ఏం కుదరదు?! నిక్కీ హాలే దగ్గర ‘కుదరదు’ అంటే కుదరదు. కష్టమైనా, నష్టమైనా ఒకటి అనుకున్నప్పుడు..ఫైట్ చెయ్యాలంతే! కాన్‌ట్ ఈజ్ నాట్ ఏన్ ఆప్షన్.. ఆమె లైఫ్ కాప్షన్. అది ఆమె రాసిన పుస్తకం పేరు కూడా. నిక్కీ ఇండియా అమ్మాయి. ఐక్యరాజ్యసమితిలో ఇప్పుడు అమెరికా అమ్మాయి. అంబాసిడర్ టు అమెరికా! మన ‘నిమ్రత’ను అమెరికా తన ‘నిక్కీ’ని చేసుకుందంటే.. అది ఆమె క్యాలిబర్. ‘కుదరదు’ అనని ఆమె క్యాపబిలిటీ!
ఆకాశమే హద్దుగా ఆస్వాదించే స్వేచ్ఛాస్వాతంత్య్రాలు, అంతే వివపరీతమైన జాత్యాహంకారం, వర్ణవివక్ష.. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ‘యునైటెడ్ క్యారెక్టరిస్టిక్స్!’ అందుకేనేమో నిక్కి హేలీ అంది.. ‘నేను భారతీయ స్త్రీని కావడం వల్ల అమెరికాను కొత్తకోణం నుంచి చేసే అవకాశం కలిగింది.
అయితే ఇక్కడి సమాజాన్ని భిన్న వర్గాల సమూహంగా కాక భిన్న తత్వాల కలయికగా పరిశీలించాను’ అని! నిక్కి హేలీ.. అమెరికాలో పుట్టిపెరిగిన మన ఆడపడుచు. సౌత్ కరోలినా రాష్ట్రానికి మొట్టమొదటి మహిళా గవర్నర్.. భారత సంతతికి చెందిన తొలి అమెరికన్ గవర్నర్. ఈ రెండే కాదు.. భారతీయ ఉద్యోగవలసలను ఆపాలని కంకణం కట్టుకున్న అమెరికన్ ప్రెసిడెంట్ ట్రంప్ తమ దేశం తరపున నియమించిన యూఎన్‌ఓ దౌత్యవేత్త కూడా! ఈ ఘనతలే ఈ రోజు నిక్కి బయోను ఇక్కడ ఆవిష్కరించేలా చేశాయి.
బిజినెస్ ఉమన్
నిక్కి 1972, జనవరి 20న సౌత్ కరోలినాలోని బాంబెర్గ్‌లో పుట్టింది. ఆమె తల్లిదండ్రులు ఇండియా నుంచి అమెరికా వలసొచ్చిన సిక్కులు. నిక్కి పూర్తి పేరు నమ్రత నిక్కి రాంధ్వా హేలీ. ఆమె తండ్రి సిక్కుమతాచారం ప్రకారం తలకు పాగా ధరించేవారు. దాంతో ఆ ప్రాంతంలోని అమెరికన్స్, ఇతర యురోపియన్ మైగ్రెంట్స్‌కంటే నిక్కి వాళ్ల కుటుంబం, వాళ్ల ఆచారవ్యవహారాలు చాలా భిన్నంగా ఉండేవి, కనిపించేవి. దీనివల్ల ఆమె తన బాల్యంలో జాత్యహంకారాన్ని ఎదుర్కోవాల్సి వచ్చింది.
అందుకే ఆ తర్వాత రాజకీయాల్లోకి వచ్చాక వలసల హక్కుల చట్టానికి గట్టి మద్దతు తెలిపి ఉంటుంది. పాఠశాల చదువు పూర్తయ్యాక క్లెమ్సన్ యూనివర్శిటీలో స్కాలర్‌షిప్ వచ్చింది. టెక్స్‌టైల్ మేనేజ్‌మెంట్‌లో డిగ్రీ చేసింది. నిజానికి కాటన్, ఊలు, సిల్క్.. మీద ఆమెకు ఆసక్తి లేదు. కేవలం క్లెమ్సన్ యూనివర్శిటీలో చదువు ఒక్కటే ఆమె కల. కాబట్టి సీట్ దొరికిన కోర్స్‌ను చదువుకుంది.
తల్లిదీ బట్టల వ్యాపారమే. ఆ చదువు వ్యాపారంలో తల్లికి చేదోడువాదోడుగా ఉండేందుకు ఉపయోగపడుతుంది అనుకుంది. అనుకున్నట్టే యూనివర్శిటీ నుంచి వచ్చాక బట్టల వ్యాపారంలోకి అడుగుపెట్టింది నిక్కి. ‘ఎక్సోటికా ఇంటర్నేషనల్’ అనే ఆ వస్త్రవ్యాపార సంస్థను మల్టీమిలియన్ డాలర్ కంపెనీగా మార్చే ప్రయత్నంలో పడింది. ఆమె వ్యాపార దక్షత 1998లో నిక్కీని ఆరేంజ్‌బర్గ్ కౌంటీ చాంబర్ ఆఫ్ కామర్స్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్‌కి నేమినేట్ చేసింది. అలాగే 2003లో లెగ్జింటన్ చాంబర్ ఆఫ్ కామర్స్‌కి కూడా ఆమెను నామినేట్ చేశారు.
2004లో నేషనల్ అసోసియేషన్ ఆఫ్ విమెన్ బిజినెస్ ఓనర్స్‌కి ప్రెసిడెంట్ అయింది. అక్కడితో ఆగిపోలేదు. లెగ్జింటన్ మెడికల్ ఫౌండేషన్, వెస్ట్ మెట్రో రిపబ్లికన్ విమెన్, ఎన్‌ఏడబ్ల్యూబీఓ సౌత్ కరోలినా చాప్టర్.. వంటి సంస్థల్లోనూ భాగస్వామి అయింది. ఇంకోవైపు కమ్యూనిటీ సేవాకార్యక్రమాల్లో పాలుపంచుకోవడం మొదలుపెట్టింది. ఇవన్నీ నిక్కీ పొలిటికల్ ఎంట్రీని ఖరారు చేశాయి.
కాన్ఫిడరేట్ బాటిల్ ఫ్లాగ్
సదరన్ క్రాస్‌గా పిలిచే కాన్ఫిడరేట్ బాటిల్ ఫ్లాగ్ అనేది కాన్ఫిడరేట్ స్టేట్స్ ఆఫ్ అమెరికాకు రాజకీయ చిహ్నం. ఉరిశిక్షను, జాత్యహంకార విధానాలను వ్యతిరేకించే ప్రయత్నాలకు అప్పటి ప్రెసెడెంట్ హ్యారీ ట్రుమన్ మద్దతు తెలిపాడు. సివిల్ వార్‌లో నల్లవాళ్లకు మద్దతుగా కూడా ఈ పతాకాన్ని ఉపయోగించారు.
పొలిటికల్ లీడర్..
2004లో సౌత్ కరోలినా శాసనసభకు ఎలక్షన్లు మొదలయ్యాయి. రిపబ్లికన్ పార్టీ తరపున బరిలోకి దిగింది నిక్కీ. తన పోటీని ఖాయం చేసుకోవడానికి అప్పటికే హౌజ్ ఆఫ్ రిప్రజెంటీటివ్ అయిన ల్యారీ కూన్ మీద గెలవాలి. అదంత ఆషామాషీ వ్యవహారం కాదు. ఎందుకంటే ల్యారీ లాంగెస్ట్ సర్వింగ్ మెంబర్ ఆఫ్ ది హౌజ్.
పైగా రాజీకాయాలను ఔపోసన పట్టిన నేత. తను.. ఓనమాలు దిద్దుతున్న వనిత. ఆమెకున్న చురుకుదనం, ఆసక్తి ల్యారీతో పోటీపడకుండా నిక్కీనే తమ పార్టీ అభ్యర్థిగా ఏకగ్రీవంగా ఎన్నుకునేలా చేశాయి. అలా సౌత్ కరోలీనా రిపబ్లికన్ ఆఫీస్‌కు మొదటి ఇండియన్ అమెరికన్ అధినేత అయింది నిక్కీ. 2008 ఎన్నికల్లోనూ డెమోక్రాట్ అభ్యర్థిని ఓడించింది.
వలసల మద్దతుదారు
ట్రంప్ అధికారంలోకి రాగానే వరాల కన్నా కోరడానే ఎక్కువగా ఝుళిపించాడు అమెరికాకు వస్తున్న వలసలకు సంబంధించి. కాని అదే పార్టీ అభ్యర్థిగా సౌత్ కరోలినా హౌజ్‌లో ఉన్న మన ఆడబిడ్డ మాత్రం వలసల పట్ల సహానుభూతే ప్రదర్శించింది. ప్రాక్టికల్‌గా నిలబడింది కూడా. వలసలకు సంబంధించిన చట్టాల అమలుకు మద్దతు తెలిపింది. అబార్షన్లను వ్యతిరేకించే బిల్లుకూ ఓటు వేసి అమ్మ మనసు చాటుకుంది.
ప్రభుత్వాల మంకు పట్టు, ప్రజల పన్నులతో వచ్చిన ఆదాయాన్ని వృ«థాచేయడం, దుర్వినియోగం పర్చడం వంటివాటిని నిలువరించేందుకు మొదలైన టీపార్టీ ఉద్యమంలో సభ్యురాలై, ఆ ఉద్యమానికి జై కొట్టింది. రిపబ్లికన్ పార్టీ స్ట్రాటజీతో కాకుండా ప్రజల సమస్యలతో సంబంధం ఉండడం, వాటిని పరిష్కరించే మార్గాలు తెలుసుండడం, ప్రజా శ్రేయస్సు కోసం పార్టీని ఒప్పించే శక్తిసామర్థ్యాలు కలిగి ఉండడం.. వంటి లక్షణాలన్నీ 2010లో నిక్కీకి సౌత్ కరోలీనా గవర్నర్ పట్టాన్ని కట్టబెట్టాయి.
ఈ విజయం.. సౌత్‌కరోలీనాకు తొలి మహిళా గవర్నర్‌గానే కాదు.. ఫస్ట్ ఇండియన్ అమెరికన్ గవర్నర్‌గా కూడ రికార్డ్ నమోదు చేసింది. తన జీవిత కథ ఆధారంగా ‘కాంట్ ఈజ్ నాట్ యాన్ ఆప్షన్’ పేరుతో ఓ పుస్తకాన్నీ రాసింది నిక్కీ హేలి.
కాంట్రవర్సీలు..
సిక్కు మతస్తురాలుగా చిన్నప్పుడు ఎదుర్కొన్న జాత్యహంకార అనుభవాల దృష్ట్యా యుక్త వయసు వచ్చాక క్రిస్టియన్ మతం తీసుకుంది. క్రిస్టియన్‌నే పెళ్లిచేసుకుంది. కాని తల్లిదండ్రుల మీదున్న గౌరవంతో, వాళ్ల కోసం సిక్కు మత పండగలను, ఆచారాలను కూడా పాటిస్తుంది. సౌత్‌కరోలీనా ఎన్నికల్లో ఆమె పోటీ చేసినప్పుడు ఈ అంశంతోనే ఆమె మీద బురదజల్లేందుకు యత్నించారు ప్రత్యర్థులు.
అదొక విషయమే కాదన్నంత తేలికగా కొట్టిపారేసింది నిక్కి. అందుకే పూర్తి వ్యక్తిగతమైన ఆమె రిలేషన్స్‌ను తెరమీదకు తెచ్చారు. అపవాదు వేసి అభివృద్ధి చెందిన దేశాల్లో కూడ రాజకీయాలు వ్యక్తిగత దూషణకు దిగజారుతాయని నిరూపించారు. నాగరిక సమాజంలో కూడా స్త్రీని నిలువరించాలంటే ఆమె శీలాన్ని శంకించాలనే అనాగరితను చాటుకున్నారు. దేనికీ స్పందించలేదు నిక్కీ. అతిగా ఆవేశపడలేదు.
తనేంటో నిరూపించుకోవాలనే వ్యర్థ ప్రయత్నమూ చేయలేదు. తన మీద వచ్చిన విమర్శలకు అసలు విలువివ్వలేదు. ప్రజల పట్ల తనెంత లాయల్‌గా ఉంటుందో స్పష్టం చేసింది. అదే జనాలకూ నచ్చింది. అన్నిటికన్నా ముందు సమస్య వస్తే ధైర్యంగా నిలబడే ఆమె తీరును ఇష్టపడ్డారు. ఆమె నిజాయితీని మెచ్చారు. అదే ఆమె పట్ల వాళ్లకు నమ్మకాన్ని పెంచింది. గవర్నర్‌ను చేసింది.
కాన్ఫిడరేట్ ఫ్లాగ్..
2015, జైన్ 17న సౌత్ కరోలీనాలో జరిగిన ఓ సంఘటన అమెరికానే కాదు ప్రపంచాన్నంతటినీ వణికించింది. డైలాన్ రూఫ్ అనే 21 ఏళ్ల తెల్ల కుర్రాడు... సౌత్ కరోలీనాలోని ఇమాన్యుయేల్ ఆఫ్రికన్ మెథడిస్ట్ చర్చ్‌లో నల్లవాళ్ల మీద కాల్పులు జరిపాడు. ఆ దాడిలో ఆరుగురు ఆడవాళ్లు, ముగ్గురు మగవాళ్లు చనిపోయారు. మరణించిన తొమ్మిదిమందిలో రివరెండ్, స్టేట్ సెనేటర్ అయిన పింక్‌నీ కూడా ఉన్నారు.
నల్లవాళ్ల మీద కోపంతోనే ఈ పని చేశానని, దీనితో నల్లవాళ్లకు వ్యతిరేకంగా ‘రేస్ వార్’ను స్టార్ట్ చేయాలనుకున్నానీ పోలీసులకు చెప్పాడు రూఫ్. అది విన్న లోకమంతా హతాశయింది. ఈ విషాదం జరిగిన తెల్లవారి గవర్నర్ నిక్కీ ఎన్‌బీసీకి ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో ‘ఈ కాల్పులను ‘హేట్ క్రైమ్’గా పరిగణించి, నేరస్తులకు మరణశిక్ష పడేలా చూస్తామ’ని చెప్పింది. అప్పుడే సదరన్ హెరిటేజ్, ప్రైడ్‌కి చిహ్నంగా ఉన్న కాన్ఫిడరేట్ బాటిల్ ఫ్లాగ్‌ను పట్టుకుని నల్లజాతి వ్యతిరేక దండులో నినాదాలిస్తున్న రూఫ్ ఫోటోగ్రాఫ్ కూడా బయటపడి పెద్ద చర్చకు కారణమైంది.
అప్పటి దాకా ఆ పతాకం స్టేట్ కాపిటల్ బిల్డింగ్ మీద రెపరెపలాడుతూ ఉండేది. నల్లవాళ్ల పట్ల వివక్షతో రగిలిపోతున్న రూఫ్ ఆ జెండాను పట్టుకొని తెల్లవాళ్ల ఉద్యమంలో తిరగాడడంతో.. ఇంతకీ కాన్ఫిడరేట్ బాటిల్ ఫ్లాగ్ హెరిటేజ్, ప్రైడ్‌కి చిహ్నమా లేక నల్లవాళ్ల మీద వివక్షను సూచించే పతాకమా అనే విమర్శలు వెల్లువెత్తాయి. డిబేట్ల సాగాయి. దాంతో 2015, జూన్ 22న స్టేట్ కాపిటల్ మీదున్న కాన్ఫిడరేట్ బాటిల్ ఫ్లాగ్‌ను తీయించే సాహసం చేసింది సౌత్ కరోలీనా గవర్నర్ నిక్కీ హేలీ.
‘ఈ నేల భిన్న జాతుల, సంస్కృతుల సమ్మేళనం. ఈ ఐక్యత విచ్ఛిన్నం కాకుండా ఉండాలంటే, రంగు, జాతి మనుషుల మధ్య విద్వేషాన్ని పెంచకుండా ఉండాలంటే కాపిటల్ గ్రౌండ్స్‌లోని ఈ కాన్ఫిడరేట్ బాటిల్ ఫ్లాగ్ అవతనం కావాల్సిందే’ అని స్టేట్‌మెంట్ ఇచ్చింది.
– శరాది
Comments
Please login to add a commentAdd a comment