మచ్చలకి ఆవిరి పెట్టండి!
బ్యూటిప్స్
అసలే ఇది ఎండాకాలం. కాసేపలా బయటకి వెళ్లి వచ్చారంటే, ముఖం నల్లగా జిడ్డోడటమే గాక మచ్చలు కూడా పడటం సహజం. చర్మం నిర్జీవంగా మారిపోతుంది. అలాంటప్పుడు ఏదయినా క్రీమును ముఖానికి రాసుకుని మృదువుగా మర్దన చేసుకుని ఆవిరిపడితే సరి. క్రమేణా చర్మం నిగారింపును సంతరించుకుంటుంది. శరీరంలోని వ్యర్థాలను తొలగించుకోవడానికి ఆవిరిస్నానం... అదేనండీ, స్టీమ్‌బాత్ ఎంతో ఉపకరిస్తుంది. స్టీమ్‌బాత్ అందుబాటులో లేకపోతే కనీసం ముఖానికి ఆవిరి పట్టించినా మేలే.
ఎందుకంటే ఆవిరి పట్టడం ద్వారా ముఖచర్మంలోని రక్తకణాలు ఉత్తేజితమై, రక్తప్రసరణ బాగా జరుగుతుంది. మూసుకు పోయి ఉన్న స్వేదరంధ్రాలు తెరుచుకుంటాయి. అయితే బాగా మసిలే నీటితో ఆవిరి పెట్టకూడదు. అలా చేయడం వల్ల చర్మం ఎర్రగా కందిపోతుంది. తగుమాత్రం వేడి ఉంటే చాలు. ముఖం మీద మొటిమలు బాగా ఉన్నవాళ్లు కూడా ఆవిరికి కాస్తంత దూరంగా ఉండటం మంచిది.