Student activity
-
జేఎన్టీయూఏలో ర్యాగింగ్ వికృతరూపం
అనంతపురం విద్య: జేఎన్టీయూ (అనంతపురం) ఇంజనీరింగ్ కళాశాలలో ర్యాగింగ్ రక్కసి వికృతరూపం దాల్చింది. సీనియర్ విద్యార్థులు అర్ధరాత్రి దాకా వెకిలిచేష్టలు.. అలసిపోయేదాకా డ్యాన్సులు.. అడ్డూఅదుపూలేని అకృత్యాలకు పాల్పడటంతో జూనియర్ విద్యార్థులు ఆవేదన చెందుతున్నారు. వీరి ఆగడాలు మితిమీరుతుండటంతో భరించలేకపోయిన బాధితులు ఫిర్యాదు చేశారు. ర్యాగింగ్‌కు పాల్పడిన 12 మంది కెమికల్, కంప్యూటర్ సైన్సెస్ గ్రూప్ సెకండియర్ విద్యార్థులను సస్పెండ్ చేస్తూ ప్రిన్సిపాల్ డాక్టర్ పి.సుజాత శనివారం ఉత్తర్వులిచ్చారు. జేఎన్టీయూ(ఏ) చరిత్రలో ఒకేసారి 12 మంది విద్యార్థులపై సస్పెన్షన్ వేటుపడటం ఇదే తొలిసారి. సీనియర్, జూనియర్ విద్యార్థుల హాస్టళ్లు వేర్వేరుగా ఉన్నప్పటికీ ర్యాగింగ్ పేరిట వికృత క్రీడ సాగిస్తున్నారు. జూనియర్లను సీనియర్ విద్యార్థుల హాస్టల్‌కు రప్పించి అర్ధరాత్రి దాకా అర్ధనగ్నంగా డ్యాన్సులు చేయించడంతో పాటు సిగరెట్లు, మద్యం తీసుకొచ్చి ఇవ్వాలని పురమాయిస్తున్నారు. గంటల తరబడి నిల్చునే ఉండాలని కోరడంతో పాటు సీనియర్లు చెప్పింది వినాలంటూ ఇబ్బంది పెడుతున్నారని బాధితులు ఆందోళన చెందుతున్నారు. చర్యలు తీసుకుంటున్నాం ర్యాగింగ్ జరిగినట్లు తెలియగానే శుక్రవారం రాత్రి హాస్టల్‌కు వెళ్లి ఆరా తీశాం. అర్ధరాత్రి ఒంటి గంట వరకు అక్కడే ఉండి విద్యార్థులతో మాట్లాడాం. ప్రస్తుతం ఎలాంటి ఇబ్బందులు లేవు. ర్యాగింగ్‌కు పాల్పడితే తప్పకుండా కఠిన చర్యలు తీసుకుంటాం. – ప్రొఫెసర్ పి.సుజాత, ప్రిన్సిపాల్, జేఎన్టీయూఏ ఇంజనీరింగ్ కళాశాల -
శభాష్ రమ్య.. నీ ప్రాజెక్ట్ అదిరింది!
సాక్షి,వీరఘట్టం(శ్రీకాకుళం): ఎక్కడ చూసినా ప్లాస్టిక్.. ఏది కొన్నా ప్లాస్టిక్. అంతరించిపోదని తెలిసినా, కీడు చేస్తుందని ప్రచారం చేసినా జనం దీన్ని వదలడం లేదు. కారణం సరైన ప్రత్యామ్నాయం లేకపోవడం. సరి గ్గా ఈ ఆలోచనే వీరఘట్టం కేజీబీవీ విద్యార్థి ప్రాజెక్టును జాతీయ స్థాయికి పంపించింది. ప్లాస్టిక్‌కు బదులు బయో డీగ్రేడబుల్ కప్పులు వాడవచ్చని విద్యార్థి చేసిన ప్రదర్శన ఆమెను దేశ రాజధానికి పంపిస్తోంది. ఇటీవల జిల్లా, రాష్ట్ర స్థాయిలో జరిగిన జాతీయ సైన్స్ కాంగ్రెస్ వర్చువల్ ఎగ్జిబిషన్లో వీరఘట్టం కేజీబీవీ టెన్త్ విద్యార్థిని కె.రమ్య ప్రదర్శించిన గడ్డి కప్పుల ప్రాజెక్టు జాతీయ స్థాయి సెమినార్‌కు ఎంపికైందని ఎస్ఓ రోజా తెలిపారు. వచ్చే ఏడాది జనవరిలో ఢిల్లీలో జరిగే జాతీయ సైన్స్ కాంగ్రెస్ సెమినార్లో తమ విద్యార్థి పాల్గొంటుందని, ఇది తమకు గర్వకారణమని ఆమె తెలి పారు. ప్రాజెక్టు రూపొందించడంలో సహకరించిన గైడ్ టీచర్లు ఎల్.సునీత, కె.స్నేహలత, జి.సృజనలను అభినందించారు. ఏంటీ ప్రత్యేకత..? జిల్లా నుంచి 223 ప్రాజెక్టులు పోటీ పడితే ఈ ప్రాజెక్టు ఒక్కటే జాతీయ స్థాయి వరకు వెళ్లగలిగింది. కేజీబీవీ విద్యార్థిని రమ్య రూపొందించిన ప్రాజెక్టు పేరు బయో డీగ్రేడబుల్ కప్స్(గడ్డితో తయారు చేసే కప్పులు). ప్రస్తుతం ప్లాస్టిక్ వ్యర్థాలతో ప ర్యావరణం కలుషితమవుతోంది. ముఖ్యంగా సిటీల్లో పానీపూరీ బడ్డీల వద్ద వీటి వినియోగం బాగా ఎక్కువగా ఉంది. ఇలాంటి చోట్ల ప్లాస్టిక్ కప్పుల బదులు బయోడీగ్రేడబుల్ కప్పులు వాడితే ప్లాస్టిక్ వినియోగం తగ్గించవచ్చునని రమ్య తన ప్రాజెక్టులో స్పష్టంగా చెప్పడంతో ఈ ప్రాజెక్టుకు జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చింది. కప్పుల తయారీ ఇలా.. విద్యార్థిని చెప్పిన వివరాల ప్రకారం.. ఈ బయోడీగ్రేడబుల్ కప్పులు కాలుష్య రహితం. వీటిని తయారు చేయడం చాలా సులభం. మనకు అందుబాటులో ఉండే ఎండుగడ్డిని కొంత తీసుకుని దాన్ని పౌడర్‌గా చేయాలి. ఈ పౌడర్‌ను తగినంత నీటిలో కలపి ఈ ద్రావణాన్ని ఒక పాత్రలో వేసి వేడి చేయాలి. ద్రావణాన్ని వేడి చేశాక అందులో తగినంత కార్న్‌ఫ్లోర్, వెనిగర్ వేసి ముద్దగా తయారు చేయాలి. ఈ ముద్దను కప్పులుగా తయారు చేసి ఎండబెడితే బయోడీగ్రేడబుల్ కప్పులు తయారవుతాయి. ఈ కప్పుల్లో వేడి పదార్థాలు తిన్నా ఎలాంటి హాని ఉండదు. ఈ విధంగా పర్యావరణాన్ని పరిరక్షించవచ్చు. ఆనందంగా ఉంది నేను రూపొందించిన బయోడీగ్రేడబుల్ కప్పుల ప్రాజెక్టు జాతీయ స్థాయికి ఎంపికవ్వ డం ఎంతో ఆనందంగా ఉంది. మా ఎస్ఓ మేడమ్, గైడ్ టీచర్ల సలహాలు, సూచనలతో ఈ ప్రాజెక్టు రూపొందించాను. తక్కువ ఖర్చుతో ఈ కప్పులను సులువుగా తయారు చేసుకోవచ్చు. పానీపూరీ బడ్డీల వద్ద, మనం నిత్యం ఇంటిలో వాడే ప్లాస్టిక్ కప్పుల బదులు వీటిని వాడితే పర్యావరణాన్ని కాపాడినవాళ్లమవుతాం. ఢిల్లీలో త్వరలో జరిగే జాతీయ సైన్స్ కాంగ్రెస్ సెమినార్ పాల్గొనేందుకు మరింతగా సిద్ధమవుతున్నాను. – కె.రమ్య, పదో తరగతి విద్యార్థిని, కేజీబీవీ, వీరఘట్టం చదవండి: ఇల వైకుంఠపురంలో..! ఇంద్రభవనాల్లాంటి ఇళ్లు -
టీచర్ కొట్టిందని పోలీస్ స్టేషన్లో...
సాక్షి, హైదరాబాద్: హోంవర్క్ చేయలేదని బాలుడుని కొట్టిన ట్యూషన్ టీచర్‌పై బాలుడి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు. ఎస్ఆర్నగర్ ఇన్స్పెక్టర్ సైదులు తెలిపిన వివరాల ప్రకారం.. కరోనా కారణంగా పాఠశాలలు లేకపోవడంతో బాపూనగర్‌కు చెందిన ఎస్.రిమ్షానా తన కుమారుడు తనిష్‌ను వెంగళరావునగర్‌లో ఉండే మహిళ టీచర్ ఇంటికి ట్యూషన్‌కు పంపిస్తోంది. కాగా ట్యూషన్‌కు వెళ్లేందుకు బాలుడు భయపడుతుండటంతో తల్లి గట్టిగా అడగడంతో తనిష్ తన ఎడమచేతిపై అయిన గాయాలను చూపించాడు.ఒంటిపై కూడా గాయాలు కనిపించాయి.హోంవర్క్ చేయడం లేదని టీచర్ రోజు తనను కొడుతుందని బాలుడు తెలుపడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు.ఈ మేరకు టీచర్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఇన్స్పెక్టర్ తెలిపారు. -
Women Safety Tool: ‘టచ్’ చేస్తే షాకే!
బాలాజీ చెరువు (కాకినాడ సిటీ): మహిళలపై నానాటికీ పెరుగుతున్న అరాచకాలను దృష్టిలో ఉంచుకుని తూర్పు గోదావరి జిల్లా సూరంపాలెం ప్రగతి ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థినులు ఉమెన్ సేఫ్టీ పరికరాన్ని రూపొందించారు. ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ బ్రాంచ్‌కు చెందిన మౌనిక, దివ్య, ఎస్.మహేశ్వరి, ఆశ్రిత, ఐశ్వర్య, సంకీర్తన, మోనిష, గాయత్రిలతో కూడిన బృందం ఈ పరికరాన్ని తయారుచేసింది. విజిటింగ్ కార్డు సైజ్ ఉండే ఈ పరికరాన్ని మహిళలు లోదుస్తుల్లో లేదా పాకెట్లో ఎక్కడైనా అమర్చుకోవచ్చు. దాన్ని ఎవరైనా ముట్టుకుంటే వెంటనే వారికి కరెంట్ షాక్ తగిలి, దాదాపు 5 నిమిషాల పాటు ఏమీ చేయలేకుండా ఉండిపోతారు. ఆ సమయంలో మహిళలు ఆపద నుంచి బయటపడొచ్చని, ఈ పరికరం వారికి ఎంతో ఉపయోగపడుతుందని ప్రాజెక్టు గైడ్ వి.శేషగిరిరావు తెలిపారు. పరికరం తయారీకి విజిటింగ్ కార్డు సైజ్ బోర్డు, రెండు స్టీల్ పేట్లు, 4 ఓల్ట్ బ్యాటరీ, ఫ్రీక్వెన్సీ ట్రాన్స్ఫార్మర్, స్పార్క్ గ్యాప్ కెపాసిటర్, పుష్ ఆన్ స్విచ్ వాడామని చెప్పారు. అరగంట చార్జింగ్ పెడితే దాదాపు 6 గంటల వరకు ఈ పరికరం పనిచేస్తుందన్నారు. -
అమ్మమ్మ కష్టంలోంచి పుట్టిన ఆలోచన, ప్రధాని ప్రశంస
సాక్షి, బంజారాహిల్స్: అమ్మమ్మ పడుతున్న అవస్థలను చూసిన ఆ బాలుడి మనసు కరిగిపోయింది. ఆ కష్టాలకు చెక్ పెట్టాలన్న ఆలోచన పుట్టింది. అల్జీమర్ వ్యాధితో తన అమ్మమ్మలాగే కోట్లాది మంది ప్రపంచ వ్యాప్తంగా బాధపడుతున్నారని తెలుసుకున్న ఆ బాలుడు పరిష్కారం చూపాలని మూడేళ్లు కష్టపడి మొత్తానికి అందులో విజయం సాధించాడు. ⇔ జుబ్లీహిల్స్ పబ్లిక్ స్కూల్లో 9వ తరగతి చదువుతున్న చదలవాడ హిమేష్ అల్జీమర్స్ వ్యాధి ఉన్నవారి ఆరోగ్య పరిరక్షణకు స్మార్ట్ వాచ్ కనిపెట్టి ప్రధాన మంత్రి రాష్ట్రీయ బాలపురస్కార్ అవార్డ్–2021ను గెలుచుకున్నాడు. ⇔ గుంటూరుకు చెందిన హిమేష్ తండ్రి కిశోర్‌కుమార్ ఆడియో ఇంజినీర్ కాగా, తల్లి సంధ్య గృహిణి. ⇔ మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాకు చెందిన హిమేష్ ఈ యంత్రాన్ని కనిపెట్టడంలో చేసిన కృషికి సోమవారం ప్రధాన మంత్రి నిర్వహించిన వర్చువల్ మీటింగ్‌కు కూడా హిమేష్ హాజరయ్యాడు. వృద్ధులను, వికలాంగులను పర్యవేక్షించడానికి స్మార్ట్ రిస్ట్ బ్యాండ్ తోడ్పడుతుందని హిమేష్ తెలిపాడు. ⇔ ప్రపంచంలో ప్రతి మూడు సెకన్లలో ఒక వ్యక్తి అల్జీమర్స్ వ్యాధితో బాధపడుతున్నారని, అందులో మా అమ్మమ్మ కూడా ఒకరన్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఇలాంటి రోగులందరికీ ఈ పరికరం ఉపయోగపడుతుందని చెప్పాడు. ⇔ ఈ పరికరాన్ని అల్జీమర్స్ రోగులు ధరిస్తారని, ఇది వారి ఆరోగ్య స్థితిని పరిరక్షించడమే కాకుండా సంచారం, పల్స్, బీపీ వంటి రోగాలను గురించి తెలియజేస్తుందని తెలిపారు. రోగికి ఏదైనా అసాధారణ పరిస్థితి ఎదురైతే ఒక హెచ్చరిక ఇవ్వడమే కాకుండా ఆ సమాచారాన్ని పంపుతుందన్నాని వివరించాడు. ⇔ అల్జీమర్స్ వ్యాధి సోకిన వారి ఆరోగ్య పరిరక్షణ కోసం స్మార్ట్ వాచ్ కనిపెట్టిన చదలవాడ హిమేష్‌ను రాష్ట్ర గిరిజన, స్త్రీ,శిశు సంక్షేమ శాఖల మంత్రి సత్యవతిరాథోడ్ సోమవారం సత్కరించి బాలుడితో పాటు అతడి తల్లిదండ్రులను అభినందించారు. -
‘క్యాంప్ గూగుల్’ విజేతగా గుంటూరు విద్యార్థి
గాంధీనగర్ (విజయవాడ సెంట్రల్): గూగుల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ దేశవ్యాప్తంగా ఆన్లైన్లో నిర్వహించిన ‘క్యాంపు గూగుల్ 2020’ జూనియర్ విభాగంలో గుంటూరుకు చెందిన కట్నేని హరికార్తీక్ విజేతగా నిలిచాడు. హరికార్తీక్ గుంటూరులో కిడ్స్ స్కూల్లో 4వ తరగతి చదువుతున్నాడు. గూగుల్ క్యాంపు ఇచ్చిన ఎక్స్ప్లోర్ అండ్ పెయింట్ (ఆన్ వాటర్ కన్జర్వేషన్), కోడింగ్ విత్ స్క్రాచ్ (గేమ్ క్రియేషన్ ఆన్ కోవిడ్–19), ఎక్స్‌ప్రెస్ థ్రూ స్టోరీస్ (ఏ మిస్టిక్ థ్రిల్లర్ స్టోరీ రైటింగ్), క్రాప్ట్స్ అండ్ స్కెచ్చింగ్ (ఆన్ ఇండియన్ క్రాప్ట్స్), కుకింగ్ అండ్ లెర్నింగ్ న్యూ లాంగ్వేజెస్ ఎసైన్మెంట్లలో హరికార్తీక్ ప్రథముడుగా నిలిచాడు. ఈ పోటీల్లో దేశవ్యాప్తంగా 15 మంది మాత్రమే విజేతలుగా నిలవడం గమనార్హం. వర్చువల్‌గా నిర్వహించిన గ్రాండ్ ఫినాలేలో భారత్ క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ హరికార్తీక్ను అభినందించారు. చదవండి: ఇదంతా నా కర్మ : బోరున ఏడ్చిన సంజన -
బీఎస్సీ అగ్రికల్చర్ విద్యార్థిని వినూత్న ఆలోచన
సాక్షి, మంచిర్యాల: రైతులకు లాభం చేకూర్చేవిధంగా తక్కువ ఖర్చుతో కలుపు తీసే యంత్రాన్ని బీఎస్సీ అగ్రికల్చర్ ఫైనల్ ఇయర్ విద్యార్థిని శర్వాని తయారు చేసింది. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని హైటెక్‌సిటీ కాలనీలో నివాసం ఉంటున్న కాసం శర్వాని మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో గల శ్రీ సంతు శంకర్ మహారాజ్ కాలేజ్ ఆఫ్ అగ్రికల్చర్లో బీఎస్సీ అగ్రికల్చర్ నాలుగో సంవత్సరం చదువుతోంది. లాక్డౌన్ నేపథ్యంలో కళాశాలలు తెరవక పోవడం, ఆమె ప్రాజెక్టులో భాగంగా, రైతులకు తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభం చేకూర్చాలని, కళాశాలలో చెప్పిన పాఠ్యాంశాలు, ఆన్లైన్లో కలుపు యంత్రాలను తయారు చేసే విధానం చూసి, అందుబాటులో ఉన్న వాటితో కేవలం రూ. 500లను ఖర్చు చేసి కలుపు యంత్రాన్ని తయారు చేసింది. ఒక పెద్ద ఇనుప రాడ్డు, షార్పుగా ఉన్న మేకులు, పాత సైకిల్ రీమ్‌లను యంత్రంలా వెల్డింగ్‌తో తయారు చేయించింది. డీజిల్, పెట్రోల్ ఉపయోగించకుండానే కలుపును త్వరగా, సులభంగా తీయడం వల్ల, సమయం ఆదా కావడంతో పాటు, రైతులకు కష్టం కలగకుండా ఉండేలా దానిని తయారు చేసింది. ఆమె తయరు చేసిన యంత్రంతో మంచిర్యాలలోని వారి పొలంలోనే కలుపు మొక్కలను విజయవంతంగా తొలగించింది. కలుపు యంత్రం వినియోగం, పూల మొక్కలు, పండ్ల మొక్కలు వృద్ధి కోసం మందార మొక్కల గట్టి చెక్క వినియోగం, కలబంద, కంపోస్టు, కోకోపీట్, ఎర్రమట్టి వినియోగం వల్ల కలిగే లాభాలను రైతులకు వివరించింది. -
న్యూస్ పేపర్‌తో రైలు.. ఆశ్చర్యపోయిన రైల్వే శాఖ
తిరువనంతపురం: కేరళకు చెందిన 12 ఏళ్లు బాలుడు న్యూస్ పేపర్‌తో అచ్చం రైలు నమూనాను తయారు చేసి అందరిని ఆశ్చర్యపరిచాడు. లాక్డౌన్లో మెదడుకు పదును పెట్టి తన సృజనాత్మకతను చాటుకుని మాస్టర్‌గా మారాడు. తన టాలెంట్‌తో నెటిజన్లతో పాటు రైల్వే మంత్రిత్వ శాఖను కూడా అబ్బురపరిచిన ఈ బాలుడి పేరు అద్వైత్ కృష్ణ. ఇతడు కేరళలో త్రిస్పూర్‌లోని సీఎన్ఎన్ బాయ్స్ హై స్కూల్లో 7వ తరగతి చదువుతున్నాడు. మాస్టర్ అద్వైత్ న్యూస్ పేపర్‌తో రైలును తయారు చేస్తున్న వీడియోలను, ఫొటోలను గురువారం రైల్వే మంత్రిత్వ శాఖ తమ అధికారిక ట్విటర్లో షేర్ చేసింది. (‘ఆ ఉద్యోగులకు భారీగా వేతన పెంపు’) Master Adwaith Krishna, a 12 year old rail enthusiast from Thrissur, Kerala has unleashed his creative streak and has made a captivating train model using newspapers. His near perfection train replica took him just 3 days. pic.twitter.com/H99TeMIOCs — Ministry of Railways (@RailMinIndia) June 25, 2020 ‘12 ఏళ్ల మాస్టర్ అద్వైత్ ఈ రైలును రూపొందించడానికి కేవలం 3 రోజుల సమయం తీసుకున్నాడు. ఇది తయారు చేయడానికి 33 న్యూస్ పేపర్లు, 10 ఎ4(A4) షిట్లు, గ్లూను ఉపయోగించి అచ్చమైన రైలు ప్రతిరూపాన్ని తయారు చేశాడు’ అని రైల్యే శాఖ తన ట్వీట్లో పేర్కొంది. మాస్టర్ అద్వైత్ రైలు ఇంజన్, బోగీలను, ఇతర భాగాలను తయారు చేసి వాటిని అమర్చిన విధానాన్ని ఈ వీడియోలో స్పష్టంగా చూపించారు. కాగా ఈ వీడియో షేర్ చేసిన కొన్ని గంటల్లోనే 32 వేలకు పైగా వ్యూస్, వందల్లో లైక్‌లు వచ్చాయి. ‘అద్భుతం’, ‘ఈ బాలుడి తెలివి అందరికి స్ఫూర్తి’, ‘ఇతడికి రైల్వే ఆర్ అండ్ డీలో ఉద్యోగం ఇవ్వండి తన తెలివితో కొత్త టెక్నాలజీని తీసుకువస్తాడు’ అంటూ నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు. (చదువెందుకు..పెళ్లిచేసేయండి అన్నారు!) pic.twitter.com/qRN6WEQ3ms — Ministry of Railways (@RailMinIndia) June 25, 2020 -
కుక్కల దాడి: ఇంజినీరింగ్ కాలేజీలో దారుణం
సాక్షి, వరంగల్ రూరల్ జిల్లా : ఇంజినీరింగ్ కాలేజీలో దారుణం చోటుచేసుకుంది. బీటెక్ సెంకండియర్ చదువుతున్న ఓ విద్యార్థినిపై కాలేజీలోని కుక్కలు ఒక్కసారిగా దాడిచేశాయి. దీంతో ఆ అమ్మాయి పరిస్థితి విషమంగా ఉంది. నర్సంపేట మండలం లక్నేపల్లి శివారులోని బాలాజీ ఇంజినీరింగ్ కళాశాలలో ఈ ఘటన చోటుచేసుకుంది. రమ్య అనే విద్యార్థిని బాలాజీ ఇంజినీరింగ్ కాలేజీలో బీటెక్ సెంకండియర్ చదువుతోంది. కాలేజీ హాస్టల్లో ఉంటున్న రమ్యపై శుక్రవారం కాలేజీలో ఉండే కుక్కలు ఒక్కసారిగా దాడి చేశాయి. దీంతో తీవ్రంగా గాయపడిన రమ్య పరిస్థితి విషమంగా ఉంది. ఆమెను హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ రోజు కాలేజీలో ఫ్రెషర్ డే నిర్వహిస్తున్నారు. ఈ సమయంలో కాలేజీలో చదువుతున్న విద్యార్థినిపై కుక్కలు దాడి చేసి.. తీవ్రంగా గాయపర్చడం విద్యార్థులను షాక్‌కు గురిచేస్తోంది. రమ్య పరిస్థితి విషమంగా ఉండటంతో కాలేజీ ముందు విద్యార్థులు పెద్ద ఎత్తున ధర్నా నిర్వహిస్తున్నారు. -
చెట్టు నీడ బతుకు ధ్యాస
ఆ రోజు గురువు, తన శిష్యులకు బుద్ధ భగవానుడి అష్టాంగ మార్గాలను వివరిస్తున్నాడు. వారిలో ఒక విద్యార్థి గురువు చెప్పే అంశాలపై దృష్టి నిలపక ఇతర విషయాలు ఆలోచిస్తున్నాడు. అతని ఆలోచన గమనించి ప్రేమపూర్వకంగా మందలించాడు గురువు. శిష్యునితో ‘‘బౌద్ధ సూత్రాలలో ముఖ్యమైనది ధ్యానం. ధ్యానం అంటే ఏకాగ్రత. మనం చేసే పని మీదనే దృష్టి నిలపడం. బుద్ధభగవానుడు ఈ మార్గం ద్వారానే జ్ఞానాన్ని పొందాడు’’ అంటూ ఏకాగ్రత ప్రాముఖ్యతను వివరించాడు గురువు. ఆయన మాటలు విన్న శిష్యుడు ‘‘భంతే! ధ్యానం ద్వారా బుద్ధ భగవానుడు జ్ఞానాన్ని పొందాడు. కానీ సామాన్య ప్రజలకు నిత్యజీవితంలో ఏకాగ్రత వల్ల కలిగే ప్రయోజనం ఏమిటి’’ అని ప్రశ్నించాడు. గురువు తలపంకించాడు. శిష్యుడితో ‘‘సరే, అలా వెళదాం పద’’ అన్నాడు. పరిసరాలను గమనిస్తూ వారలా ముందుకు సాగుతుండగా వారికి ఒక నది కనిపించింది. నది ఒడ్డున కూర్చున్న ఒక జాలరి చేపలు పట్టడానికి నదిలో గాలం వేసి దానిని చూస్తూ కూర్చున్నాడు. ఇంతలో ఒక పాము అతడి పక్కగా వెళ్తూ అతని వద్ద ఆగిపోయి, తల పైకెత్తి చూస్తోంది. కానీ అతనికి అదేమీ తెలియడం లేదు. శిష్యుడు ఆ పాము జాలరిని కరుస్తుందేమోనని భయపడ్డాడు. జాలరిని అప్రమత్తం చేయడానికి ముందుకు వెళ్లబోతుండగా పాము అతని పక్కనుండి వెళ్లిపోయింది. ఇంత జరిగినా అతడు కొంచెం కూడా కదలలేదు. అతని చూపు నదిలో ఉన్న గాలం నుండి మళ్లలేదు. గురువు శిష్యుని వంక చిర్నవ్వుతో చూస్తూ జాలరి సమీపానికి వెళ్లి అతన్ని పిలిచాడు. పలకలేదు. మరల పిలిచాడు. అయినా అతనిలో చలనం లేదు. దగ్గరకు వెళ్లి అతని భుజంపైన తట్టాడు. జాలరి ఒక్కసారిగా ఉలిక్కిపడ్డట్టు లేచి బౌద్ధ గురువును చూశాడు. వెంటనే వారికి నమస్కారం చేశాడు. గురువు ఆ జాలరిని.. ‘‘ఏమి ఆలోచిస్తున్నావు నాయనా? మూడుసార్లు పిలిచాను. పలకలేదు. నీ పక్కనుండి పాము వెళ్లినా కనీసం తల కూడా తిప్పలేదు. నీకు పామంటే భయం లేదా?’’ అని అడిగాడు. ఆ జాలరి.. ‘‘క్షమించండి. నా చూపంతా చేపలపైన, గాలం పైనే ఉంది. నిజానికి పామంటే నాకు చచ్చేంత భయం. కానీ నా పక్కనుండి వెళ్లినట్లు కూడా తెలియలేదు నాకు. కనీసం శబ్దం సరిగా వినిపించలేదు. అంతగా లీనమైపోయాను. ఎందుకంటే చేపలు దొరక్కపోతే గడవడం చాలా కష్టం. అందువల్ల ఆ ధ్యాసలో ఉన్నాను’’ అని చెప్పి మళ్లీ తన పనిలో నిమగ్నమయ్యాడు జాలరి. గురువు శిష్యుని వంక నవ్వుతూ చూశాడు. శిష్యుడు అర్థమయిందన్నట్లుగా తల పంకించి గురువుకు వినయంగా నమస్కరించాడు. – కస్తూరి శివభార్గవి -
గర్జించిన సమైక్య ఉద్యమం
=గుడివాడలో సేవ్ ఆంధ్రప్రదేశ్ సభ విజయవంతం =చల్లపల్లిలో సకల జనుల గర్జన =నూజివీడులో విద్యార్థి గర్జన =వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో సమైక్య ప్రతిజ్ఞలు =పంచాయతీల్లో తీర్మానాలు రాష్ట్ర అవతరణ దినోత్సవం రోజున సమైక్య ఉద్యమం హోరెత్తింది. ఎన్జీవోల ఆధ్వర్యంలో గుడివాడలో జరిగిన సేవ్ ఆంధ్రప్రదేశ్ సభకు ఆ సంఘ రాష్ట్ర అధ్యక్షుడు పి.అశోక్‌బాబు హాజరయ్యారు. చల్లపల్లిలో సకలజనుల గర్జన, నూజివీడులో విద్యార్థి గర్జన మిన్నంటాయి. వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో సమైక్య ప్రతిజ్ఞలు, పాలాభిషేకాలు నిర్వహించారు. విభజనాసురుల దిష్టిబొమ్మలు దహనం చేశారు. వైఎస్సార్సీపీ పిలుపుమేరకు సమైక్యాంధ్రకు మద్దతుగా పలు పంచాయతీలు తీర్మానం చేశాయి. సాక్షి, గుడివాడ/ విజయవాడ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవం నాడు సమైక్యాంధ్ర ఆకాంక్ష మరోసారి ఆకాశాన్నంటింది. జిల్లా అంతటా సమైక్యాంధ్రకు మద్దతుగా ఆందోళనలు హోరెత్తాయి. గుడివాడ గుండె ఘోష గుడివాడ గుండె సమైక్య సింహనాదంతో ఘోషించింది. పట్టణ నడిబొడ్డున ఉన్న ఎన్టీఆర్ స్టేడియం జనసంద్రమైంది. అమరజీవి పొట్టి శ్రీరాములు ప్రాంగణం నూతనోత్తేజంతో ఉప్పొంగింది. జాతీయపతాక రూపశిల్పి, ఈ జిల్లావాసి పింగళి వెంకయ్య సభావేదిక సమైక్య ఉద్యమానికి బహుముఖ వ్యూహంతో కార్యాచరణను ఖరారు చేసింది. ఉవ్వెత్తున ఎగసిపడిన ఉద్యోగుల సమ్మె అనంతరం తొలిసారి గుడివాడలో జరిగిన సేవ్ ఆంధ్రప్రదేశ్ మహాసభ సమైక్య ఉద్యమాన్ని హోరెత్తించింది. ఉద్యోగుల సమ్మె విరమణతో ఉద్యమం ఆగిపోయిందన్న ప్రచారానికి చెక్ పెడుతూ ఈ సభ స్పష్టతనిచ్చింది. తమ సమ్మె విరమణ తాత్కాలికమేనని, ఇది విశ్రాంతి మాత్రమేనని మరోమారు బహుముఖ వ్యూహంతో సమ్మెను కొనసాగిస్తామంటూ ఏపీ ఎన్జీఓ రాష్ట్ర అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ పరిరక్షణ సమితి అధ్యక్షుడు పరుచూరి అశోక్‌బాబు సమక్షంలో ఉద్యోగ సంఘాల నాయకులు ప్రతినబూనారు. గుడివాడ సమైక్య ఉద్యమ జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహించిన సభ విజయవంతం కావడంతో పాటు పలువురు సంఘాల నాయకులు ఉద్యమానికి దిశానిర్దేశం చేశారు. జిల్లాలో రానున్న కాలంలో ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేసేలా కార్యాచరణ రూపొందించారు. ఈ నవంబరు, డిసెంబరు మాసాల్లో గ్రామగ్రామాన ఉద్యమనేతలు పర్యటించి రైతులు, ఉద్యోగులతో సమన్వయ కమిటీలను ఏర్పాటు చేయాలని సూచించారు. రైతులు, ఉద్యోగులు కలిస్తే రాజకీయనేతల గతినే మార్చేస్తారని, రానున్న కాలంలో సమైక్యవాదంతో నిలిచే పార్టీలకే మద్దతు తెలిపేలా ప్రజలను సమాయత్తం చేయాలని మహాసభ సూచించింది. రాష్ట్ర విభజన వలన కలిగే నష్టాన్ని తొలిదశ ఉద్యమంతోనే ప్రజలకు వివరించగలిగామని, మలిదశ ఉద్యమంతో సమైక్యవాదం కాపాడుకునేలా కార్యాచరణ ఉండాలని మహాసభ తీర్మానించింది. ఇప్పటివరకు గాంధీమార్గంలో జరిగిన ఉద్యమ తీవ్రతను రానున్న కాలంలో ఢిల్లీ గద్దెను గడగడలాడించేలా బహుముఖ రూపాల్లో కొనసాగించాలని మహాసభ నిర్ణయించింది. గుడివాడ మహాసభ ఇంత విజయవంతంగా నిర్వహించడం ఈ జిల్లావాడిగా గర్విస్తున్నానని, తాను గుడివాడలోనే ఓనమాలు దిద్దామని అశోక్‌బాబు అన్నారు. మహాసభలో మాట్లాడిన ఉద్యోగ, కార్మిక, కర్షక, మేధావుల, నిపుణులు మాట్లాడుతూ రాష్ట్ర విభజనతో ఆయా రంగాల్లో సీమాంధ్రకు జరిగే నష్టాన్ని వివరించారు. తూర్పు కృష్ణా జేఏసీ చైర్మన్ ఉల్లి కృష్ణ అధ్యక్షతన జరిగిన మహాసభలో ఏపీ ఎన్జీఓ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం.చంద్రశేఖరరెడ్డి, వెస్ట్ కృష్ణా అధ్యక్షుడు ఎ.విద్యాసాగర్, రాష్ట్ర రెవెన్యూ అసోసియేషన్ జేఏసీ కన్వీనర్ బొప్పరాజు వెంకటేశ్వర్లు, ఆంధ్ర మేధావుల ఫోరం కన్వీనర్ చలసాని శ్రీనివాస్, రాష్ట్ర మాలమహానాడు అధ్యక్షుడు కారెం శివాజీ, ఎమ్మార్పీఎస్ రాష్ట్ర నాయకుడు పి.వెంకటేశ్వరరావు మాదిగ, మున్సిపల్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు ఎస్.కృష్ణమోహన్, రైతాంగ సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు ఎర్నేని నాగేంద్రనాధ్, చలసాని ఆంజనేయులు, జలవనరుల నిపుణుడు పి.ఎ.రామకృష్ణంరాజు, జిల్లా జేఏసీ కోకన్వీనర్ మండలి హనుమంతరావు, గుడివాడ జేఏసీ చైర్మన్ యార్లగడ్డ వెంకటేశ్వరప్రసాద్, ఎన్జీఓస్ డివిజన్ అధ్యక్ష, కార్యదర్శులు షేక్ ఫరీద్‌బాషా, జి.రాజేంద్రప్రసాద్, డి.శ్రీనివాస్, పొట్లూరి గంగాధరరావు, ఎం.ప్రసాద్, వై.వి.రావు, కె.సత్యానందం, బి.అన్నపూర్ణ, ఎండీ ఇక్బాల్, నరహరశెట్టి శ్రీహరి, వరలక్ష్మి తదితరులు మాట్లాడారు. -
సమైక్య గళం
సమైక్యాంధ్ర ఉద్యమం మరింత వేడెక్కింది. విద్యార్థుల జై సమైక్యాంధ్ర నినాదాలతో బుధవారం బెజవాడ నగరం మార్మోగింది. విద్యార్థి జేఏసీ ఆధ్వర్యంలో వేలాదిమంది విద్యార్థులు తరలిరావడంతో బందరురోడ్డు చుట్టుపక్కన వీధులన్నీ కిక్కిరిశాయి. విజయవాడలో ఎంపీ లగడపాటి రాజగోపాల్‌ను ఆర్టీసీ కార్మికులు నిలదీయగా, మంత్రి పార్థసారథిని కృష్ణలంకలో మహిళలు నిలదీశారు. బందరు, గుడివాడ, కైకలూరు, జగ్గయ్యపేట, నూజివీడుల్లో సమైక్య ఆందోళనలు ఉవ్వెత్తున ఎగసిపడ్డాయి. సాక్షి, విజయవాడ : జిల్లా కేంద్రం మచిలీపట్నంలో రోల్డుగోల్డు నగల వ్యాపారులు, కార్మికులు పనులు మాని సమైక్యాంధ్ర పరిరక్షణకు రోడ్డెక్కారు. కోనేరుసెంటరులో వంటావార్పు నిర్వహించారు. రోల్డుగోల్డు ఆభరణాల తయారీ విధానాన్ని తెలియజేస్తూ ర్యాలీలో శకటాలను ఏర్పాటు చేశారు. బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో కైకలూరు బంద్ చేపట్టారు. తాలూకా సెంటర్లో ఎన్జీవోలు చేస్తున్న రిలే దీక్షలు 15వ రోజుకు చేరాయి. ఎన్జీవోలు వాహనాల అద్దాలను తుడిచారు. కలి దిండిలో సానారుద్రవరం రైతులు రిలే దీక్షలు చేపట్టారు. ముదినేపల్లిలో ఉపాధ్యాయులు రోడ్డుపై భిక్షాటన చేశారు. నూజివీడులో జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రిలేదీక్షలు 21వ రోజుకు చేరాయి. ఏఐటీయూసీ ఆధ్వర్యంలో పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. సర్వవాణిజ్యమండలి ఆధ్వర్యంలో తెలుగుతల్లికి లక్షబిళ్వార్చన నిర్వహించారు. న్యాయవాదులు నిర్వహిస్తున్న రిలేదీక్షలు పదో రోజుకు చేరాయి. మైలవరం లీలావతి పబ్లిక్ స్కూల్ విద్యార్థులు సమైక్యాంధ్రకు మద్దతుగా ర్యాలీ నిర్వహిం చారు. ఇబ్రహీంపట్నం ఎన్టీటీపీఎస్ గేట్ వద్ద సమైక్యాంధ్రకు మద్దతుగా రోడ్డుపైనే కృష్ణాష్టమి వేడుకలు నిర్వహించారు. పెనుగంచిప్రోలులో శ్రీతిరుపతమ్మ ఆలయ అర్చకులు దీక్షల్లో కూర్చొన్నారు. తిరువూరులో ప్రైవేటు వైద్యులు ఉపాధ్యాయులు, సమైక్య జేఏసీ ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శనలు చేశారు. ఆర్టీసీ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో బస్టాండ్ ఆవరణలో రిలేదీక్షలు నిర్వహించారు. తోటమూలలో టీడీపీ ఆధ్వర్యంలో రిలేదీక్షలు జరిగాయి. పామర్రు నాలుగు రోడ్ల సెంటర్లో రిలేదీక్షలు చేస్తున్న అంగన్వాడీ టీచర్లకు ఆ శాఖ సూపర్వైజర్లు గులాబీలు ఇచ్చి నిరసన తెలిపారు. చల్లపల్లిలో జేఏసీ ఆధ్వర్యంలో 216 జాతీయ రహదారిపై మోకాళ్ళతో మానవహారం నిర్వహించి నిరసన తెలిపారు. కొంతమంది తలకిందులుగా ప్రదర్శన చేశారు. చల్లపల్లిలో చేపట్టిన 19వరోజు దీక్షలో అవనిగడ్డ ఆర్టీసీ కార్మికులు, వైద్య ఆరోగ్య సిబ్బంది పాల్గొన్నారు. పంచాయతీ కార్యదర్శులు, వీఆర్వోలు, వీఆర్యేలు సమ్మెలోకి వెళ్ళడంతో ఆయా కార్యాలయాలకు తాళాలు పడ్డాయి. వీఆర్వోలు, వీఆర్ఏలు చల్లపల్లి, ఘంటసాల మండలాల్లో మోటార్‌సైకిల్ ర్యాలీ నిర్వహించారు. గన్నవరంలో తహశీల్దారు కార్యాలయ ఆవరణలో రెవెన్యూ అధికారులు సమైక్యాంధ్రకు మద్దతుగా పిచ్చి మొక్కలు తొలగించి నిరసన తెలిపారు. గుడివాడ టాక్సీ ఓనర్స్ అండ్ డ్రైవర్స్ యూనియన్ నాయకులు, డ్రైవర్లు, ఓనర్లు మోకాళ్లపై నడిచి నిరసన తెలిపారు. వత్సవాయిలో జేఏసీ రిలే దీక్షా శిబిరాన్ని వైఎస్సార్ కాంగ్రెస్ జిల్లా కన్వీనర్ సామినేని ఉదయభాను సందర్శించారు. తిరువూరులో ఉపాధ్యాయులు రోడ్లు ఊడ్చి నిరసన తెలిపారు. కానూరు వీఆర్ సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజి విద్యార్థులు భారీ ర్యాలీ చేశారు. పెడన మండల రెవెన్యూ సంఘాల ఉద్యోగులు స్థానిక తహశీల్దార్ కార్యాలయం సమీపంలో 216 జాతీయ రహదారిపై నాలుగు రోడ్డు కూడలిని దిగ్బంధం చేసి వంటా వార్పు కార్యక్రమాన్ని నిర్వహించారు. కృత్తివెన్ను మండలం లక్ష్మీపురంలో ప్రాథమిక, ఉన్నత పాఠశాలల విద్యార్థులు, గ్రామస్తుల ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. పెదపారుపూడిలో ఉపాధ్యాయులు గుడివాడ-కంకిపాడు రహదారిపై విద్యార్థులకు పాఠాలు చెప్పారు. వైఎస్సార్సీపీ జిల్లా కన్వీనర్ సామినేని ఉదయభాను జగ్గయ్యపేటలో మీసేవ కేంద్రానికి తాళాలు వేసి సమ్మెలో పాల్గొనాలని కోరారు. అలాగే రాష్ట్ర విభజనను నిరసిస్తూ మొక్కజొన్న కండెలు కాల్చారు. విజయవాడలో.. నగరంలోని ఇరిగేషన్ కార్యాలయం వద్ద రైతు నేత యెర్నేని నాగేంద్రనాథ్ చేపట్టిన నిరాహార దీక్ష రెండోరోజుకు చేరింది. విద్యుత్ ఉద్యోగుల జేఏసీ ఆధ్వర్యంలో భారీ ప్రదర్శన నిర్వహించారు. నగరపాలక సంస్థ ఉద్యోగులు రోడ్డుపైనే వంటావార్పు చేసి సహపంక్తి భోజనాలు చేసి నిరసన తెలిపారు. వీజీటీఎం ఉడా అధికారులు, సిబ్బంది సామూహికంగా వంటావార్పు చేయడమే కాకుండా ఆటాపాట నిర్వహించారు. సివిల్ కోర్టుల వద్ద బెజవాడ బార్ అసోసియేషన్ (బీబీఏ) ఆధ్వర్యంలో న్యాయవాదులు సమైక్యాంధ్ర ఉద్యమంలో భాగంగా వంటావార్పు చేశారు.