సమైక్యాంధ్ర ఉద్యమం మరింత వేడెక్కింది. విద్యార్థుల జై సమైక్యాంధ్ర నినాదాలతో బుధవారం బెజవాడ నగరం మార్మోగింది. విద్యార్థి జేఏసీ ఆధ్వర్యంలో వేలాదిమంది విద్యార్థులు తరలిరావడంతో బందరురోడ్డు చుట్టుపక్కన వీధులన్నీ కిక్కిరిశాయి. విజయవాడలో ఎంపీ లగడపాటి రాజగోపాల్‌ను ఆర్టీసీ కార్మికులు నిలదీయగా, మంత్రి పార్థసారథిని కృష్ణలంకలో మహిళలు నిలదీశారు. బందరు, గుడివాడ, కైకలూరు, జగ్గయ్యపేట, నూజివీడుల్లో సమైక్య ఆందోళనలు ఉవ్వెత్తున ఎగసిపడ్డాయి.
సాక్షి, విజయవాడ : జిల్లా కేంద్రం మచిలీపట్నంలో రోల్డుగోల్డు నగల వ్యాపారులు, కార్మికులు పనులు మాని సమైక్యాంధ్ర పరిరక్షణకు రోడ్డెక్కారు. కోనేరుసెంటరులో వంటావార్పు నిర్వహించారు. రోల్డుగోల్డు ఆభరణాల తయారీ విధానాన్ని తెలియజేస్తూ ర్యాలీలో శకటాలను ఏర్పాటు చేశారు. బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో కైకలూరు బంద్ చేపట్టారు. తాలూకా సెంటర్‌లో ఎన్జీవోలు చేస్తున్న రిలే దీక్షలు 15వ రోజుకు చేరాయి. ఎన్జీవోలు వాహనాల అద్దాలను తుడిచారు. కలి దిండిలో సానారుద్రవరం రైతులు రిలే దీక్షలు చేపట్టారు.
ముదినేపల్లిలో ఉపాధ్యాయులు రోడ్డుపై భిక్షాటన చేశారు. నూజివీడులో జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రిలేదీక్షలు 21వ రోజుకు చేరాయి. ఏఐటీయూసీ ఆధ్వర్యంలో పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. సర్వవాణిజ్యమండలి ఆధ్వర్యంలో తెలుగుతల్లికి లక్షబిళ్వార్చన నిర్వహించారు. న్యాయవాదులు నిర్వహిస్తున్న రిలేదీక్షలు పదో రోజుకు చేరాయి. మైలవరం లీలావతి పబ్లిక్ స్కూల్ విద్యార్థులు సమైక్యాంధ్రకు మద్దతుగా ర్యాలీ నిర్వహిం చారు. ఇబ్రహీంపట్నం ఎన్టీటీపీఎస్ గేట్ వద్ద సమైక్యాంధ్రకు మద్దతుగా రోడ్డుపైనే కృష్ణాష్టమి వేడుకలు నిర్వహించారు.
పెనుగంచిప్రోలులో శ్రీతిరుపతమ్మ ఆలయ అర్చకులు దీక్షల్లో కూర్చొన్నారు. తిరువూరులో ప్రైవేటు వైద్యులు ఉపాధ్యాయులు, సమైక్య జేఏసీ ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శనలు చేశారు. ఆర్టీసీ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో బస్టాండ్ ఆవరణలో రిలేదీక్షలు నిర్వహించారు. తోటమూలలో టీడీపీ ఆధ్వర్యంలో రిలేదీక్షలు జరిగాయి. పామర్రు నాలుగు రోడ్ల సెంటర్లో రిలేదీక్షలు చేస్తున్న అంగన్‌వాడీ టీచర్లకు ఆ శాఖ సూపర్‌వైజర్లు గులాబీలు ఇచ్చి నిరసన తెలిపారు.
చల్లపల్లిలో జేఏసీ ఆధ్వర్యంలో 216 జాతీయ రహదారిపై మోకాళ్ళతో మానవహారం నిర్వహించి నిరసన తెలిపారు. కొంతమంది తలకిందులుగా ప్రదర్శన చేశారు. చల్లపల్లిలో చేపట్టిన 19వరోజు దీక్షలో అవనిగడ్డ ఆర్టీసీ కార్మికులు, వైద్య ఆరోగ్య సిబ్బంది పాల్గొన్నారు. పంచాయతీ కార్యదర్శులు, వీఆర్వోలు, వీఆర్యేలు సమ్మెలోకి వెళ్ళడంతో ఆయా కార్యాలయాలకు తాళాలు పడ్డాయి. వీఆర్వోలు, వీఆర్‌ఏలు చల్లపల్లి, ఘంటసాల మండలాల్లో మోటార్‌సైకిల్ ర్యాలీ నిర్వహించారు.
గన్నవరంలో తహశీల్దారు కార్యాలయ ఆవరణలో రెవెన్యూ అధికారులు సమైక్యాంధ్రకు మద్దతుగా పిచ్చి మొక్కలు తొలగించి నిరసన తెలిపారు. గుడివాడ టాక్సీ ఓనర్స్ అండ్ డ్రైవర్స్ యూనియన్ నాయకులు, డ్రైవర్లు, ఓనర్లు మోకాళ్లపై నడిచి నిరసన తెలిపారు. వత్సవాయిలో జేఏసీ రిలే దీక్షా శిబిరాన్ని వైఎస్సార్ కాంగ్రెస్ జిల్లా కన్వీనర్ సామినేని ఉదయభాను సందర్శించారు. తిరువూరులో ఉపాధ్యాయులు రోడ్లు ఊడ్చి నిరసన తెలిపారు. కానూరు వీఆర్ సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజి విద్యార్థులు భారీ ర్యాలీ చేశారు.
పెడన మండల రెవెన్యూ సంఘాల ఉద్యోగులు స్థానిక తహశీల్దార్ కార్యాలయం సమీపంలో 216 జాతీయ రహదారిపై నాలుగు రోడ్డు కూడలిని దిగ్బంధం చేసి వంటా వార్పు కార్యక్రమాన్ని నిర్వహించారు. కృత్తివెన్ను మండలం లక్ష్మీపురంలో ప్రాథమిక, ఉన్నత పాఠశాలల విద్యార్థులు, గ్రామస్తుల ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. పెదపారుపూడిలో ఉపాధ్యాయులు గుడివాడ-కంకిపాడు రహదారిపై విద్యార్థులకు పాఠాలు చెప్పారు. వైఎస్సార్‌సీపీ జిల్లా కన్వీనర్ సామినేని ఉదయభాను జగ్గయ్యపేటలో మీసేవ కేంద్రానికి తాళాలు వేసి సమ్మెలో పాల్గొనాలని కోరారు. అలాగే రాష్ట్ర విభజనను నిరసిస్తూ మొక్కజొన్న కండెలు కాల్చారు.
విజయవాడలో..
నగరంలోని ఇరిగేషన్ కార్యాలయం వద్ద రైతు నేత యెర్నేని నాగేంద్రనాథ్ చేపట్టిన నిరాహార దీక్ష రెండోరోజుకు చేరింది. విద్యుత్ ఉద్యోగుల జేఏసీ ఆధ్వర్యంలో భారీ ప్రదర్శన నిర్వహించారు. నగరపాలక సంస్థ ఉద్యోగులు రోడ్డుపైనే వంటావార్పు చేసి సహపంక్తి భోజనాలు చేసి నిరసన తెలిపారు. వీజీటీఎం ఉడా అధికారులు, సిబ్బంది సామూహికంగా వంటావార్పు చేయడమే కాకుండా ఆటాపాట నిర్వహించారు. సివిల్ కోర్టుల వద్ద బెజవాడ బార్ అసోసియేషన్ (బీబీఏ) ఆధ్వర్యంలో న్యాయవాదులు సమైక్యాంధ్ర ఉద్యమంలో భాగంగా వంటావార్పు చేశారు.
సమైక్య గళం
Published Thu, Aug 29 2013 12:48 AM | Last Updated on Fri, Sep 1 2017 10:12 PM
Advertisement