భలే పెన్ను
మీరు రాసేది మీకే గుర్తుండటం లేదా..? మరేం ఫర్వాలేదు. మీలాంటి వారి కోసమే ఈ పెన్ను. ఇలాంటలాంటి పెన్ను కాదిది. మీరు ఏం రాసినా నిక్షేపంగా గుర్తుంచుకుంటుంది. రాసిన రాతను రాసినంత వేగంగానే స్కాన్ చేసి తన మెమొరీలో నిక్షిప్తం చేసుకుంటుంది. మరచిపోయిన మీ రాతలను అవసరమైనప్పుడు మళ్లీ గుర్తు చేస్తుంది. ఫ్రెంచి పెన్నుల బ్రాండు ‘ఓరీ’ ఈ హైటెక్ పెన్నును ‘స్టైలోగ్రాఫ్’ పెన్నుగా త్వరలోనే మార్కెట్‌లోకి తీసుకు రానుంది. రాగితో చూడముచ్చటగా తయారు చేసిన ఈ పెన్నుకు, కలపతో తయారు చేసిన క్యాప్ రక్షణగా ఉంటుంది.
ఇందులో 0.7 ఎంఎం బాల్‌పాయింట్ రీఫిల్ ఉంటుంది. మామూలు బాల్‌పాయింట్ పెన్నుల మాదిరిగానే, అవసరమైనప్పుడు రీఫిల్‌ను మార్చేసుకోవచ్చు. దీని లోపల ఒక చిన్న బ్యాటరీ ఉంటుంది. ఒకసారి చార్జ్ చేస్తే, దీంతో రాత ఏకధాటిగా రెండు రోజులు నిరంతరాయంగా సాగిపోతుంది. దీనికి జతగా లెదర్ కవర్‌తో తయారు చేసిన నోట్‌బుక్ కూడా ఉంటుంది. ఈ నోట్‌బుక్‌లో రాసిన రాతలను బ్లూటూత్ ద్వారా స్మార్ట్‌ఫోన్‌కు పంపుకునే వెసులుబాటు ఉంది. దీని ఖరీదు 12 పౌండ్లు (రూ.1200) మాత్రమే.