వైభవంగా ‘భాష్యం’ వేడుకలు
గుంటూరు ఎడ్యుకేషన్ : భాష్యం విద్యాసంస్థల 23వ వార్షికోత్సవాన్ని గోరంట్లలోని భాష్యం టీచర్స్ కాలనీ ప్రాంగణంలో మంగళవారం రాత్రి వైభవంగా నిర్వహించారు. ముందుగా భాష్యం విద్యాసంస్థల అధినేత భాష్యం రామకృష్ణ జన్మదినోత్సవాన్ని ఇదే వేదికపై జరిపారు. ముఖ్య అతిథిగా హాజరైన ప్రముఖ సినీ నటుడు, మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) అధ్యక్షుడు డాక్టర్ రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ విద్యతోనే మనిషికి సమాజంలో ఒక గుర్తింపు వస్తుందని చెప్పారు. జన్మనిచ్చిన తల్లిదండ్రులు, విద్యాబుద్ధులు నేర్పి జీవితాన్ని తీర్చిదిద్దే ఉపాధ్యాయుల పట్ల వినయ, విధేయతలతో నడుచుకోవాలని విద్యార్థులకు సూచించారు.
రాష్ట్రంలో అగ్రగామి విద్యాసంస్థగా, విద్యార్థులను రాష్ట్ర, జాతీయ స్థాయిలో టాపర్లుగా తీర్చిదిద్దుతూ బ్రాండ్ ఇమేజ్‌ను భాష్యం సొంతం చేసుకుందని పేర్కొన్నారు. రాష్ట్ర మహిళా కమిషన్ చైర్‌పర్సన్ నన్నపనేని రాజకుమారి మాట్లాడుతూ విద్యార్థి దశ నుంచే విలువలు కలిగిన మంచి పౌరులుగా ఎదగాలని సూచించారు.
భాష్యం రామకృష్ణ మాట్లాడుతూ తల్లిదండ్రుల నమ్మకమే పునాదిగా భాష్యం ఎదిగిందని చెప్పారు. కార్యక్రమంలో భాష్యం పూర్వ విద్యార్థి గౌతమ్, సంస్థ సలహాదారు మైలవరపు శ్రీనివాసరావు, భాష్యం హనుమంతరావు, భాష్యం గోపి, ప్రిన్సిపాల్స్, ఉపాధ్యాయులు, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు వేలాదిగా పాల్గొన్నారు. అనంతరం విద్యతో పాటు క్రీడా, సాంస్కృతిక పోటీల్లో ప్రతిభ చూపిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. విద్యార్థుల సంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. భారీ విద్యుత్ వెలుగుల నడుమ తీర్చిదిద్దిన వేదిక సినీ సెట్టింగ్‌ను తలపించింది.