వెలుగులనమ్మే చిన్నారి | Story About Hans Christian Andersen The Little Matchstick Girl Book | Sakshi
Sakshi News home page

వెలుగులనమ్మే చిన్నారి

Published Mon, Dec 30 2019 12:22 AM | Last Updated on Mon, Dec 30 2019 12:24 AM

Story About Hans Christian Andersen The Little Matchstick Girl Book - Sakshi

సంవత్సరం చివరి రోజున జరిగే కథ.
సంవత్సరంలో ఏరోజూ జరగకూడని కథ.


చలి మరీ తీవ్రంగా ఉంది; మంచు కురిసింది; చీకటి కూడా పడుతోంది. అది సాయంత్రం, ఆ సంవత్సరపు చివరి సాయంత్రం. ఇట్లాంటి చలిలో, చీకటిలో ఒక పేద బాలిక నడుస్తూవుంది;  తలకు కట్టయినా, కాళ్లకు చెప్పులయినా లేకుండా. ఇల్లు వదిలినప్పుడు ఆమె కాళ్లకు చెప్పులున్న మాట వాస్తవం; కానీ ఏం లాభం? అవి ఆమె కాళ్లకు చాలా పెద్దవైనాయి; అంతకుముందు వాళ్లమ్మ వేసుకున్నవాయె. పోనీ అవైనా ఉన్నాయనుకుంటే, ఆ వీధిలోంచి భయంకరమైన వేగంతో వెళ్లిన రెండు గుర్రపుబళ్లకు భయపడి పరుగెత్తడంలో అవెక్కడో జారిపోయినై.

ఒక చెప్పు ఎక్కడా కనబడనేలేదు; కనబడిన రెండోదాన్ని ఎవరో పేద తుంటరి పిల్లాడు ఎత్తుకొని పరుగెత్తాడు; వాడికి ఎప్పటికైనా పిల్లలు పుడితే కొనవలసిన ఊయలకు పెట్టుబడిగా పనికి వస్తుందనేమో. ఇంక ఈ చిన్నారి తల్లి తన చిన్న కాళ్లతోనే నడుచుకుంటూ పోయింది. చలికి ఆమె ఎర్రటి పాదాలు నీలంరంగులోకి మారుతున్నాయి. ఆమె వేసుకున్న పాత ఏప్రానులో కొన్ని అగ్గిపుల్లలున్నాయి; ఇంకో కట్టేమో ఆమె చేతిలో ఉంది. పొద్దుటినుంచీ అందులోంచి ఒక్కటైనా ఎవరూ కొనలేదు, ఒక్క ‘ఫార్తింగ్‌’ అయినా ఇవ్వలేదు.

పాపం ఆ చిన్నారి అట్లానే ఆ చలికి వణుకుతూ, ఆకలికి మాడుతూ, కాళ్లను ఈడ్చుకుంటూ పోయింది. ఎంత హృదయ విదారక దృశ్యం!
ఆమె మెడచుట్టూ అందంగా జాలువారిన ఆమె పొడవాటి జుట్టు మంచు ముద్దలతో నిండిపోయింది. కానీ ఆమె దానిగురించి ఒక్కసారైనా ఆలోచించలేదు. అన్ని కిటికీల్లోనూ కొవ్వొత్తులు వెలుగుతున్నాయి, రుచికరమైన బాతు మాంసం వాసన వేస్తోంది. అది కొత్త సంవత్సరపు వేడుక. దీని గురించైతే ఆమె ఆలోచించకుండా ఉండలేకపోయింది.
రెండు ఇళ్ల మధ్య ఏర్పడిన మూలలో– అందులోంచి ఒక ఇల్లు కొంచెం ఎక్కువ పొడుచుకు వచ్చినట్టుగా ముందుకు వచ్చింది– ఆ చిన్నారి చేతులు ముడుచుకుని కూర్చుంది;

తన కాళ్లను మరింత, మరింత దగ్గరకు లాక్కుంది; అయినా చలికి ఇంకా, ఇంకా వణుకుతూనేవుంది. అయినప్పటికీ ఇంటికి తిరిగివెళ్లడానికి ధైర్యం చాల్లేదు; ఒక్క అగ్గిపుల్లయినా అమ్మలేదాయె, చేతిలోకి ఒక్క ఫార్తింగ్‌ అయినా రాలేదాయె, ఇంటికి వెళ్తే నాన్న నుంచి దెబ్బలు తప్పవాయె. పోనీ ఇంటికి వెళ్లినా అక్కడా చలి తప్పదాయె; ఇంటికి పైకప్పు తప్ప ఏమీలేదాయె. పెద్ద పెద్ద పర్రెలను గడ్డితోనూ పాతబట్టలతోనూ కప్పినప్పటికీ గాలి ఇంకా ఈల వేస్తూనేవుంటుంది.

ఆమె చిన్న చేతులు చలికి దాదాపుగా మొద్దుబారిపోయినై. అయ్యో! కట్టలోని ఒక్క అగ్గిపుల్ల వెలిగించగలిగినా ఆమెకు కొంత ఉపశమనమైనా దొరుకునే! ఆ కట్టలోంచి తీయడానికి ధైర్యం చేసి, దాన్ని ఆ గోడకు గీకి, ఆ మంటకు తన వేళ్లను కాపుకోగలిగితే బాగుండు! ఆ, ఆమె ఒకటి బయటికి తీసింది. ‘సుర్‌ర్‌!’ ఎలా వెలిగింది, ఎలా మండింది! కొవ్వొత్తిలాగా వెచ్చటి, ప్రకాశవంతమైన మంట. దాని మీద ఆమె వేళ్లను ఉంచింది. ఎంత బాగుంది! మెరుగుపెట్టిన ఇత్తడి కాళ్లతో ఉండే ఒక పెద్ద ఇనుప పొయ్యి ముందు కూర్చున్నట్టుగా అనిపించింది. ఎంత అందమైన మంట! చిన్నారి తన పాదాలను కూడా ఆ వేడి తగిలేట్టుగా చాపింది; కానీ ఇంతలోనే ఆ బుల్లి మంట ఆరిపోయింది; పొయ్యి మాయమైంది. ఆమె చేతిలో కాలిపోయిన పుల్ల తప్ప ఇంకేమీ లేదు.

మరొక్కదాన్ని గోడకు వ్యతిరేకంగా గీకింది; ప్రకాశంగా అది మండింది; గోడ మీద ఎక్కడైతే వెలుతురు పడిందో ఉన్నట్టుండి అది పారదర్శకమైన తెరలా మారిపోయింది; లోపల గది అంతా ఆమెకు కనబడుతోంది. టేబుల్‌ మీద మంచులాంటి తెల్లటి బట్ట పరిచివుంది; దానిమీద అందమైన పింగాణీ పాత్రలు అమర్చివున్నాయి; యాపిల్‌ ముక్కలు, ఎండు రేగుపళ్లతో గొప్పగా గార్నిష్‌ చేసిన కాల్చిన బాతులోంచి ఉడుకు పొగలు వస్తున్నాయి.

ఇంకా ముఖ్యమైన విషయం, ఛాతీకి కత్తి, ఫోర్కులను గుచ్చివున్న ఆ బాతు ఆ పాత్రలోంచి గెంతి, నేరుగా ఆ చిన్నారి దగ్గరకే నడుచుకుంటూ వచ్చేలోగా ఆ అగ్గిపుల్ల ఆరిపోయింది; మందపు, చల్లటి, తడిసిన గోడ తప్ప అక్కడ ఇంకేమీ లేదు. ఆమె ఇంకోటి వెలిగించింది. ఇప్పుడు ఆమె ఒక బ్రహ్మాండమైన క్రిస్‌మస్‌ ట్రీ కింద కూర్చునివుంది; గాజు తలుపులోంచి ధనిక వ్యాపారి ఇంట్లో తను చూసినదానికన్నా పెద్దది; అంతకంటే దివ్యమైన అలంకరణ చేసినది!

దాని ఆకుపచ్చ కొమ్మల మీద వేలాది దివ్వెలు వెలుగుతున్నాయి, గొప్ప రంగుల బొమ్మలు మెరుస్తున్నాయి, దుకాణాల్లో చూసి ఎప్పటికీ కొనలేనని తను అనుకున్నలాంటివి. వాటిని అందుకోవడానికి చేతులు సాచేలోగా అగ్గిపుల్ల ఆరిపోయింది. క్రిస్‌మస్‌ ట్రీలోని దివ్వెలు పైకి, ఇంకా పైకి లేచాయి; అవిప్పుడు స్వర్గంలోని నక్షత్రాల్లా ఆమెకు కనబడుతున్నాయి; అందులోంచి ఒక తార రాలిపోయింది, ఒక పెద్ద మంటతో.
‘‘ఇప్పుడే ఎవరో చనిపోయారు!’’ అని చెప్పింది, వాళ్ల నానమ్మతో. ఆమెను ముద్దుచేసిన ఏకైక వ్యక్తి ఇప్పుడు లేని ఈ నానమ్మ. ఒక తార రాలిందంటే ఒక ఆత్మ దేవుడి దగ్గరకు చేరుకున్నట్టని చెప్పిందావిడ.

ఆ గోడకు మరో అగ్గిపుల్ల వెలిగింది; మళ్లీ దివ్యమైన వెలుగు; అందులో ముసలి నానమ్మ నిలుచునివుంది, ఒళ్లంతా కాంతులీనుతూ, ముఖం నిండా శాంతితో, ప్రేమతో.
‘‘నానమ్మా!’’ అని కేకేసింది పాప. ‘‘నీతో నన్ను తీసుకెళ్లు. అగ్గిపుల్ల ఆరిపోగానే నువ్వు వెళ్లిపోతావు, మాయమైపోతావు– వెచ్చటి పొయ్యిలా, రుచికరమైన బాతులా, బ్రహ్మాండమైన క్రిస్‌మస్‌ ట్రీలా నువ్వు కనబడకుండా పోతావు!’’ వెంటనే తన దగ్గరున్న మొత్తం అగ్గిపుల్లల్ని ఆ గోడకు గీకి వెలిగించింది, నాన్నమ్మను తన దగ్గరే ఉంచుకోవాలన్న కృత నిశ్చయంతో. ఆ అగ్గిపుల్లలు ఎంత గొప్పగా వెలిగినాయంటే పట్టపగలు కాంతి కూడా వాటిముందు వెలవెలబోతుంది. అంతకుముందెప్పుడు నాన్నమ్మ అంత పొడుగ్గా, అంత అందంగా కనబడలేదు. ఆమె ఆ చిన్నారి బాలికను తన చేతిలోకి తీసుకుంది; ఆ వెలుగులో, ఆ సంతోషంలో ఇరువురూ పైకి, ఎంతో ఎత్తుకి ఎగిరిపోయారు. ఇంక అక్కడ చలి లేదు, ఆకలి లేదు, వేదన లేదు– వాళ్లు దేవుడితో ఉన్నారు.

కానీ ఆ మూలకు, ఆ సాయంత్రపు చలి వేళలో, గోడకు ఆనుకుని కూర్చున్న ఆ గులాబీ చెక్కిళ్ల నవ్వు ముఖపు చిన్నారి పాప మంచుకు గడ్డ కట్టుకుపోయింది, ఆ ఏడాది చివరి రోజున. బొమ్మలా, కదలకుండా తన అగ్గిపుల్లలతో కూర్చుంది ఆ చిన్నారి; ఆ అగ్గిపుల్లల్లో ఒక కట్ట కాలిపోయివుంది. ‘‘తనను తాను వెచ్చగా కాపుకోవాలనుకుంది పాపం,’’ అన్నారు జనం. కానీ ఏ ఒక్కరికైనా ఇంత కూడా అనిపించలేదు, కలలో కూడా వాళ్లు తలిచివుండరు; ఎంత అందమైన వాటిని తను చూసివుంటుంది! ఎంత తేజస్సుతో ఆమె తన నానమ్మతో కలిసి కొత్త సంవత్సరపు సంరంభంలోకి అడుగుడివుంటుంది!

హాన్స్‌ క్రిస్టియన్‌ యాండెర్సెన్‌ (1805–75) రాసిన ‘ద లిటిల్‌ మాచ్‌స్టిక్‌ గర్ల్‌’ కథ ఇది. అనువాదం: సాహిత్యం డెస్క్‌. రచనాకాలం: 1845. మనుషుల్లో ఉండవలసిన కరుణను ప్రధాన వస్తువుగా చేసుకున్న ఈ ఫెయిర్‌ టేల్‌ ప్రపంచవ్యాప్తంగా ఎందరో కళాకారులను ఇప్పటికీ ఆకర్షిస్తూనేవుంది; ఎన్నోసార్లు వివిధ రూపాల్లో తెరకెక్కుతూనేవుంది. అదే కారణంగా ఎన్నో క్రిస్‌మస్‌ కథా సంకలనాల్లోనూ చోటు చేసుకుంది. డెన్మార్క్‌కు చెందిన యాండెర్సెన్‌ కవి, నవలాకారుడు, నాటక రచయిత అయినప్పటికీ ఆయన పేరు ఫెయిర్‌ టేల్స్‌తోనే ముడిపడిపోయింది. మూడు వేలకుపైనే ఇలాంటివి రాశాడంటారు. పిల్లలకోసం ఉద్దేశించినా పెద్దలూ చదివారు. పాశ్చాత్య ప్రపంచపు ఉమ్మడి చైతన్యాన్ని రూపొందించిన కథలుగా వీటిని పరిగణిస్తారు. అందువల్లేనేమో ఎన్నో దేశాల్లో ఆయన విగ్రహాలు కనబడతాయి. 

హాన్స్‌ క్రిస్టియన్‌ యాండెర్సెన్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement