ఉంగరం తొడిగే వేలు నల్లబారుతోంది! | health counciling | Sakshi
Sakshi News home page

ఉంగరం తొడిగే వేలు నల్లబారుతోంది!

Published Wed, Aug 31 2016 10:44 PM | Last Updated on Mon, Sep 4 2017 11:44 AM

ఉంగరం తొడిగే వేలు నల్లబారుతోంది!

ఉంగరం తొడిగే వేలు నల్లబారుతోంది!

డర్మటాలజీ కౌన్సెలింగ్

నేను గత పదేళ్లుగా కుడి చేతి వేలికి బంగారపు ఉంగరాన్ని ధరిస్తున్నాను. కానీ గత మూడు నెలల నుంచి ఉంగరం ధరించే చోట చర్మం నల్లబడుతోంది. ఆ ప్రాంతంలో కాస్త దురదగా, మంటగా కూడా ఉంటోంది. నా సమస్యకు తగిన పరిష్కారం చూపండి. - రాజేశ్వరి, ఆదిలాబాద్
ఏదైనా వస్తువుతో మన చర్మం ఆనుకుంటున్నప్పుడు ఏ సమయంలోనైనా అక్కడ  ‘కాంటాక్ట్ డర్మటైటిస్’ అనే సమస్య ఎదురుకావచ్చు. బహుశా మీకు కూడా ఇదే సమస్య వచ్చి ఉంటుంది. మీరు ఏదైనా సబ్బుగానీ లేదా డిటెర్జెంట్ గాని ఉపయోగిస్తుంటే... దాని మిగిలిపోయిన భాగం ఉంగరం వెనక ఉండిపోయి, అది చర్మానికి ఆనుకుంటుంది. దాంతో అలా ఆ సబ్బు లేదా డిటెర్జెంట్ ఆనుకొని ఉండేచోట అలర్జీ కనిపిస్తోంది. లేదా మీ ఉంగరంలోని ఇతర లోహాలు (అల్లాయ్స్) వల్ల కూడా అలర్జీ వచ్చే అవకాశం ఉంది. దీనికి చికిత్స ఈ కింది విధంగా అందించవచ్చు.

1) మీ ఉంగరాన్ని తరచూ తీసి శుభ్రం చేసుకొని మళ్లీ ధరించండి.
2) మీరు చేతులు కడుక్కునే సమయంలో వేళ్లన్నీ శుభ్రమయ్యేలా చూసుకోండి.
3) చర్మం నల్లగా అయ్యే ప్రాంతంలో హ్యాలోమెటాజోన్ వంటి మైల్డ్ కార్టికోస్టెరాయిడ్ ఉన్న క్రీమును రెండు వారాల పాటు రాయండి.
4) మీ ఉంగరాన్ని వేరే వేలికి తొడిగేందుకు అవకాశం ఉంటే, అలా కూడా మార్చి చూడవచ్చు.
ఈ నాలుగు జాగ్రత్తల తర్వాత కూడా మీ సమస్య తగ్గకపోతే మీకు దగ్గరలో ఉన్న డర్మటాలజిస్ట్‌ను సంప్రదించండి.

ఒకసారి నా చిన్నతనంలో నా చేతుల మీద (అరచేతుల వెనక భాగంపై) వేడివేడి గంజి ఒలికింది. గంజి ఒలికిన చోట చర్మం గట్టిబారి కదుములు కట్టింది. ఇప్పుడు నా వయసు 24 ఏళ్లు. నాకు పెళ్లిసంబంధాలు చూస్తున్నారు. నా చేతుల మీద ఉన్న ఈ కదుములు కాస్మటిక్‌గా ఇబ్బందికరంగా ఉన్నాయి. ఏదైనా చికిత్స ద్వారా వీటిని తొలగించగలమా? - సలీమా, కర్నూలు
మీరు చెప్పినట్లుగా వేడి ద్రవాలు చర్మం మీద పడినప్పుడు తీవ్రమైన గాయాలను కలగజేస్తాయి. అయితే తక్షణమే చికిత్స అందితే మీరు చెప్పిన మచ్చలు, కదుములు మిగలకుండా చికిత్స అందించవచ్చు. ఇక మీ విషయంలో ఈ కిందివిధంగా చికిత్స చేయవచ్చు.
1. మీ చర్మంపై కదుములు ఉన్న ప్రాంతంలో రోజుకు రెండుసార్లు సిలికాన్ జెల్ రాయాలి.
2. మీకు శాశ్వత పరిష్కారం కోసం ప్లాస్టిక్ సర్జన్‌ను సంప్రదించవచ్చు. వారు ఆరోగ్యకరమైన చర్మాన్ని మీ నుంచే సేకరించి కదుములు ఉన్నచోట గ్రాఫ్టింగ్ చేస్తారు.
3. కదుములు ఉన్న తీవ్రతను బట్టి ఫ్రాక్షనల్ లేజర్ లాంటి లేజర్ చికిత్స కూడా చేయవచ్చు. దీనివల్ల కదుములు తొలగిపోయి, ఆ ప్రాంతంలో కొలాజెన్ వృద్ధి అవుతుంది. మీ సమస్య పరిష్కారం కోసం ఒకసారి మీకు దగ్గర్లోని డర్మటాలజిస్ట్‌ను కలవండి.

డాక్టర్  స్మిత ఆళ్లగడ్డ
చీఫ్ డర్మటాలజిస్ట్,  త్వచ క్లినిక్, గచ్చిబౌలి, హైదరాబాద్

 

కాళ్ల వాపులు వస్తున్నాయి... ప్రమాదమా?
నెఫ్రాలజీ కౌన్సెలింగ్

నాకు 48 ఏళ్లు. గత 12 ఏళ్లుగా షుగర్ ఉంది. ఈ మధ్య ఎక్కువగా ప్రయాణాలు చేసేటప్పుడు కాళ్లకు వాపులు వస్తున్నాయి. రక్తం పరీక్ష చేయించగా క్రియాటినిన్ 10 మి.గ్రా., యూరియా 28 మి.గ్రా. ఉన్నది. యూరిన్ పరీక్షలో ప్రొటీన్ త్రీ ప్లస్ అని తెలిపారు. నాకు ఉన్న ఈ షుగర్ వ్యాధి వల్ల కిడ్నీలకు ఏదైనా సమస్య వచ్చే అవకాశం ఉందా? - నిరంజన్‌రావు, ఖమ్మం
మీరు తెలిపిన వివరాల ప్రకారం మీకు యూరిన్‌లో ప్రోటీన్ ఎక్కువగా పోతూ ఉన్నట్లు స్పష్టమవుతోంది. మీరు మొట్టమొదట ఒక అంశాన్ని నిర్ధారణ చేసుకోవాలి. ఇది షుగర్ వల్ల వచ్చిన సమస్యా లేక ఇతర కారణాల వల్ల ఇలా జరుగుతోందా అనేది మొదట పరీక్ష చేయించుకోండి. మీ యూరిన్‌లో అధికంగా రక్తం పోవడానికి షుగర్ ఒక కారణం కావచ్చు. ఈ సమస్య ఉన్నవాళ్లు భవిష్యత్తులో కిడ్నీలు దెబ్బతినకుండా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. మీరు షుగర్‌ను కంట్రోల్‌లో ఉంచుకోవడం చాలా అవసరం. తినక ముందు 110 మి.గ్రా. లోపు, తిన్న తర్వాత 160 మి.గ్రా. లోపు ఉండేటట్లు చూసుకోవాలి. బీపీ 115 / 75 లోపల ఉండేలా చూసుకోవాలి. ఇది కాకుండా ఉప్పును బాగా తగ్గించుకోవాలి. పొగతాగడం, ఆల్కహాల్ లాంటి అలవాట్లు ఉంటే పూర్తిగా మానేయాలి. పెయిన్ కిల్లర్‌లు సొంతంగా వాడకూడదు.

నా వయసు 37 ఏళ్లు. నాకు తరచూ మూత్ర విసర్జన సమయంలో మంట వస్తోంది. మాటిమాటికీ జ్వరం కూడా వస్తోంది. మందులు వాడుతున్నప్పుడు తగ్గుతోంది కానీ మందులు మానేయగానే మళ్లీ అదే పరిస్థితి. దయచేసి నాకు తగిన సలహా ఇవ్వండి.   - సుధాకర్‌రావు, నల్లగొండ
మీరు ‘రికరెంట్ యూరిన్ ఇన్ఫెక్షన్’తో బాధపడుతున్నారు. ఇలా మళ్లీ మళ్లీ మూత్రంలో ఇన్ఫెక్షన్ రావడానికి గల కారణాలను ముందుగా తెలుసుకోవాలి. మీకు షుగర్ ఉన్నట్లయితే దాని వల్ల ఇలా మాటిమాటికీ యూరిన్ ఇన్ఫెక్షన్ రావచ్చు. అందుకే ముందుగా ఒకసారి షుగర్ పరీక్షలు చేయించండి. అలాగే అల్ట్రాసౌండ్ స్కానింగ్ చేయించి మూత్ర విసర్జక వ్యవస్థలో ఎక్కడైనా రాళ్లు ఉన్నాయా అని కూడా చూడాలి. ఇక యాంటీ బయాటిక్ కోర్సు పూర్తిగా వాడకపోయినా ఇన్ఫెక్షన్ పదేపదే తిరగబెట్టవచ్చు. మీరు మంచినీళ్లు ఎక్కువగా తాగుతూ ఉండాలి. రోజుకు కనీసం రెండు, మూడు లీటర్ల నీళ్లు తాగండి. మూత్రవిసర్జన ఫీలింగ్ కలగగానే ఎక్కువసేపు వేచిచూడకుండా వెంటనే విసర్జనకు వెళ్లండి.


నా వయసు 36 ఏళ్లు. ఇటీవల ఆకలి బాగా తగ్గిపోయింది. డాక్టర్‌ను సంప్రదించి పరీక్షలు చేయించుకున్నాను. వాటిలో క్రియాటినిన్ ఎక్కువగా పోతోందని  చెప్పి, డాక్టర్ స్కానింగ్ తీయించారు.అందులో కిడ్నీ సైజు బాగా తగ్గింది అని చెప్పారు. ప్రస్తుతం క్రానిక్ కిడ్నీ డిసీజ్ ఐదో దశలో ఉన్నాననీ, కిడ్నీ మార్పిడి అవసరమని చెప్పారు. కిడ్నీ మార్పిడి తప్ప మరో ప్రత్యామ్నాయం ఏదైనా ఉందా? కిడ్నీ మార్చుకోవాలంటే ఎవరి దగ్గర తీసుకోవాలి?  - రవికుమార్, నేలకొండపల్లి
మీరు తెలిపిన వివరాల ప్రకారం మీకు కిడ్నీ మార్పిడి ఒక్కటే ఉత్తమమైన పరిష్కారం. మీ తోడబుట్టినవాళ్లు లేదా మీ భార్య వంటి దగ్గరి సంబంధీకుల నుంచి కిడ్నీని స్వీకరిస్తారు. కిడ్నీ మార్పిడి చేయించుకునే ముందు దాతకు అన్ని రకాల పరీక్షలు చేయించి, కిడ్నీదానం చేయడం వల్ల దాతకు ఎలాంటి సమస్యలు లేకపోతేనే వారి నుంచి కిడ్నీని స్వీకరిస్తారు. ఇక పేషెంట్‌కు దాత ఎంత దగ్గరి బంధువైతే అంత మంచిది. కిడ్నీ మార్పిడి తర్వాత క్రమం తప్పకుండా మందులు వాడాల్సి ఉంటుంది. ఒకవేళ దాత అందుబాటులో లేకుంటే క్రమం తప్పకుండా డయాలసిస్ చేయించుకుంటూ, కెడావర్ దాతల కోసం రిజిష్టర్ చేయించుకోవాలి. బ్రెయిన్‌డెత్ అయిన సందర్భాల్లో వాళ్ల దగ్గర కిడ్నీ దొరికితే అది మీకు అమర్చుతారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement