ఆ రోజు గురువు, తన శిష్యులకు బుద్ధ భగవానుడి అష్టాంగ మార్గాలను వివరిస్తున్నాడు. వారిలో ఒక విద్యార్థి గురువు చెప్పే అంశాలపై దృష్టి నిలపక ఇతర విషయాలు ఆలోచిస్తున్నాడు. అతని ఆలోచన గమనించి ప్రేమపూర్వకంగా మందలించాడు గురువు.
శిష్యునితో ‘‘బౌద్ధ సూత్రాలలో ముఖ్యమైనది ధ్యానం. ధ్యానం అంటే ఏకాగ్రత. మనం చేసే పని మీదనే దృష్టి నిలపడం. బుద్ధభగవానుడు ఈ మార్గం ద్వారానే జ్ఞానాన్ని పొందాడు’’ అంటూ ఏకాగ్రత ప్రాముఖ్యతను వివరించాడు గురువు. ఆయన మాటలు విన్న శిష్యుడు ‘‘భంతే! ధ్యానం ద్వారా బుద్ధ భగవానుడు జ్ఞానాన్ని పొందాడు. కానీ సామాన్య ప్రజలకు నిత్యజీవితంలో ఏకాగ్రత వల్ల కలిగే ప్రయోజనం ఏమిటి’’ అని ప్రశ్నించాడు.
గురువు తలపంకించాడు. శిష్యుడితో ‘‘సరే, అలా వెళదాం పద’’ అన్నాడు. పరిసరాలను గమనిస్తూ వారలా ముందుకు సాగుతుండగా వారికి ఒక నది కనిపించింది. నది ఒడ్డున కూర్చున్న ఒక జాలరి చేపలు పట్టడానికి నదిలో గాలం వేసి దానిని చూస్తూ కూర్చున్నాడు. ఇంతలో ఒక పాము అతడి పక్కగా వెళ్తూ అతని వద్ద ఆగిపోయి, తల పైకెత్తి చూస్తోంది. కానీ అతనికి అదేమీ తెలియడం లేదు. శిష్యుడు ఆ పాము జాలరిని కరుస్తుందేమోనని భయపడ్డాడు. జాలరిని అప్రమత్తం చేయడానికి ముందుకు వెళ్లబోతుండగా పాము అతని పక్కనుండి వెళ్లిపోయింది.
ఇంత జరిగినా అతడు కొంచెం కూడా కదలలేదు. అతని చూపు నదిలో ఉన్న గాలం నుండి మళ్లలేదు. గురువు శిష్యుని వంక చిర్నవ్వుతో చూస్తూ జాలరి సమీపానికి వెళ్లి అతన్ని పిలిచాడు. పలకలేదు. మరల పిలిచాడు. అయినా అతనిలో చలనం లేదు. దగ్గరకు వెళ్లి అతని భుజంపైన తట్టాడు. జాలరి ఒక్కసారిగా ఉలిక్కిపడ్డట్టు లేచి బౌద్ధ గురువును చూశాడు. వెంటనే వారికి నమస్కారం చేశాడు.
గురువు ఆ జాలరిని.. ‘‘ఏమి ఆలోచిస్తున్నావు నాయనా? మూడుసార్లు పిలిచాను. పలకలేదు. నీ పక్కనుండి పాము వెళ్లినా కనీసం తల కూడా తిప్పలేదు. నీకు పామంటే భయం లేదా?’’ అని అడిగాడు. ఆ జాలరి.. ‘‘క్షమించండి. నా చూపంతా చేపలపైన, గాలం పైనే ఉంది. నిజానికి పామంటే నాకు చచ్చేంత భయం. కానీ నా పక్కనుండి వెళ్లినట్లు కూడా తెలియలేదు నాకు. కనీసం శబ్దం సరిగా వినిపించలేదు. అంతగా లీనమైపోయాను. ఎందుకంటే చేపలు దొరక్కపోతే గడవడం చాలా కష్టం. అందువల్ల ఆ ధ్యాసలో ఉన్నాను’’ అని చెప్పి మళ్లీ తన పనిలో నిమగ్నమయ్యాడు జాలరి. గురువు శిష్యుని వంక నవ్వుతూ చూశాడు. శిష్యుడు అర్థమయిందన్నట్లుగా తల పంకించి గురువుకు వినయంగా నమస్కరించాడు.
– కస్తూరి శివభార్గవి
చెట్టు నీడ బతుకు ధ్యాస
Published Sat, Jun 22 2019 12:34 AM | Last Updated on Sat, Jun 22 2019 12:34 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment