రిలాక్స్... రీఛార్జ్
యోగా
వ్యాయామం ఏదైనా సరే ఒత్తిడిని దూరం చేయాలే తప్ప మరింత ఒత్తిడికి గురి చేయకూడదు. మరీ ముఖ్యంగా మండు వేసవిలో యోగ సాధన చేసేవాళ్లు... పూర్తి రిలాక్స్‌డ్‌గా ఉండాలి. అప్పుడే ఆసనాలు రీఛార్జ్ సాధనాలుగా మారతాయి. యోగ సాధన సమయంలో ఒత్తిడి దరి చేరకుండా మధ్యలో రిలాక్స్ అయ్యేందుకు సైతం కొన్ని ఆసనాలు చేయవచ్చు.
నిరాలంబాసన: పొట్టమీద పడుకుని ఆసనాలు చేస్తున్నప్పుడు మధ్యలో రిలాక్స్ అవడానికి చేసే ఆసనం ఈ నిరాలంబాసనం. బోర్లా పడుకుని ఏదైనా ఆసనం చేస్తున్నప్పుడు (ఉదాహరణకు ధనురాసనం, శలభాసనం, సానాసనం) పొట్టమీదనే కాకుండా ఊపిరితిత్తులు, గుండె భాగాలపై కూడా ఒత్తిడి ఎక్కువగానే ఉంటుంది కనుక అలాంటి ప్రతి ఆసనం చేసిన తరువాత ఎక్కువ సేపు విశ్రాంతి తీసుకోవడం ఎంతైనా అవసరం. అంటే, శ్వాస వేగం తగ్గి తిరిగి శ్వాస సాధారణ స్థితికి వచ్చేంతవరకు రిలాక్స్ అవ్వాలి. నిరాలంబాసనంలో రిలాక్స్ అయ్యేటప్పుడు పొట్ట, పొత్తి కడుపు, కటి భాగాలు పూర్తిగా సౌకర్యవంతంగా కింద కుర్చీసీటులో ఆని ఉండాలి. ఊపిరితిత్తులకు గుండెకు విశ్రాంతి కోసం ఛాతీభాగం పైకి లేపి గడ్డం కింద రెండు చేతులతో సపోర్ట్ ఉంచాలి. ఈ ఆసనం నేల మీద చేసినట్లయితే కాళ్లు రెండు నేల మీద ఉంచవచ్చు. కుర్చీలో చేస్తున్నాం కనుక కాళ్లు రెండూ చాపి (స్టెచ్ చేసి) ఉంచిన దానికన్నా మడచి ఉంచినందువల్ల హామ్‌స్ట్రింగ్స్, కాఫ్ మజిల్స్, గ్లూటియస్ కండరాలు పూర్తిగా రిలాక్స్‌డ్‌గా ఉంటాయి.
ఈ ఆసనంలో పొట్ట భాగాలకు సున్నితంగా మసాజ్ జరుగు తుంది. పొట్టలోని ట్రేప్డ్ గ్యాసెస్ రిలీజ్ అయ్యి జీర్ణశక్తి మెరుగుపడుతుంది. థైరాయిడ్, పారాథైరాయిడ్ గ్రంథుల పనితీరు మెరుగుపడుతుంది. స్పైనల్ డిజార్డర్స్‌ని కరెక్ట్ చేయడానికి ఉపయోగపడుతుంది. హై బిపి, మానసిక ఒత్తిడి, ఫాటిగ్యూ, యాంగై్జటీ వంటి సమస్యలను దూరం చేసి మనసుకు ప్రశాంతతను కలుగజేస్తుంది. ఆలంబన అనగా సపోర్ట్, నిరాలంబన అనగా నో సపోర్ట్ అంటే ఈ స్థితిలో మనసుకు ఆలోచనరహిత స్థితికి చేరే అవకాశం ఉన్నది. (మనసుకు ఆలోచనలే ఆలంబన) కనుక దీనికి నిరాలంబాసన అని పేరు.
సాలబం భుజంగాసన : ఇంతకు ముందు ఉన్న నిరాలంబ స్థితిలో నుండి, అరచేతులు కుర్చీసీటు భాగంలో గట్టిగా ప్రెస్ చేస్తూ ఛాతీని కొంచెం పైకి లేపి మడిచి ఉంచిన కాళ్లను స్ట్రెయిట్‌గా వెనుకకు స్ట్రెచ్ చేసి, తలని గడ్డాన్ని వీలైనంత పైకి లేని 3 లేదా 5 సాధారణ శ్వాసల తరువాత తిరిగి వెనుకకు నిరాలంబాసనంలోకి వచ్చి రిలాక్స్ అవ్వాలి. ఇది బిగనర్స్‌కి కొత్తసాధకులకు ముందుంగా ఇవ్వబడే తేలికపాటి బ్యాక్ బెండ్ పోశ్చర్.
ఉపయోగాలు: లో బ్యాక్ పెయిన్ అంటే ఔ1 నుంచి ఔ5 రీజియన్‌లో ఉన్న సమస్యలకు పరిష్కారంగా పనిచేస్తుంది. అబ్డామినల్ మజిల్స్‌కి వ్యాయామం అవుతుంది. లంగ్స్ ఛెస్ట్, హార్ట్ మజిల్స్ ఎక్స్‌పాండ్ అవుతాయి. ఇది తేలికపాటి ఆసనం కనుక ఆస్త్మా సమస్య, ఊపిరితిత్తుల ఇబ్బందులు ఉన్న వాళ్లు కూడా చక్కగా సాధన చేయవచ్చు. కచ్చితమైన రిలీఫ్ దొరుకుతుంది.
జాగ్రత్తలు: ఏదైనా బ్యాక్ ఇంజ్యూరీ అయ్యి స్పైనల్ సర్జరీ అయిన వాళ్లు, తొలి త్రైమాసికంలో ఉన్న గర్భిణీస్త్రీలు నిపుణుల పర్యవేక్షణలో చేయాల్సి ఉంటుంది. రెండవ లేదా మూడవ త్రైమాసికంలో ఉన్న స్త్రీలు పొట్టమీద పడుకొని చేసే ఆసనాలు ఏవీ కూడా చేయకూడదు. దానికి బదులుగా ఇదే భంగిమని గోడకి ఎదురుగా కొంచెం దూరంలో ఆపోజిట్‌లో నిలబడి చేతులు రెండు గోడకి ప్రెస్ చేస్తూ షోల్డర్, ఛాతీ ఓపెన్ అయ్యేటట్లుగా ప్రయత్నం చేయవచ్చు.
సమన్వయం: సత్యబాబు
ఎ.ఎల్.వి కుమార్ ట్రెడిషనల్ యోగా ఫౌండేషన్