వాకింగ్ జాగింగ్
ఒత్తిడిని ఎదుర్కోవడం
ఆధునికుల్లో అత్యధికుల్ని బాధిస్తోన్న ఒత్తిడికి వ్యాయామంలో పరిష్కారం లభిస్తుందనేది చాలా కాలంగా చాలా మంది వైద్యులు చెబుతున్నదే. అయితే దీని కోసం జిమ్‌లూ, ఇతరత్రా కసరత్తులూ ఏవీ అక్కర్లేదనీ వాటన్నింటికన్నా మిన్నగా కేవలం వాకింగ్‌తో ఒత్తిడికి చెక్ పెట్టవచ్చునని తాజాగా ఒక సర్వే వెల్లడించింది. మ్యాక్స్ బూపా వాక్ ఫర్ హెల్త్ నిర్వహించిన సర్వేలో పాల్గొన్న వారిలో 97శాతం మంది ఇదే విషయాన్ని స్పష్టం చేశారు. ఢిల్లీ, ముంబయి, బెంగుళూరు, జైపూర్ నగరాలకు చెందిన వారు ఈ సర్వేలో పాల్గొన్నారు.
ఉపకరిస్తున్న యాప్స్...
ఇందులో 42శాతం మంది వృద్దులు ఒత్తిడిని ఎదుర్కోవడంలో వాకింగ్‌ను మించింది లేదని చెప్పగా, వాకింగ్ తర్వాత ఒత్తిడి, హైపర్ టెన్షన్ తగ్గిందని 50శాతం మంది మధ్యవయస్కులు చెప్పారు. ఆసక్తికరమైన అంశమేమిటంటే ఇందులో 40శాతం మంది వాకింగ్ యాప్స్ తమను నడకవైపు బాగా చైతన్యపరిచాయని వెల్లడించారు. వీరిలో 60శాతం మంది గాడ్జెట్స్ వాడడం వల్ల తమ ఆరోగ్య పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షించుకోగలుగుతున్నామన్నారు. మిగతా నగరాలతో పోల్చినప్పుడు ఢిల్లీ, ముంబయిలో అత్యధికంగా 70, 72 శాతం మంది గాడ్జెట్స్ వినియోగిస్తున్నారు.
నడక లోపిస్తే ఆరోగ్యం పడకే...
వాకింగ్ కేవలం కేలరీలను ఖర్చు చేయించడంతో ఊరుకోదు. హ్యాపీ హార్మోన్‌గా పేరుపడిన ఎండార్ఫిన్‌ను సైతం విడుదల చేస్తుంది. అది అయితే అదే సమయంలో రెగ్యులర్‌గా నడవని వారు డిప్రెషన్‌కు తొందరగా లోనవుతున్నారని సర్వే తేల్చింది. నడకకు దూరంగా ఉన్నవారిలో 15శాతం మంది డిప్రెషన్, హై స్ట్రెస్ లెవల్స్‌కు లోనవుతున్నారని వివరించింది. వాకింగ్‌తో మానసికపరమైన ఇతరత్రా ప్రయోజనాలూ కలుగుతున్నాయని సర్వే చెబుతోంది. నడక ద్వారా తమకు ఆత్మశోధనకు అవకాశం కలుగుతోందని 19శాతం మంది మధ్యవయస్కులు, స్వావలంబన అనుభూతి కలుగుతోందని 21శాతం మంది వృద్దులు అంటున్నారు.
సాకులూ ఉన్నాయి...
అయితే ఈ ఒత్తిడిని చిత్తు చేసే సులభమైన చికిత్సను అందుకోవడంలో మరికొన్ని భిన్న కోణాలను సైతం ఈ సర్వే ఎత్తి చూపింది. పాల్గొన్నవారిలో పలువురు వాకింగ్‌కు దూరంగా ఉండడానికి చెబుతున్న కారణాలలో... 43శాతం మంది తమకు వాకింగ్‌కు అవసరమైన సమయం లేదని అంటుంటే, 29శాతం మంది వాకింగ్‌ను బోర్ కొట్టించేదిగా భావిస్తున్నారు. 21శాతం మందికి వాకింగ్‌కు వెళ్లేందుకు సరైన తోడు దొరకడం లేదు. అలాగే మరో 21శాతం మందికి అసలు వాకింగ్ తమ మానసిక ఆరోగ్యానికి ఇంతగా ఉపయోగపడుతుందనే అవగాహనే లేదు.