగ్రహాలను గాక, ప్రతిష్టించిన విగ్రహాలను దర్శించుకుని స్వామి వారి అనుగ్రహం పొందాలి. మళ్లీ గర్భగుడి తెరిచేందుకు దాదాపు ఏడాదిన్నరకు పైగా సమయం పడుతుందని అధికారులు చెబుతున్నారు.

 

సేవలు యథాతథం

స్వయంభూ ఆలయాలకు, బాలాలయాలకు మూల విగ్రహాల విషయంలో తప్ప ఎక్కడా తేడా ఉండదు. స్వామి వారు స్వయంగా వెలిసిన విగ్రహ ప్రతిరూపాలను కదల్చడం సాధ్యం కాదు కాబట్టి ఆ రూపంలో ఉన్న కవచ విగ్రహాలను బాలాలయంలో ప్రతిష్ఠాపన చేస్తారు. ఇక, స్వామివారికి నిత్యం చేసే సుప్రభాత సేవ, అభిషేకం, సహస్ర నామ, కుంకుమార్చనలు, సుదర్శన హోమం, నిత్యకల్యాణం, ఆరగింపు, వెండి జోడు సేవలు, శుక్రవారం ఊంజల్ సేవ, సువర్ణ పుష్పార్చనలు యథాతథంగా జరుగుతాయి. దీంతోపాటు భక్తులు స్వామి వారికి చేయించే కల్యాణం, అభిషేకం, అర్చనలు, సేవలు, వ్రతాలు అన్నీ కూడా మామూలుగానే ఉంటాయి. అయితే, ఉన్న తేడా ఒక్కటే. అదేంటంటే... స్వామి వారి ఊరేగింపు మాత్రం ఉండదు. తిరువీధులు ఉండవు కనుక స్వామి వారి సేవల సమయంలో ఆలయం చుట్టూ ఊరేగింపు ఉండదు.

 
యాదరుషికి ప్రత్యక్షమైన స్వామి...

యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహాస్వామి దేవస్థానం 500 ఏళ్ల క్రితం నాటిదని పురాణేతిహాసాలు చెబుతున్నాయి. పూర్వం యాదరుషి అనే మహాతపస్వి స్వామి మహిమలు తెలుసుకుని ఆయన కోసం బ్రహ్మాండమైన తపస్సును ఆరంభించాడు. అలా కొన్ని సంవత్సరాలు తపస్సు చేయగా బ్రహ్మాదిదేవతలు, మునీశ్వరులు ప్రత్యక్షమై లక్ష్మీనరసింహాస్వామి ప్రత్యక్షం కావాలంటే ఆయన కంటే ముందు ఆంజనేయస్వామిని ప్రసన్నం చేసుకోవాలని సలహానిచ్చారు. అప్పుడు యాదరుషి ఆంజనేయ స్వామిని ప్రసన్నం చేసుకుని ‘నేను లోక సంరక్షణార్థం దివి నుంచి భువికి స్వామి వారిని తీసుకుని రావడానికి తపస్సును ఆరంభించాను’ అని చెప్పి అప్పటివరకు ఈ క్షేత్రాన్ని పాలిస్తూ దీనికి సంర క్షకుడిగా ఉండాలని ఆంజనేయుడిని కోరాడు. అందుకు ఆంజనేయస్వామి అంగీకరించి ఈ క్షేత్రాన్ని సంరక్షిస్తూ, క్షేత్రపాలకుడిగా ఉండిపోయాడు. అలా మరి కొన్ని సంవత్సరాలు తపస్సు చేయగా లక్ష్మీనరసింహాస్వామి కరుణించి స్వయంభువుగా గుట్ట మీద వెలిశారు. యాదరుషి పేరు మీదుగా ఈ క్షేత్రం యాదగిరి గుట్టగా పేరుగాంచింది. జ్వాలా, యోగానంద, గండభేరుండ, ఉగ్ర, లక్ష్మీనరసింహులు అనే పంచరూపాలతో దర్శనమిస్తూ అటు లోకాలను, ఇటు భక్తులను కాపాడుతూ ఎంతోమందికి ఇలవేల్పుగా ఉన్నారు.

 

గ్రహ, గృహ బాధలు తీర్చే పుష్కరిణి...

కొంతకాలం తర్వాత స్వామి వారు తన మహిమలతో భక్తుల గ్రహ, గృహ బాధలు తీర్చడానికి ఓ పుష్కరిణిని  సృష్టించారు. ఇందులో 3 కోట్ల కోనేటి తీర్థాలను ప్రసాదించడం వల్ల ఈ తీర్థంలో స్నానం చేసిన ప్రతి భక్తుడికి బాధలు తీరుతాయని స్వామి వారు యాదరుషికి తెలిపినట్టు స్కాంధ పురాణంలో ఉంది. యాదరుషి తపస్సుచే స్వామి, అమ్మవార్లు ఒక విశాలమైన గుహలో వెలిశారు. ఈ గుహలో వెలిసిన స్వామి, అమ్మవార్లను దర్శించాలంటే గుహలోనుంచి వెళ్ళి నివేదన చేసేవారు. గుహ చాలా పెద్దదిగా, మనుష్య సంచారం లేకుండా ఉండేది. ఈ గుహ చుట్టూ జంతువుల సంచారం ఉండేది. కానీ ఈ క్షేత్రం కాలానుగుణంగా ప్రసిద్ధి చెందింది. భక్తుల రాక పెరిగింది. ఆదాయం పెరిగింది. భక్తుల కోరికలు తీరసాగాయి. బాధల నుంచి విముక్తి చెందడంతో ఆలయం వాసికెక్కింది. ఈ నేపథ్యంలో ఆలయాన్ని 1950వ సంవత్సరంలో దేవాదాయ శాఖలో కలిపేసి అభివృద్ధి చేస్తూ వచ్చారు.

 
నిఘా నీడలో గుట్ట...

గుట్ట ఆలయ అభివృద్ధి పనులన్నీ నిఘా నీడలో సాగుతున్నాయి. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పటిష్ట బందోబస్తు చర్యలు చేపట్టారు. కూల్చివేతల నుంచి నూతన భవనాల నిర్మాణం, బాలాలయ ఏర్పాటు వంటి కార్యక్రమాలన్నింటినీ సీసీ కెమెరాల పర్యవేక్షణలో నిర్వహిస్తున్నారు. ఈ నెల 14న రాష్ట్ర డీజీపీ అనురాగ్‌శర్మ గుట్టకు వచ్చి స్వామి వారిని దర్శించుకుని భద్రతా ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు. గుట్టలో భవిష్యత్ అవసరాల దృష్ట్యా ప్రత్యేక సర్కిల్ కార్యాలయం ఏర్పాటు చేయాలని, చెక్‌పోస్టుల ఏర్పాటు, మహిళా పోలీస్‌స్టేషన్ వంటివి కూడా ఏర్పాటు చేయాలని ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు వెళ్లాయి. గుట్ట బందోబస్తుకు ఎంతమంది పోలీసులు అవసరం అవుతారనేది కూడా ప్రభుత్వానికి నివేదించారు.

 
కొండపైనే బస్‌స్టేషన్

యాదగిరికొండపై పుష్కరిణి వీధిలో ఉన్న శ్రీచక్రభవన సముదాయ సమీపంలో స్వామి వారి దర్శన కాంప్లెక్స్ వద్దనే 1.9 ఎకరాల విస్తీర్ణంతో బస్‌స్టేషన్ ఏర్పాటు చేయనున్నారు. కొండపైన భక్తులకు అవసరమయ్యే పూజాసామాగ్రి కోసం దుకాణాల సముదాయం, కొండపైకి వెళ్లడానికి, కిందికి రావడానికి రెండు వేర్వేరు ఘాట్‌రోడ్లతో పాటు దర్శన క్యూ కాంప్లెక్స్, ప్రధాన ఆలయ ప్రాకారం, మాడ వీధుల మధ్య ఖాళీ ప్రదేశాల్లో భక్తులు సేదతీరేందుకు ల్యాండ్‌స్కేప్ గార్డెన్లు ఏర్పాటు చేయనున్నారు. పర్యాటకులను ఆకర్షించే విధంగా గుట్టకు సమీపంలో ఉన్న రాయగిరి, యాదగిరిగుట్ట చెరువులను, బస్వాపురం రిజర్వాయర్‌ను అభివృద్ధి చేయనున్నారు. ఇందులో వాటర్ గేమ్స్, పార్కు, బోటింగ్ కూడా ఏర్పాటు చేయనున్నారు. గుట్టకు దారితీసే నాలుగు వైపులా ఉన్న రోడ్లను ఫోర్‌లేన్లుగా అభివృద్ధి చేయనున్నారు.

 

మేకల కల్యాణ్ చక్రవర్తి
బ్యూరో ఇన్‌ఛార్‌‌జ సాక్షి, నల్లగొండ (సాక్షి యాదగిరిగుట్ట ప్రతినిధి ఆరుట్ల వేణుగోపాలాచార్యులు సహకారంతో..)

 

 118 అడుగుల  క్షేత్రపాలకుడు
గర్భాలయానికి తూర్పుదిక్కున ద క్షిణానికి అభిముఖంగా గుట్ట క్షేత్రపాలకుడైన శ్రీరామభక్త ఆంజనేయ స్వామి 118 అడుగుల విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నారు. అదే విధంగా శిల్ప కళాశాల కూడా ఏర్పాటు చేయనున్నారు. ఇందుకోసం మొత్తం రెండువేల ఎకరాల స్థలాన్ని సేకరించాలని నిర్ణయించారు. దాదాపు భూసేకరణ పనులు పూర్తయ్యాయి. మొత్తంమీద ఈ ఆలయ అభివృద్ధి పనులకు రూ.1000 కోట్ల వరకు ఖర్చు కానుండగా, ప్రభుత్వం గత రెండే ళ్లలో ఏడాదికి రూ.100 కోట్ల చొప్పున మంజూరు చేసింది. తాజాగా మరో రూ.100 కోట్లు కూడా కేటాయించింది. ఈ ఆలయ నిర్మాణంలో పాలుపంచుకునేందుకు పలు కార్పొరేట్ కంపెనీలు కూడా స్వచ్ఛందంగా ముందుకు వస్తున్నాయి.

 

చేరుకోవడం ఇలా...!
విజయవాడ, అనంతపురం, హైద్రాబాద్, విశాఖ నుంచే కాకుండా విదేశాల నుంచి సైతం భక్తులు  రావడం ఈ క్షేత్ర మహత్మ్యం. ఈ  క్షేత్రానికి విజయవాడ సుమారు 280  కిలోమీటర్లు దూరం. హైద్రాబాద్ నుంచి సుమారు 70 కిలోమీటర్లు.  విశాఖపట్నం 750 కిలోమీటర్లు.  అనంతపురం 450 కిలోమీటర్లు. యాదగిరిగుట్టలో బస్ డిపో ఉంది. హైదరాబాద్, వరంగల్, నల్లగొండ నుంచి బస్సుమార్గంలో యాదగిరి గుట్టకు చేరుకోవచ్చు. రాయగిరి రైల్వే స్టేషన్ గుట్టకు 4 కి.మీ దూరంలో ఉంది. భువనగిరి 14 కి.మీ దూరంలో ఉంది. హైదరాబాద్‌లో అంతర్జాతీయ విమానాశ్రయం ఉంది.

 

 
ఈ రాత్రి వరకే ప్రధాన ఆలయ దర్శనాలు

బాలాలయ నిర్మాణం పూర్తయింది. ఇక్కడ విగ్రహాల ప్రతిష్టాపన ఈనెల 21న ఉదయం 9:58 గంటలకు శ్రీ మాన్ త్రిదండి చినజీయర్ స్వామి చేతుల మీదుగా జరుగుతుంది. ఈ బాలాలయం ప్రతిష్ఠాపన పూర్తికాగానే ప్రధాన ఆలయ పనులను ప్రారంభిస్తాం. ఈ పనికి సంబంధించి టెండర్ల ప్రక్రియ కూడా పూర్తయింది. సన్‌షైన్ కంపెనీకి పనులు ప్రభుత్వం అప్పగించింది. 15 రోజుల్లో వీరికి పొజిషన్ ఇస్తాం. దక్షిణ భాగాన రిటైనింగ్ వాల్ ఏర్పాటుతో ఆలయ అభివృద్ధి పనులు ప్రారంభం అవుతాయి. ఒప్పందం ప్రకారం ఈ పనులను 9 నెలల్లో పూర్తి చేయాల్సి ఉంటుంది.

 - గీతారెడ్డి  ఆలయ కార్యనిర్వహణాధికారిణి

 

బాలాలయం
యాదగిరిగుట్టలో నిర్మిస్తోన్న బాలాలయ నిర్మాణానికి సంబంధించి అన్ని ప్రణాళికలు హైదరాబాద్‌లోనే తయారయ్యాయి. వైటీడీఏ అధికారులు, ఈ ఆలయానికి ఆర్కిటెక్ట్‌గా వ్యవహరిస్తున్న ఆనంద్‌సాయి, స్తపతి సుందరరాజన్, ఆలయ ఈవో గీతారెడ్డి తదితరులు ఈ బాలాలయ నిర్మాణం కోసం విశేషంగా కృషి చేశారు. తిరువీధులు అందంగా కనిపించేందుకు గాను శిల్పాలను కూడా భాగ్యనగరంలోనే తయారుచేయించారు. బాలాలయంలో భాగంగా ముందు భాగంలో అందంగా కనపడేందుకు ఫైబర్‌తో పిల్లర్లు, శిల్పాలు ఏర్పాటు చేస్తున్నారు. గుహను కూడా నిర్మిస్తున్నారు. కల్యాణ మండపం, సత్యనారాయణ వ్రత మండపం, గోదాం, రామానుజ కూటమి, క్యూలైన్లు కూడా నిర్మిస్తున్నారు. ఇందుకోసం ఇప్పటికే ఓ దశ కూల్చివేతలు పూర్తి కాగా, మరోదశ కూల్చివేతలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement