కూతురు అంటే తల్లిదండ్రుల చాటు బిడ్డలా, వారిపై ఆధారపడేలా కాకుండా కుటుంబానికే పెద్ద దిక్కుగా మారే విధానం ‘గోరింటాకు’ సీరియల్‌లో కనిపిస్తుంది. స్టార్ మా’లో వస్తున్న ‘గోరింటాకు’ సీరియల్ ద్వారా తెలుగు టీవీ ప్రేక్షకులకు శ్రీవల్లిగా పరిచయం అయ్యింది కావ్య. బెంగుళూరు నుంచి తెలుగింటికి వచ్చిన కావ్య సీరియల్‌లోని తన పాత్ర గురించి, నిజ జీవితం గురించి ఆనందంగా పంచుకుంది.
‘తండ్రికి గుండెజబ్బు. అతను చేసేది మగ్గం పని. కుటుంబం గడవలేని స్థితిలో తండ్రి స్థానాన్ని శ్రీవల్లి తీసుకుంటుంది. చేనేత చీరల అమ్మకం, అందులోని ఎగుడుదిగుడులను తట్టుకుంటూ తను ముందుకుసాగడం చూసే ప్రేక్షకులు ఇలాంటి ధైర్యవంతురాలైన కూతురు తమ ఇంట్లోనూ ఉంటే బాగుంటుంది అనుకుంటున్నారు. ఈ మాటలు నాతోనే ప్రేక్షకులు నేరుగా అన్నప్పుడు కలిగిన ఆనందం ఇంతా అంతా కాదు.’
ఆడిషన్స్ ద్వారా ఎంపిక
బిఎస్సీ పూర్తి చేశాక కన్నడ సీరియల్స్ చేస్తూ వచ్చాను. ఇప్పుడు కన్నడలోనూ నీలి, నాయకి సీరియల్స్ చేస్తున్నాను. ముందు ఈ ఫీల్డ్ అనుకోలేదు కానీ, మా అమ్మ భాగ్య నేను నటిని కావాలని ఆశపడేది. ఎక్కడ సీరియల్స్, సినిమా ఆడిషన్స్ జరిగినా అక్కడకు తీసుకెళ్లేది. నాకు చిన్నప్పటి నుంచి డ్యాన్స్‌లో ఆసక్తి ఎక్కువ. ఆ ఆసక్తి గమనించే అమ్మ నన్ను ఈ ఫీల్డ్‌కి పరిచయం చేయాలనుకున్నారు. కన్నడలో మూడేళ్లుగా సీరియల్స్ చేస్తున్నాను. ఈ ఏడాది తెలుగులో అవకాశం వచ్చింది. నాన్న నటరాజ్ బోర్‌వెల్స్ బిజినెస్ చేస్తారు. నాకో చెల్లెలు. తను డిగ్రీ సెకండియర్ చదువుతోంది.
శ్రీవల్లికి పూర్తి వ్యతిరేకం
సీరియల్‌లో శ్రీవల్లికి ఉన్నంత బరువు బాధ్యతలు నాకు లేవు. అలాగే, అందులో శ్రీవల్లి విలన్స్ నుంచి ఎదుర్కొనే టీజింగ్ సీన్స్ లాంటివి కూడా లేవు. నిజం చెప్పాలంటే నా జీవితం శ్రీవల్లి పాత్రకు పూర్తి విరుద్ధంగా ఉంటుంది.
భక్తురాలిని...
గోరింటాకు సీరియల్‌లో శ్రీవల్లి చాలా స్ట్రిక్ట్. ఎవరైనా తప్పు చేస్తే అస్సలు సహించదు. ధైర్యంతో పాటు దైవం అంటే భక్తి కూడా ఉంటుంది. మా అమ్మకు దేవుడి మీద బాగా నమ్మకం. రెండు నెలలకోసారి ఇంట్లో హోమాలు, పూజలు తప్పనిసరిగా ఉంటాయి. వాటిలో నేనూ పాల్గొంటాను.
కాటన్ చీరలు
చేనేత బ్యాక్‌గ్రౌండ్ మీద సీరియల్ థీమ్ నడుస్తుంది. ఈ సీరియల్‌లో శ్రీవల్లికి చీరల షోరూమ్ కూడా ఉంటుంది. మిగతా సీరియల్స్‌లో లాగా హీరోయిన్‌కి హెవీగా మేకప్, డిజైనర్ డ్రెస్సులు కాకుండా కాటన్ చీరలను యూనిట్ సజెస్ట్ చేసింది. దాంతో మంగళగిరి చేనేత చీరలను ధరిస్తుంటాను. సింపుల్‌గా కాటన్ చీరలో కనిపించడంతో శ్రీవల్లి వ్యక్తిత్వం కూడా ఇందులో ప్రతిఫలిస్తుంటుంది.
తొందరపడను
చేసే పని ఒకేలా ఉండకూడదు అనుకుంటాను. అందుకే త్వరగా అన్నీ చేసేయాలని కోరుకోను. ఈ పరిశ్రమలో మంచి అవకాశాలు వచ్చినప్పుడు వినియోగించుకుంటూనే ఇంకా పై చదువులు చదవాలని ఉంది. అందుకోసం ప్రయత్నాలు చేస్తున్నాను. వేటికీ ఎక్కువ హైరాన పడటం ఉండదు కాబట్టి కాస్త ఖాళీ టైమ్‌ను నా కోసం ఉండేలా జాగ్రత్తపడతాను. అప్పుడేగా మన ఇష్టాయిష్టాలు నెరవేర్చుకోవచ్చు. ఏ కాస్త తీరికి దొరికినా డ్యాన్స్ చేస్తాను. రాక్, పాప్, ఇండో–వెస్ట్రన్.. ఇలా అన్ని రకాల సంగీతాన్ని ఇష్టపడతాను. అప్పుడప్పుడు బుక్స్ చదువుతుంటాను.
నన్ను చూసి నేర్చుకోవాలంటుంది
మా చెల్లి డిగ్రీ సెకండియర్ చదువుతోంది. చదువుకొని ఉద్యోగం తెచ్చుకోవాలనేది తన తాపత్రయం. ‘అక్కా, ఇద్దరం కలిసే పెరిగాం కదా! నీకింత ధైర్యం ఎలా వచ్చింది’ అని అడుగుతుంటుంది. నన్ను చూసి తనూ ఒక ఫొటో షూట్ ట్రై చేసింది.
సూచనలు అడుగుతాను
అమ్మానాన్న, చెల్లి నా సీరియల్స్ చూసి సూచనలు చెబుతుంటారు. ఒక్కోసారి వాళ్లు చెప్పకపోయినా నేనే అడుగుతాను. తెలుగు నేర్చుకుంటున్నాను. ప్రతీ డైలాగ్‌నకి ముందు దాని పూర్తి అర్ధం తెలుసుకుంటాను. ప్రేక్షకులు మెచ్చేలా నటన ఉండాలని తపిస్తాను’ అని వివరించింది కావ్య.
– నిర్మలారెడ్డి
Comments
Please login to add a commentAdd a comment