
త్రీమంకీస్ - 34
డైలీ సీరియల్ - క్రైమ్ కామెడీ సస్పెన్స్‌థ్రిల్లర్ - 34
- మల్లాది వెంకటకృష్ణమూర్తి
బయటకి వచ్చాక ఓ బేంక్‌కి వెళ్ళి జైలర్ ఇచ్చిన లెటర్‌ని చూపించాడు.
‘‘ఓ! నువ్వు జైల్లో ఉన్నావని దాచకుండా చెప్పావంటే నువ్వు నమ్మదగ్గ వాడివే. వాడ్డుయూ వాంట్?’’ బ్రాంచ్ మేనేజర్ అదరంగా చూస్తూ అడిగాడు.
‘‘ఐ వాంట్ టు స్టార్ట్ ఇంజనీరింగ్ ఇండస్ట్రీ. గివ్ మి ఏ లోన్. దెన్ లీవ్ మి ఎలోన్’’ వానర్ ఘనంగా ఉంటుందని ఇంగ్లీష్‌లో అభ్యర్థించాడు.
వాళ్ళిచ్చిన లోన్‌తో ఓ ఫైవ్ స్టార్ హోటల్‌కి వెళ్ళి గది తీసుకుని తినడానికి, తాగడానికి ఆర్డర్ ఇచ్చాడు. అవి వచ్చాక ట్రే మీది తెల్లటి శుభ్రమైన బట్టని తొలగిస్తే చికెన్ ఫ్రై కనిపించింది. ఓ కోడి పిల్ల చికెన్ ఫ్రై వంక చూస్తూ బాధగా అడుగుతోంది.
‘‘మమ్మీ! మాట్లాడు మమ్మీ. నాతో మాట్లాడు మమ్మీ! ఇలా అయిపోయావేమిటి?’’
గ్లాసులోని ఆరెంజ్ జూస్‌ని చూసి పక్కనే ఉన్న ఆరెంజి పండు అరుస్తోంది.
‘‘అమ్మా! నాన్నా! నన్ను అనాథని చేసి వెళ్ళిపోయారా?’’
వాటి మీది దయతో వానర్ కళ్ళల్లోంచి నీళ్ళు జలజలా కారాయి. ఆ దయతోనే గుండె ఆగింది.
‘‘చూడండి. వీడి గుండె కొట్టుకుంటోంది. కొద్దిసేపు గుండె ఆగినట్లయింది. అంతే. మరణించిన వాళ్ళనే ఇక్కడికి తీసుకురావాలని తెలీదా?’’
ఆ మాటలకి కళ్ళు తెరిచి చూస్తే యమధర్మరాజు తన భటుల వంక కోపంగా చూస్తున్నాడు.
‘‘వాళ్ళ తప్పేంలేదు సార్. నా గుండెలో నా ప్రియురాలు నివశిస్తోంది. అందుకని అది కొట్టుకుంటోంది’’ వానర్ చెప్పాడు.
‘‘మీరంతా ఎవరు?’’ తన చుట్టూ మూగిన కొత్తవాళ్ళని చూసి అడిగాడు.
‘‘గుర్తు పట్టలేదా? మేమంతా నీ ఎఫ్‌బిలో మిత్రులం. నువ్వూ చచ్చాక, ఇక్కడికి వచ్చాక ఇలా కలుసుకోవడం ఆనందంగా ఉంది. అదృష్టం. నరకానికి వచ్చావు. స్వర్గానికి వెళ్తే నీకు ఇంతమంది కంపెనీ దొరికేది కాదు’’ వాళ్ళు చెప్పారు.
‘‘ఈ తెల్లవాళ్ళంతా ఎవరు?’’
‘‘జీవించి ఉండగా గో టు హెల్ అని తిట్టించుకోబడ్డవారు.’’
‘‘బాబోయ్! ఇది హెల్లా?’’
‘‘అవును. అల్లాటప్పా హెల్ కాదు. రియల్ హెల్. హెల్ మీద మనం విన్నవి ఉత్తి జోక్స్ కాదు. నిజాలు. ఉదాహరణకి ఇక్కడి బీర్ ఉంటుంది కాని బీర్ మగ్గులకి రంధ్రాలు కూడా ఉంటాయి. అందమైన ఆడవాళ్ళుంటారు కాని ఆడవాళ్ళకి... అర్థం చేసుకో.’’
అంతా గందరగోళంగా మాట్లాడుకుంటూంటే యమధర్మరాజు సుత్తితో కొడుతూ అరిచాడు.
‘‘ఆర్డర్! ఆర్డర్!’’
‘‘ఓ పీజా, రెండు బర్గర్‌లు, ఓ కోక్ జీరో’’ వానర్ వెంటనే చెప్పాడు.
‘‘షటప్’’ ఆయన అరిచాడు.
‘‘కొత్త బ్రాండా? సరే. షటప్ టేస్ట్ చేస్తాను. సెవెన్ అప్ లేదా థంప్స్ అప్‌లా ఉంటుందా?’’ అడిగాడు.
‘‘వీడి వల్ల ఇక్కడ డిసిప్లిన్ దెబ్బతింటోంది. ముందు వీడ్ని తీసుకెళ్ళి కాగే నూనెలో వేయండి’’ ఆయన ఆసహనంగా అరిచాడు.
‘‘ఒద్దు. ఒద్దు. నా వంటి నిండా దద్దుర్లు వస్తాయి...’’ అరుస్తున్న వానర్‌కి ఠక్కున మెలకువ వచ్చేసింది.
పెబైర్త్ నించి వచ్చే గురక విని అది కలని తెలుసుకున్నాక స్థిమిత పడ్డాడు. దుప్పటిని తీసుకెళ్ళి టాయ్‌లెట్‌లో పిండి మళ్ళీ పరచుకుని పడుకున్నాడు.
9
మర్నాడు ఉదయం గార్డ్ కపీష్‌తో చెప్పాడు - ‘‘నీకోసం ములాఖత్‌కి ఎవరో వచ్చారు.’’
కపీష్‌కి వెంటనే అనుమానం కలిగింది. కొంపతీసి తను జైలు పాలైన సంగతి తన తల్లితండ్రులకి తెలిసిందా? పేపర్లో తన గురించి వచ్చిందా?
‘‘ఎవరు?’’ అడిగాడు.
‘‘నేను నీ ఇన్‌ఫార్మర్‌ని కాదు. పద. నువ్వే చూడు’’ గార్డ్ కోపంగా చెప్పాడు.
కపీష్ అతన్ని అనుసరించాడు. ఎదురుగా గంధం బొట్టు మీద కుంకం బొట్టు కనిపించగానే ఊపిరి పీల్చుకున్నాడు. తల తిప్పి చూేన్త నిన్న కనిపించిన అమ్మాయి కనిపించింది. కపీష్ వెంటనే నవ్వాడు. ఆమె కూడా నవ్వింది.
‘‘జైల్లో ఉండగా ఏం చేయలేనన్నాను కదా? మళ్ళీ ఎందుకు వచ్చారు?’’ కపీష్ ఆమె వంక చూస్తూ ఆయన్ని ప్రశ్నించాడు.
‘‘నీ డబ్బు జైలర్ దగ్గర ఉందని కదా నిన్న చెప్పావు?’’ సేఠ్ అడిగాడు.
‘‘అవును?’’
‘‘నువ్వు నాకు డబ్బు ఇవ్వాలని ఆయనకి చెప్పి ఇప్పించచ్చుగా?’’
‘‘ఎవరికి చెప్పి?’’ కపీష్ ఆమెనే చూస్తూ అడిగాడు.
‘‘జైలర్‌కి. లేకపోతే నీకు అనవసరంగా వడ్డీ పెరిగిపోతుంది.’’
‘‘ఏం పెరుగుతుంది?’’ కపీష్ దృష్టంతా ఆమె మీదే ఉండటంతో సేఠ్ చెప్పేది అర్థం చేసుకోలేకపోయాడు.
‘‘వడ్డీ.’’
‘‘పెరగనీండి’’ ఆమె వంకే చూస్తూ నవ్వుతూ చెప్పాడు.