మొదటి ప్రపంచ యుద్ధానికి కొన్నాళ్ల ముందు కీళ్ల నొప్పుల సమస్యకు ఒక వింత చికిత్స ప్రచారంలోకి వచ్చింది. తిమింగలం మీద కాసేపు పడుకుంటే కీళ్ల నొప్పులు మటుమాయమవుతాయని ఒక ఆస్ట్రేలియన్ ‘అనుభవజ్ఞుడు’ బలంగా చెప్పడంతో ఈ విషయం పత్రికలకెక్కింది. సముద్రాల్లో సంచరించే సజీవ తిమింగలాల మీద శయనించడం ఎటూ సాధ్యం కాదు. అదృష్టం బాగుండి ఒడ్డుకు కొట్టుకొచ్చిన తిమింగలం కళేబరం ఏదైనా కనిపిస్తే, దాన్నలా వృథాగా వదిలేయక కీళ్లనొప్పులతో బాధపడే వారు దాని మీద పడుకుని కాసేపు చిన్న కునుకు తీస్తే నొప్పులన్నీ ఇట్టే నయమైపోతాయని అప్పటి జనాలు కూడా అమాయకంగా నమ్మేవారు. ఇదంతా ఎలా ప్రచారంలోకి వచ్చిందంటే, 1896 సంవత్సరంలో ఆస్ట్రేలియాలో సముద్రపు ఒడ్డున ఒక నడివయస్కుడు తప్పతాగాడు.
తాగినది తలకెక్కాక ఇంటికి వెళదామనుకుని లేచి బయలుదేరాడు. తడబడుతున్న అడుగులతో కొంతదూరం నడిచాక ఇక ముందుకు సాగలేక తెలివితప్పి కుప్పకూలిపోయాడు. ఇసుక మీద కాదు, ఒడ్డుకు కొట్టుకొచ్చిన ఒక తిమింగలం కళేబరం మీద. తెలివిలోకి వచ్చి చూసుకుంటే అతడు తిమింగలం మీద ఉన్నాడు. అతడికి ఒళ్లంతా తేలిగ్గా అనిపించింది. అంతవరకు పీడించిన కీళ్లనొప్పులు మాయమయ్యాయి. ఇదే సంగతి అతగాడు తన సన్నిహితులకు చెప్పడంతో ఆ సంగతి ఆనోటా ఈనోటా పత్రికలకు చేరింది. ఇక అప్పటి నుంచి కీళ్లనొప్పులతో బాధపడేవారు తిమింగలాల కళేబరాల కోసం సముద్రపు ఒడ్డున ఒకటే అన్వేషణ సాగించేవారు. అయితే, ఇందులో ఎలాంటి శాస్త్రీయతా లేదన్నది ఆధునిక వైద్యుల మాట.
Comments
Please login to add a commentAdd a comment