జంక్‌ఫుడ్ కారణంగా ఎన్నో రకాల అనర్థాలు వస్తాయన్న సంగతి ఇప్పటికే చాలా పరిశోధనల్లో, అధ్యయనాల్లో తేలింది. అయితే జంక్‌ఫుడ్ కారణంగా వీర్యకణాల సంఖ్య (స్పెర్మ్‌కౌంట్) తగ్గుతుందని ఇటీవలి తాజా అధ్యయనంలో తేలింది.
బోస్టన్(యూఎస్)లోని హార్వర్డ్ టీ.హెచ్ చాన్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్‌కు చెందిన పరిశోధకులు దాదాపు 3,000 మందికి పైగా యువకుల్లో ఓ అధ్యయనాన్ని నిర్వహించారు. 19 ఏళ్లు పైబడిన యువకులను నాలుగు గ్రూపులుగా విభజించి వారిలో ఒక గ్రూపునకు ఆరోగ్యకరమైన ఆహారం ఇచ్చారు. వారి ఆహారంలో తాజా కూరగాయలు, ఆకుకూరలు, చేపలు, పండ్లు, నట్స్, గుడ్లు, తృణధాన్యాలు ఉండేలా చూశారు. అలాగే మరో గ్రూపునకు ఒకింత తక్కువ ఆరోగ్యకరమైన ఆహారం సమకూర్చారు. ఇలా మొదటి గ్రూపు మినహా ప్రతి గ్రూపునకూ కొంత పోషకాహారాన్ని తగ్గిస్తూ, జంక్‌ఫుడ్‌ను పెంచుతూ పోయారు.
ఈ నాలుగు గ్రూపుల వీర్యనమూనాలను సేకరించి పరీక్షించగా... జంక్‌ఫుడ్‌ను తీసుకున్న గ్రూపుతో పోలిస్తే... పూర్తిగా అన్ని పోషకాలు ఉన్న మంచి సమతుహారాన్ని తీసుకున్న గ్రూపులోని యువకులలో వీర్యకణాల సంఖ్య, కదలికలు చాలా బాగున్నట్లు తేలింది. జంక్‌ఫుడ్ తీసుకున్న గ్రూపుతో పోలిస్తే, మంచి ఆహారం తీసుకున్న గ్రూపులోని యువకుల వీర్యంలో వీర్యకణాల సంఖ్య దాదాపు 25 శాతం ఎక్కువగా ఉన్నట్లు ఈ అధ్యయనంలో వెల్లడైంది. అంటే... జంక్‌ఫుడ్ తీసుకోవడం అన్న అంశం సంతానలేమికి ఎంతో కొంత దోహదం చేస్తుందన్న విషయం ఈ అధ్యయనం ద్వారా స్పష్టమైంది. ఈ అధ్యయన ఫలితాలు ప్రముఖ వైజ్ఞానిక జర్నల్ ‘జామా’లో ప్రచురితమయ్యాయి.
Comments
Please login to add a commentAdd a comment