మనవలు, మనవరాళ్లతో కలిసి భోంచేస్తున్న డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ (ఆల్బమ్ ఫొటో)
మన తొలి రాష్ట్రపతి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్. ఆయనకు కొన్ని ఆదర్శాలు ఉండేవి. వాటిలో కొన్ని తనకు తానుగా పెట్టుకున్నవి. మరికొన్ని.. మహనీయుల నుంచి నేర్చుకున్నవి. రాష్ట్రపతికి ప్రభుత్వం అనేక సదుపాయాలను, సౌకర్యాలను కల్పిస్తుంది. వాటిని వద్దనుకున్నారు రాజేంద్ర ప్రసాద్. ఆఖరికి తన వ్యక్తిగత సహాయకుల సంఖ్యను కూడా ఒకటికి కుదించుకున్నారు. గాంధీజీ జీవితాన్ని సందేశంగా తీసుకుని ఆయన ఈ ఆదర్శాన్ని ఆచరించారు.
అంతేకాదు, రాష్ట్రపతిగా సగం జీతాన్నే తీసుకున్నారు. అప్పట్లో రాష్ట్రపతి జీతం పదివేలు. ఐదువేలు చాలనుకున్నారు. అది కూడా చట్టాన్ని గౌరవించడం కోసం. పదవీ విరమణ నాటికి ఆ మొత్తాన్ని ఇంకా తగ్గించుకుని 2,500 రూ. మాత్రమే స్వీకరించారు. ఇంట్లో ఆయన రాష్ట్రపతీ కాదు, పెద్ద రాజకీయవేత్త కాదు. తాతయ్య మాత్రమే. మనవలు, మనవరాళ్లకు ఆయన తాతయ్యగా మాత్రమే తెలుసు. అది ఆయన కుటుంబం ఆచరించిన ఆదర్శం. వ్యక్తిగత అలవాట్లలో కూడా రాజేంద్ర ప్రసాద్ జీవన శైలి భిన్నంగా ఉండేది. ఆయన ఒక్కరే ఎప్పుడూ భోజనానికి కూర్చోలేదు.
పిల్లలందరూ డైనింగ్ టేబుల్ దగ్గరకి వచ్చే వరకు ఓపిగ్గా ఎదురు చూసేవారు. ఆ తర్వాతే భోజనానికి ఉపక్రమించే వారు. కలిసి తినడం అనే అలవాటు ఈ తరం పెద్దలకు, పిల్లలకు వింతగా ఉండొచ్చు. కానీ కలిసి తినందే తనకు కడుపు నిండినట్లు ఉండదని రాజేంద్ర ప్రసాద్ అనేవారు. చివరి వరకు ఆయన జీవితం కుటుంబ, సామాజిక విలువలతో నిరాడంబరంగా గడిచింది. కుటుంబంలో పాటించిన విలువలనే సమాజంలో పాదుగొల్పాలని రాజేంద్ర ప్రసాద్ ప్రయత్నించారు. మత భావనలకు అతీతంగా మనుషులందరినీ కలిపి ఉంచే విలువలు అవి. ఇవాళ ‘అడ్వొకేట్స్ డే’. ‘లా’ కూడా చదివి, సమాజంలో సమన్యాయం కోసం పాటుపడిన డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ జయంతి సందర్భంగా ఏటా ఈ రోజు ‘న్యాయవాదుల దినోత్సవం’ జరుపుకుంటున్నాం.
Comments
Please login to add a commentAdd a comment