ఖబడ్దార్‌ చైనా | Subedar Joginder Singh biopic—Video | Sakshi
Sakshi News home page

ఖబడ్దార్‌ చైనా

Published Fri, Feb 9 2018 11:34 PM | Last Updated on Fri, Feb 9 2018 11:34 PM

Subedar Joginder Singh biopic—Video - Sakshi

‘సర్దార్‌ జోగీందర్‌ సింగ్‌ ’చిత్రంలో జోగీందర్‌ పాత్రధారి గిప్పీ గ్రేవాల్‌ 

భారత్‌–చైనా సరిహద్దు ప్రాంతం ‘డోక్లామ్‌’ నివురుగప్పిన  నిప్పులా ఉంది. కొద్ది నెలలుగా అక్కడ చైనా సైనికుల కదలికలు ఎక్కువయ్యాయి. రెండు దేశాల మధ్య ఉన్న ఒప్పందాలను ఉల్లంఘించి, గతంలో మాదిరిగా చైనా ఇప్పుడు కూడా స్నేహద్రోహానికి పాల్పడి భారత్‌పై యుద్ధానికి దిగితే.. గట్టి సమాధానమే ఇచ్చేందుకు భారతీయ సైనికులు కూడా తుపాకులు ఎక్కుపెట్టి ఉన్నారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న ‘సర్దార్‌ జోగీందర్‌ సింగ్‌’ అనే పంజాబీ బయోపిక్‌ ప్రాధాన్యాన్ని సంతరించుకుంది. దేశంలోని ప్రతి యువకుడూ ‘ఖబడ్దార్‌ చైనా’ అంటూ, సైనిక దళాల్లో చేరేందుకు స్ఫూర్తినిచ్చే అంశాలన్నీ ఈ సినిమాలో ఉన్నాయని టీజర్‌ చూస్తే అర్థమౌతోంది.

నెహ్రూ ప్రేమమయుడు. శాంతి ప్రియుడు. శత్రువు ఖడ్గం తీస్తే, ఆ ఖడ్గంతో కరచాలనం కోసం మృదువైన తన చేయిని చాస్తాడు! అయితే ఇప్పుడు మనం ఆ కథలోకి వెళ్లడం లేదు. ‘పరమ వీర చక్ర సుబేదార్‌ జోగీందర్‌ సింగ్‌’ అనే కథలోకి వెళ్తున్నాం. ఇది కేవలం కథ కాదు. నిజ జీవిత కథ. ఏప్రిల్‌ 6న ‘సుబేదార్‌ జోగీందర్‌ సింగ్‌’ అని సినిమాగా విడుదల కాబోతున్న సాహస గాథ. చైనాను నెహ్రూ గుడ్డిగా నమ్మకపోతే 1962 ఇండో చైనా యుద్ధమే లేదు. ఆ యుద్ధమే లేకపోతే సుబేదార్‌ జోగీందర్‌ సింగ్‌ అనే సినిమానే ఉండబోయేదే కాదు.  

నిబద్ధతలో గెలుపు మనదే!
శత్రువును నమ్మొద్దని ఇండో–చైనా యుద్ధం మనకు నేర్పింది. ‘శత్రువును తరిమికొట్టేందుకు.. సైనికుడా.. నువ్వు నీ చివరి ప్రాణపు చుక్క చిందే వరకు పోరాడుతూనే ఉండు’ అని జోగీందర్‌ సింగ్‌ స్ఫూర్తినిచ్చాడు! యుద్ధంలో భారత్‌ ఓడిపోయింది. నిబద్ధతలో భారత సైన్యానిదే గెలుపని నిరూపించాడు జోగీందర్‌.  అక్టోబర్‌ 20 నుంచి నవంబర్‌ 21 వరకు నెల రోజుల యుద్ధమది. మనవైపు 1383 మంది సైనికులు చనిపోయారు. 3,968 మంది సైనికులు చైనాకు బందీలయ్యారు. బందీ అయ్యాక కూడా తిరగబడి, వీరమరణం పొందిన సైనికుడు సుబేదారు జోగీందర్‌ సింగ్‌! గాయాల నుంచి కారుతున్న రక్తపు చుక్కల్ని బౌండరీలపై రెడ్‌మార్కులుగా పెట్టి, ‘దాటితే చస్తావ్‌’ అని శత్రు మూకల్ని హడలుకొట్టి, అరుణాచల్‌ప్రదేశ్‌ను భరతమాత ఒడి జారనివ్వకుండా ఒడిసిపట్టుకున్నాడు జోగీందర్‌ సింగ్‌. అరుణాచల్‌ప్రదేశ్‌కు అప్పటికొక పేరు లేదు. ‘నార్త్‌ ఈస్ట్రన్‌ ఫ్రాంటియర్‌ ఏజెన్సీ’ (ఎన్‌.ఇ.ఎఫ్‌.ఎ) అది. దాని కోసమే చైనా యుద్ధానికొచ్చింది. యుద్ధంలో గెలిచి కూడా ఎన్‌.ఇ.ఎఫ్‌.ఎ.ని పొందలేకపోయింది. ఆ ఘనకీర్తి జోగీందర్‌దీ, జోగీందర్‌ నడిపించిన ‘బమ్‌ లా’ దళానిది. 
   
చైనా నుంచి నెహ్రూ ఏం కోరుకున్నాడో అది దక్కనందుకు యుద్ధం వచ్చింది. చైనా ఏం కోరుకుందో అది దక్కకుండా చేసినందుకు జోగీందర్‌ హీరో అయ్యాడు.  చైనా నుంచి నెహ్రూ స్నేహాన్ని కోరుకున్నాడు. చైనా విప్లవ నేత మావో జెడాంగ్‌ని తన స్నేహితుడు అనుకున్నాడు. ‘‘మనిద్దరం ఇచ్చిపుచ్చుకుంటే మన మధ్య బంధం బలపడుతుంది’’ అన్నాడు నెహ్రూ. ‘‘అలాగైతే అక్సాయ్‌చిన్‌ని, అరుణాచల్‌నీ ఇవ్వు’’ అన్నాడు జెడాంగ్‌. ‘‘భౌగోళికంగా కాదు, బాంధవ్యాలతో పెనవేసుకుందాం’’ అన్నాడు నెహ్రూ. జెడాంగ్‌ మౌనంగా ఉండిపోయాడు. భారత్‌ సరిహద్దుల్లోకి గుట్టు చప్పుడు కాకుండా చైనా చొరబడింది. నెహ్రూకి యుద్ధం చెయ్యక తప్పలేదు. సరిగ్గా ఇక్కడి నుంచే ‘సుబేదార్‌ జోగీందర్‌ సింగ్‌’ సినిమా మొదలౌతుంది.

1962 సెప్టెంబర్‌ 9. డిఫెన్స్‌ మినిస్టర్‌ కృష్ణ మీనన్‌ నుంచి వేళకాని వేళలో నెహ్రూకి కాల్‌! ‘‘వేరే దారి లేదు మిస్టర్‌ ప్రైమ్‌ మినిస్టర్‌. చైనా దళాలు ‘తలా రిడ్జ్‌’లో సౌత్‌కి వచ్చేశాయి’’ అంటున్నాడు మీనన్‌.  స్నేహాన్ని నమ్మినంత కాలం నమ్మాం. ఇప్పుడు సైన్యాన్ని నమ్ముకోవలసిన కాలం వచ్చేసిందని నెహ్రూకి అర్థమైంది. నెహ్రూ అప్పుడు లండన్‌లో ఉన్నాడు. కామన్వెల్త్‌ ప్రైమ్‌ మినిస్టర్స్‌ మీట్‌లో.   సరిగ్గా అర నిమిషం తర్వాత నెహ్రూ నుంచి మీనన్‌కి ‘డన్‌’ అని సంకేతం. వెంటనే మన సెవన్త్‌ ఇన్‌ఫాంట్రీ బ్రిగేడ్‌.. చైనా సేనలు బలంగా నిలుచుని ఉన్న ‘నమ్‌కా ఛు’ వైపు కదిలింది. ‘సిక్కు రెజిమెంట్‌’ ఆ బ్రిగేడ్‌లోనే ఉంది.  జోగీందర్‌ సింగ్‌ ఆ రెజిమెంట్‌లోనే ఉన్నాడు. సుబేదార్‌ అతడు. దళపతి. ‘నమ్‌కా ఛు’ని చేరుకునే దారిలో ‘బమ్‌ లా’ పోస్టు దగ్గర మూడు వైపుల్నుంచీ కదిలి వచ్చిన చైనా సేనల్ని సిక్కు రెజిమెంట్‌ అడ్డుకుంది. వాళ్ల సంఖ్య ఎక్కువగా ఉంది. వీళ్లు తక్కువగా ఉన్నారు. ఎక్కువ తక్కువల్ని చూసుకోలేదు సుబేదార్‌ జోగీందర్‌ సింగ్‌. తన సేనల్లో స్ఫూర్తిని నింపి అన్ని వైపులకు కదిలించాడు. కానీ శత్రువుల బలగం ఎక్కువగా ఉంది. నిమిష నిమిషానికీ మన బ్రిగేడ్‌ బలం సన్నగిల్లుతోంది. సిక్కు రెజిమెంట్‌లో ఉన్నదే 20 మంది సైనికులు. వారిలోనూ పది మంది నేలకు ఒరిగారు. మిగిలింది జోగీందర్, మరో తొమ్మిది మంది! వారి దగ్గర కూడా బాయ్‌నెట్‌లే మిగిలాయి. వాటితోనే పోరాడుతున్నారు. జోగీందర్‌ ఒంటినిండా బలమైన గాయాలు. చివరికి ఆ గాయాలు అతడిని చైనా సైనికులకు బందీని చేశాయి! బందీగానే మరణించాడు జోగీందర్‌ . తండ్రి మరణ వార్త వినగానే జోగీందర్‌ సింగ్‌ పెద్ద కూతురు కుప్పకూలిపోయి అక్కడే మరణించారు. చైనా అతడి చితాభస్మాన్ని సైనిక మర్యాదలతో ఇండియాలోని బెటాలియన్‌కి పంపించింది. భారత ప్రభుత్వం ఆయనకు పరమవీర చక్ర అవార్డును ప్రకటించింది. 
    
వందల మంది శత్రుదేశ సైనికులతో పోరాడిన ఇరవైమంది సైనికుల వీరోచిత పోరాటానికి దృశ్యరూపం .. ‘సుబేదార్‌ జోగీందర్‌ సింగ్‌’. సింగ్‌గా గిప్పీ గ్రేవాల్‌ నటిస్తున్నారు. టీజర్‌ చివర్లో.. ‘ఫర్‌ యువర్‌ కైండ్‌ ఇన్‌ఫర్మేషన్‌. దిస్‌ ల్యాండ్‌ బిలాంగ్స్‌ టు ఇండియా’ అంటాడు గ్రేవాల్‌. అలా అంటున్నప్పుడు అతడిని చూస్తే.. జోగీందర్‌ సింగ్‌ ఆత్మ అతడిలో ప్రవేశించిందా అనిపిస్తుంది.  పంజాబీలనే కాదు, మిగతా రాష్ట్రాల యువకులనీ సైన్యంలోకి పట్టి తీసుకుపోయేంత ఇన్‌స్పైరింగ్‌గా ఉంటుంది  సుబేదార్‌ జోగీందర్‌ సింగ్‌ లైఫ్‌ హిస్టరీ. అదిప్పుడు తగిన సమయంలో తెరకెక్కబోతోంది. 

సుబేదార్‌ జోగీందర్‌ సింగ్‌
పరమవీరచ్ర - 1921–1962
జననం : పంజాబ్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement