లైఫ్ స్టైల్ కౌన్సెలింగ్
నేను కూర్చొని చేసే వృత్తిలో ఉన్నాను. రాత్రిపూట సరిగా నిద్రపట్టడం లేదు. ఒళ్లు అలిసేలా వ్యాయామం చేయమనీ, దాంతో బాగా నిద్రపడుతుందని ఫ్రెండ్స్ చెబుతున్నారు. అయితే వ్యాయామం చేసేవాళ్లకు అంతగా నిద్రపట్టదని మరికొందరు చెబుతున్నారు. ఇందులో ఏది వాస్తవమో చెప్పండి. – శివకుమార్, హైదరాబాద్
మీరు చెప్పిన రెండు అంశాలూ నిజమే. నిద్రకు ఉపక్రమించబోయే మూడు గంటల ముందుగా వ్యాయామం అంత సరికాదు. అలా చేస్తే నిద్రపట్టడం కష్టమే. అయితే రోజూ ఉదయంగానీ లేదా ఎక్సర్‌సైజ్‌కూ, నిద్రకూ చాలా వ్యవధి ఉండేలా గానీ వ్యాయామం చేస్తే మంచి నిద్ర పడుతుంది. ఒళ్లు అలిసేలా వ్యాయామంతో ఒళ్లెరగని నిద్రపడుతుంది. ఉదయం చేసే వ్యాయామంతో ఒత్తిడి నుంచి దూరమవుతారు. అయితే ఉదయం వేళ పగటి వెలుగు వచ్చాక చేస్తే ప్రభావపూర్వకంగా ఉంటుంది. మీరు ఉదయం వ్యాయామం చేయలేకపోతే సాయంత్రం చేయవచ్చు. రోజువారీ పనుల వల్ల అప్పటికి మీ శరీర ఉష్ణోగ్రత కూడా కాస్త పెరిగి ఉంటుంది. ఇక నిద్రవేళకు మన శరీర ఉష్ణోగ్రత తగ్గుతుంటుంది. కానీ వ్యాయామంతో మళ్లీ శరీరాన్ని ఉత్తేజపరచడం జరుగుతుంది. ఇక కార్డియోవాస్క్యులార్ వ్యాయామాల వల్ల గుండె స్పందనల వేగం, రేటు పెరుగుతాయి. శరీర ఉష్ణోగ్రత కూడా పెరుగుతుంది. వీటన్నింటి ఉమ్మడి ప్రభావాల వల్ల నిద్ర తగ్గుతుంది. అంతేకాదు... వ్యాయామం ముగిసిన 20 నిమిషాల తర్వాతగానీ గుండె కండరాల రక్తం పంపింగ్ ప్రక్రియ సాధారణ స్థితికి రాదు. అందుకే వ్యాయామానికీ, నిద్రకూ మధ్య వ్యవధి ఉండాలి.
ఇక స్ట్రెచింగ్ వ్యాయామాలు, బలాన్ని పెంచే స్ట్రెంగ్త్ ట్రెయినింగ్ తరహా వ్యాయామాలూ శరీరానికి మేలు చేసినా... అవి కార్డియోవాస్క్యులార్ వ్యాయామాలకు సాటిరావు. యోగా తనువునూ, మనసునూ రిలాక్స్ చేసే ప్రక్రియ. మీ ఫ్రెండ్స్ చెప్పినట్లుగా దీర్ఘకాలిక నిద్రలేమికి వ్యాయామం విరుగుడు. అందుకే మరీ తీవ్రంగా (విగరస్‌గా) కాకుండా... మరీ తక్కువగా కాకుండా... మాడరేట్ ఎక్సర్‌సైజ్ చేయండి. కంటినిండా నిద్రపొండి. వాకింగ్, జాగింగ్, జంపింగ్, స్విమ్మింగ్, టెన్నిస్ ఆడటం, డాన్స్ చేయడం లాంటి ఏ ప్రక్రియ అయినా వ్యాయామానికి మంచిదే. అయితే మీకు గుండెజబ్బులూ, స్థూలకాయం, ఇతరత్రా ఆరోగ్య సమస్యలు ఉంటే వ్యాయామాలు మొదలుపెట్టే ముందు ఒకసారి డాక్టర్‌ను సంప్రదించి, మీకు తగిన వ్యాయామాలు సూచించమని అడగడం మేలు.
డాక్టర్
సుధీంద్ర ఊటూరి
కన్సల్టెంట్, లైఫ్ స్టైల్ అండ్ రీహ్యాబిలిటేషన్, కిమ్స్ హాస్పిటల్స్, సికింద్రాబాద్
సీఎబీజీ అంటే...
కార్డియాలజీ కౌన్సెలింగ్
నా వయసు 65. ఒక రోజు ఛాతీనొప్పి వస్తే పరీక్షించిన డాక్టర్లు సీఏబీజీ సర్జరీ చేయాలని చెప్పారు. సీఏబీజీ అంటే ఏమిటి? – నీరజ, కందుకూరు
గుండెకు రక్తాన్ని తీసుకెళ్లే కీలకమైన ధమనుల్లో అడ్డంకులు ఏర్పడినప్పుడు, రక్తసరఫరా అవరోధం కలగకుండా, సీఏబీజీ అనే సర్జరీ చేసి, రక్తాన్ని ఇతర మార్గాల్లో (బైపాస్ చేసిన మార్గంలో) గుండెకండరానికి అందేలా చేసే ఆపరేషనే సీఏబీజీ. మనం సాధారణంగా బైపాస్ సర్జరీ అని పిలిచే దీన్ని వైద్యపరిభాషలో ‘కరొనరీ ఆర్టరీ బైపాస్ గ్రాఫ్టింగ్’ అని వ్యవహరిస్తారు. దాని సంక్షిప్తరూపమే ఈ సీఏబీజీ ఆపరేషన్. ఇందులో కాళ్లు లేదా చేతులపై ఉన్న రక్తనాళాలను తీసి, గుండెకు అడ్డంకిగా ఏర్పడిన రక్తనాళాలకు ప్రత్యామ్నాయంగా, రక్తాన్ని బైపాస్ మార్గంలో అందించేలా అమర్చుతారు. సాధారణంగా ఒక బ్లాక్ (అడ్డంకి)ని బైపాస్ చేయాలంటే ఒక రక్తనాళం అవసరం. గుండె వద్ద ఉన్న రక్తనాళాన్ని నేరుగా బైపాస్ చేసే ప్రక్రియను రీ–వాస్క్యులరైజేషన్ అంటారు.
ఛాతీకీ కుడి, ఎడమ వైపున ఉన్న రక్తనాళాలను ఇంటర్నల్ మ్యామరీ ఆర్టరీ అంటారు. గుండెకు ఎడమవైపున ఉన్న నాళాన్ని లెఫ్ట్ యాంటీరియర్ డిసెండింగ్ అర్టరీ అని అంటారు. ఈ రక్తనాళాన్ని బ్లాక్ అయిన నాళాల వద్ద బైపాస్ మార్గంలా కలుపుతారు. దీర్ఘకాల ప్రయోజనాలతో పాటు రోగి త్వరగా కోలుకుంటున్నందున ఇప్పుడు బైపాస్‌లోనూ సరికొత్త విధానాన్ని పాటిస్తున్నారు.
బైపాస్ సర్జరీ చేయించుకున్న తర్వాత, భవిష్యత్తులో ఇలా మార్చిన రక్తనాళాల్లోనూ కొవ్వు పేరుకోకుండా హృద్రోగులు కొన్ని జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. రక్తనాళాల్లో పేరుకున్న బ్లాక్స్‌ను అధిగమించి, రక్తాన్ని గుండెకు చేరవేసేందుకు వీలుగా బైపాస్ సర్జరీ చేస్తారు. అంతే తప్ప ఇది చేయడం వల్ల అప్పటికే ఉన్న గుండెజబ్బు తొలగిపోయిందని పేషెంట్ అపోహ పడకూడదు. అందుకే ఇదే పరిస్థితి పునరావృతం కాకుండా రోగి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. రోగికి హైబీపీ ఉన్నట్లయితే దాన్ని ఎల్లప్పుడూ అదుపులో ఉంచుకునేలా డాక్టర్ సూచించిన మందులు తీసుకోవాలి. అలాగే రోగికి డయాబెటిస్ ఉంటే, రక్తంలోని చక్కెరపాళ్లు ఎల్లప్పుడూ అదుపులో ఉండేలా మందులు తీసుకుంటూ, కొవ్వులు తక్కువగా ఉండే పోషకాహారం తీసుకోవాలి. ఆరోగ్యకరమైన జీవనశైలిని పాటించాలి. ఇక పొగతాగే అలవాటు ఉంటే తక్షణం మానేయాలి. డాక్టర్లు సూచించిన తగిన వ్యాయామాలు చేస్తూ ఉండాలి.
డాక్టర్‌మ అనుజ్ కపాడియా
సీనియర్ కార్డియాలజిస్ట్, కేర్ హాస్పిటల్స్, బంజారాహిల్స్, హైదరాబాద్
వ్యాయామం చేస్తే నిద్రపడుతుందా? పట్టదా?
Published Thu, Dec 15 2016 11:17 PM | Last Updated on Mon, Sep 4 2017 10:48 PM
Advertisement