డర్మటాలజీ కౌన్సెలింగ్
నా వయసు 15 ఏళ్లు. నేను లెహంగా కానీ, సెల్వార్ గానీ కట్టుకున్నప్పుడు నా నడుము వద్ద నల్లగా మచ్చలాగా పడుతోంది. ఇలా నల్లమచ్చ పడకుండా ఉండాలంటే ఏం చేయాలో సలహా ఇవ్వండి.
– సుష్మా, హైదరాబాద్
మీరు చెబుతున్న సమస్య అమ్మాయిల్లో చాలా సాధారణంగా కనిపించేదే. నడుము దగ్గర కాస్త బిగుతుగా కట్టుకున్నప్పుడు ఇలా ఏర్పడటం సహజం. నడుము దగ్గరి నాడా బిగుతుగా ఉండటంతో అక్కడ ఒత్తిడి పడుతుంది. ఒత్తిడి పడ్డచోట రక్తప్రవాహం తగ్గుతుంది. దాంతో అక్కడ డార్క్ రంగును ఇచ్చే పిగ్మెంట్ కణాలు బాగా పెరుగుతాయి. దాంతో ఆ భాగం నల్లగా కనిపిస్తుంది. దీన్ని నివారించాలంటే...
∙నాడాను మరీ బిగుతుగా కట్టుకోకుండా, కాస్త వదులుగా కట్టుకోండి ∙నాడా కట్టే ప్రాంతంలో కోజిక్ యాసిడ్, ఆర్బ్యుటిన్ ఉన్న స్కిన్ లైటెనింగ్ క్రీమ్ రాసుకోండి ∙బిగుతుగా కట్టుకునే నాడాలకు బదులు, శరీరాన్ని అంటిపెట్టుకునేలా సాఫ్ట్ ఎలాస్టిక్‌తో ఉండే దుస్తులు వాడండి ∙అప్పటికీ పిగ్మెంటేషన్ తగ్గకపోతే మీకు సమీపంలోని డర్మటాలజిస్ట్‌ను కలిసి గ్లైకోలిక్, ఫీనాల్ పీలింగ్ చికిత్సను ఒక కోర్స్‌లాగా తీసుకోవాల్సి ఉంటుంది.
హెల్మెట్ బయటి జుట్టు చివర్లు చిట్లుతున్నాయి...!
నా వయసు 26 ఏళ్లు. నేను వర్క్‌ప్లేస్‌కు బైక్‌పై వెళ్తుంటాను. నా మీడియమ్ లెంత్ హెయిర్‌లోని హెల్మెట్‌కు బయట ఉండే జుట్టు దుమ్ముకూ, ఎండకూ ఎక్స్‌పోజ్ అవుతోంది. దాంతో ఆ భాగం జుట్టులోని చివర్లు చిట్లుతున్నాయి. దాంతో జుట్టు అసహ్యంగా కనిపిస్తోంది. తగిన పరిష్కారం చెప్పండి. – కె. శివానీ, విశాఖపట్నం
మీరు చెప్పినట్లుగా వెంట్రుకల చివర్లు చిట్లడానికి మూడు అంశాలు సంయుక్తంగా ప్రభావం చూపుతాయి. అవి... దుమ్ము, కాలుష్యం, ఎండ. ఈ అంశాల దుష్ప్రభావం జుట్టుకు చాలా నష్టం చేస్తుంది. మీ సమస్య తగ్గడానికి కింద పేర్కొన్న జాగ్రత్తలు పాటించండి. ∙టూవీలర్ మీద ప్రయాణం చేసేటప్పుడు జుట్టు మొత్తం కాలుష్యం, ఎండ, దుమ్ము బారిన పడకుండా, వెంట్రుకలను కప్పి ఉంచేలా జాగ్రత్తలు తీసుకోండి. ∙రోజు విడిచి రోజు తల స్నానం చేయండి. తలస్నానం చేయడానికి మైల్డ్ షాంపూ మాత్రమే ఉపయోగించండి ∙తలస్నానం తర్వాత మీ జుట్టు పూర్తిగా ఆరకముందే ఈ కింద పేర్కొన పదార్థాలు ఉండే ‘హెయిర్ సీరమ్’ రాయండి. అవి... ∙డైమిథికోన్ ∙ట్రైజిలోగ్జేన్ ∙విటమిన్ ఈ ఎసిటేట్ ∙అహోబా ఆయిల్ ∙ఆలివ్ ఆయిల్ ∙ఆల్మండ్ ఆయిల్. పైన పేర్కొన్న సీరమ్ మీ వెంట్రుకలకు దుమ్ము, అల్ట్రావయొలెట్ కిరణాలు, కాలుష్యం నుంచి రక్షణ ఇస్తుంది.
కాలి వేళ్ల మధ్య ఎర్రబారుతోంది...
నా వయసు 54 ఏళ్లు. గృహిణిని. మా ఇంట్లో మా ప్లేట్లు నేనే శుభ్రం చేస్తేగానీ లేదా మా బట్టలు నేనే ఉతుక్కుంటేగానీ నాకు సంతృప్తి ఉండదు. అందుకే ఆ పనులన్నీ నేనే చేసుకుంటూ ఉంటాను. దాంతో తడిలో ఎక్కువసేపు ఉండాల్సి వస్తోంది. దాంతో నా కాలి వేళ్ల మధ్యన చర్మం చెడినట్లుగా అవుతోంది. చూడటానికి ఎర్రగా, ముట్టుకుంటే మంటగా అనిపిస్తోంది. నాకు తగిన పరిష్కారం చెప్పండి. – అనసూర్య, కోదాడ
మీరు చెబుతున్న సమస్య చాలా సాధారణం. నీళ్లలో ఎక్కువగా ఉండేవారు, నిత్యం నీళ్లలో కాళ్లు తడుస్తూ ఉండేవారికి ఇది ఎక్కువగా వస్తుంటుంది. ప్రధానంగా సబ్బు నీళ్లలో కాళ్లు తడుస్తుండేవారిలో ఇది మరీ ఎక్కువ. దీన్ని వైద్యపరిభాషలో ‘క్యాండిడియాసిస్’ అంటారు. మీ సమస్యను దూరం చేసుకోవడం కోసం మీరు ‘టెర్బినఫైన్’ అనే మందు ఉన్న క్రీమును ప్రతిరోజూ ఉదయం ఒకసారి, రాత్రి ఒకసారి చొప్పున నాలుగు వారాల పాటు రాసుకోవాలి. అలాగే ఇట్రకొనజోల్ 100 ఎంజీ అనే ట్లాబ్లెట్‌ను పొద్దునే టిఫిన్ అయ్యాక వేసుకోవాలి. అన్నిటి కంటే ముఖ్యమైనది కొన్నాళ్ల పాటు మీరు తడిలో, తేమ ఉన్న చోట కాలు పెట్టకుండా జాగ్రత్త తీసుకోవాలి. లేదా అలాంటిచోట్ల తిరగాల్సి వస్తే కాలికి తడి అంటకుండా స్లిప్పర్లు వేసుకొని తిరగండి.
అలర్జిక్ ర్యాష్ వచ్చిన చోట డార్క్ మార్క్స్...
నాకు కుడి చేతి మీద అలర్జిక్ ర్యాష్ వచ్చింది. దురదగా అనిపిస్తుంటే విపరీతంగా గీరాను. దాంతో అక్కడ డార్క్ మార్క్స్ ఏర్పడ్డాయి. నా చర్మం మీద అవి అసహ్యంగా కనిపిస్తున్నాయి. దయచేసి నాకు తగిన సలహా ఇవ్వండి. – డి. పారిజాత, ఒంగోలు
మీరు ‘పోస్ట్ ఇన్‌ఫ్లమేటరీ హైపర్ పిగ్మెంటేషన్’తో బాధపడుతున్నారని తెలుస్తోంది. అలర్జీని అదుపులో ఉంచుకునే మందులు వాడుతూ మీరు ఈ కింది సూచనలనూ పాటించండి ∙సాఫ్ట్ పారఫిన్, షియాబట్టర్, గ్లిజరిన్ ఉన్న మాయిష్చరైజర్‌ను డార్క్ మార్క్స్ ఉన్నచోట అప్లై చేయండి.
∙ఆ ప్రాంతంలో ఎస్‌పీఎఫ్ 50 కంటే ఎక్కువగా ఉన్న సన్‌స్క్రీన్ లోషన్ ప్రతిరోజూ ఉదయం, మధ్యాహ్నం రాయండి.
∙కోజిక్ యాసిడ్, అర్బ్యుటిన్, నికోటినమైడ్‌తో పాటు లికోరైస్ ఉన్న స్కిన్ లైటెనింగ్ క్రీములు రాయండి.
∙ఆహారంలో విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉండే ఆకుకూరలు, తాజాపండ్లు ప్రతిరోజూ తీసుకోండి.
ఈ సూచనలు పాటించాక కూడా తగ్గకపోతే కెమికల్ పీలింగ్, మైక్రో డర్మా అబ్రేషన్ వంటి చికిత్సలు తీసుకోవడం కోసం మీకు దగ్గర్లోని డర్మటాలజిస్ట్‌ను కలవండి.
డాక్టర్ స్మిత ఆళ్లగడ్డ,
చీఫ్ ట్రైకాలజిస్ట్ – డర్మటాలజిస్ట్ త్వచ స్కిన్ క్లినిక్, గచ్చిబౌలి, హైదరాబాద్
Comments
Please login to add a commentAdd a comment